Previous Page Next Page 
సంకల్పం పేజి 40

 

      లేకపోతే ఎవరయినా వచ్చారా?
   
    ఏం జరిగింది? ఏం జరిగింది? ఫోన్ వేపు చూస్తూ ఆలోచనల్లో పడి పోయింది లిఖిత.
   
    "ఏమిటీ....స్ట్రీట్ రైడరంటున్నావ్...." అంటూ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు శివమూర్తి.
   
    "ఎవరో.... రీడర్" కంగారుగా అన్నాడు వికాస్.
   
    "రీడరా?"
   
    "డీలర్... డీలర్.... అడిగితే, శివమూర్తిగారూ గుడ్ న్యూస్.....మల్లిఖార్జున్ ని మనీ అడిగిన విషయం చెప్పాను కదా.... ఆయనే స్వయంగా వచ్చి, ఐదు లక్షలకు చెక్కిచ్చి వెళ్ళిపోయాడు" చెప్పాడు వికాస్.
   
    "ఐదు లక్షలిచ్చాడా..... మల్లిఖార్జున్..." ఆశ్చర్యపోయాడు శివమూర్తి.
   
    "ఏం నమ్మలేకపోతున్నారా?" అంటూ టేబిల్ సొరుగులోంచి చెక్ తీసి చూపించాడు.
   
    ఆ 'చెక్' చూస్తూ-
   
    "పిల్లికి బిచ్చం వెయ్యని వాళ్ళందరిచేతా లక్షలు కక్కిస్తున్నావయ్యా...అదృష్టజాతకుడివి. నా పార్ట్  నర్సుగా వున్నప్పుడు వీళ్ళలో ఏ ఒక్కడూ కోపరేట్ చెయ్యలేదయ్యా.... ఆయారామ్, గయారామ్ వ్యవహారంలా అయింది, ఒకడొచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ నెలలో మనకెంత రాబడని ఇంకొకడు ఫోన్ చేసి అడిగేవాడు. అంతేతప్ప ఏ ఒక్కడూ స్థిరంగా వుండేవాడు కాదు. ఏదో పేచీలు- ఏదో గోల- వాళ్ళతో చచ్చేవాడ్ననుకో."
   
    మెటీరియల్ వచ్చే ముందు చేయాల్సిన పనుల గురించి స్టాఫ్ నియామకం గురించి చర్చలు జరిపారిద్దరూ.
   
    "అరవింద్ నాయర్ ఫోన్ చేశాడయ్యా... మన కంపెనీ జన్యూన్ దా కాదా? నిజంగా మన కార్ ని ప్రొడ్యూస్ చేస్తామా? మన ఫైనాన్స్ పరిస్థితి ఏమిటి? ఇవ్వన్నీ అడుగుతున్నార్ట..... నన్నొకసారి రమ్మన్నాడాయన..... వెళితే మంచిదనుకుంటున్నాను... నువ్వు వెళ్ళమంటే వెళతాను" అన్నాడు శివమూర్తి.
   
    "వెళ్ళమంటే వెళ్లడమేమిటి సార్! మీరెళితేనే పనులన్నీ చురుగ్గా జరుగుతాయి. ఇంకో విషయం..... టెక్నికల్ స్టాఫ్..... మంచివాళ్ళు.... ఎవరైనా వుంటే.... అక్కన్నుంచి తెచ్చుకుంటే బావుంటుంది...." చెప్పాడు వికాస్.
   
    "నాయర్ సలహా తీసుకుంటాను..... ఓ.కె."
   
    కాసేపైన తర్వాత శివమూర్తి వెళ్ళిపోయాడు.
       
    సన్నగా చీకటి ముసురుకుంటోంది.
   
    బాయ్ చేత 'టీ' తెప్పించుకుని తాగుతూ మర్నాడు చేయాల్సిన పనుల్ని డైరీలో నోట్ చేసుకున్నాడు.
   
    గోడ గడియారంవైపు చూశాడు- సరిగ్గా ఐదున్నరయింది.
   
    పనులన్నీ అయిపోయాయి.
   
    చయనులు నాన్ననీ, అక్కనీ తీసుకొస్తాడు. అంచేత మంచి ఇల్లు చూడాలి.
   
    ఎక్కడ చూడాలి?
   
    ఫ్యాక్టరీకి దగ్గరగా వుంటే బాగుంటుందా? దూరంగా వుంటే బాగుంటుందా?
   
    ఎమ్.వి.పి, కాలనీలో తీసుకుంటే బాగుంటుందనుకున్నాడు. నందరాజ్ ని సంప్రదిస్తే ఆయన చూపిస్తాడు.
   
    మర్నాడు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
   
    లేచి-
   
    ఆఫీస్ రూంకి తాళం వేసి, మెయిన్ గేట్ వేసి బాయ్ తో చెప్పి బయటి కొచ్చాడు.
   
                                         *    *    *    *    *
   
    వెలుతురు పాములు పాకుతున్నట్టుగా ఆ విశాలమైన గది.
   
    భానోజీరావు ఛాంబర్ అది.
   
    "మధు వున్నాడా...."
   
    "ఉన్నారు సర్..."
   
    "ఒకసారి రమ్మనమనండి."
   
    మరో ఐదు నిమిషాల్లో మధుకుమార్ అక్కడున్నాడు.
   
    "కూర్చో"
   
    "ఆ వికాస్ పనులు చురుగ్గా సాగుతున్నాయట.... తెలుసా..." భానోజీరవు నోటివెంట ఆ మాట రాగానే ఆశ్చర్యపోయాడు మధుకుమార్. తనకప్ప జెప్పిన పని ఆయనే చేసినందుకు.
   
    "ఏం ఆశ్చర్యపోతున్నావా? శత్రువుని కనిపెట్టడం నా హాబీ... తాబేల్లాగా నువ్వు ఆ సమాచారం తెలుసుకుని వచ్చేసరికి వాడి కారు మార్కెట్లోకి వచ్చేస్తుంది. అందుకే నేనే తెల్సుకున్నాను. శివానీ మోటార్స్ కి లైసెన్స్ వచ్చింది- లోన్ వచ్చింది. ఓ మోడ్రన్ కారుని వాళ్ళు జనవరి నాటికి తీసుకొస్తున్నార్ట- డీలర్స్ 'టాక్' బాగా వుందట... పెట్రోలు, డీజిల్ అవసరంలేని కారుని ఇన్ వెంట్ చేయటం ఆర్ధిక మంత్రికి మహదానందాన్ని కలిగించిందట. ఇండియాలో పెట్రోలు, డీజిల్ కార్లు తయారు చేసే కంపెనీలు వికాస్ కి లైసెన్స్ రాకుండా విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాయట. చాపక్రింద నీరులా అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాడు" చెప్పాడు భానోజీరావు.
   
    చాలా విషయాలు తెలిశాయి భానోజీరావుకు అనుకున్నాడు మధుకుమార్.
   
    "ఈ రెన్నాళ్ళూ నువ్వు శివానీ మీద కాన్ సెంట్రేట్ చెయ్యి మనం జింఖానా 1000 ని మోడిఫై చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్న సమయంలో మనకు పోటీలో ఇంకో కారు వుండకూడదు- అర్ధమైందా"
   
    "ఏం చెయ్యమంటారు?"
   
    "శివానీ ఎన్ని కార్లు రిలీజ్ చేస్తున్నారో కనుక్కో..... వాటన్నిటినీ మనమే కొనేస్తాం. ఒక డీలర్ ద్వారా.... ధ్వంసం చేసేస్తాం.... అర్ధమైందా. శివానీ మీద రాత్రికి రాత్రే ఎటాక్ జరగాలి. అక్కడ ఫ్యాక్టరీ అనేది ఉండకూడదు....పోలీసులు ఫైర్ ఏక్సిడెంట్ గా కేసు రాసుకోవాలి.... అర్ధమైందా..."
   
    "ఎస్... ఎస్..."
   
    భానోజీరావుకు ఆ శివానీ మీద ఎందుకంత కక్షో అర్ధం కావడం లేదు మధుకి. జింఖానాతో పోలిస్తే అది చాలా చిన్న కంపెనీ. చాలా, చాలా రైవల్ కంపెనీల కార్లొచ్చినా, తన  'ప్రొడక్ట్ క్వాలిటీ' చేతే వాటిన్నిట్నీ 'మార్కెట్లో లేకుండా' సర్వశక్తులూ కేంద్రీకరించే వ్యక్తిత్వం గల భానోజీరావుకి శివానీ అంటే ఎందుకంత కక్ష?
   
    దాని రూపురేఖలు కూడా నాశనం చెయ్యాలనే పగ ఎందుకు? బ్యాటరీ కారనా? అయినా అ ఆపనికి తననే ఎందుకు వినియోగిస్తున్నాడీయన. అని కూడా ఆలోచించాడు మధు.
   
    "అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి. ఎక్కడా మన వ్యక్తులు, మన కంపెనీ బయటకు రాగూడదు..." హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు భానోజీరావు. మరో పావుగంట ఇతర విషయాల చర్చల తర్వాత-
   
    మధుకుమార్ బయటకెళ్ళిపోయాడు.
   
    శత్రు వర్గాల మీద తను తీసుకునే చర్యల విషయంలో ఎప్పుడూ ఎవరి దగ్గరా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచని భానోజీరావు, 'శివానీ' విషయంలో మధుకుమార్ దగ్గర బయటపడ్డాడు.
   
    అసలే అవకాశం కోసం ఎదురుచూసే మధుకుమార్ ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటే...
   
    వికాస్ తో చేతులు కలిపితే..
   
    ఆలోచిస్తున్నాడు భానోజీరావు.
   
    వెంటనే ఆయనకు జగన్నాధ మిశ్రా.... గుర్తుకొచ్చాడు. జగన్నాధ మిశ్రా ఒరిస్సాలోని బరంపురంలో కార్ల డీలర్. ఈ బిజినెస్ లో సీనియర్ వ్యక్తి. వ్యాపారంలో ఎక్కడ ఏ పాచిక వెయ్యాలో తెల్సిన శకుని.
   
    మధుకుమార్ మీద జగన్నాధ మిశ్రా!!
   
    ఆ ఆలోచన చాలా సంతృప్తి నిచ్చింది భానోజీరావుకి.
   
    అయిదు నిమిషాల్లో ఎస్.టి.డి. మీద మెసేజ్ వెళ్ళిపోయింది జగన్నాధమిశ్రాకు.
   
                                        *    *    *    *    *
   

    విశాలమైన బెడ్ రూం, అతి విలాసంగా ఉంది.
   
    ఆ బెడ్ రూంలో ఒక పక్కన 'లిక్కర్ కాబినేట్' ఉంది. 'సమ్ థింగ్ స్పెషల్' డ్రింక్ ని తీసుకుని గ్లాసులో పోసుకుని, అందులో రెండు 'ఐస్ క్యూబ్స్' వేసుకున్నాడు మధుకుమార్.
   
    సిప్ చేశాడు.
   
    త్రిబుల్ ఫైవ్ సిగరెట్ పాకెట్ లోని సిగరెట్ తీసి వెలిగించి ఆలోచిస్తున్నాడు.
   
    భానోజీరావు ఊహించింది కరెక్టే భానోజీరావు ఏం జరగొచ్చునని భావించాడో, దాని గురించే ఆలోచిస్తున్నాడు మధుకుమార్.
   
    శివానీ కంపెనీ కారు మార్కెట్లోకి రాకుండా తను చెయ్యదు! వికాస్ తో తన చేతులు కలుపుతాడు!!
   
    ఎప్పటికయినా జింఖానాకు తను చైర్మెన్ కావాలి- భానోజీరావుని చిటికెన వేలుతో తీసి అవతలకు పారెయ్యాలి.
   
    ముందుగా లిఖితను తనవేపు తిప్పుకోవాలి.
   
    అందుకు రంగం సిద్దం చెయ్యాలి.

 Previous Page Next Page