"ఒరేయ్.....వేలిడంత లేవు నువ్వు కూడా కామెంట్ చేస్తావా?" గబగబా ముందుకు పరిగెత్తి, వాడ్ని పక్కకుతోసేసి, మిగతా వాళ్ళ నుంచి సంధ్యను తప్పించడానికి తలప్రాణం తోకకొచ్చింది నారాయణరావుకి.
అరగంట గడిచింది.
పూర్తిగా తడిసిపోయి, ముద్దయిపోయి ఇసుకమీద కూర్చుండి పోయిన సంధ్య వేపే మగ జనమంతా విచిత్రంగా చూస్తుండడంతో సిగ్గూ, రోషం, కోపం మూడూ ముంచుకొచ్చాయి ఆమెకు.
"ఛీ.....వెధవ ప్లాన్.....వెధవప్లాన్ అని.....అర్జంటుగా ఆటో తీసుకురా పో....." ఏం చెయ్యాలో తోచక, షోకేస్ లో బొమ్మను చూస్తున్నట్లుగా చూస్తున్న ప్రేక్షక జనాల్ని పక్కకు తోసేస్తూ కథాకళి చేస్తున్న నారాయణరావుతో అందామె.
నారాయణరావు, సర్రుమని రోడ్ మీదకు పరుగెత్తాడు.
"ఇలాంటి పిచ్చి, పిచ్చి ప్లాన్లు మరెప్పుడూ వెయ్యక అర్ధవైందా" రుసరుసలాడుతూ ఆటో ఎక్కుతూ అంది సంధ్య.
ఆటో ముందుకెళ్ళిపోయింది.
కరెంట్ పోల్ లా నడిరోడ్డుమీద నిలబడిపోయాడు నారాయణరావు.
"రొమాన్స్ కోసం బిడ్డను బీచ్ కు తీసుకొచ్చావా ఖన్నా. పాపం ప్రోగ్రామ్ ఫైలినట్టుందే" సెకండ్ స్టాండర్డ్ కుర్రాడు వెక్కిరిస్తూ కామెంట్ చేసేసరికి, ఉగ్రంగా వాడివేపు చూసి, వాడి చెవి పట్టుకుని నులిమేసరికి, వాడు అంతెత్తున ఏడుపు అందుకున్నాడు-వాడి మమ్మీ డాడీ, కయ్యానికి పరుగెత్తుకుని వస్తుండగా నారాయణరావు కె జి హెచ్ వేపు దౌడు తీసాడు.
* * * *
దబదబా తలుపు బాదుతున్న చప్పుడికి మెలుకువ వచ్చింది నారాయణరావుకి.
బోర్లాపడుకున్న నారాయణరావు రూమ్ వేపు చూశాడు. తెల్లవారు జామున నాలుగు గంటలవరకూ అతనో విషయం గురించి సీరియస్ గా ఆలోచించాడు.
అదీ__తమ ప్రేమ గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలంటే ఏం చెయ్యాలని.
అసలు గిన్నీస్ బుక్ అంటే ఏమిటి? అందులోకి ఎక్కడమంటే ఏమిటి? నారాయణరావుకి అర్ధమైనకాడికి గిన్నీస్ బుక్ అనేది అమెరికాలోనో,ఇంకెక్కడో వుండే కొండ అనిన్నూ___చాలా అష్టకష్టాలు పడి, ఆ కొండ ఎక్కినావాళ్ళకు, ఆ కొండ తాలూకూ వాళ్ళు అవార్డులిస్తారని, ఎప్పటికయినా తను ఆ కొండెక్కి ఆ అవార్డును సంపాదించాలని తీవ్రంగా తీర్మానించుకున్నాడు. ఆ తర్వాత మాత్రమే అతనికి శుభ్రమైన నిద్రపట్టింది.
కళ్ళు నులుముకుంటూ లేచి తలుపు తెరచిన నారాయణరావుకి పొలాల్లో దిష్టిబొమ్మలా కనిపించిన జుత్తుల జిన్నాను చూడగానే భయపడ్డాడు.
"ఏంటీ.....నువ్వింకా ఇలాగే వున్నావ్.....రాత్రి నేను మీ ఓనరు కిచ్చిన మెసేజ్ అందలేదా?"
"మా హౌసోనరుకు ఏం మెసేజిచ్చావ్?"
"అదేరాబాబూ.....నీకు తెలీదా? అఖిలపక్ష ప్రేమ కార్యాచరణ కమిటీ ద్వారా ఆ మధ్య అందరికీ ఉత్తరాలు పోస్టుచేసాం కదా.....ఈ మధ్య లెటర్ కరస్పాండెన్సులవీ జరిగాయిలే.....అని సిటీల నుంచీ ఊళ్ళనుంచీ స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తున్నారు భారీ సంఖ్యలో."
"ఎందుకూ....సెంట్రల్ మినిస్టరొస్తున్నాడా?"
"నీదో గోల.....నువ్వూ సంధ్యా ప్రేమించుకుంటున్నారు గదా దాని మద్దతుకోసం భారీ ఊరేగింపు బస్టాండు నుంచి స్టార్టవుతోంది. సంధ్య కూడా వచ్చేసింది కూడా."
ఆ మాట వినగానే గబగబా తయారైపోయాడు నారాయణ రావు.
మెట్లు దిగుతుండగా-
మెట్లకడ్డంగా నిజంగా శీర్షాసనం వేసి, రొప్పుతున్న హౌస్ ఓనర్ ని చూడగానే అనుమానం వచ్చింది నారాయణరావుకు.
"ఆసనాలంటే మండిపడే మనిషి, ఆసనాలేస్తున్నాడేంటీ-అందులోనూ, శీర్షాసనం.....మెట్లకు అడ్డంగా....?"
"నేను పైకొచ్చినపుడు ఈ వికృతాకారం ఇక్కడలేదే......" జుత్తులజిన్నా అన్నాడు కంగారుపడిపోతూ.
"మా వాడికి ఏదొచ్చినా అంతే-ఆగదు-నడుం నొప్పికి అందరూ అమృతంజనమో ఇంకోటో రాసుకుంటే, మావాడు గోడెక్కి కూర్చుంటాడు. తలనొప్పి వస్తే, బకెట్ నిండా నీళ్ళునింపి, ఆ నీళ్ళలో తల పెట్టుకుని కూర్చుంటాడు. ఆ మధ్య చేతివేళ్ళు పట్టేసాయన్నాడు. కరెంట్ వైర్ పట్టుకోమన్నాను....." నవ్వుతూ చెప్పాడు నారాయణ రావు.
"పట్టుకున్నాడా?"
"పట్టుకుంటే ఈ అవతారంలో ఎందుకు కనబడతాడు. పట్టుకుని వుండడు...." అని.
"గురూగారూ___అడ్డుగా లేస్తారా? మేం అర్జంటుగా బయటకు వెళ్ళాలి" ఆయనకు చిన్నమోస్తరు చెవుడు కూడా వుండడంవల్ల వంగి చెప్పాడు.
"ఏంటీ.....ఈ ఫోజులో ఫోటో తీస్తావా తీసుకో....." అని ఎదురు జవాబిచ్చేసరికి డంగైపోయాడు నారాయణరావు.
"ఫోటోకాదండీ బాబూ-ఆ ఆసనాలాపి మాకు దారిస్తారా....?" గట్టిగా, లౌడ్ స్పీకర్ లోంచి అరిచినట్టుగా అరిచాడు.
"వినబడిందిలేవయ్యా-నువ్వెక్కడకు వెళుతున్నావో నాకుతెలుసు ఆ ప్రేమ ఊరేగింపుకే కదా - అందుకే-నువ్వక్కడకు వెళ్ళకూడదనే ఈ ఆసనం వేసా__" ఆసనానికి స్వస్తిచెప్పేసి, మామూలుగా నిలబడి అన్నాడు ఆ ఇంటి వానరుడు.
"ఎందుకు వెళ్ళకూడదట?"
"అదంతే. ప్రేమేవిటయ్యా-ప్రేమ.....ప్రేమలో పడినవాడెవడు బాగుపడ్డాడయ్యా చెప్పు" చికాకుగా అన్నాడాయన.
"అంటే మీరు ప్రేమ వ్యతిరేకా?"
"వ్యతిరేకా మజాకా......నేనొక్కడ్నే కాదు.....ఈ కాలనీ వాళ్ళందరం కూడా ప్రేమ వ్యతిరేక కులమే. అందుకే మేమందరం ఓ సంఘంగా ఏర్పడ్డాం....."
"ఏం చేస్తారు......?"
"ఏం చేస్తామా......గత రెండు నెలలుగా, మీ స్టూడెంట్స్ వెధవ వేషాలన్నీ గమనిస్తున్న మేం__అతి త్వరలో మీకు వ్యతిరేకంగా భారీ సభలూ, వూరేగింపులూ తీయడానికి నిశ్చయించాం.....సిటీలోని పెద్దలందరూ, అఖిలపక్ష ప్రేమ నిరోధక కమిటీని ఏర్పాటుచేసే సంకల్పములో వున్నాం....."
ఆ మాటకు ఆనందంగా నవ్వాడు నారాయణరావు.
చప్పట్లు కొట్టాడు జుత్తులజిన్నా-
"అదేదో త్వరగా చేయండి......ఒక పనయిపోతుంది....." అని గేటు తెరచుకుని బయటకు వెళ్ళిపోతున్న నారాయణవేపు, జుత్తుల జిన్నావేపు విచిత్రంగా చూశాడు ఆ హౌస్ వానరుడు.
సరిగ్గా అదే సమయంలో ఆ వానరుడి కూతురు జాంబవతి లోన్నించి వచ్చింది.
"కనీసం నా వేపు ముఖం ఎత్తి చూడని, ఆ నారాయణరావుతో నా పెళ్ళిని చేయించడానికి కుట్ర పన్నుతానన్నావ్ పన్నావా నాన్నా?" సిగ్గుపడుతూ అడిగింది జాంబవతి.
"ఆఁ పన్నానులే.....ఆ కుట్రలో ఫస్ట్ పార్టుకు ఇప్పుడే అంకురార్పణ చేసాలే.....అదికాదు గానీ జాంబవతీ.....తండ్రి దగ్గర సిగ్గుపడకూడదని నీకెన్నిసార్లు చెప్పాను___చూడమ్మా మరోసారి చెపుతున్నాను- ఎవరయినా కుర్రాడు కనిపించాడనుకో అప్పుడు సిగ్గుపడాలి బుజ్జగిస్తూ చెప్పాడు.
"ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర సిగ్గుపడినా.....ఎవ్వడూ లవ్ చెయ్యడం లేదు....." విసుక్కుని, గొణుక్కుంటూ లోనికెళ్ళిపోయింది జాంబవతి.