Previous Page Next Page 
మొగలిబాకు పేజి 42

   

      ఆ తరువాత ఎండలో పద్మాసనం వేసుకుని నారాయణరావు, సంధ్యల ప్రేమని ఎలా భగ్నం చేయాలనే విషయమై అరగంటసేపు ఆలోచించి, తరువాత వళ్ళంతా చుర్రు మనడంతో, చాప సర్దుకుని లోనికెళ్ళిపోయాడు హౌస్ ఓనర్.
   
                                            *    *    *    *
   
    ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వేలాదిమంది స్టూడెంట్స్ గుమిగూడి ఉన్నారు. రెండు లారీలు, నాలుగు ట్రాక్టర్లు, స్కూటర్లు, హీరోహోండాలనిండా ఎటు చూస్తే అటు విద్యార్ధినీ విద్యార్ధులు.
   
    రోడ్డు కటూ ఇటూ రెండు వరుసల్లో విద్యార్దినులు-వారి చేతుల్లో బ్యానర్లు_
   
    ప్రపంచ ప్రేమికులారా! ఏకం కండి!
   
    ప్రేమ నిత్యం-ప్రేమ సత్యం-ప్రేమ శాశ్వతం-
   
    ప్రేమను ప్రేమించండి......ప్రేమికులను ప్రోత్సహించండి.....
   
    టాపులేని జీపుమీద నారాయణరావు, సంధ్య నిలుచున్నారు.
   
    ఊరేగింపు ప్రారంభమైంది.
   
    విద్యార్ధుల నినాదాలతో రోడ్లన్నీ హోరెత్తిపోతున్నాయి.
   
    ఎక్కడి ట్రాఫిక్ అక్కడ స్తంభించి పోయింది.
   
    ఊరేగింపు, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్స్, జగదంబా మీదుగా వెళుతోంది.
   
    "తరతరాలుగా, యుగయుగాలుగా పెద్దల దౌష్ట్యానికి బలైపోతున్న ప్రేమను రక్షించండి....."
   
    "లవ్ బర్డ్స్ సంధ్యా, నారాయణరావు....జిందాబాద్....జిందాబాద్....."
   
    ఆ చోద్యాన్ని రోడ్డుమీద వెళుతున్నవాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు.
   
    రోడ్డుమీద పూర్ణామార్కెట్ జంక్షన్ లో ఒకర్నొకరు ప్రస్నించుకోవడం ప్రారంభించారు.
   
    "ఎందుకట....ఇదంతా?"
   
    "ఆ జీపుమీద బొమ్మల్లా నిలబడ్డారే.....వాళ్ళిద్దరూ ప్రేమికులట- పెద్దలకు వ్యతిరేకంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నార్ట__వాళ్ళ కందరకూ వీళ్ళు మద్దతు తెలుపుతున్నారన్నమాట......"
   
    ఎక్కడి ట్రాఫిక్ అక్కడ ఆగిపోవడంతో ఆ న్యూస్ అర్జంట్ గా తెలియడంతో, ఆ ఏరియా పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ రెండు బెటాలియన్ల పోలీసులతో వచ్చేసాడు.
   
    ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా, కట్టుదిట్టంగా ఊరేగింపు సాగిపోతోంది.
   
    ఊరేగింపు ఎ.వి.ఎన్. కాలేజీ డౌన్ దగ్గరకొచ్చింది.
   
    అప్పుడు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కొత్తరోడ్డు జంక్షన్ దగ్గర ఇంకొక వూరేగింపు కనబడడంతో నారాయణరావు మొదట ఖిన్నుడయ్యాడు.
   
    ఆ వూరేగింపులో__అందరూ యాభైకి పైబడి ఎనభై ఏళ్ళకి లోబడిన వాళ్ళేవున్నారు.
   
    రోడ్డు కటూ ఇటూ కర్రలు, ఊతగా పట్టుకున్న వృద్దులు నడుస్తున్నారు-మధ్యలో అరడజను రిక్షాల్లో మరీ నడవలేని వృద్దులు కూర్చున్నారు.
   
    ఆ వృద్దుల చేతుల్లో ప్లేకార్డ్స్ వున్నాయి-వాటిమీద స్లోగన్లు వున్నాయి.
   
    ప్రేమేమిటి ప్రేమ-ఛండాలం.....
   
    ప్రేమ పేరుతో కుర్రకారు వేసే పోకిరీ వేషాలను బహిష్కరించండి.....
   
    ప్రేమ పేరుతో అందరూ లేచిపోతే పెద్దరికం మాటేమిటి? పెద్దల మాటేమిటి?
   
    ప్రేమ నిరోధక కమిటీ జిందాబాద్.....
   
    "ఏంటది? ఎవరు వారు?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది సంధ్య.
   
    ఆ వృద్దుల ఊరేగింపు ముందు కనబడిన వ్యక్తుల్ని చూడగానే వాళ్ళెవరో అర్ధమైపోయింది.
   
    ద్వారకానగర్ పార్కులో, ఆరోజు మీటింగ్ పెట్టిన మహిళా మణులు-అ మహిళామణుల్లో ఒక మహిళామణిని చూసి నిర్ఘాంతపోయారు సంధ్య, నారాయణరావులు.
   
    మేడ్ ఫర్ ఈచ్ అదర్ కంటెస్ట్ నిర్వాహకురాలు మాజీ మిస్ డాబాగార్డెన్స్__
   
    ఆవిడ శివాలెత్తిపోతున్నట్లు స్లోగన్స్ ఇచ్చేస్తోంది.
   
    ఆ పక్కన తన హౌస్ వానరుడ్ని చూడగానే మరింత నిర్ఘాంతపోయాడు నారాయణరావు.
   
    "వీళ్ళందరూ ఎక్కడ కలిసారు?"
   
    అప్పుడే పరుగు పరుగున వెనకనుంచి ముందుకొచ్చాడు వాసుదేవ్-మైక్ అందుకున్నాడు.
   
    "మైడియర్ విద్యార్ధినీ విద్యార్దులారా-ఇన్నాళ్ళూ మనకు ప్రతి పక్షం లేదు. మన ప్రేమ ఉద్యమాన్ని నీరు కార్చడానికి, విదేశీకుట్ర ఆరంభమైంది. నడవడానికి ఓపికలేని వాళ్ళందరూ ఊరేగింపు తీయడమే దానికి నిదర్శనం. అంచేత విద్యార్దులారా! ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని పురికొల్పినా......అహింసకు దిగొద్దని మనవి చేస్తున్నాను."
   
    అతని చేతిలోంచి మైకు అందుకుని మోతీలక్ష్మీ ఆవేశంగా ఉపన్యసించడం ప్రారంభించింది.
   
    "ప్రేమ గురించి తెలియని ఈ వృద్దుల వూరేగింపును చిన్నా భిన్నం చేయండి__కమాన్__ఆ వృద్దుల్ని తరిమి తరిమి కొట్టండి" సడన్ గా మోతీలక్ష్మి చేతిలోని మైకును లాక్కుని కోప్పడిపోయాడు వాసుదేవ్.
   
    "నేను శాంతియుతమైన స్టేట్ మెంట్స్ ఇస్తుంటే, నువ్వు అశాంతి యుతమైన స్టేట్ మెంట్స్ ఇవ్వడం నాకేం నచ్చలేదు. ఇది ఉద్యమం.....మీ ఇల్లు కాదు......"
   
    "ఇన్నాళ్ళూ మన ఉద్యమం, చాపకింద నీరులా సాగింది. అలా సాగకూడదు-ఇప్పుడు ఈ వూరేగింపును, మనం చిన్నాభిన్నం చేసామనుకో.....నేషనల్ లెవెల్లో మన ఉద్యమం గురించి తెలుస్తుంది. అదీ నా ప్లాన్...."
   
    "కరెక్టే....సారీ....నేనది ఊహించలేదు. అయితే ఏం చేద్దాం" అడిగాడు వాసుదేవ్.
   
    "ఆ ఊరేగింపును చిన్నాభినం చేయమని ఆర్డర్స్ ఇవ్వు.....అంతే" మోతీలక్ష్మీ సలహాతో వాసుదేవ్ మైకుని తీసుకుని-
   
    "మహా ఉద్యమ విద్యార్దులారా.....ఆదర్శ, ఆశయ విద్యార్దినులారా...... సల సల కాగే ఉష్ణ రక్తం లాంటి మన ఉద్యమాన్ని నీరు కార్చటానికి వృద్దవర్గం చేపట్టిన ఆ వూరేగింపును నాశనం చేయండి.....ఆ వృద్దుల్ని చేపట్టిన ఆ వూరేగింపును నాశనం చేయండి......ఆ వృద్దుల్ని తరిమెయ్యండి...." అని ఆర్డర్స్ యివ్వగానే విద్యార్ధినీ విద్యార్దులందరూ ఒక్కుమ్మడిగా ముందుకు పరిగెత్తారు- ఆ వృద్దుల వూరేగింపు మీద పడ్డారు.
   
    వాళ్ళ చేతుల్లోని ప్లేకార్డ్స్ లాక్కున్నారు..... బ్యానర్లు చింపి, పోగులు పెట్టారు. రిక్షాల టైర్లలో గాలి తీసేసారు.....రోడ్ పక్కనున్న మట్టిని తీసి ముసలాళ్ళ మీద జల్లారు. కంకరరాళ్ళను విసిరి వాళ్ళను భయభ్రాంతుల్ని చేశారు.
   
    కొంతమంది ప్రాణభయంతో పరుగెడుతుండగా, వాళ్ళను వెంటాడుతూ దిరుగెత్తారు జుత్తులజిన్నా, మహమ్మదాలీ తదితరులు.
   
    జుత్తులజిన్నా చేతికి ఒక ముసలాయన దొరికిపోయాడు. ఆయన కట్టుకున్న పంచెను లాగేశాడు.
   
    "బాబ్బూబూ..... నా పంచె నా కిచ్చీయ్యమ్మ..... నీకు పుణ్యముంటుంది"
   
    "మరెప్పుడయినా ఇలాంటి వూరేగింపులు తీస్తావా?"
   
    "నేను వూరేగింపులు తీయడ మేమిటి తండ్రీ.... సాంబమూర్తి కళామందిర్ లో పోటీలు పెట్టిందే___ ఆవిడొచ్చింది___ఈ వూరేగింపులో పార్టిసిపేట్ చేస్తే వందరూపాయలు ఇస్తానంటే వచ్చాను....."

 Previous Page Next Page