Previous Page Next Page 
మొగలిబాకు పేజి 40

   

      "అంటే__మీరిప్పుడు పరమ ప్రేమ విద్వేషిగా మారిపోయారా?" అడిగింది సంధ్య.
   
    "అవునమ్మా.......ప్రేమంటే ఏం లేదుతల్లీ.....మేటర్ ఆఫ్ సెవెన్ మినిట్స్__అంతే ఆ ప్రేమ పేరుతో యువతరం ఎంత టైమ్ వేస్టు చేస్తుందో నాకిప్పుడే అర్ధమైంది తల్లీ"
   
    "అయితే కండక్టర్ సార్......ప్రేమ గురించి, మీ అభిప్రాయాన్ని ఈ పేపర్ మీద రాసి సంతకం పెడతారా?" తెల్ల కాగితాన్ని అతని ముందుంచుతూ ఆనాడు నారాయణరావు.
   
    "రాస్తా.....కసిగా రాస్తా....లెండి" అంటూ ఆ తెల్లకాగితంమీద బరబరమని కొన్ని వాక్యాలురాసి, సంతకం పెట్టి డేట్ వేశాడు.
   
    "థాంక్యూసార్" కృతజ్ఞతలు తెలిపాడు నారాయణరావు.
   
    "ఇట్సాల్ రైట్__ఇప్పుడుకాదు.....మీకెప్పుడు కావాలన్నా.....ఇలాంటి కాగితాలిస్తాను నా దగ్గరకు రండి" అని ఇంటి అడ్రస్ కూడా ఆనందంగా చెప్పాడు పరకాయమణి.
   
    ఆ తర్వాత ఆ బస్సులోంచి ఆనందంగా దిగిపోయారు నారాయణరావు, సంధ్య.
   
                                        *    *    *    *
   
    ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలు.
   
    రామకృష్ణా బీచ్ కోలాహలంగా వుంది.
   
    అరగంటనుంచీ ఇసక తిన్నెమీద కూర్చుని సంధ్యకోసం ఎదురుచూస్తున్నాడు నారాయణరావు.
   
    "ఈ ఆడవాళ్ళకు బొత్తిగా టైమ్ సెన్స్ లేదు. ఛ.....ఛా" చికాకు పడుతున్నాడతను.
   
    "హలో" ఆ పిలుపు వినిపించగానే నారాయణరావు ముఖం ఒన్ కె.వి.లా వెలిగిపోయింది.
   
    "ఎందుకిక్కడకు రమ్మన్నావ్? అదీగాక అర్దరాత్రి పన్నెండు గంటలకు ఎవరయినా ఫోన్ చేస్తారా?" చిరుకోపంగా అడిగిందామె.
   
    "అదా....నాకు గుడ్ ఐడియాలన్నీ అర్దరాత్రి వస్తాయి. వెరైటీ ఐడియాలన్నీ తెల్లవారుజామున వస్తాయంతే" అని ఆమె చేయి పట్టుకున్నాడు నారాయణరావు.
   
    "మనం యిద్దరం ఉన్నప్పుడు ఈ వెధవ్వేషాలెయ్యక్కరాలేదు. ఎందుకు పిల్చావో, ప్రోగ్రామ్ ఏమిటో చెప్పు" కసిరింది సంధ్య.
   
    "ట్రైమండస్ పబ్లిసిటీకి వెరైటీ ఐడియా"
   
    "ఏంటది?"
   
    "ఈ బీచ్ లోని జనాల్ని, మనం ఎట్రాక్ట్ చేసేటట్టుగా, హైలెవెల్లో మనం ప్రేమికులుగా నటిస్తామన్నమాట ....అండర్ స్టాండ్"
   
    "ఏం చేయాలో వివరంగా చెప్పు" కాసేపు సీరియస్ గా ఆలోచించి చెప్పాడు నారాయణరావు.
   
    "నువ్వు నెమ్మదిగా ముందుకెళ్ళి నీట్లోవున్న ఆ రాయిమీద కూర్చుని ఒడ్డునున్న నావేపు అదే పనిగా ఓరకంట చూస్తావు.....నేను కూడా నీ వేపు ఓరకంట చూస్తాను"
   
    "అలా చూస్తూనేవుంటాం.....ఆ తరువాత" ఉత్సాహంగా చెప్పుకుపోతున్న నారాయణరావు మాటల్ని కట్ చేసిందిసంధ్య.
   
    "ముందు సీన్ లోకి వెళ్ళిపోదాం.....తరువాత ఆటోమేటిగ్గా స్క్రీన్ ప్లే వస్తుంది.....సరేనా"
   
    నవ్వాడు నారాయణరావు.
   
    "ఇప్పుడు తీసే సినిమాల మాదిరి షూటింగ్ స్పాట్ లోనే డైలాగులు రాస్తారు. అలాగన్నమాట.....పద ఈ దెబ్బతో మన ప్రేమ గురించి వైజాగ్ జనాలందరకూ తెల్సి పోవాలి"
   
    సంధ్య లేచి అటూ ఇటూ చూస్తూ ముందుకు నడిచింది. సముద్రపు నీళ్ళల్లోకి అడుగుపెట్టి, ఒడ్డుకి రెండడుగులు దూరంలో ఉన్న నల్లరాయిమీద కూర్చుంది.
   
    ఆమె కాలికి చల్లనినీళ్ళు, చల్ల చల్లగా తాకుతున్నాయి.
   
    ఆ సీనుని రసోద్రేకంగా చూస్తున్నాడు నారాయణరావు.
   
    అటూ యిటూ చూసి కొన్ని గులకరాళ్ళను తీసుకొని, సంధ్య వేపు  విసరడం ప్రారంభించాడు.
   
    అరగంట గడిచింది.....చేతిలోని గులకరాళ్ళన్నీ అయిపోయాయి. గులకరాళ్ళకోసం అటూ యిటూ తిరుగుతున్నాడు.
   
    అక్కడక్కడ చేతిలో గులకరాళ్ళతో ఆడుతున్న చిన్నపిల్లల దగ్గర్నుంచి కూడా ఆ రాళ్ళను తీసుకొని సంధ్య మీదకు విసిరాడు.
   
    "లాభంలేదు.....గులకరాళ్ళ ప్రేమకు ఫుల్ స్టాఫ్" అంటూ ముందుకు నడుస్తూ అందరివేపూ చూశాడు నారాయణరావు.
   
    చుట్టూ ఎక్కువమంది ప్రేమజంటలు-కొత్తగా పెళ్ళయిన వాళ్ళూ కూర్చోవడం వల్ల ఎవరూ ఆ సీనుని పట్టించుకోవడంలేదు.
   
    "సీను ప్లాప్. ప్లేస్ మారుద్దామా?" అడిగింది సంధ్య.
   
    "అదేంకాదు.....ఇప్పుడు నీమీద నేను నీళ్ళను విసురుతాను.....నువ్వు సిగ్గు పడుతూ నీళ్ళల్లోకి వెళుతుంటావ్....అప్పుడు చచ్చినట్టుగా అందరూ మనల్నే చూస్తారు"
   
    అంటూ ముందుకెళ్ళి దోసిళ్ళోకి నీళ్ళను తీసుకొని సంధ్యమీద పోయడం ప్రారంభించాడు.
   
    ఆ నీళ్ళనుంచి తప్పించుకుంటూ సంధ్య ముందుకెళుతోంది.
   
    "సైలెంట్ మూవీలో హీరోయినుగా అలా కామ్ గా ముందుకెళ్ళి పోతే ఎలా.....చూడూ....ఏయ్ డియర్....వద్దు డియర్. హేయ్ రావ్ వద్దు రావ్ అని.....అలా అంటుండాలి" ఆమెకే వినబడేటట్లు అన్నాడు నారాయణరావు.
   
    "గట్టిగా అనాలా, నెమ్మదిగా అనాలా?"
   
    "ఏదోరకంగా అనూ.....సీను మాత్రం ఎఫెక్టివ్ గా రావాలి.....అర్ధమైందా?"
   
    నీళ్ళు జల్లుతూ అన్నాడు నారాయణరావు-
   
    నారాయణరావు చెప్పినట్టుగానే "ఏయ్ డియర్__వద్దు డియర్, హేయ్ రావ్.....వద్దు రావ్" అని అంటూ ముందుకెళుతోంది సంధ్య.
   
    "ఇప్పుడు నీ చీర తడిపేస్తాను తడి తడిగా ఎండలో మెరిసిపోయే నీ ఒంటిని నా చూపుల్తో తడిపేస్తాను. డియర్ సందూ నువ్వు నా ప్రేయసికాదు, ఊర్వశివి, అహ.....హ" శివాజీగణేశన్ లెవెల్లో డైలాగు లనేస్తూ, నీళ్ళను విసురుతూ-
   
    ఏవో నీళ్ళు తనమీదకూడా పడడంతో ఆశ్చర్యంగా తలతిప్పి చూశాడు నారాయణరావు.
   
    పదేళ్ళ వయసుగల పిల్లలు.....వాళ్ళుకూడా వరసగా నిలబడి సంధ్యమీద నీళ్ళు విసురుతున్నారు.
   
    పరమ చికాకొచ్చింది నారాయణరావుకి.

    "ఆవిడ నా ప్రేయసి మీరెందుకురా నీళ్ళు విసురుతున్నారు" ఒకడి చెయ్యి పుచ్చుకుని కోపంగా అడిగాడు నారాయణరావు.
   
    "నీ ప్రేయసా? పబ్లిక్ ప్రాపర్టీ-ఒరేయ్ బ్రదర్-పిల్ల పనస పండులా వుందిరా" అంటూ కామెంట్ చేసేసి నేరుగా నీళ్ళలోకి వెళ్ళి పోయి, సంధ్య చేయి పుచ్చుకోబోయాడు. దాంతో మిగతా కుర్రాళ్ళు కూడా ముందుకు హోరుమంటూ పరుగెత్తారు.
   
    సంధ్య ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయింది. సరిగ్గా అదే సమయంలో ముందుకు పరిగెడుతున్న ఆమె కాలు మడతబడి కింద నీళ్ళలో పడిపోయింది.
   
    ఉధృతంగా వస్తున్న కెరటాలు ఆమెను పక్కకునెట్టేస్తున్నాయి.
   
    "సేవ్ మీ__రక్షించండి__రక్షించండి__" నీళ్ళలో తప తప కొట్టుకొంటూ కేకవేస్తోందామె.
   
    "మేం సేవ్ చేస్తాం....మేం రక్షిస్తాం...." అంటూ కుర్రాళ్ళందరూ ఆమెమీద పడ్డారు.
   
    "నీళ్ళలో తడిసిన పిల్ల.....మమతా కులకర్ణిలా వుందిరా....." సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న ఒకడు కామెంట్ చేసాడు.

 Previous Page Next Page