గంగారత్నం మూతి తిప్పింది.
త్రయంబకరావు, విజయ్ కుమార్ మల్ హోత్ర వైపు కొరకొర చూశాడు.
"ఏయ్ కుర్రాడా! చీమిడి తుడుచుకో," అంది అమల విజయ్ కుమార్ మల్ హోత్ర మీసాల వైపు వేలుపెట్టి చూపిస్తూ.
విజయ్ కుమార్ మల్ హోత్రవి హిట్లర్ మీసాలు. ఆ మీసాల తీరు ముక్కు రంధ్రాల కింద మూతిమీద నిలువుగా జలుబు నీళ్ళు కారుతున్నట్లే వుంటాయి.
అమల అలా అనంగానే త్రయంబకరావు "హిహ్హిహ్హీ" అంటూ పెద్దగా నవ్వాడు.
"యాక్కులాయిలే, చీమిడి తుడుచుకో కుర్రాడా!" మళ్ళి అంది అమల.
"మీకే సార్, చెప్పేది వినబడలా!" త్రయంబకరావు అన్నాడు.
"నేను తుడవనా?" అంటూ అమల కూర్చున్న చోటు నుంచి లేచింది.
విజయ్ కుమార్ మల్ హోత్ర "డేమ్ ఫూల్," అని ఎవరిని తిట్టాడో తిట్టి బూటు కాలితో గట్టిగా తన్ని చర్రున లేచి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
త్రయంబకరావు ఆనందించి లేచి అమల దగ్గరకు రాబోయాడు. సరీగ అప్పుడే నూనె సీసా దువ్వెన తీసుకుని నర్సమ్మ అక్కడికి వచ్చింది.
"సరోజమ్మగారు! జడవేస్తాను రండమ్మా!" అంటూ ప్రేమగా పిలిచింది నర్సమ్మ.
"ముందు అత్తగాడికి వెయ్యి, ఊ..... వెయ్యమంటుంటే." అంది అమల గంగారత్నంని చూపుతూ.
"నా బొంద నెత్తిన గొడుగు లేనిదాన్ని నాకేం జడ!" అంది గంగారత్నం.
"అదేం లాభంలేదు పెద్దమ్మగారూ! అమ్మగారి ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ పైపైన దువ్వుతాను రండి. లేకపోతే ఇల్లుపీకి పందిరేస్తారు."
"ఏం చేస్తాము కానియ్యి. జడ వేసినట్లు నటియ్యి." అంటూ గంగారత్నం నర్సమ్మ ముందు కూర్చుంది.
అమల వచ్చి వాళ్ళ ఎదురుగా, కూర్చుంది. "నేను లేక్కపెడతాను సరీగ పది జడలు వెయ్యాలి తెల్సిందా!" అంది గుడ్లు మిటకరిస్తూ.
"అయ్యో అయ్యో." అంది గంగారత్నం.
"ఎందుకైనా మంచిది గుండుగీయించుకోవే అమ్మా!" అన్నాడు త్రయంబకరావు నవ్వుతూ.
"ఇదేమో జడలు వేయిస్తుంది. నీవేమో గుండు గీయించు" అంది గంగారత్నం.
నర్సమ్మ నవ్వుకుంటూ వేలంత జడలు వేయటం మొదలుపెట్టింది. అమల లెక్కపెడుతూ కూర్చుంది.
22
అమల గోళ్ళు కొరుక్కుంటున్నట్లు నటిస్తూ కిటికీ దగ్గర నుంచుంది బైటికి చూస్తూ.
"ఏయ్ అమలా!" అన్న పిలుపు విని త్రుళ్ళిపడింది అమల. గిర్రున వెనుదిరిగి చూసింది.
గుమ్మానికి అడ్డంగా విజయ్ కుమార్ మల్ హోత్ర నించుని ఉన్నాడు. అమల చూసి హేళనగా నవ్వింది.
అమలకి అంతా అయోమయం అయింది. వీడు వీడు భగవాన్ మనిషా! లేక భగవాన్! ఉహు, వాడు వాళ్ళ మనిషి అయితే భుజంగరావు ఇతను తన రంగూన్ ఫ్రెండు కొడుకని ఎలా చెప్పారు? బహుశా వకటి అయి వుంటుంది. నిజంగా రంగూన్ మిత్రుడు వస్తున్నట్లు వార్త పంపించి వుంటాడు, భగవాన్ ఆ మిత్రుడి కొడుకుని మాయంచేసి వాడిని విజయ్ గా తయారుచేసి ఇక్కడ ప్రవేశపెట్టి ఉంటాడు ఇలా ఎంత మంది ఇంట్లో చేరుతారు? చేరి ఏం చేస్తారు?
"ఏంటి ఆలోచిస్తున్నావ్? పేరు ఎలా తెలిసిందనా!"
అమల మాట్లాడలేదు.
"పెదవి కదుపు అమలా!"
అమల కొర కొర చూసింది.
"నీ చూపులు మగవాడిని రెచ్చగోట్టేటట్లు వుంటాయి