భయమేసినప్పుడు హనుమాన్ చాలీసా చదవమని చెప్పింది అమ్మ. కోపం వచ్చినప్పుడు ఒకటి నుంచి ఇరవై వరకు లెక్కపెట్టమని నాన్న చెప్పాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలో ఎవరూ చెప్పలేదు. తనకు తోస్తున్నన మార్గం ఒక్కటే -అది ఒకటి నుంచి శరీరం తిరిగి చల్లనయ్యే వరకు లెక్క పెడుతుండడమే.
ఆమె ఒకటి రెండు లెక్కపెట్టుకుంటూనే బయటికి ఉరికింది.
అంతవరకూ రానిచ్చి మధ్యలో హఠాత్తుగా వెళ్ళిపోతున్న ఆమె వైపు అదోలా చూస్తూండిపోయాడతను.
ఆమె ఇంటికి చేరేవరకు ఆ విధంగా లెక్కపెడుతూనే వుంది.
ఒకటి..... పది..... పదకొండు.... నూటా రెండు... నూట యాభై ఒకటి......
అదిగో అలా మొదలయింది ఆమె జబ్బు. ప్రవీణ జబ్బుకు కారణం తెలిసిందిగానీ దానికి మందు ఎలా వేయాలో మాత్రం అర్ధం కాలేదు చంద్రరేఖకి. ఆమె ఆలోచనలో పడింది.
రామాపురంలోని మర్రిచెట్టు యధాప్రకారం కుర్రకారు చెప్పుకుంటున్న మాటలను నిశ్శబ్దంగా వింటోంది. అప్పుడప్పుడు ఆ మాటలకు త్రుళ్ళిపడుతున్నట్లు ఆకులు కదులుతూ వున్నాయి.
ఆ సాయంత్రం వేళ అక్కడకు చేరిన కుర్రవాళ్ళంతా ఏమిటేమిటో మాట్లాడుతూ కాలాన్ని పరిగెత్తిస్తున్నారు. ఆకాశవాణి సుబ్బారావు మొదటి ఉదంతం చెప్పి రెండో ఉదంతంలోకి పోతున్నాడు.
"ఇది ఇంకా తమాషా విషయం. వారం రోజులనుంచీ జరుగుతోంది. మీ కెవరికీ తెలియదంటే ఆశ్చర్యంగా వుంది" అన్నాడు.
"నువ్వు వారంరోజులుగా వూర్లోలేవుగా. మరి నువ్వు లేకపోతే ఈ విషయాలన్నీ మాకెలా తెలుస్తాయి? సరేలే. ముందు లోకయ్య కథేదో చెప్పు" రంగయ్య హుషారుపడుతూ అడిగాడు.
"లోకయ్య మగాడు కదా. అతనికి పట్టిందేమో ఆడదెయ్యం. ఇక చూడండి తమాషా. వాడు దెయ్యం పట్టినప్పుడు చేస్తున్న విషయాలు వింటూంటే నవ్వాగడంలేదు" అన్నాడు సుబ్బారావు.
"ఇంతకీ వాడికి ఎలా పట్టింది దెయ్యం?"
"అదంతా పెద్ద హిస్టరీలే. తీరిగ్గా వినండి. పదిహేనురోజుల క్రితం లోకనాథం తన చెల్లెలి దగ్గరకి బయలుదేరాడు. వాడి చెల్లెలు పద్మని తంగరాజుపాళెంలో ఇచ్చారు గదా. వాడు బయలుదేరింది ఆదివారం. చెల్లెలి ఇంటికి వెళుతున్నా అని కేజీ పొట్టేలు మాంసం తీసుకున్నాడు. అప్పటికి వాడి భార్య అరుస్తూనే వుంది.
"ప్రపంచంలో నీకొక్కడికే చెల్లెలు వున్నట్లు నిలవటంలేదేం. ఆ వూరికి బస్సులేదు. నడిచే వెళ్ళాలి. మధ్యలో మామిడితోపులన్నీ వున్నాయి కదా ఇలా మాంసం తీసుకువెళితే ఇంకేమైనా వుందా? దెయ్యాలు వెంటబడి 'మాక్కొద్దిగా పెట్టు అబ్బయ్యా' అని అడుగుతాయి కాబట్టి మాంసం తీసుకువెళ్ళకు" అని.
కానీ లోకయ్య వినలేదు. "నువ్వు పోయే వెర్రిమొఖమా! దెయ్యాలేమిటే పొట్టేలు మాంసానికి వెంటబడేది. అవి ఎప్పుడూ తినేది మనిషి మాంసం కదా" అని మాంసంతోనే బయలుదేరాడు.
సాయంకాలం నాలుగు గంటలకే బయల్దేరినా ఎదురుపడ్డ వాళ్ళందరితో మాట్లాడి వూరిపొలిమేరలు దాటేసరికి అయిదయిపోయింది.
పొలాలకు అడ్డంపడి నడిచాడు. మరో అరగంటకి తార్రోడ్డు దాటి మామిడితోపుల్లో పడ్డాడు.
భార్య దగ్గరయితే అలా అన్నాడుగానీ పొద్దుపోతుంటే గుండెల్లో గుబులు బయలుదేరింది. మాంసం ఎత్తుకుపోతుంటే దెయ్యాలు వెంటపడతాయని చిన్నప్పట్నుంచీ వింటూనే వున్నాడు.
సాయంకాలం కరిగిపోతోంది. చీకటి దెయ్యం చేయిసాచినట్టు లోకం మీద పాకుతోంది. పక్షులు ఆకాశంలోపడి పరుగులు తీస్తున్నాయి.
ఎర్రగా రక్తపుముద్దలావున్న సూర్యుడు శరీరాన్నంతా శుభ్రం చేసుకోవడానికి పడమటికొండల మధ్యలోకి దూకుతున్నట్లున్నాడు. గాలికి కూడా దెయ్యాల భయం వున్నట్లు మెల్లగా వీస్తోంది.
లోకనాథం అదిరేగుండెతో వేగంగా నడుస్తున్నాడు.
తెల్లమట్టి మిట్టలుదాటి తాటితోపులో నడుస్తున్నాడు. చీకటి పడుతోంది. వెలుగు ఆనవాళ్లు ఎక్కడా కనపడటంలేదు. ఆకాశం మసిపట్టిన కిరసనాయిల్ దీపపు చిమ్నీలా వుంది. నిలువెత్తు తాటిచెట్లు దెయ్యాలు తలలు విరబోసుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఎక్కడో పుల్లలు విరిగిన చప్పుడు. చీకటి సైతం జడుసుకునేటట్లు నక్క అరుపు.