"ఏం జరిగింది? ఎందుకింతపని చేసింది?" తెల్లపోతూ అంది.
శ్యాం తల దించుకున్నాడు. "అమ్మా.....రేఖ..... ప్రెగ్నంట్ అయిందని, అందుకని....సిగ్గుతో, భయంతో ఆ పని చేసిందని అనుకుంటున్నారు. రేఖ ఫ్రెండు.....వాళ్ళ ఎదురింట్లో వుండే సునీత చెప్పింది. డాక్టరుకి రేఖ నాన్నగారు చెప్పారుట."
"మైగాడ్..... ఏదో ఆ గొడవ అంతటితో సమసిపోయిందనుకున్నాను. ఆఖరి కిదీ జరిగిందన్నమాట. రేఖ! పాపం గాభారాపడి, ఏంచెయ్యాలో దిక్కుతోచక, .... యీ పనికి తలపడిందేమో? ఎంత తొందరపడింది? ఈ రోజుల్లో.....ఎబార్షన్ లీగలైజ్ అయిన రోజుల్లో.....యింత గాభరాపడవలసింది ఏముందని యిలా చేసింది?..."
"వాళ్ళమ్మే అసలు గాభరాపెట్టి ఏడ్చిందటమ్మా. దాంతో రేఖ భయపడి ఏడ్చిందట నిన్నంతా. యివాళ ఆఖరికిలా చేసిందట."
"ఆ శారద తెలివితక్కువతనం రేఖని నాశనం చేస్తుంది. శారద అమాయకురాలు... కాని ఆ తండ్రి ఏంచేస్తున్నాడుట అతనేనా చెప్పవద్దా?"
"లేదమ్మా, ఆయనకు తెలిసినట్టులేదు. ఆ తల్లి గాభరాపడి ఏడ్చి....నేనేం చెయ్యనే తల్లీ.....ఆ రాధకీ ఇలాగే జరిగిందే అమ్మా.....అయ్యయ్యో..... అంటూ ఏడ్చి గాభరాపెట్టిందంటుంది సునీత."
ఆమాట వినగానే రాధాదేవి మొహం నల్లబడింది. హు.... తన దురదృష్టం అందరికీ ఉపమానం అయిందన్న మాట అనుకుంది. పోనీ తన దురదృష్టం రేఖకి అంటకూడదు. రేఖని కాపాడాలి. మాధవ్ ఏమన్నాసరే.....రేఖని ఓదార్చి తను చెయ్యగలిగింది చెయ్యాలి.
తనేం చెయ్యాలి!?... ఏం చెయ్యగలదు? ఆరోజంతా ఆలోచించింది రాధాదేవి.
23
"శ్యాం... ఒకమాట అడుగుతాను. సిన్సియర్ గా జవాబు చెపుతావా?" ఆ రాత్రి డ్రాయింగురూములో కూర్చున్నప్పుడు శ్యాంని అడిగింది, రాధాదేవి.
శ్యాం వింతగా తల్లివంక చూసి "ఏమిటమ్మా?" అన్నాడు.
రాధాదేవి మాటలకి తడుముకుంది. "శ్యాం, రేఖ.... రేఖంతే నీకు చాలా యిష్టంగదూ..... నన్ను ఓ స్నేహితురాలిగా భావించి జవాబు చెప్పు." కొడుకు మొహంలోకి నిశితంగా చూస్తూ అంది. శ్యాం మొహం ఎర్రబడింది. తల్లివంక చూపు కలపలేక తలదించుకుని "ఎందుకమ్మా యిలా అడుగుతున్నావు?"
"కారణం వుంది శ్యాం. రేఖ అంటే నీకు యిష్టం అని, ఆమెపట్ల ఆరాధన ఉందని.... ఆమె సమక్షంలో నిన్ను చూసిన కొద్దిసార్లలోనే గ్రహించాను. యామ్ ఐ రైట్... శ్యాం జవాబివ్వలేదు. తన మనసులో సంగతి తల్లి గుర్తించినందుకు సిగ్గుపడ్డాడు.
"శ్యాం! రేఖ అంటే నీకు చాలాయిష్టం. ఆ అమ్మాయి అంటే నాకూ యిష్టమే. శ్యాం, రేఖని వివాహం ఆడడానికి నీకిష్టమేనా చెప్పు" సూటిగా అడిగింది.
శ్యాం అప్రతిభుడై చూశాడు. 'అమ్మా' అన్నాడు తెల్లబోతూ. అతని మొహంలో రంగులు మారాయి.
"ఏం శ్యాం? ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఏం? రేఖని పెళ్ళాడడానికి నీకేం అభ్యంతరం..... ఆమెకి అందం, చదువు అన్నీ ఉన్నాయి."
"అమ్మా.... కాని.... కాని...."
"ఏమిటి కానీ.... రేఖమీద అత్యాచారం జరిగిందని అభ్యంతరమా, రేఖ శీలం కోల్పోయిందని ఆమెపట్ల నీకు ఉత్సాహం పోయిందా.... రేఖ నీకింక తగదనిపిస్తూందా."
"అమ్మా!" హర్ట్ అయ్యాడు శ్యాం. "అమ్మా నీకు తెలుసు, ఆ కారణంగా నిరాకరించే అర్హతలు నాకు లేవని నీకు తెలుసు" బాధగా అన్నాడు.
కొడుకు మొహంలో బాధచూసి రాధాదేవి విచలిత అయి "సారీ శ్యాం.... నీ మనసులో మాట తెలుసుకోవాలని అన్నాను. అంతేగాని నిన్ను కించపరచాలని కాదు. శ్యాం, ఫ్రాంక్ గా చెప్పు. రేఖ వప్పుకుంటే ఆమెని వివాహం ఆడేందుకు నీకేమన్నా అభ్యంతరం వుంటుందా?"
"శ్యాం తడబడ్డాడు. రేఖ..... రేఖలాంటి అందాలరాశి భార్యగా వస్తే అదృష్టంకాదూ! కాని, కాని.... "అమ్మా.....నేనిష్టపడ్డా..... రేఖ..... వాళ్ళు వాళ్ళు వప్పుకుంటారా?" అన్నాడు. అడగదల్చింది ఒకటయితే అడిగింది మరొకటి.
"అదంతా నేను చూసుకుంటాను. రేఖ యిష్టపడుతుందనే అనుకుంటున్నాను శ్యాం. రేఖ తల్లిదండ్రులకి ఛాయిస్ లేదు యింక, యింత జరిగాక.....రేఖకి పెళ్ళికావడం మనదేశంలో అంత సులువుకాదు. తెలిసి తెలిసి ఎవరూ ముందుకు వస్తారని అనుకోను. కట్టుకున్న భార్యనే ఈ కారణంగా దూరం చేసిన మాధవ్ లాంటి పురుషులున్న మనదేశంలో అంత త్యాగబుద్దితో ముందుకువచ్చి పెళ్ళి చేసుకుంటారనుకోవడం వెర్రి. ఆదర్శాలు వల్లిస్తారు. ఎవరన్నా చేస్తే అభినందిస్తారు. కాని తమదాకా వచ్చేసరికి తప్పుకుంటారు. ఆడదాని శీలానికి మనవాళ్ళిచ్చిన విలువ ఇంతా అంతా కాదు. ఆ శీలం పోగొట్టుకున్న ఆడదాన్ని ఆదుకునే నాధులు.... ఈ నాటికీ లేరు.... అంచేత రేఖ పెళ్ళి ఒక సమస్యే అవుతుంది."
"అందుకనా నన్ను చేసుకోమంటున్నావు? అమ్మా ఒకటి చెప్పు.... రేఖకి ఇలా జరగకపోతే నన్ను చేసుకుంటుందా, నాకివ్వడానికి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించేవారంటావా?"
"శ్యాం..... రేఖ తల్లిదండ్రులు నామీద కోపంతో అంగీకరించేవారు కాదు. రేఖ..... ఏమో, ప్రేమ గుడ్డిదన్న సూక్తి వినలేదా శ్యాం.... నీమీద యిష్టమైతే నీ రూపురేఖలని పట్టించుకోకుండా చేసుకునేదేమో? కాని.... కాని, యిప్పుడు రేఖ పరిస్థితి వేరు. ఆమె భవిష్యత్తుకు దారి యించుమించు మూసుకు పోయినట్టే. అంటే బతకలేదని కాదు, కాని పెళ్ళి గగనం అవుతుంది. ఆమె తండ్రి విజ్ఞుడు అయితే నిన్నంగీకరిస్తాడు. శ్యామ్..... రేఖకిప్పుడు కావాల్సింది ధైర్యం చెప్పేవారు, ప్రోత్సహించేవారు కావాలి. ఆ ఇంట్లో ఆ రెండూ కరువని నాకు తెలుసు. శారదలాంటి తల్లి నీడన రేఖకి రక్షణలేదు. మాధవ్ కి ఆవేశంతప్ప, ఆలోచనలేదు. సిగ్గుతో, అవమానంతో, భయంతో దిక్కుతోచక రేఖ ఈ పని చేసిందని నాకు తెలుసు. రేఖకి ధైర్యంచెప్పి 'నేనున్నాను, నీకేం కాలేదు, అని ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. శ్యాం, రేఖ నా కోడలయితే ఆమె కోల్పోయిన ధైర్యం నేనిస్తాను. ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి ఏమీ చెప్పే అవకాశం మాధవ్ నాకీయడు. రేఖతో మాట్లాడడానికీ యిష్టపడక పోవచ్చు. రేఖని నీవు పెళ్ళిచేసుకో. ఎవరో బలాత్కారం చేసినంత మాత్రాన ఆమె ఏదో కోల్పోయిందనడం అమానుషం. శీలం, పవిత్రత అంతా మనసుకి వుండాలి. ఆమె జోక్యం లేకుండా జరిగిన దానిలో ఆమె పాత్రలేదు. ఆ కారణంగా ఓ ఆడపిల్ల వివాహానికి మాతృత్వానికి దూరం కాకూడదు శ్యాం. నీవు ఏదో ఆదర్శంగా త్యాగం చేస్తున్నానని అనుకోకు. రేఖ నీకిష్టం అయితే పెళ్ళాడడానికి ఏమభ్యంతరం లేదా? శ్యాం బాగా ఆలోచించుకో, అమ్మ ఏదో అందని వేసుకుని, తరువాత ఆమెని అడుగడుగునా మాటలతో చిన్నపుచ్చి హింసించకూడదు. నేననుభవించాను గనుక ఆ బాధ నాకు తెలుసు. ఆమెని ఆమెగా స్వీకరించే ఔదార్యం నీకుంటే చెప్పు. నేను వెళ్ళి రేఖతో మాధవ్ తో మాట్లాడుతాను."