Previous Page Next Page 
యమదూత పేజి 39

 

    "నువ్వు మంచి పనులు చేస్తుంటే వద్దని నేనెప్పుడన్నా అభ్యంతర పెట్టానా జలీల్?" అంది ఆమె ఆర్ద్రంగా.
    
    చటుక్కున తల్లి చేతులు రెండూ పట్టుకున్నాడు జలీల్.
    
    "థాంక్స్ అమ్మా! నువ్వు గనుక ఇప్పుడు వద్దని ఒక్కమాట అన్నా నేను మానసికంగా చాలా మధనపడవలసి వచ్చేది. అందరికీ గనక నీలాంటి అమ్మలే వుంటే ఈ దేశం ఎంత బాగుపడి ఉండేదో!" అన్నాడు ఉద్వేగంగా.
    
    "దేశం బాగుపడాలంటే నాలాంటి తల్లులు కాదు. నీలాంటి కొడుకులు ఉండాలి. పదా! ముందు భోజనం చెయ్! తర్వాత వెళుదువుగాని అంది జహానారా బేగం.
    
    టేప్ రికార్డర్ ఆన్ చేసి, అల్లారఖా తబలా మీదా, రవిశంకర్ సితార్ మీదా చేసిన అద్భుతమయిన జుగల్ బందీ వింటూ, బట్టలు మార్చుకుని భోజనానికి కూర్చున్నాడు జలీల్.    

 

    తన కొడుకుకి ఎప్పుడు భోజనం వడ్డిస్తున్నా కూడా, అదే అతఃని చివరి భోజనమేమో అన్నట్లు ఆరాటపడిపోతుంది ఆ తల్లి మనసు. అతని వృత్తి అలాంటిది. అతని ప్రవృత్తికూడా అతన్ని ఎప్పటికప్పుడు అతి ప్రమాదకరమయిన పరిస్థితులలో పడేస్తుంటుంది.
    
    అలాగని ఎవరికీ వాళ్ళు మనకెందుకులే అని చూసీ చూడనట్లు ఊరుకుంటే ధర్మం నాలుగు పాదాల మీద నడవడం మాట అటుంచి, అధర్మం వెయ్యికాళ్ళ మీద వికృత నృత్యం మొదలెడుతుందని ఆమెకి బాగా తెలుసు.
    
    దేశం ముఖ్యం ఆమెకి!
    
    తనైనా, తన కొడుకైనా, తన కుటుంబమయినా కూడా ఆ తర్వాతే!
    
    ప్రేమతో తల్లి కొసరి కొసరి మారు వడ్డిస్తుంటే, కడుపునిండా భోజనం చేశాడు జలీల్. తర్వాత, తన యూనిఫారంకి బదులు డెనిమ్ జీన్సూ, టీషర్టూ వేసుకున్నాడు. రివాల్వర్ మేగజైన్ ఓపెన్ చేసి, బులెట్స్ ఉన్నాయో లేదో సరి చూసుకున్నాడు. కెమెరాలో ఫిల్ము లోడ్ చేసే ఉందని నిశ్చయించుకున్న తర్వాత దాన్ని భుజానికి తగిలించుకున్నాడు.
    
    జలీల్ ఇంటికి వచ్చి తల్లితో రెండు ముక్కలు మాట్లాడి, రెండు ముద్దలు తినేలోగా ఇరుగింటి వాళ్ళూ, పొరుగింటి వాళ్ళూ చీటికి మాటికి ఎవరో ఒకరు వచ్చి తలుపు కొడుతూనే వున్నారు.
    
    ఆ అచ్చమయిన మిడిల్ క్లాస్ లొకాలిటీలో అందరికీ జహానారా బేగంతో పనే! అక్కడున్న వాళ్ళందరికీ ఆమె తలలో నాలుక! ఆమె సలహా, సంప్రదింపులు లేకుండా ఎవరూ ఏ పనీ చెయ్యలేరు! చెయ్యరు!
    
    తను రెడీ అయ్యాక తల్లికి వీడ్కోలు చెప్పి బయటకు వచ్చాడు జలీల్. స్కూటర్ శబ్దం వినగానే పక్కింటి మేడమీద నుంచి ఒక పిల్లాడు "హాయ్, జలీల్ అంకుల్!" అని చెయ్యి ఊపాడు.
    
    ఆ పిల్లాడి వైపు నవ్వుతూ చెయ్యూపి, స్కూటర్ స్టార్టు చెయ్యబోయాడు జలీల్.
    
    ఇంతలోనే, పాకుతున్నట్లుగా అతి మెల్లగా వచ్చింది ఒక నల్లటి కారు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని వున్న ఒకతను డ్రైవింగ్ సీటులో కూర్చుని వున్నాడు. ఒక చెయ్యి విలాసంగా విండోలోనుంచి బయటికి జార్చి ఉంచాడు అతను. రెండో చెయ్యి స్టీరింగ్ వీల్ ని పట్టుకుని వుంది. జలీల్ కనబడగానే అన్నాడు.
    
    "ఇన్ స్పెక్టర్ జలీల్ ఇల్లు ఇదేనా?"
    
    అతని వైపు పరిశీలనగా చూస్తూ, "అవును!" అన్నాడు జలీల్.
    
    "చిన్న ఇల్లయినా బహుముచ్చటగా వుంది కిటికీలో పూలకుండీలూ అవీ. ఓహోహో! వెరీ గుడ్ టేస్ట్! అన్నట్లు జలీల్ గారికి ఒక తల్లి కూడా ఉండాలి కదూ!
    
    సమాధానం చెప్పకుండా తీక్షణంగా అతనివైపు చూశాడు జలీల్.
    
    "పాపం! రెండుకళ్ళూ లేవు ఆమెకి! టోటల్లీ బ్లయిండ్! అయినా ఆ సంగతి ఎవరూ తొందరగా కనిపెట్టలేరు. చూపు లేకపోయినా అంతా చాకచక్యంగా చేసుకుపోతుంది పనులు. అయినా ఏదో ఒక రోజున అధాట్టుగా పదిమంది గూండాలు ఇంటిమీద పదడి అఘాయిత్యం చేస్తే ఏం చెయ్యగలదు పాపం గుడ్డి మనిషి! ఆ జలీల్ సంగతి చూద్దామా అంటే అతను అనవసరమైన పనులన్నీ నెత్తిన వేసుకుని రాత్రింబవళ్ళు ఇల్లు పట్టకుండా తిరుగుతుంటాడు కదా!" అంటున్నాడు కార్లోని మనిషి నవ్వుతూ అలా అంటూనే కారు వేగం హెచ్చించాడు.
    
    తక్షణం స్కూటర్ స్టార్ట్ చేశాడు జలీల్.
    
    అప్పటికే విపరీతమైన స్పీడు అందుకుని సందు తిరిగి అదృశ్యమైపోయింది ఆ నల్ల కారు.
    
    తల పంకించి, 'సో! ఇది మొదటి హెచ్చరిక అన్నమాట!' అనుకున్నాడు జలీల్.
    
    తనమీద కాదు -
    
    తన తల్లి మీద దండెత్తుతామని!
    
    ఒక్కక్షణం ఆలోచించి, స్కూటర్ కి స్టాండ్ వేసి ఇంట్లోకి వెళ్ళాడు జలీల్.
    
    జాగ్రత్తగా వుండమని తల్లిని హెచ్చరించి, బయటికొచ్చి మళ్ళీ స్కూటర్ స్టార్ట్ చేసి దూసుకుపోయాడు.
    
    అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో వుంది ఒక ఆరంతస్తుల బిల్డింగు. ఆ బిల్డింగుకి రెండు బ్లాకుల అవతల తన స్కూటర్ ని ఆపి, లాక్ చేసి, తర్వాత ఆ బిల్డింగు వైపు పరీక్షగా చూశాడు ఇన్ స్పెక్టర్ జలీల్. సెకెండ్ ఫ్లోర్ లో తప్ప ఇంక మిగతా అన్ని ఫ్లోర్ లలో కూడా లైట్లు చాలావరకూ ఆర్పేసి వున్నాయి.
    
    ఒక్కక్షణం ఆలోచించి, తర్వాత చకచకా లోపలికి నడిచాడు ఇన్ స్పెక్టర్ జలీల్. అక్కడ రిసెప్షన్ ఆఫీసులో ఒక వ్యక్తి కూర్చుని కునికి పాట్లు పడుతున్నాడు. జలీల్ ని చూడగానే కళ్ళు నులుముకుని, నిటారుగా కూర్చున్నాడు అతను. "ఎవరు?" అన్నాడు జలీల్ తో జాగ్రత్తగా.
    
    "మాల్ కోసం వచ్చాను" అన్నాడు జలీల్.
    
    "ఎవరు పంపారు?"
    
    "బందూక్ వాలా!"
    
    "బందూక్ వాలానా?" అన్నాడు ఆ వ్యక్తి అనుమానంగా. అంటూనే చెయ్యి టేబుల్ డ్రాయరులోకి పోనిచ్చాడు. డ్రాయర్ లో ఏదో ఆయుధం ఉంటుందని అర్ధమయింది జలీల్ కి. మెరుపులాగా చెయ్యి ముందుకు జాపి అతని గెడ్డం కింద కొట్టాడు ఇన్ స్పెక్టర్ జలీల్. ఒక్కసారి మూలిగి తేలకళ్ళు వేసి కుర్చీతో సహా వెనక్కి విరుచుకు పడిపోయాడు ఆ వ్యక్తి.
    
    మెట్లమీదుగా గబగబా పైకి పరిగెత్తాడు జలీల్.
    
    అదే టైంలో మేడ మెట్లు దిగి కిందికి వస్తున్నాడు ఒక వ్యక్తి. జలీల్ ని చూడగానే ఆశ్చర్యంతో చిన్న కేకపెట్టి వెనక్కి తిరిగాడు. జలీల్ ని గుర్తు పట్టాడు అతను. కానీ పోలీసులు అంత ధైర్యంగా తమ 'అడ్డా'లోకి వచ్చేస్తారని అతను ఊహించలేదు. అందుకే ఆశ్చర్యం కలిగింది అతనికి.
    
    ఒక్కసారిగా రెండేసి మెట్లు చొప్పున ఎక్కేస్తూ ఆ వ్యక్తిని అందుకుని, బాక్సింగ్ ఛాంపియన్ కొట్టినట్లు ఒక్క దెబ్బ కొట్టాడు జలీల్.
    
    అతను రెండుసార్లు అటూ ఇటూ ఊగి, తర్వాత ధడేలుమని కిందపడి మెట్లమీద నుంచి దొర్లడం మొదలెట్టాడు.
    
    ఆ శబ్దాలు పైన ఉన్న వాళ్ళకి వినబడినట్లు ఉంది. కంగారుగా మాటలు వినబడ్డాయి. మరుక్షణంలో ముగ్గురు వ్యక్తులు మేడ మెట్ల పై భాగాన ప్రత్యక్షమయ్యారు. రివాల్వర్లు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో.
    
    వాళ్ళు ఆ రివాల్వర్ లని తనమీద గురిపెట్టి కాల్చేలోపలే, తను తన రివాల్వర్ తో వాళ్ళ కాళ్ళ వైపు గురిపెట్టి కాల్చాడు జలీల్.
    
    మొదలు నరికిన మానుల్లాగా నేలకూలారు ముగ్గురూ.
    
    గబగబ రెండో అంతస్తుకి వెళ్ళిపోయాడు జలీల్.
    
    అక్కడ ఓ గది వుంది. ఆగదిలో గోడలకి స్టీలు రాకులు అమర్చి వున్నాయి. వాటికి అద్దాలు బిగించి వున్నాయి.
    
    ఆ అద్దాలలోంచి కనబడుతున్నాయి ఒక దానిమీద ఒకటిగా పేర్చిపెట్టిన అనేకమయిన ప్లాస్టిక్ ప్యాకెట్స్! ఆ ప్యాకెట్లలో తెల్లటి పొడి!
    
    దగ్గరికి వెళ్ళి ఒక రాక్ తెరవడానికి ప్రయత్నించాడు అతను.
    
    రాలేదు. తాళం వేసి వుంది దానికి. రివాల్వర్ ని రాక్ తాళానికి ఆనించి కాల్చాడు అతను.
    
    ఆ పేలుడికి తాళం విడిపోయింది. అద్దాలు పగిలి జలజల గాజు పెంకులు నేలమీద రాలాయి.
    
    అల్మారా లోపల వున్న ఆ ప్యాకెట్లు ఏమిటో అర్దమయింది అతనికి.
    
    ఓపెన్ మార్కెట్ లో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాల స్టాకు అది!

    వాటిలో నుంచి రెండు పాకెట్లు తీసి జేబులో వేసుకున్నాడు అతను. తర్వాత ఆ అల్మారానీ, ఆ గదినీ, అక్కడక్కడ కిందపడిపోయి వున్న గ్యాంగ్ స్టర్స్ నీ రకరకాల యాంగిల్సులో ఫోటోలు తీశాడు.
    
    ఈ మాత్రం రుజువులు చాలు!
    
    ఇవి చూపిస్తే ఆ తర్వాత తన సుపీరియర్ ఆఫీసర్ తనకి కావలసి సాయం అందజేస్తాడు. అప్పుడింక మెకానిక్ ని కంట్రోల్ లో పెట్టడం ఏమంత పెద్ద పనికాదు!
    
    అలా అనుకుంటూ ఉంటేనే చాలా వుత్తేజం కలిగింది అతనికి.
    
    ఒక్కొక్క అంతస్తే ఎక్కుతూ, అలర్టుగా చూస్తూ, అన్ని గదులూ పరిశీలించాడు జలీల్.
    
    ఒక గదిలో బోలెడన్ని అకౌంట్సు బుక్సూ, లెడ్జర్సూ వున్నాయి. వాటిలో డైరీ సైజులో ఉన్న ఒక చిన్న బుక్కు ఉంది.

 Previous Page Next Page