Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 40

"ఎలా?"
"అదంతా నాకొదిలెయ్."
కళ్యాణ్ హుషారుగా లేచి 'పీటర్ స్కాట్ బాటిల్ ఓపెన్ చేశాడు.
కుర్చీ ఒకటి దగ్గరికి లాక్కుని, దాని మీదకి కాళ్ళు బార జాపి గ్లాసందుకున్నాడు రాజేష్.

                                                 * * *
"హల్లో బేబీ! హల్లో లవ్!"
చటుక్కున లావణ్య మొహం మీదకి నవ్వొచ్చింది.
"రాజేష్! అదేమిటి హఠాత్తుగా మాయమైపోయావ్?"
"రెండు మూడు నెలల పాటు మెడ్రాసులో ఉండాల్సి వస్తుంది. సుధ చెప్పలెదూ?"
నుదుటి మీద వేలితో కొట్టుకుంటూ ఆలోచించింది లావణ్య. "చెప్పిందా? వుహు! ఏమో! చెప్పినట్లు గుర్తులేదు.
రాజేష్ కుర్చీలోంచి సగం జరినట్లు జేరగిలబడి బద్దకంగా చూశాడు.
"లవ్! నువ్వు వారం రోజుల్లో చాలా మారిపోయావ్?"
"ఏం మారాను?"
"మొదటిది. చిక్కిపోయావ్. రెండు కాస్త నల్లబడ్డావ్. మూడు మోహంలో కాస్త గర్వం తగ్గింది" అంటూ నవ్వాడు.
ఇతనికి విషయాలన్నీ చెప్పేద్దామా అనిపించింది కాసేపు. తర్వాత ప్రయత్నపూర్వకంగా మనసు ఉగ్గబట్టుకుంది. ఉహు. ఈ విషయం ఇంకెవరికి తెలియడానికి లేదు. పెళ్ళి చేసుకోబోయే ప్రియుడే పట్టించుకోవటం లేదు. ఇతనికెందుకు ఉంటుంది ఆసక్తి?
ఏమి లేదన్నట్లు నిదానంగా తలాడించింది. 'మెడ్రాసే వెళ్ళేటప్పుడు నాకూ చెప్పి వెళ్ళకూడదు?"
"నా బద్ధకం నీకు తెలియదా? చెప్పాలి చెప్పాలి అనుకుంటూనే గడిపేశాను. చివరికి స్టేషను నుంచి ఫోన్ చేద్దామనుకున్నాను. కుదర్లేదు. చిల్లర లేకపోయింది. అవునూ! నా బద్దకమంటే గుర్తొచ్చింది. మన మాట ఏం చేశావ్?"
"ఏ మాట?" అంది లావణ్య పరధ్యానంగా.
"ఐ లవ్ యూ!" అన్నాడు రాజేష్.
లావణ్య నవ్వుతూ తలూపింది. 'ఇంక అలా మాట్లాడకు. నేను పెళ్ళి కుదిరిపోయిన అమ్మాయిని. ఎందుకో నీ మీద కోపం తెచ్చుకోవాలన్నా రాదు నాకు" అంది.
"ఇంకెవరన్నా అలా మాట్లాడితే ఏం చేస్తావు?"
"చెంప పగిలేలా కొడతాను"
"ఇప్పుడు నిన్ను గట్టిగా పట్టుకుని, మొహం వెనక్కి వంచేసి పెదిమల......"
"ష్! అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంక మా ఇంట్లోకి రానివ్వను జాగ్రత్త!"
"లావణ్యా! నువ్వు నాన్నలా చెయ్యలేవు. నాకు నీ రహస్యం తెలుసు!"
బెదిరిపోయి చూసింది లావణ్య.
"ఏమిటది?"
"చెప్పెయ్యనా?" అని నవ్వాడు రాజేష్. "నీకు నేనంటే అయిష్టం లేదు. ఏదో ఆవేశంలో శ్రీహర్షని ప్రేమించాననుకుంటున్నావ్. అది నిజం కాదని నాకు తెలుసు. మాట ఇచ్చేశావు కాబట్టి దాన్ని పట్టుకు పాకులాడుతున్నావ్. అతను నీకు తగినవాడు కాడు. నాకు అతని మీద జెలసి ఉంది గానీ ద్వేషం లేదు.'
తేరుకుంది లావణ్య. ఇదేనా ఇతనికి తెలిసిన రహస్యం!
"లావణ్యా! నేను తెలివైన వాణ్ణ, చవటనా, ఒక్క మాటలో చెప్పు.'
లావణ్య మాట్లాడలేదు.
"నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా నాకు తెలుసు లవ్! నిదానంగా కూర్చుని , తాపీగా ఆలోచించుకో! నీకు తగినవాణ్ణి" కుర్చిలోంచి లేచి నిలబడ్డాడు. "నే నొక్కన్నే!"
లావణ్య మాట్లాడలేదు.
"ఎందుకో తెలుసా? నిన్ను నా ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తాను కాబట్టి. లావణ్యా! ఆలోచించు. నీకోసం. రోజులు గడిచిపోతున్నాయ్. లవ్! వెళ్లొస్తాను.'   
                                              * * *
మర్నాడు శ్రీహర్షా వాళ్ళింటికి వెళ్ళింది లావణ్య. అతను నిర్వికారంగా వున్నాడు. అసలతనికి ఉత్తరం అందిందా? రాజు వరండాలో కూర్చొని చదువుకుంటున్నాడు.
"రాజు?" పిలిచింది మెల్లిగా.
లావణ్యని చూసి నిలబడ్డాడు రాజు.
"శ్రీహర్షకి వుత్తరం ఇచ్చావా?"
"ఇచ్చానండి!" అన్నాడు రాజు తడుముకోకుండా అబద్దం అదేస్తూ.
లావణ్య మనసులో పట్టుదల చోటు చేసుకుంది.
తనేమయిపోయినా అతనికి ఫర్వాలేదా? ఏమిటి అతని మనస్తత్వం? డబ్బున్న పిల్ల, బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బులు కడుతూ తన బాధా తను పడుతుందిలే అనుకుంటున్నాడా?
లోపలకెళ్ళింది.
అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. స్నేహ కిలకిల నవ్వుతోంది.
తను పరధ్యానంగా ఉండిపోయింది. శ్రీహర్ష పక్కనే వచ్చి కూర్చున్నాడు.

 Previous Page Next Page