శ్రీహర్ష చూపు ఆప్రయత్నంగా స్నేహ మీదకు పోయింది.
తనూ సినిమా చూస్తున్నట్లు లేదు. ఏదో ఆలోచిస్తున్నట్లు తల సీటుకి ఆన్చి జేరగిలబడి కూర్చింది.
"అతను చూడు" అంటూ రేవతి సినిమా గురించి ఏదో చెప్పింది.
అకస్మాత్తుగా ఆలోచనల్లోంచి బయటపడి, నవ్వుతూ రేవతి వైపు చూసింది స్నేహ.
తనకెంత 'కష్టం'! తల్లి చనిపోయింది. తండ్రి దేశాలు పట్టిపోయాడు. గతిలేక ఇంకొకరి అండన జేరింది తను.
అయినా ఎంత సహనం!
రేవతి కోసం తన దుఃఖాన్ని మరిచిపోయి సరదాగా మాటాడుతోంది. ఆమె నిగ్రహాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
ఇంటర్వెల్ లో మళ్ళీ కాఫీలో స్నేహ కాఫీ తాగదు. అందుకని గుర్తుగా తనకోసం ఐస్ క్రీం తెచ్చాడు శ్రీహర్ష. ఆ చిన్న విషయానికే కృతజ్ఞత కనబరుస్తూ చూసింది స్నేహ. ఆ అమ్మాయి గొంతు విప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు. కళ్ళలో మాట్లాడే నేర్పు ఉంది తనకి.
స్నేహాని సంతోషపెట్టడం ఎంత తేలిక.
* * *
ఈ మధ్య మెడ్రాసులోనే ఉంటున్న రాజేష్ మధ్య మధ్యలో హైదరాబాద్ వచ్చిపోతున్నాడు.
వచ్చినప్పుడల్లా క్లబ్బుకోసారి, కళ్యాణ్ వాళ్ళ అనాధశరణాలయానికోసారి వెళ్ళి రావడం తప్పదు అతనికి.
వ్యాపారం- పరిచయాలు- తప్పించుకోలేనివి.
శరణాలయం ముందు కారాపాడు రాజేష్. లోపలికి నడిచాడు.
అది ఒక పాతకాలపు బిల్డింగ్. చూస్తూనే మనసులో దిగులేస్తుంది. అక్కడక్కడ పెచ్చులుడిపోయాయి. సున్నమే యించి ఎన్నాళ్ళయిందో చెప్పలేం.
దాన్లో ఆరు గదులు.
వరండాలో కెన్ చేయిర్స్ వేసి ఉన్నాయి. ఆఫీసు రూం కనబడుతోంది. బల్లమీదికి కాళ్ళు బారజాపి కూర్చుని ఉన్నాడు కళ్యాణ్.
ఎవరో ఇద్దరు మనుషులు అతని కెదురుగా కూర్చున్నారు.
లోపల ఎవరో డాన్స్ చేస్తున్నట్లు గజ్జెల చప్పుడు. హర్మని వాయిద్యం.
నవ్వుకుంటూ వరండాలో కుర్చీలో కూర్చున్నాడు రాజేష్.
"కళ్యాణ్ సాబ్! మాకు పిల్లలు గావాలి" అంటున్నాడు ఒకతను.
"సప్లై చెయ్యడానికే మేమున్నాం" అన్నాడు కళ్యాణ్.
"లోపలకెళ్ళి సరుకు చూడొచ్చా?"
"ఎక్కువ సరుకు ప్రస్తుతం లేదు. ఒక్కతే ఉంది. పిలిపిస్తా" అంటూ "మాలతీ! టీ తీసుకురా" అంటూ కేకేశాడు కళ్యాణ్.
రెండు నిమిషాల తర్వాత ఒక పంతోమ్మిదేళ్ళ అమ్మాయి ట్రేలో మూడు కప్పులు పెట్టుకుని, భయంగా జాలిగా చూస్తూ ప్రవేశించింది.
"ఈ అమ్మాయే!" అన్నాడు కళ్యాణ్.
వచ్చిన వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని సంతలో పశువుని చూసినట్లు తూచి తూచి చూశారు.
"ఎంతకోస్తావ్?" అన్నాడొకడు, మాలాతి లోపలి కెళ్ళిన తర్వాత.
"పదివేలన్నా లేనిదే నాకు గిడుతుందా?" అన్నాడు కళ్యాణ్ అదోరకంగా నవ్వుతూ.
కాసేపు వాళ్ళందరూ గొంతు తగ్గించి బేరం కుదుర్చుకున్నారు.
"సరికు ఎల్లుండి పంపిస్తా" అంటూ వాళ్ళని పంపటానికి గుమ్మం దాకా వచ్చిన కళ్యాణ్ రాజేష్ ని చూసి బిత్తరపోయాడు.
"నువ్వా! ఎప్పుడొచ్చావ్? బయటే కూర్చుండిపోయావెం?"
"బేరం ఏడున్నరకు సేటిలవుతుండగా వచ్చాను. లోపలికొస్తే నువ్వు పాపం వాళ్ళతో సరిగా మాట్లాడలేవేమోనని ఇక్కడే కూర్చుండిపోయాను."
"నువ్వు సర్వాంతర్యామివి" అన్నాడు కళ్యాణ్ అక్కసుగా.
రాజేష్ నవ్వాడు.
"ఎవరు ఇప్పుడొచ్చినవాళ్ళు?"
"బెంగుళూరు నుంచి వచ్చారు."
"తెలుగు అమ్మాయిల మీద ఎంత మక్కువో! బెంగుళూరు నుంచి వచ్చారా? పాపం! ఒక అమ్మాయినే అప్పచెప్పుతున్నవెం? వాళ్ళకి నిరుత్సాహంగా ఉండదు?"
"రాజేష్! నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం కలిగించుకోకు. మన లావాదేవీలు ఎంతవరకు అంతవరకే ఉండని."
"బ్రదరూ! నాకు తెలియకుండా నువ్వు ఏ వ్యాపారం చేయలేవు. నాకు తెలియకుండా నువ్వు దమ్మిడి వెనకేసుకోలేవు. సర్వాంతర్వామిని. తెలుసుగా."
కళ్యాణ్ కాసేపు మౌనంగా ఉండి "సరే! ఆ వెల్ ఫేర్ హాస్టల్ కి రెండు నెలల వెచ్చాలు సప్లై చేస్తాను నీ పేరుతో. సొమ్మొకడిది, సోకొకడిదీనూ" అన్నాడు మంటగా.
రాజేష్ బద్దకంగా చూశాడు.
"ఫోటోలేం చేశావ్?" అన్నాడు కల్యాణ్.
"బాగా వచ్చాయ్. లక్షలు సంపాదించోచ్చు."
కళ్యాణ్ మొహం వెలిగిపోయింది.