"ఏమిటి మౌనంగా ఉన్నావ్?"
ఏం లేదన్నట్లు తల ఉపింది లావణ్య.
"నువ్వు కూడా రా" అంటోంది స్నేహ రేవతితో.
"ఉహూ! కాళ్ళు పట్టుకుపోతున్నాయ్. నేను నడవలేను. " అని తల అడ్డంగా ఆడిస్తోంది రేవతి.
"ఎక్కడికి?" అన్నాడు శ్రీహర్ష.
"కొత్త విక్లి వచ్చి ఉంటుంది. వెళ్ళి కొనుక్కువద్దామంటే రేవతి సాయం రావటం లేదు. రాజుగాడికేమో ఇవాళ హఠాత్తుగా చదువు మీద శ్రద్ధ పుట్టింది" అంది స్నేహ ఆరోపణగా.
శ్రీహర్ష నవ్వాడు.
"నువ్వు ఇరవయ్యో శతాబ్దంలో పుట్టాల్సినదానివి కావు. అందులో హైదరాబాద్ లో ఉండడానికి అసలు తగవు."
"మరెలా ఉండాలి?"
"ఇదో! లావణ్యలా ఉండాలి" నవ్వు పెదాల కింద తొక్కిపెడుతూ లావణ్య వైపు చూశాడు.
లావణ్య మాట్లాడలేదు.
"లావణ్య ఒకసారి నాతో ఏం చెప్పిందో తెలుసా? నేను మీకంటే ఎందులోనూ, ఏ విషయంలో కూడా తీసిపోను. మీరు బిజినెస్ చేస్తే నేనూ బిజినెస్ చెయ్యగలను. మీరు కార్డ్స్ ఆడితే నేనూ అడగాలను. మీలాగా ఈత కొట్టగలను. మీలా టెన్నిస్ అడగలను' అని చెప్పింది. ఆ మాట నిలబెట్టుకుంటుంది కూడా. నీలాగా సందు చివరిదాకా తోడు రమ్మని అడుగుతుందనుకుంటున్నావా? లావణ్య తన విషయాలు తను చుసుకోగలదు. నీలాగా కాదు.'
చురుగ్గా అతనివైపు చూసింది లావణ్య.
వెక్కిరిస్తున్నాడన్నమాట! అయితే ఉత్తరం అందే ఉంటుంది. తను ఈ మాటలన్నీ అతనితో అన్నమాట నిజమే. తప్పేమిటి? ఇప్పటికి అంటుంది. అతనికంటే తను ఏ విధంగానూ తక్కువ గాదు. అంతమాత్రానా కాబోయే భార్య ప్రమాదంలో ఉన్నాను, సాయం చెయ్యమంటే చిటికిన వేలు కూడా కదల్చకుండా వ్యంగ్యంగా మాట్లాడతాడా? అసలితను మాత్రం ఏం చెయ్యగలడు? సినిమా హీరోలాగా వెళ్ళి వాడెవడో కనుక్కుని కొడతాడా? అల్ రైట్! ఉత్తరం రాయటం తన తప్పయిపోయింది, మిస్టర్ శ్రీహర్షా! నీ సానుభూతి నాకక్కర్లేదు. నీ వ్యంగ్యము నఖ్కరలేదు. నిజంగానే! ఐ కెన్ లుక్ ఆప్టర్ మై సెల్ఫ్. ఒకవేళ నా విషయాలు నేను చూసుకోలేని పక్షంలో నా జీవితాన్ని అంతం చేసేసుకుంటాను గానీ నీ సహాయం కోరను.
"యూ జస్టు సీ!"
"వదినగారివాళ చాలా పరధ్యానంగా ఉన్నారు" అంది రేవతి చనువుగా.
లావణ్య విసుక్కుంది.
"నేనెప్పుడు అలానే ఉంటాను. నన్ను పలకరించకండి" అంటూ.
ఎవరికన్నా కోపం వస్తే స్నేహకు భయం. వాళ్ళ కోపం పోగొట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది.
నెమ్మదిగా వచ్చి లావణ్య దగ్గరగా కూర్చుంది.
"వంట్లో బాలేదా?"
ఒక్కక్షణం స్నేహ వైపు చూసి "బాగానే ఉంది" అంది లావణ్య.
"మీరు సీరియస్ గా ఉంటే మా అందరికి భయంగా ఉంటుంది. నవ్వండి ప్లీజ్!
లావణ్య పెదిమిల మీదకు అప్రయత్నంగానే చిర్నవ్వు వచ్చింది.
శ్రీహర్ష అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఈ వారం రోజులుగా లావణ్యని తను నవ్వించలేకపోయాడు. స్నేహ లావణ్యని ప్రసన్నం చేసుకోగలిగింది.
"మీ అమ్మగారు ఎప్పుడొస్తారు సింగపూర్ నుంచి?" అంది స్నేహ.
"ఇంకో పదిహేను ఇరవై రోజులు పట్టొచ్చు."
"ఎప్పుడూ బిజీగానే ఉంటారావిడ" అంది స్నేహ నవ్వుతూ. "మీరేం చేస్తుంటారు రోజంతా?" అంది మళ్ళీ.
"నువ్వేం చేస్తుంటావో చెప్పు." అంది లావణ్య.
తనకు మాట్లాడే మూడ్ లేదు. అయినా పెంపుడు కుక్కపిల్లలా దగ్గరగా వచ్చి కూర్చుని ఆప్యాయంగా మతాడుతున్న స్నేహాని కసిరి కొట్టలేకపోయింది. స్నేహ మోహంలో ఉన్న ప్రశాంతత అలాంటిది. తనని చూస్తే ఎదుటివాళ్ళ కోపం ఇట్టే దిగిపోతుంది.
"నేనేం చేస్తాను చెప్పండి. మాములు ఆడపిల్లను . లేస్తాను. నాలుగు పత్రికలు తిరగేస్తాను. తింటాను, నిద్రపోతాను. నాలో ఏ ప్రత్యేకతా లేదు" అంది స్నేహ నవ్వుతూ.
అలాగే అంటుంది కానీ స్నేహ వచ్చినప్పటినుంచి అమ్మ ఇంటిపని మానేసి, హాయిగా కాలు మీద కాలేసుకుని కుర్చుంటోంది." అంది రేవతి.
"నీలాగా" అన్నాడు శ్రీహర్ష.
"నా కసలు పనులే చేతకావనుకో . ఇప్పుడు ఇంటిపనంతా స్నేహ చేతులమీదే నడిచిపోతోంది. పొట్లకాయకూర వండడం దగ్గర్నుంచి, అన్నయ్య పాంట్లు మడత పెట్టడందాకా."
లావణ్య ఒక్కసారి తలెత్తి చూసింది.
స్నేహ చిరునవ్వు నవ్వుతోంది. "పనులు చెయ్యడం న హాబీ. లావణ్యగారికి టెన్నిస్ అడ్డం ఎంత ఇష్టమో, రేవతికి పొద్దస్తమానం అద్దంలో మొహం చూసుకోవడం ఎంత ఇష్టమో , పనులు చెయ్యడం నాకంత ఇష్టం."


