Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 40


    
    "నేను వెళ్ళి స్నానం చెయ్యాలి!" అంది ప్రతిమ.
    
    "ఉండవోయ్! బోర్డు తగిలించేశాం! ఇంకాసేపట్లో ఎవడో ఒక పేషెంటు రాకపోడు! రాక రాక ఫస్ట్ పేషెంట్ వచ్చేసరికి నువ్వు క్లినిక్ లో లేకుండా బాత్ రూంలో ఉంటే ఎలా?" అన్నాడు నవ్వుతూ.
    
    "విత్తనం నాటి వెంటనే పళ్ళకోసం కాచుక్కూచున్నట్లా? ఇంతకీ ప్రాక్టీస్ పెట్టడం ఖాయమేనంటారు?"
    
    "ముమ్మాటికీ!"
    
    "రేపొద్దున్న ఇంకెవరో ఏదో అనగానే మళ్ళీ మానెయ్యమంటారు."
    
    "ఇదిగో, అమ్మాయ్! చనువుగా మాట్లాడుతున్నాను కదా అని నెత్తికెక్కేస్తున్నావ్!"
    
    "నా పద్దతి ఎలాంటిదో మీకు తెలియదు! ఏ విషయమైనా పట్టుకున్నానంటే, దాని అడుగూ - అంతం చూసే స్వభావం నాది! అంతంత మాత్రంగా దేన్నీ పైపైన తడిమి వదిలెయ్యను నేను. ఆ పద్దతిలోనే చదువులో మునిగిపోయి ఎప్పుడూ డిస్టింక్షను మార్కులు స్కోర్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టినా అంతే! మళ్ళీ ఆ ధ్యాసలో పడిన తర్వాత నన్నాపకూడదు. వోకే?" అంది ప్రతిమ కొంచెం సీరియస్ గా.
    
    "కండిషన్లు పెడుతున్నావా?" అన్నాడు శ్రీరాం నిదానంగా.
    
    "కండిషన్లు పెట్టడం కాదు నా మనసు ఉండే కండిషన్ ఎలాంటిదో చెబుతున్నాను. మీరు నిప్పుల్లో దూకమంటే దూకడానికి సిద్దం నేను! మీరు ప్రాక్టీస్ వద్దంటే సరేనన్నాను. ఇప్పుడు పెట్టమంటున్నారు మళ్ళీ. సరేనంటున్నాను. ఇంక మళ్ళీ వేరే ఆలోచన రాకూడదు మీకు! సరేనా?"
    
    "ఆస్తి పోగొట్టుకోవడంతో నేను నీకు చులకన అయిపోయానా, ప్రతిమా?"
        
    "అలాగని కాదు..."
    
    ఇంతలో ఒక స్త్రీ భారంగా, మెల్లిగా నడుస్తూ లోపలికి వచ్చింది. గర్భవతి, ఎనిమిది నెలలు నిండి ఉండొచ్చు. బీదగా కనబడుతోంది.
    
    "పేషెంటు!" అన్నాడు శ్రీరాం, లేచి నిలబడుతూ.
    
    ఆ వచ్చినామె సందేహంగా చూస్తూ, నీరసంగా ఉన్న గొంతుతో అడిగింది.
    
    "హనుమంతరావుగారి ఇల్లు ఈ వరసలోనేనా, అమ్మా?"
    
    ప్రశ్నార్ధకంగా శ్రీరాం వైపు చూసింది ప్రతిమ.
    
    శ్రీరాం విసుగ్గా గొంతు పెట్టి, "కాదు! పక్క గల్లీలో!" అన్నాడు.
    
    కాస్త సంకోచించి, తటపటాయిస్తూ అడిగింది ఆమె, "మీకు పనిమనిషి అవసరం ఉందా, అమ్మా?"
    
    శ్రీరాంకి వోపిక చచ్చిపోయింది.
    
    "వెళ్ళెళ్ళు! మేమే పని కోసం వెదుక్కుంటున్నాం, ఇంక నీకేమిటి పని చూపించేది?"    
    
    ఆమె బెదిరిపోయి, సృష్టి భారాన్నంతా మోస్తున్న దానిలా మెల్లిగా నడుస్తూ వెళ్ళిపోయింది.
    
    గుండె తరుక్కుపోయినట్లయి, అంటే చూస్తూ ఉండిపోయింది ప్రతిమ. నెలలు నిండుతున్నా, పని చెయ్యక తప్పని పరిస్థితి! పాపం!
    
    వెంటనే ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికొచ్చింది ప్రతిమ. ఎవరికి చేతనైన పని వాళ్ళు చెయ్యాలి. శ్రమ పడే సామర్ధ్యం ఉన్నప్పుడు శ్రమించక పోవడం, సోమరిగా కూర్చోవడం, నేరమే!
    
                                                                  * * * * *
    
    "ఒక్కడంటే ఒక్క పేషెంటు కూడా రాలేదివాళ!" అన్నాడు శ్రీరాం ఆ రాత్రికి. అతని గొంతులో నిస్ప్రుహ ధ్వనిస్తూంది.
    
    "బోర్డు తగిలించెయ్యగానే బోల్డు మంది పేషెంట్లు వచ్చెయ్యడానికి ఇదేమన్నా సినిమానా? మెల్లి ఎల్లిగా కొంతమంది రావాలి. వాళ్ళు ఇంకొంత మందితో చెప్పాలి. మంచి డాక్టరని పేరు పడాలి. అప్పుడు..."
    
    "ఈలోగా మనం ముసలాళ్ళమై పోవాలి! అంతేనా? అప్పటి దాకా ఎలా చస్తాం?"    
    
    "నేనొకటి చెప్పనా?"
    
    "చెప్పు!"
    
    "మీరు కోపగించుకోకూడదు!"
    
    "ఉపోద్ఘాతాలు వద్దు. చెప్పు." అన్నాడు శ్రీరాం విసుగ్గా.
    
    "నేను ఏదైనా హాస్పిటల్లోనో, నర్సింగ్ హోమ్ లోనో జాబ్ లో చేరి, అనుభవం వచ్చాక ఇంటి దగ్గరే ప్రాక్టీసు పెట్టుకుంటే బాగుంటుంది. అది కరెక్ట్ పద్దతి కూడానూ!"
    
    "ఉద్యోగం అంటే ఇంకొకళ్ళ చేతి కింద నీళ్ళు తాగడం! అది నాకు ఇష్టం లేదు! అందులోనూ నువ్వు ఉద్యోగం చెయ్యడం అసలు ఇష్టం లేదు!"
    
    "అది తప్పదండీ?" అంది ప్రతిమ మృదువుగా. "ఇవాళ పేపర్లో ఒక అడ్వర్ టయిజు మెంటు చూశాను."
    
    "అప్పుడే అడ్వర్టయిజుమెంట్లూ చూడటం కూడా మొదలెట్టావన్న మాట! ప్రాక్టీస్ పెట్టమని నేను చెబుతూంది నీకు మనసుకెక్కటం లేదు! నేనుత్త పనికిమాలిన వాడిననుకుని నీ అంతట నువ్వే సెపరేట్ గా ఆలోచనలు చేసుకుంటున్నావ్!"
    
    "అది కాదు! మరేం చెయ్యను చెప్పండి? పొద్దున ప్రాక్టీస్ పెడితే సాయంత్రానికి ఫేమస్ డాక్టర్ని అయిపోతానన్నట్లు మీరు మాట్లాడేస్తుంటే? ఫ్రాంక్ గా చెబుతున్నాను. ప్రాక్టికల్ గా ఆలోచించరు మీరెప్పుడూ! మీది అడ్వెంచరిజమ్, సాహసాలు చేసే స్వభావం మీది"
    
    "అందుకే బిజినెస్ లో దివాలా ఎత్తానంటావ్! అవునా? అప్పుడే చూడు! నీ మాట తీరు మారింది." అన్నాడు శ్రీరాం మొహం గంటు పెట్టుకుని. "నేనే భార్యనయినట్లూ, నువ్వే భరించేదానివైనట్లూ మాట్లాడుతున్నావ్!"
    
    "శ్రీరాం, ఈ జీవితం మనిద్దరిదీ! నేను కూడా నాకు తోచిన మంచీ -చెడ్డా చెప్పకూడదా?"
    
    శ్రీరాం మొహం అటు తిప్పుకున్నాడు.
    
    "వోకే! మీరే బాస్! చెప్పండి! ఏం చెయ్యను?"
    
    "నా మాటంటే నీకు బొత్తిగా లక్ష్యం లేదు!" అన్నాడతను పంతంగా.
    
    చిన్నపిల్లాడిలా ప్రవర్తించే అతని మనస్తత్వం చూస్తే కొద్దిగా నవ్వొస్తూంది ప్రతిమకు. సైకాలజీలో ఇలాంటి మనస్తత్వానికి ఏమిటి పేరు? ఫ్రాయిడ్ శ్రీరాంని ఏ రకంలో చేరుస్తాడు?
    
    "లక్ష్యం ఉందని రుజువు చెయ్యడానికి ఏం చెయ్యను? ఈ మేడ మీదనుంచీ కిందికి దూకెయ్యనా? గోడకి ఉన్న ఈ ప్లగ్గులో వేలు పెట్టెయ్యనా? ఏం చెయ్యను - చెప్పండి?" అంది నవ్వుతూ.
    
    నవ్వుకి ఆమె పమిట జారిపోయింది. ఆమె పమిటతో బాటు అతని కోపం కూడా జారిపోయింది.
    
                                                               * * * * *

 Previous Page Next Page