Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 39

 

    "అతి కష్టం మీద నా ఇష్టాన్ని చంపేసుకున్నాను. మళ్ళీ ఆ ఉత్సాహం, ఆ మూడ్ రావు నాకు." అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది ప్రతిమ.
    
    అతను ఆమె జడ పట్టుకుని ఆపాడు.
    
    "వెర్రివెధవ ఏదో వాగుతాడులే! అన్నట్లు వెళ్ళిపోతేనేం? నువ్వు ప్రాక్టీస్ పెడుతున్నావు." అన్నాడు కోపం నటిస్తూ.    
    
    సమయం వచ్చింది కాబట్టి అడిగెయ్యాలనిపించింది ప్రతిమకి.
    
    "అప్పట్లో నేను ప్రాక్టీస్ చెయ్యాలని తహతహ లాడిపోతే మీ పంతం కోసం నా చదువంతా బీరువాలో దాచేసి తాళమేశారే! ఎందుకు చేశారలాగ? 'అయ్యో, పాపం! తను బాధపడిపోతుందేమో'నని నా కోసం ఫీలయ్యారా మీరు? మళ్ళీ ఇప్పుడు 'బోర్డు కట్టేయ్!' అనగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకోవాలా? భలేవారు మీరు!" అంది చనువుగానే అతన్ని నిలదీస్తూ.
    
    "షటప్! యూ స్వీట్ లిటిల్ ఇడియట్! నోర్మూసుకుని విను! నేనెవర్ని? 'ఏ వన్' బిజినెస్ మాన్ ని! బిజినెస్ కి కాపిటల్ ఉండాలి. నీ చదువూ, నీ డిగ్రీ మనకి పెట్టుబడి! ఎవరో ఏదో అన్నారని మనం గింజుకుంటూ ఎందుకు వెనకబడిపోవాలి? యా! నువ్వు బ్రిలియంట్ డాక్టర్ వి! నేను ఫైనాన్షియల్ విజార్ డ్ ని! నీ చదువు పెట్టుబడిగా జాయింట్ ఫర్మ్ లాగా పెడతాం!"
    
    సగం కోపంతో, సగం నవ్వుతో, అతన్ని చూస్తోంది ప్రతిమ.
    
    "ఇదివరకోసారి పార్ట్ నర్ షిప్ బిజినెస్ గురించి చెప్పాను నీకు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. డబ్బున్న వాడెవడో పెట్టుబడి పెడతాడు. వ్యాపారం తెలిసిన వాడింకొకడు బిజినెస్ రన్ చేస్తుంటాడు. అంటే పెట్టుబడి పెట్టి మెదలకుండా కూర్చునేవాడు స్లీపింగ్ పారట్ నర్ కాగా, నిజంగా పని చేసేవాడు వర్కింగ్ పార్ట్ నర్ అన్నమాట! మన విషయంలో కొంచెం తేడా ఉంది. మన పెట్టుబడి నీ చదువు! దానితో వ్యాపారం చేసే తెలివితేటలు నావి! కొన్నాళ్ళయ్యేసరికి యాభై బెడ్ల నర్సింగ్ హోమ్ కట్టి పగలంతా ఇద్దరం ఒళ్లొంచి పని చేస్తాం! రాత్రంతా ఫోంబెడ్ మీద ఒళ్ళలిసిపోయేలా స్లీపింగ్ పార్ట్ నర్స్ మి అయిపోతాం! ఓకే?"
    
    ఆడది స్లీపింగ్ పార్ట్ నర్- అంటే పడక సుఖం ఇచ్చే భాగస్వామి మాత్రమేననీ, మొగుడు వర్కింగ్ పార్ట్ నర్ - సంపాదించి పోషించే మొనగాడనీ అతను ఇదివరకోసారి చెప్పిన ఆర్గ్యుమెంటు ఇంకా గుర్తుంది ప్రతిమకి.
    
    లాయర్లకి లాగే సేల్సు పీపుల్ కి కూడా ఒకే వాదాన్ని సమయానుకూలంగా కాసేపు అటు తిరగేసీ కాసేపు ఇటు తిరగేసీ ఎటు పడితే అటు చెప్పగల చాకచక్యం ఉండాలి. అది శ్రీరాంకి బోలెడంత ఉందని గుర్తించింది ప్రతిమ.
    
    "ఎస్, ప్రతిమా! మీ నాన్న అన్న మాటలు మరిచిపోలేదు నేను! నీ చదువుని పెట్టుబడిగా పెట్టుకుని నేనేదో లక్షలు సంపాదించేస్తానని అన్నాడు కదూ? నాకా మాటలు బాగా గుర్తుండిపోయాయి. నిజానికి అప్పట్లో నాకా ఉద్దేశం లేదు కాని.... కానీ... ఇప్పుడు పంతం పెరిగిపోయి, ఆయన మాటలని దారుణంగా నిజం చేసి పారెయ్యాలనిపిస్తూంది. యా! నువ్వు ప్రాక్టీస్ పెడతావు. వచ్చే సంవత్సరానికి ఆ ప్రాక్టీస్ రెండింతలవుతుంది. ఆ తరవాత సంవత్సరానికి నాలుగింతలు! ఆ తరవాత సంవత్సరానికి....ఓహ్! ఫెంటాస్టిక్! కొన్నాళ్ళకి ఫైవ్ స్టార్ హోటలంత మోడరన్ హాస్పిటల్ కడతాం! గుండెల మార్పిడి చేసేటంత అడ్వాన్ స్ డ్ సౌకర్యాలు ఉంటాయి అందులో!"
    
    "మగవాళ్ళకి ఆడవాళ్ళ గుండెలు పెడితే గానీ తెలియదు మా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో!"
    
    "అడ్డు తగలకు! విను! మన హాస్పిటల్ ని కంపెనీగా ఫ్లోట్ చేస్తాం! షేర్లు అమ్ముతాం! ఈ రోగాల బిజినెస్ కి మంచి ఫ్యూచర్ ఉంది ప్రతిమా! తిరుగులేని మార్కెట్టు! రిసెషన్, అంటే మందగించడం అన్న మాటే లేదు. పేషెంట్లను ఆకలి మందగించినా, దృష్టి మందగించినా కూడా డాక్టర్లకి అభివృద్దే! ప్రపంచంలో రోగులు రోజురోజుకీ ఎక్కువ అవుతుంటారే తప్ప తగ్గరు! అదృష్టవశాత్తు కొత్త రోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి! మార్కెట్ ఈజ్ జస్ట్ బెకనింగ్ టు యూ - రా రమ్మని పిలుస్తూంది, డాక్టర్ ప్రతిమా!"
    
    చిరునవ్వుతో చూస్తూంది ప్రతిమ అతన్ని.
    
    "ఈ బిజినెస్ లో మార్కెట్ ఎప్పుడూ డౌనయిపోదు, ప్రతిమా! డిమాండు ఉంటూనే ఉంటుంది. మొన్న కొత్త బ్లేడ్ల కంపెనీ వాళ్ళ షేర్లు అడ్వర్టయిజ్ చేసినప్పుడు ఏం చెప్పాను? మొగాళ్ళకి గెడ్డాలూ, మీసాలూ పెదిగినన్నాళ్ళూ బ్లేడ్లకి గిరాకీ తగ్గదు. యామ్ ఐ రైట్, డాక్టర్ ప్రతిమా?"
    
    ఆపుకోలేనంత నవ్వొచ్చింది ప్రతిమకి.
    
    "బాగుంది! డాక్టర్లు ఎక్కడయినా, 'రోగాలన్నీ మాయమైపోవాలి, రోగులందరికీ నయమైపోవాలి' అని కోరుకుంటారు గానీ, 'రోగులూ - రోగాలూ వర్దుల్లాలి, మన మార్కెట్ పెరగాలి' అనుకుంటారా? అయినా పేషెంట్లూ, బ్లేడ్లూ ఒకటేనేమిటి?"
    
    "మనం డబ్బుకి అమ్మగలిగింది ఏదైనా సరే కమ్మోడిటీ అవుతుంది. మన సేవలూ, సర్వీసెస్ కొనే జనం అంతా మన మార్కెట్ అవుతారు. ఇది బిజినెస్ లో ప్రాధమిక సూత్రం! డాక్టర్లు దీనికి అతీతమైన వాళ్ళేం కారు!"
    
    అతను తమషాకే అంటున్నాడని భావించిన ప్రతిమ ఇంకా నవ్వుతూనే ఉంది. శ్రీరాం సీరియస్ గా బోర్డు తీసుకుని కిందికి నడిచాడు. ఆదుర్దాగా వెనకనే వెళ్ళింది ప్రతిమ.    

    "ఏమిటీ"? నిజంగానేనా?"
    
    "మరి అబద్దంగా అనుకున్నావేమిటి?"
    
    "వద్దొద్దు! ప్లీజ్! ఇప్పుడింక నాకా మూడ్ లేదు."
    
    "మూడ్ లేదని కూర్చుంటే కడుపులు మాడతాయి! ఏదో ఒకటి చెయ్యాలి మనం."
    
    నిస్సహాయంగా ఆగిపోయింది ప్రతిమ.
    
    "ఏమ్మా! ఏమిటి సంగతి?" అంది అటువైపు వచ్చిన సరస్వతి.
    
    అప్పటికే శ్రీరాం గేటు దగ్గరికి వెళ్ళిపోయాడు.
    
    "ఆయన మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యమంటున్నారత్తయ్యా!"
    
    "మరింకేమే, పిచ్చి పిల్లా! రోగి కోరిందీ, వైద్యుడు చెప్పిందీ ఒకటే అయినట్లు, ఇన్నాళ్ళనుంచీ నువ్వు ఆరాటపడింది దానికోసమే కదా?"
    
    "ఉహుఁ! బలవంతంగా ఆ ఉద్దేశాలు మార్చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనసు అటు మళ్ళించుకోవడం కష్టమే!"
    
    సానుభూతిగా చూసింది సరస్వతి.
    
    "నీ ఇష్టమమ్మా! త్వరగా స్నానం చెయ్యి! నీకు ఇష్టం కదా అని చేమదుంపలు కొన్నాను ఇవాళ. పులుసులో ముక్కలుగా వెయ్యనా, వేపుడు చెయ్యనా? ఎన్నాళ్ళయిందో బిడ్డకి ఇష్టమైన భోజనం పెట్టి!"
    
    ఎవరో తట్టినట్లు ఉలిక్కిపడింది ప్రతిమ. అత్తగారు తనకిష్టమైన భోజనం పెట్టి చాలా రోజులు అయింది. సరే, వాళ్ళు మాత్రం ఇష్టమైన వంటకాలు తిని ఎన్ని రోజులయి ఉంటుందో! ఎందుకు అందరూ అనవసరంగా కష్టపడటం - తన చేతిలో మెడికల్ డిగ్రీ ఉంచుకుని? డబ్బుకి కటకట అయిపోయి, సుబ్రమణిని పని మానెయ్యమని చెప్పారు. మల్లయ్యకి ఉద్వాసన చెప్పారు. పనిమనిషి తన మానేసింది. ఇంటెడు పనీ అత్తగారే చేసుకుంటున్నారు. 'ఎందుకీ ఆకారణమైన ఇబ్బందులు?' అనిపించింది ప్రతిమకి.
    
    శ్రీరాం బోర్డు బయట తగిలించి వచ్చి, వరండాలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. లోపలికి వెళ్ళబోతున్న ప్రతిమని చెయ్యి పట్టుకుని లాగి, బలవంతంగా తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.

 Previous Page Next Page