మరునాడు 'నవజ్యోతి చారిటీ హాస్పిటల్'లో లేడీ డాక్టర్ పోస్టుకి అప్లయ్ చేసింది ప్రతిమ.
"ఈ నెల ఇరవై రెండో తారీఖు పొద్దున్న పదిగంటలకు ఇంటర్వ్యూ కి హాజరు కావలసినది" అని సమాధానం వచ్చింది ప్రతిమ అప్లికేషన్ కి. "డాక్టర్ వి.కె. కుమార్, ఎఫ్.ఆర్.సి.ఎస్." అని ఉంది లెటర్ హెడ్ మీద.
ఈయన పేరు చాలాసార్లు విన్నది తను. కానీ ఇంతవరకూ ఎప్పుడూ చూడటం తటస్థించలేదు. మంచి డాక్టరేగానీ, చాలా కోపిష్టి అని చెప్పుకుంటారు అందరూ.
చిన్న చిన్న నల్లటి చుక్కలున్న తెల్లచీరె కట్టుకుని, సింపుల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళింది ప్రతిమ. బస్సులో ఆమెని తీసుకువచ్చి, హాస్పిటల్ దగ్గర దింపి, అటునుంచీ ఎక్కడికో వెళ్ళిపోయాడు శ్రీరాం.
పెద్ద హాస్పిటలే అది. ఎక్స్ -రే దగ్గరనుంచీ మెటర్నిటీ దాకా అన్ని శాఖలూ ఉన్నాయి అందులో. ఇంటర్వ్యూకి చాలామంది కేండిడేట్స్ వస్తారని ఊహించింది ప్రతిమ. కానీ అసలు మిగతా కేండిడేట్స్ ఎవరూ వచ్చినట్లు లేదు.
ప్రతిమ లోపలికెళ్ళగానే నవ్వుతూ ఎదురొచ్చింది ఒక నర్సు. ప్రతిమ పేరు కనుక్కుని "ప్లీజ్ సిట్ డవున్! ఇప్పుడే వెళ్ళి చెప్పి వస్తాను" అంటూ లోపలికి వెళ్ళిపోయింది.
చాలా హాస్పిటల్సులోలాగా దిగులుగా లేదు అక్కడి వాతావరణం. ఆహ్లాదకరంగా ఉంది. తళతళ మెరిసిపోతున్న చల్లటి తాండూర్ బ్లూ ఫ్లోరింగూ, తెల్లటి ప్లాస్టిక్ ఎమల్షన్ పెయింట్సు వేసిన గోడలూ, ఒక వారగా అందమైన చేపలున్న గాజుతొట్టీ, దానిలో క్షణానికోసారి నోరు తెరిచి గాలిబుడగ వదులుతున్న మొసలి బొమ్మా, కిటికీ దగ్గర రంగు రంగుల తొట్లలో క్రోటన్లూ, బిల్డింగ్ చుట్టూ ఉన్న తోటలో పెద్ద పెద్ద వృక్షాలూ.
ఆ వాతావరణంలో అడుగు పెట్టగానే సగం వ్యాధి తగ్గిపోయేటట్లు చాలా హాయిగా ఉంది. పేషెంట్లు కూర్చునే వెయిటింగ్ రూంలో మెత్తటి సోఫాలూ, వాటి మధ్య టీపాయి మీద రకరకాలైన మేగజైనులూ ఉన్నాయి. ఇంతలో ఒక చిన్న పిట్ట కూత వేసినట్లు శ్రావ్యమైన ధ్వని. అది డాక్టరుగారి బజర్.
"ప్లీజ్! లోపలికెళ్ళండి!" అంది నర్సు తను బయటికి వచ్చేస్తూ సంభ్రమంగా లేచి, సర్టిఫికేట్స్ ఉన్న ఫోల్డరు భద్రంగా పట్టుకుని లోపలికి నడిచింది ప్రతిమ.
డాక్టర్ కుమార్ సీరియస్ గా తన ముందు ఉన్న కేస్ హిస్టరీ ఏదో చదువుతున్నాడు. చాలా అందంగా ఉన్నాడతను. కూర్చుని ఉన్నా, పొడుగాటి మనిషి అని చూడగానే అర్ధం అవుతూంది.
"గుడ్ మార్నింగ్ డాక్టర్!"
డాక్టర్ కుమార్ ప్రతిమని చూసి, ముభావంగా తల పంకించాడు. కూర్చోమని కూడా అనలేదు. సీరియస్ గానే కొన్ని వివరాలడిగాడు చెప్పింది ప్రతిమ.
హఠాత్తుగా, "మీ హజ్బెండ్ ఏం చేస్తుంటారు?" అన్నాడు.
కొద్దిగా తడబడి, "బిజినెస్" అంది ప్రతిమ.
"ఏం బిజినెస్?" అన్నాడు కుమార్ యుద్దంలో పట్టుబడిపోయి, తన ముందు హాజరు పరచబడ్డ శత్రు సైనికుడిని, సైన్యాధికారి ప్రశ్నిస్తున్నట్లు.
"సో మెనీ! టీవీ డిస్ట్రిబ్యూషను, గార్మెంట్స్ ఎక్స్ పోర్టు, ఇంకా కొన్ని!" అంది ప్రతిమ, తన భర్తను తక్కువ చెయ్యడం ఇష్టంలేక.
"అయితే ఈ జాబ్ కోసం మీరింత తాపత్రయపడిపోవడం ఎందుకు? ఈ పోస్టుకి తగిన క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళనే సెలెక్ట్ చేసుకునే వాళ్ళం కదా?"
అతను మాట్లాడుతున్నది ఏమిటో అర్ధం కాలేదు ప్రతిమకి. అయోమయంగా చూసింది.
"మీ హజ్బెండ్ బిజినెస్ మానే కావచ్చు. కానీ నా వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోవడం మాత్రం ఆయన బిజినెస్ కాకూడదు. అవునా? దెన్ వై ద హెల్ హి వెంట్ టూ డాక్టర్ నీలకంఠం? నీలకంఠం దగ్గిరికి ఆయన అసలు ఎందుకెళ్ళారు? నీలకంఠానికీ నాకూ, నీలకంఠానికీ తనకూ ఉన్న ఫ్రెండ్ షిప్ ని దుర్వినియోగం చేసి, మిమ్మల్ని ఎలా అయినా ఈ జాబ్ లో చేర్చుకునేలా చూడమని లెటరు రాయించారు. నీలకంఠం మాట తీసెయ్య;లేక నేను మిమ్మల్ని ఈ జాబ్ లో చేర్చుకుంటే, ఆ తరవాత మిమ్మల్ని ఎలాంటి జాబితాలో చేరుస్తానో తెలుసా? తనకంటూ సామర్ధ్యం లేకుండానే, రెకమెండేషన్ లతో దూరిపోవాలనీ, పక్కవాడిని తొక్కేసి దూకెయ్యాలనీ చూసేవాళ్ళని నేను సోషల్ లెపర్ స్ గా చూస్తాను. అంటరాని రోగులుగా ట్రీట్ చేస్తాను. అర్ధమయిందా?"
అతను అంత అసందర్భంగా, అంత అమర్యాదగా మాట్లాడతాడని వూహించని ప్రతిమ అవాక్కయిపోయింది. తరవాత మెల్లి మెల్లిగా ఆమెకి జరిగింది అర్ధం కావడం మొదలెట్టింది. ఆయన వెళ్ళి డాక్టర్ నీలకంఠం ద్వారా రెకమెండ్ చేయించారా? ఏమిటంత అవసరం? తన సామర్ధ్యం మీద తనకి చాలా నమ్మకం ఉంది. అలాగే తన వర్క్ మీద నమ్మకమున్న వాళ్ళే తనకి ఉద్యోగం ఇస్తారు. రెకమెండేషన్ ఎందుకు?
రోషంతో, అవమానంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. చటుక్కున లేచి నిలబడి, "ఇంక వెళ్ళి రావచ్చా, డాక్టర్? థాంక్యూ వెరీ మచ్" అంది.
అప్పుడు మొదటిసారిగా ఆమె మొహంలోకి చూశాడు డాక్టర్ కుమార్. ప్రతిమ మొహం జేవురించి ఉంది. కోపంతో ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. వణుకుతున్న గొంతుని అదుపులోకి తెచ్చుకుని అంది ప్రతిమ!
"కానీ ఒక్క విషయం, డాక్టర్! నేను ఎవ్వరి రెకమెండేషన్ కోసం ఆరాటపడి పోలేదు. అంత అవసరం కూడా నాకు లేదు. మీరు నా డిగ్రీ, మార్కులూ, సబ్జెక్టులో నాకు ఉన్న నాలెడ్జి గురించి అడక్కుండానే తోచిందల్లా మాట్లాడేస్తున్నారు. నేను వెళ్ళిపోయాక, మీ ప్రవర్తన ఎంత మొరటుగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి!" అంటూనే విసురుగా వెనక్కి తిరిగింది.
"ఆగండి! నేనీ జాబ్ మీకు ఇస్తానని డాక్టర్ నీలకంఠానికి ప్రామిస్ చేశాను."
"టు హెల్ విత్ యువర్ ప్రామిస్! మీకూ, మీ ఉద్యోగానికీ ఒక నమస్కారం! ఈసారి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనకలాలోచించడం అలవాటు చేసుకోండి!" అంటూ చకచక వెళ్ళిపోయింది ప్రతిమ. డాక్టర్ కుమార్ ఆమె వెళ్ళిన వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.
* * * * *
"గుడ్ న్యూసా? జాయినయిపోయావా?" అన్నాడు శ్రీరాం హుషారుగా నీలకంఠం అంత పెద్ద డాక్టర్ చేత డాక్టర్ కుమార్ కి తను రెకమెండ్ చేయించగలగడం అతనికి చెప్పలేనంత గర్వంగా ఉంది. నీలకంఠంతో ఇదివరకు అతనికి క్లబ్ లో టెన్నిస్ పరిచయం. ఇంటర్వ్యూలో హఠాత్తుగా ఈ సంగతి తెలిసి, తన పతి పరపతికి పొంగిపోయి, అప్పాయింట్ మెంట్ ఆర్డర్ తో, గుండె పట్టని సంతోషంతో వచ్చి తనని కృతజ్ఞతా పూర్వకంగా చూస్తుంది ప్రతిమ. అప్పుడు తను సరదాగా కాలరెత్తేసి, ఆ తరువాత ప్రతిమని చేతుల్లో ఎత్తేసి గిరగిర తిప్పేసి.... అన్న పంథాలో వూహిస్తున్న శ్రీరాం, ఎర్రబడ్డ కళ్ళతో, కందిపోయిన మొహంతో విసురుగా తిరిగి వచ్చిన ప్రతిమని చూడగానే ఆశ్చర్యపడ్డాడు.
"ప్రతిమా! ఏమయింది?"
"మీరు డాక్టర్ నీలకంఠంతో రెకమెండ్ చేయించారా?"
"అవును! నేను చేయించాను!" అన్నాడు శ్రీరాం. అతని గొంతులో కొంచెం గర్వం ధ్వనించింది.
"ఎందుకు?"


