Previous Page Next Page 
అరుణ పేజి 40

    రోజులు దొర్లిపోతున్నాయి యథాప్రకారం. పగలంతా పేషెంట్లతో అరుణకి సరిపోతుంది. మధ్యాహ్నం అంతా ఏదో పుస్తకాలతో కాలంగడిపేస్తుంది. రోజులు దొర్లిపోతున్నా ఈ మధ్యకొద్ది రోజులలో జరిగిన సంఘటనలు అరుణ మనసు మీద బలమైన ముద్రవేశాయి. రెడ్డి కూతురు వెంకు, సుబ్బులు మరణం, రెడ్డి జరిపించబోయిన అత్యాచారం, సుబ్బారావువైఖరి....... అన్నీ కలిసిఅరుణ మనసుకి విశ్రాంతి అన్నది ఈయన ఆలోచనలు పీడించ నారంభించాయి. అన్నింటికన్నా రెడ్డి అత్యాచారం, సుబ్బారావు అనవసర కయ్యం ఆమె మనసు మీద బాగా పనిచేశాయి.    
    వీటన్నింటి మధ్య ఓదార్పు రమేష్ తో స్నేహం నిజంగా ఈ సంఘటనల తరవాత సుబ్బారావు తనతో శత్రుత్వం వహించాక ఆ రమేష్ కూడా లేకపోతే ఆ వాతావరణం నిజంగా పిచ్చెక్కించేదేమో? ఈ ఊళ్ళో మాత్రం మాట్లాడే మనిషి కూడా లేకపోతే తోచక కొట్టుకుపోయేది తను.    
    ఈ నెలరోజులలోనే రమేషు మంచి మిత్రుడయ్యాడు అరుణకి. అందులో సుబ్బారావుతో మాటలు లేక అతని తోట వైపుకి వెళ్ళడానికి లేక ఆ పక్క కాస్త దూరంలో ఉన్న రమేషు పొలంలో తోటలోకివెళ్ళడం ఆరంభించింది అరుణ. ఈ కొద్ది రోజులలోనే అతని సహృదయం, సంస్కారం మీద అరుణకి మంచిగురి కుదిరింది. రమేషు కూడా అరుణతో చనువుగా ఉంటూ, తాము తలపెట్టిన వ్యవసాయ కార్యక్రమాలగురించి చర్చించడం, సలహాలు తీసుకోవడం చేసేవాడు.        
    రమేషు తను తలపెట్టిన అధునాతన మయిన వ్యవసాయం గురించి ఎన్నెన్నో పథకాలు వేశాడు. "ట్రాక్టరు కొనాలని నిశ్చయించాను. మీ సలహా ఏమిటి?" అని అడిగాడు అరుణని.    
    "తప్పకుండా కొనండి. దానికి సందేహమెందుకు?" అంది అరుణ.    
    "కానీ ట్రాక్టరు కొంటే పొలాల పనుల మీద ఆధారపడిన కూలీ లందరికీ జీవనోపాధిపడగొట్టినట్టవుతుందని బాధగా ఉంది" ఎటూతేల్చుకోలేక అరుణని సలహా అడిగాడు అరుణ ఆలోచించింది అరుణ మాట నిజమే కోతలు ఊడ్పులు దున్నటం వీటన్నింటికీ కూలి పనులకి పోయేవాళ్ళందరికి ట్రాక్టరువచ్చిందంటే ఆ పనులు దొరకవు.    
    "ఆమాట నిజమే అనుకోండి. అలా అని ఎల్లకాలమూ పాత పద్ధతులే పట్టుకు వేళ్ళాడితే ఎలాగ? ఇదివరకు ఎద్దుబళ్లవాళ్ళు రిక్షాలు వచ్చి మానోటదుమ్ముకొట్టాయన్నారు. రిక్షాలవాళ్ళు బస్సులొచ్చి మా కూడు పడగొడుతున్నాయి అన్నారు అలా అని ఎన్నాళ్ళయినా ఆ ఎద్దుబండే పట్టుకు వేళ్ళాడుతామా? బళ్ళు దాటి కార్లు రైళ్ళు విమానాల స్టేజిలోకి రాలేదూ? ప్రపంచం రాకెట్ల యుగంలో ఉంటే మనమింకా నాగళ్ళు ఎద్దులనే పట్టుకువేళ్ళాడుతే ఎలాగ? ఫరవాలేదు కొనండి ఎలాగూ గూడ్సులోకూలీలు కావాలి. మిగతాఅప్పుడు ఇంకేవో పనులుంటూనే ఉంటాయి" అరుణ ప్రోత్సహించింది.    
    "అందుకే నేను మరో ఆలోచన చేశాను. మీరు నేను ఆకాశానికి నిచ్చెనలువేస్తున్నానని నవ్వకుండా, నా ప్లానులు వినండి మొత్తం మా పొలందగ్గిర దగ్గిర తొంభై ఎకరాలుంటుంది. అదికాక కొబ్బరితోట ఓ పదెకరాలుంది. మామూలు తోట ఓ మూడు ఎకరాలుంది. నేను చాలా చాలా ఉద్దేశాలతో ఉన్నాను, ట్రాక్టరు కొనాలని, స్వంతంగా నీళ్ళకి నూతిలోంచి మోటారు పంపు పెట్టుకోవాలని, ధాన్యం ఎలాగు అమ్ముతున్నాం కనక ఓ రైసు మిల్లు పెట్టిబియ్యం వ్యాపారం పెట్టాలని, ఓ చిన్న నూనె మిల్లు పెట్టి మా తోటలో కాసే కొబ్బరి, వేరుశనగ నూనె వ్యాపారం చెయ్యాలని ఇలాగే చాలా ప్లానులున్నాయి.    
    అంటే ఇవన్నీ వెంటనే చేస్తానని కాదు నెమ్మది నెమ్మదిగా ఓ దాని తరువాత ఓటి కార్యరూపంలోకి తెస్తాను. వీటన్నింటికి ముందుగవర్నమెంటు లోనులిస్తుంది. అవి గ్రాంటు తీసుకోవాలి, వీటన్నింటికి పవర్ సప్లెయ్ కావాలి, మిషన్లు కొనాలి. నా కార్యక్రమం అంత ఆచరణలోకొచ్చేసరికి కొన్ని ఏళ్ళుపట్టవచ్చు. కానీ, స్థూలంగా నా ఉద్దేశాలు ఇవి. ముందు వాయిదాల పద్దతి మీద టాక్టరుకొనాలి."    
    అరుణ చప్పట్లు కొట్టింది. "భేష్ చిన్నసైజూ ఇండస్ట్రీయలిస్ట్ అయిపోతారన్నమాట" నవ్వుతూ అంది.    
    "అదిగో నవ్వుతున్నారు మీరు అందుకే ముందు చెప్పకూడదనుకున్నాను."    
    "చాచా నవ్వడం లేదు మెచ్చుకుంటున్నాను. మీ ఉద్దేశాలని ప్రోత్సహిస్తున్నాను. చాలా బాగున్నాయి మీ ఆలోచనలు. నిజంగా ఇవన్నీ తప్పకుండా ఆచరణలోకి వస్తే యెంత మందికి పనులు చూపించినట్లవుతుంది. అంతేకాక ఈ పల్లెటూరికి ఓ జీవం వస్తుంది. అందరూ మీలాగే ఆలోచిస్తే మనం దేశం యెప్పుడో బాగుపడేది. ఇంత నిరుద్యోగ సమస్య ఉండేదికాదు. రైసుమిల్లు, ఆయిలుమిల్లు వగైరాలంటే ట్రాక్టర్లు వచ్చి తమ జీవనోపాధి పడగొట్టాయని బాధపడే వారందరికి పనులు లభిస్తాయి తప్పకుండా మీరీ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టాలి" ఉత్సాహంగా అంది అరుణ.    
    "నాకూ ఉత్సాహంగానే ఉంది. చూద్దాం యెంతవరకు నెరవేరుతాయో నా కోరికలు?" రమేషు అన్నాడు. ఓ రోజు ట్రాక్టర్లు కాగితాలు పట్టుకు వచ్చేవాడు. ఏ కంపెనీది కొనమంటారు అనేవాడు. వాయిదాలపద్దతి మీద కొననా, కొంచెం పొలం అమ్మి పూర్తిగా డబ్బిచ్చి కొనడం మంచిదంటారా అని అడిగేవాడు. మరో రోజు ఇక్కడ తక్కిన భూస్వాములకి, రైతులకి ట్రాక్టరు అద్దెకి ఇస్తానని చెప్పను, అసలు నా ఒక్కడి కోసమే అయితే ట్రాక్టరు మెయింటెయిన్ చేయడం కష్టం గంటకి ఏమాత్రం అద్దె నిర్ణయిస్తే బాగుంటుందంటారు అని మరోమారు అడిగేవాడు.    
    పొలంలో అంతా వరే కాకుండా ఏ ఏభైఎకరాలు మాత్రం వరిపండించు దామనుకున్నాను. మీ సలహా ఏమిటి అని మరో సాయంత్రం కూర్చున్నప్పుడు అడిగేవాడు. ఇప్పుడున్న పదెకరాల కొబ్బరి తోటలో ఏడాదికి ఎండుసార్లు దింపినప్పుడల్లా ఓ పదేసి వేల కొబ్బరికాయలు దింపుతున్నాం ఆధునికపద్దతులలో కొబ్బరి కాపు ఎక్కువ వచ్చేటట్లు చూస్తున్నాను అని, మరోసారి వాటర్ పంపు కొన్నాను, పవర్ సప్లై కావాలి. ఇరిగేషన్ వారికి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి రాశాను. ఎంతకీ జవాబులు రావు ఏమి చెయ్యమంటారు? ఇలా మగ గవర్నమెంటు పని చేస్తే ఏం పనులవుతాయి చెప్పండి అంటూ చర్చించేవాడు. రైసు మిల్లుకి షెడ్ గోడౌన్ అది కట్టిస్తున్నాను. ఈ ప్లాను బాగుంటుందంటారా? అని ఓ పూట ఇంటికొచ్చి మరీ అడిగేవాడు. ప్రతీవిషయం అరుణని అడిగేవాడు.    
    మంచిచెడ్డలు చర్చించేవాడు. అరుణకి తెలియనివిషయాలు వివరించిసలహా అడిగేవాడు రమేషు. సాయంకాలం తోటలో కూర్చున్నంతసేపూ ఏదో విషయం గురించి ఇద్దరూ మాట్లాడుకోవడం, మంచి చెడ్డలు చర్చించడం, ఒకరికొకరు సలహాలిచ్చుకోవడం రమేషు, అరుణల దినచర్యలో ఓ భాగం ఐపోయింది. రమేషు ఉత్సాహంగా తనకార్యక్రమాలు వివరిస్తూంటే ఉత్తేజితురాలై ఆసక్తిగా అరుణ తోచిన సలహాలిచ్చింది. తనకు మార్పులు సూచించేది. తనకి తెలియని వివరాలు రమేషు చెబుతూంటే శ్రద్దగా వినేది. అరుణరమేషుల స్నేహం ఆ ఊళ్ళో చాలా మందికికన్ను కుట్టింది. అందులో ముఖ్యంగా సుబ్బరావుకి. అరుణ రమేషు రోజు నవ్వుకుంటూ పొలాల వెంబడి, తోటల వెంబడి తిరగడం, గంటలకిగంటలు చీకటిపడ్డా తోటలో కూర్చోవడం అన్నీ చూస్తూ అసూయతో ఉడికిపోయేవాడు.    
    ఏం చెయ్యలేక క్రోధంతో మనసులోనే అరుణని శపించుకునేవాడు ఇన్ని చేసినతను, రమేషు రాగానేకనపడడం మానేశాడు! ఇలాంటి విశ్వాస ఘాతకురాలుందని మనసులోనే అరుణని కసిదీరా కృతఘ్నురాలిగా చిత్రించుకుని తిట్టుకుని తృప్తిపడేవాడు కొన్నాళ్ళు రాను రాను అరుణ తనకుపూర్తిగా దూరం కావడం, రమేషుకి మరి సన్నిహితురాలవడం చూసి అసూయ మనసులో దాచుకోవడం అసాధ్యమయి అడిగిన వారికి, అడగనివారికి అందరికి అరుణ ఈ ఊరికి రావడానికి, డాక్టరుగా ఈనాడు వేలు ఆర్జించడానికి తనెన్ని శ్రమలుపడ్డాడో, అరుణకి ఎన్నెన్ని విధాలుగా సహాయ పడ్డాడో వివరించి మరి చెప్పి ఆఖరికి ఈనాడు ఆ రమేషు రాగానే అరుణ ఇంత చేసి తన సహాయాన్ని ఎంతతేలిగ్గా మరిచిపోయిందో అన్నీ చెప్పుకోవడం ఆరంభించేవాడు. అరుణ, సుబ్బారావుల మధ్య జరిగిన అసలు సంగతి ఎవరికీ తెలియదు.    
    వారందరు కళ్ళారా సుబ్బారావు ముందులో అరుణకేవిధంగా సహాయపడ్డది చూసినవారు కనక సుబ్బారావు మాటలు అన్నీ నమ్మడానికి ఏమాత్రం సందేహించలేదు. అరుణ చేస్తున్నపని సరి అయింది కాదనే సుబ్బారావు పక్షమే అందరూ మాట్లాడారు. అరుణ గురించి, అరుణకి...... రమేషుకి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చర్చలు, అపోహలు విమర్శలు వాళ్ళలో ప్రారంభమయ్యాయి. ఏ ఒకరిద్దరి మినహా అందరూ అరుణ చేస్తున్నపని తప్పనే అభిప్రాయానికి తేలిగ్గానే వచ్చారు.    
    అయితే ఇదంతా అరుణ వెనకే. ఎదుటపడి అడిగే ధైర్యం కానీ విమర్శించే ధైర్యం కానీ ఎవరికీ లేదు. వెనక గుసగుస లాడ్డం, చెవులు కొరుక్కోవడం అరుణకి తెర వెనుక జరుగుతున్న ఈ భాగవతం ఏమీ తెలియదు. అసలు రమేషు గురించి, తన గురించి ఇలాంటి అపోహలు వస్తాయనిగాని, ఇలాంటి విమర్శలు వినవలసి వస్తుందని గాని, అసలు ఇలా తామిద్దరిని గురించి ఆలోచిస్తారనికాని అరుణ కలలో కూడా అనుకోలేదు. అసలు అంత దూరం ఆమె ఆలోచనలు వెళ్ళవు.    
    ఓ స్త్రీ పురుషునితో మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య తప్పకుండా ఏదో ఉందనే అభిప్రాయంతో మనుష్యులు ఉంటారనే విషయం అరుణ ఊహకి అందని విషయం. చిన్నప్పటినించి పట్టణంలో పెరిగి, మగవారితో సమంగా చదువుసంధ్యలు చదివి, పురుషుల మధ్యమసలడం అలవాటయిన అరుణ, తను రమేషుతో మాట్లాడడం లో అసలు తప్పు ఉందని ఎన్నడూ అనుకోలేదు.    
    ఆమె అనుకోకపోయినా ఊళ్ళో వాళ్ళందరికి అదో తప్పు కింద కనిపిస్తూందన్న విషయమూ ఆమె గ్రహించలేదు. రమేషుతో పరిచయమయిన కొద్ది రోజులలోనే రమేష్ వివాహితుడోకాడో, మాటల్లో అడిగింది అరుణ. అతనికి వివాహమయిందని, మూడు సంవత్సరాల కొడుకు ఉన్నాడని విన్నాక అరుణ తేలిగ్గా నిశ్చింతగా నిట్టూర్పు విడిచింది. సుబ్బారావుతో ఆమెకి అనుభవం జరిగాక, రమేష్ కూడా తనమీద అలాంటి ఉద్దేశాలు ఏమీ పెట్టుకోడని వివాహితుడని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది.    
    రమేష్ కేవలం ఆమె దృష్టిలో స్నేహితుడు మాత్రమే. రమేష్ భార్యతో సహా ఓసారి అరుణ ఇంటికి వచ్చాడు. రమేష్ భార్య విమల స్కూలు ఫైనలు పాసయింది. వాళ్ళ నాన్నగారూ భూస్వామే. విమలని పై ఊళ్ళో పెట్టి స్కూలు ఫైనలు వరకు చెప్పించారు తరవాత ఇంకా చదువుకుంటానంటున్నా, పల్లెటూరి వాసనలు ఇంకా పూర్తిగా పోనీ ఆమె తండ్రి ఆడదానికి అరుణ మాత్రం చదువు చాలని పెళ్ళి చేశాడు కూతురికి విమల అంత ఎక్కువ రంగు లేకపోయినా మొహంమంచి కళగానే ఉంటుంది. కాస్తూ కూస్తో చదువు విమలని చూసి సంతోషించింది.

 Previous Page Next Page