Previous Page Next Page 
అరుణ పేజి 39


    
    ఉదయం మణి ద్వారా సుబ్బారావుకి ఉత్తరం పంపింది అరుణ. ఆ ఉత్తరాన్ని సుబ్బారావు ఎలా స్వీకరిస్తాడోనని ఆమె మనసు ఆరాటపడింది.    
    రుక్కు మధ్యాహ్నం వస్తే ఏదో విధంగా మాటల్లో అడిగినట్లు సుబ్బారావు హావభావాలు ఎలా వున్నాయో రాబట్టాలి అనుకుంది అరుణ. కాని మధ్యాహ్నం మామూలుగా రుక్కు రాలేదు. సాధారణంగా ఏదన్నా ఒంట్లో బాగులేనపుడు కానీ, ఇంట్లో పనేదన్నా వుంటే కానీ రాకపోవడం అప్పుడప్పుడు అలవాటేగనుక రుక్కు రానందుకు ఆశ్చర్యపడలేదు అరుణ.    
    ఆ సాయంత్రం తోటలోకి వెళ్ళడమా, మానడమా అని కాస్త సందేహించింది అరుణ.    
    ఆ ఉత్తరాన్ని సుబ్బారావు ఏ విధంగా తీసుకున్నాడో? తేలిగ్గా తీసుకుంటే ఫరవాలేదు కానీ, ఏదో అవమానం జరిగినట్టు నొచ్చుకున్నాడేమో? కోపగించుకున్నాడేమో? అతన్ని సమాధానపరచడంతన కర్తవ్యం. ఉత్తరంలో రాసినా ఎదుటపడిముఖతా తనకలాంటి ఉద్దేశం లేదనిచెప్పితే అతను సంతుష్టుడవచ్చు. అసలు మామూలుగా ఈవేళ అతన్ని కలుసుకుంటే అతని మూడ్స్ ఎలా వున్నాయో చూస్తే తెలిసిపోతుంది. అతను మామూలుగా వుంటే ఏ బాధలేదు. కోపగించినట్లున్నా నొచ్చుకున్నట్టున్నా అతన్ని ప్రసన్నుడ్ని చేసుకోవాలి అతను తనకు ఎంతో చేశాడు. ఈ విషయం మూలంగా ఓ మంచిమిత్రుడిని దూరం చేసుకోకూడదు. ఎప్పటిలా ఇద్దరూ స్నేహితులుగా ఉండడానికే తను ప్రయత్నించాలి. అరుణ తోటకి వెళ్ళడానికి నిశ్చయించింది.    
    ఈ వర్షాకాలంవచ్చిందగ్గిరనించి అరుణ ఇదివరకులా తోటలోకి వెళ్ళడం కుదరడం లేదు. వర్షాలు, బురద, పొలాల నిండుగా నీళ్ళు, తోటలోకి వెళ్ళడం అంటే కష్టమే అందుచేత సుబ్బారావే అప్పుడప్పుడు ఇంటికే వచ్చికూర్చునేవాడు. వర్షం తెరిపి ఇచ్చి రెండుమూడు రోజులయ్యాక బురద అది లేనప్పుడు మాత్రం అరుణ తోటవైపు వెళ్ళేది. రెండురోజులనించి వర్షమేలేదు. మళ్ళీ రేపు వస్తే అసలు వెళ్ళడం కుదరదు. అతనంతట అతను ఇంటికి రావడానికి మొహమాటపడవచ్చు ఏం జరగనట్టు తనేముందు మాట్లాడితే అతనికి ఇబ్బంది ఉండదు అని అరుణ తోటకి బయలుదేరింది.    
    అరుణ తోటలోకి వెళ్ళేసైరకి సుబ్బారావు అప్పుడే పది నిమిషాలకి ముందువెళ్ళిపోయాడని అక్కడి కూలీలు చెప్పారు. అరుణకి కాస్త ఆశ్చర్యమనిపించింది బాగా చీకటి పడేవరకు సాధారణంగా పొలంలో, తోటలో ఏదో ఒక పని పురమాయిస్తూ ఉంటాడు సుబ్బారావు. పొలంలో తోటలో ఉన్నవాడికి చెయ్యాలోగాని బోలెడు పనులుంటాయి అనేవాడు. అంతేకాక రోజూ సాయంత్రం చీకటిపడేవరకు వుండడానికి కారణం తను వస్తుందేమోనని ఎదురు చూసి, రాదని తేలాక వెళ్ళిపోతానని సుబ్బారావే చాలా సార్లు అన్నాడు. ఈవేళ రోజుకంటే ముందుగా, తను వచ్చేవేళ దాటిపోక ముందేవెళ్ళిపోయాడంటే తనని తప్పించుకోవడానికి. తనని కలవడంఇష్టంలేక వెళ్ళిపోయాడన్న మాట. అంటే తనమీదకోపం వచ్చిందన్న మాట. పోనీ: అతని ఇంటికివెడితే? ఈ ఒక్కరోజులోనే ఎందుకిలా అనుకోవటం? ఒకవేళ ఇంకేదన్నా పని ఉండి వెళ్ళిపోయాడేమో? రేపూ చూసి నిర్ణయించవచ్చు. తొందరపడి నిర్ణయాలు ఎందుకు చేయడం అనుకుని అరుణ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం.
    
    అరుణ అనుకున్నట్టు గాక ఆ మర్నాడు కూడా సుబ్బారావు తోటలో కలవలేకపోయింది. అరుణ వెళ్ళేసరికి క్రితం రోజులాగే ముందుగానే ఇంటికివెళ్ళిపోయాడు సుబ్బారావు. ఆ మధ్యాహ్నం రుక్కు కూడా చదువుకోవడానికి రాలేదు. అరుణకి ఆశ్చర్యంవేసింది. అనుమానమూవచ్చింది. చూస్తుంటే సుబ్బారావుకి బాగానే కోపం వచ్చినట్టుంది. చెల్లెల్ని కూడా చదువుకోవడానికి పంపడానికి ఇష్టపడలేదన్న మాట. తనతో మాట్లాడడం ఇష్టం లేదన్న మాట ప్చ్: ఈ మనుషులు ఇంతలా ఓ చిన్నకారణానికి కూడా ఎందుకు మారిపోతారో? విరక్తిగా అనుకుంది అరుణ మధ్యాహ్నం రుక్కు ఎందుకు రాలేదోచూసి రమ్మని, పిలుచుకురమ్మని మణిని పంపితే మణి వెంటనే తిరిగొచ్చాడు. "వాళ్ళన్నయ్యగారు ఆవిడని చదువుకి మరి వెళ్ళక్కరలేదన్నారట! చదివింది చాలన్నారట, పాపం, రుక్కు అమ్మగారు చదువుసగంలో ఆగిపోయిందని విచారంగా చెప్పారు" అన్నాడు.    
    అరుణకి సుబ్బారావు తననిదూరంగా ఉంచుతున్నాడన్న విషయం అంత బాధ అనిపించలేదు గానీ రుక్కుని చదువుకు వెళ్ళవద్దనడం ఎక్కువ కష్టం కలిగించింది. ఎంతో కష్టపడి ఈ సంవత్సరంనించి చెప్పింది. ఓ స్టాండర్డు కి తెచ్చింది. ఇంకో ఆరు నెలలలో పరీక్షకి కట్టిద్దామనుకొంది. ఇప్పుడీ విషయంతో రుక్కు చదువు ముడిపెట్టాడన్న మాట. ఛీ: సుబ్బారావు మూర్ఖత్వానికి అరుణకి కాస్త కోపం వచ్చింది. అయినా తనేం చెయ్యాలో తోచలేదు. అతన్ని ఓసారి ఎలాగైనా కలవాలి. ఆ రోజు తోటనించి తిరిగి వచ్చాక చీకటిపడిపోయిందని మర్నాడు వెళ్ళి సుబ్బారావుని కలుసుకుని ఎలాగైనా అతనికి అన్నీ వివరించి సౌమ్యుడిని చేసుకోవాలి.    
    అరుణ ఈ విషయం ఎంత సౌమ్యంగా పరిష్కరించాలని ఆలోచించినా, సుబ్బారావు అరుణకి ఆ అవకాశం ఈయలేదు. మర్నాడు వెడితే సుబ్బారావు ఇంటిలో లేడు. రుక్కుని అడిగితే అన్నయ్య కోపంగా చదువుకి మరివెళ్ళనక్కరలేదన్నాడన్న మాట తప్పితే మరేం చెప్పలేకపోయింది. సుబ్బారావు తల్లిఅదోరకం అయోమయం మనిషి ఆవిడ పని, ఆవిడ గోల ఆవిడది తప్ప సుబ్బారావు ఎందుకు రుక్కుని వెళ్ళక్కరలేదన్నారో ఆవిడ ఏం చెప్పలేకపోయింది. "ఏమోనమ్మా? నాకేం తెలుసుతల్లీ? వాడెలాగ అంటే అలా చేయవలసిన వాళ్ళం.    
    మాకేం ఈ చదువులు తెలుసాపాడా?  రోజు వాడేవెళ్ళమన్నాడు. ఈ రోజు వాడే వద్దన్నాడు. వాడు వద్దన్న పనిచేస్తే అంతెత్తు ఎగురుతాడు" అంది అమాయకంగా వాళ్ళని ఇంకా అంతకంటే ఏమడిగినా లాభంలేదని అరుణకి తెలిసినిస్పృహగా ఇంటికి తిరిగి వచ్చింది. తరవాత మరి రెండుమూడు రోజులు వర్షం నించి బయటికి కదలడమే పడలేదు అరుణకి.    
    నాలుగైదురోజులకి ఆఖరి సారిగా సుబ్బారావుతో మాట్లాడిచూడాలన్న ఉద్దేశంతో అరుణ తోటలోకి వెళ్ళింది. అరుణ తోటలోకి అడుగుపెట్టడం చూసి సుబ్బారావు చూడనట్టుగా గబగబ పెద్ద పెద్ద అంగలు వేస్తూ మరో వైపునించి వెళ్ళిపోయాడు, అరుణ పిలిచే లోపలే మరోసారి అరుణ తోటలోకి అడుగు పెడుతూంటే అప్పుడే పైకి వస్తున్న సుబ్బారావు తడబడి గబగబ తప్పుకునివెళ్ళిపోయాడు.    
    "సుబ్బారావుగారూ ఏమిటీ అన్యాయం? నేను వస్తూంటే మీరు చూసికూడా వెళ్ళిపోతున్నారేమిటి?" అరుణ తమాషాగా అంటూ మాట కలపబోయింది.    
    సుబ్బారావు మాట్లాడకుండా ఎర్రగా మొహం చేసుకుని వెళ్ళిపోయాడు. అరుణ నివ్వెరపోయింది. సుబ్బారావుకి ఎంతమాత్రం తనని కలుసుకోవడం, మాట్లాడడం ఇష్టంలేదని స్పష్టపడిపోయింది. అరుణకి కోపం వచ్చింది. "ఇంత మూర్ఖత్వ మేమిటి ఇతనికి? తన కోరిక నెరవేరలేదని ఇంత కోపమా? ఇంత కసా? ఛీ: అంత లెక్క అతనికి లేకపోతే తనుమాత్రం ఊరికే అతనికోసం ఎందుకు ప్రాకులాడాలి ఏదో తనకు అనేక విధాల సహాయం చేశాడన్న కృతజ్ఞతతో తను అతనితో స్నేహం దూరం చేసుకోకూడదని భావిస్తుంది కాని, ఆ మనిషికి ఇదేమీ పట్టనట్టుంది పోనీ, అతని కంత అయిష్టం అయితే అతని వెంతబడి అతన్ని తను విసిగించడం ఎందుకు?    
    అరుణ నిర్లిప్తంగా ఇంటి ముఖంపట్టింది. ఆ వ్యవహారం ఎంత తేలిగ్గా తీసుకుందామని ప్రయత్నించినా అంతరాంతరాలలో అరుణకి ఆ సంఘటన చాలా మనస్తాపమే కలిగించింది.    
    ఆ మనస్తాపం మరో పది రోజులకిమరింత పెరిగింది. ఆరోజుఅరుణ ఎవరి ఇంటికో పేషెంటుని చూడడానికి వెళ్ళి ఆ ఇంటి మెట్లుదిగుతుంటే ఎదురుగారోడ్డుమీద సుబ్బారావు కనిపించాడు. ఈ మధ్య జరిగిన సంగతి మరిచి అరుణ మామూలుగా, "సుబ్బారావుగారూ" అంటూ ఉత్సాహంగా పలకరించి, అతని పక్కన నడవడం మొదలెట్టింది.    
    "ఏమండీ, ఏమిటి ఎక్కడా కనబడడంమానేశారు:" అంటూ చనువుగా అడిగింది.    
    సుబ్బారావు అరుణని చూస్తూనే ముఖం గంటుపెట్టుకుని ఎటూ పారిపోయే దారి లేక ఆమెతో నడవక తప్పదన్నట్టు నడుస్తున్నాడు. అరుణ ప్రశ్నకి అదోలా నవ్వుతూ. "మరెందుకు కనపడడం? నా అవసరం మరి మీకు వుండదనికనబడలేదు:" అన్నారు.    
    "అదేమిటి, అలా మాట్లాడుతున్నారు?" తెలతెల్లపోతూ అడిగింది అరుణ.    
    "అవును మరి ఈ పల్లెటూరి బడుద్డాయి అవసరం మీకేమి ఉంటుంది? మిమ్మల్ని మరపించే స్నేహితులు దొరికారు. ఇంక నా అవసరం, నేను మీకు చేసే దేముంటుంది? వస్తా పనుంది. మీలాంటిగొప్పవారి ముందు, చదువుకున్నవారి పక్కన నిలబడే అర్హతలు నాకు ఏమున్నాయి: తాహతెరుగకుండా ఎగబడ్డం నాదే తప్పని తెలిసింది లేండి ఇప్పుడు" అంటూనే గబగబవెళ్ళిపోయాడు.    
    అరుణ నిర్ఘాంతపోయి రోడ్డుమీద ఒక్కక్షణం నిలబడిపోయింది. సుబ్బారావు అన్నమాటలు అర్ధం చేసుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది ఆమెకి అర్ధం అయ్యాక ఆవేశంతో ఆమె అడుగులు గబగబపడ్డాయి ఇంటివరకు.    
    'ఛీ ఈ సుబ్బారావు సహృదయుడు. అట్టే చదువుకోకపోయినా సంస్కారి అని, ఓ మంచి మిత్రులు అని నమ్మింది. ఇతని అసలు స్వరూపం యిప్పుడు బయట పెట్టుకున్నాడు.    
    ఈ అసూయ, కుళ్ళు అంత తను రమేష్ తో మాట్లాడుతూందని అసలు రమేష్ నించే అతన్ని వివాహము చేసుకోవడానికి తిరస్కరించాననుకుంటున్నాడేమో? ఏం మనిషి తనకి చదువు ఉద్యోగం లేవని రమేష్ కి అవి వున్నాయని, అవి లేవని తనని తిరస్కరించి రమేష్ వెంట తనుపడిందని ఊహిస్తున్నట్లున్నాడు సుబ్బారావు. ఇంత కుత్సితపుబుద్దా: నిజానిజాలు తెలుసుకోకుండా రమేష్ తో మాట్లాడిందని ఎంత తేలిగ్గా తన గురించి అంచనా వేశాడు: ఇలాంటి మనిషితో ఇంకా ఎలాగో అలాగ బంధం నిలుపుకోవాలని ఆరాటపడ్డం తనది బుద్దితక్కువ:'    
    అరుణ మనసు ఆ సంఘటనతో విరిగిపోయింది. సుబ్బారావు మాటలతో పూర్తిగా విరక్తి వచ్చి మరి సుబ్బారావుతో మాట్లాడడంగాని, అతని సంగతి పట్టించుకోవడంగానీ మానాలని నిర్ణయించుకుంది.    
                                                                        * * *

 Previous Page Next Page