"ఈ రోజు నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు జయచంద్ర.
లూసీ మౌనంగా చూసింది.
"ఈ రోజు మా మ్యారేజ్ డే!" అన్నాడు ఏ భావం లేకుండా.
"మెనీ హేపీ రిటర్న్స్..."అని అతని మొహంలోకి చూసి ఆగిపోయింది లూసీ.
"ముంగిట నిలబడి మృత్యువు రారమ్మని పిలుస్తూవుంటే వెళ్ళలేక, వెళ్ళలేక వెళ్ళడానికి సిద్దం అవుతున్న ఆమెని....ఎలా కన్ సోల్ చెయ్యాలో నానాటికీ అర్ధం కాకుండా పోతోంది" బాధగా కణతలు రుద్దుకుంటూ అన్నాడు జయచంద్ర.
"మీరు ధైర్యం తెచ్చుకోవాలి సర్!" పెద్దమనిషితరహాగా అంది లూసీ.
"ఎలా....ఎలా....?" ఆవేశంగా అన్నాడు. "ఏమని ధైర్యం చెప్పను? 'కార్డియో మయోపతీ' అనే జబ్బు నీకు రాలేదు డాక్టర్లు అబద్దం చెప్పారనా? నువ్వు మింగే రంగు రంగుల బిళ్ళలవల్ల నీకు పూర్తిగా తగ్గిపోతుందనా? లేక అనుక్షణం యాతనపడుతూ నువ్వు ఇలాగే మంచంలో పడి నూరేళ్ళు బ్రతకాలనా? ఏమని చెప్పను? ముఖంమీద చిరునవ్వుల ముసుగులు వేసుకుని గుండెల్లో బడబానలాన్ని దాచుకుని అందరం గొప్పగా నటిస్తూ తిరుగుతున్నాం! ఎంతకాలం?"
ఆ మాటకి లూసీ ఠక్కున తలెత్తి చూసింది. "ఎంతకాలం?" అంటే ఏమిటి అతని వుద్దేశ్యం? ఎంతకాలం ఆమె బ్రతుకుతుందనా?
లూసీ చూపు వాడిగా తాకినట్లయి జయచంద్ర సర్దుకున్నాడు.
"ఓ.....నా తల పగిలిపోతోంది. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడంలేదు" అన్నాడు బాధగా.
"ఇట్స్ ఓకే సర్! సమస్యలు మనసులో వుంటే మనసుని బలహీనపరుస్తాయి. బయటికి వచ్చేస్తే అవే బలహీనమవుతాయి" అంది లూసీ.
"రైట్.....ఐ విల్ మేక్ ఏ మూవ్" అంటూ జయచంద్ర కోటు అందుకున్నాడు.
"సర్...." అని సందేహంగా ఆగిపోయింది లూసీ.
"యస్...." చెప్పమన్నట్లు చూశాడు జయచంద్ర.
"మనసు మనల్ని బలవంతుల్నీ చెయ్యగలదు. బలహీనుల్నీ చెయ్యగలదు! ఆ మనసుని అదుపులో పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. మీకు చెప్పే అర్హత లేకపోయినా, వయసు వుంది కాబట్టి చెపుతున్నాను. జీవితం ఏ ఒక్కరి పూలపాన్పు కాదు. కష్టపడి పూలని సాధించి మనమే తయారుచేసుకోవాలి. ఉన్నంతలో సంతోషాన్ని వెతుక్కోవాలి. ఐ విష్ యూ ఏ మెమెరబుల్ ఏనివర్సిటీ సర్!" చివరిమాటకి ఆమె కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.
"లూసీ.....థాంక్యూ.....థాంక్యూ వెరీమచ్" కొద్దిగా కదిలిపోయినట్లు అన్నాడు జయచంద్ర.
అతను వెళ్ళిపోతూ వుంటే అటే చూస్తూ నిలబడింది లూసీ.
కోటి కోర్కెలతో కొత్త పెళ్ళి కూతురిగా జయచంద్ర ప్రక్కన ఠీవిగా నిలబడిన కాంచనని మొదటిసారి చూడగానే 'మేడ్ ఫర్ యీచ్ అదర్' అనుకుంది లూసీ ఆ కపుల్ కి ఇలాంటి పరీక్ష ఎందుకు పెడుతున్నాడో ఆ భగవంతుడు! సేవ్ దెమ్ మైలార్డ్' అని భారంగా నిట్టూర్చింది.
* * *
పట్టుచీర అంచులు కాళ్ళలలో అడ్డుపడుతుంటే వాటిని ఓ చేత్తో పైకి ఎత్తిపట్టుకుని, ఇంకో చేత్తో కొబ్బరికాయా, పూవులూ, అరటిపండ్లూ వున్న పూలసజ్జ పట్టుకుని నడుస్తున్న సంధ్య వెనక్కి తిరిగి "అదేమిటీ అలా నిలబడిపోయావు? రా, చాయా....." అంది.
కారుకి ఆనుకుని నిలబడ్డ చాయ ఆ ప్రశ్న వేసిన సంధ్యనీ, ఎదురుగా కనిపిస్తున్న గుడినీ, ఓసారి చూసి, "వద్దులే! మనకీ ఆయనకీ పడదు....నువ్వెళ్ళిరా.....నేను ఇక్కడే నిలబడతాను" అంది.
"తప్పు!" సంధ్య చెంపలు వేసుకుంది. "అలా అనకూడదు. భగవంతుడితో పంతం ఏమిటీ? నేను చెపుతున్నాగా రా అలా గుడిదాకా వచ్చి లోపలికి రాకుండా వుండకూడదు" అంది భయంగా.
చాయ చిన్నగా నవ్వి "నేను ఎప్పుడూ రాలేదు నీకోసం వస్తున్నాను ఊరికే నిలబడతాను అంతే!" అంది.
"సరే!" అంతమాత్రానికే చిన్నపిల్లలా సంతోషపడిపోతూ అంది సంధ్య.
"సంధ్యా! ఇలా ప్రతీ శుక్రవారం గుడికొస్తావు కదా! ఆ దేవుడు నీ కోర్కెలు తీరుస్తున్నాడా?" అడిగింది చాయ.
సంధ్య ముఖంలో దిగులు మబ్బు ఆవరించినట్లుగా నిశ్శబ్దంగా అయిపోయింది.
"కోర్కెలు తీరితే దేవుడి దయ అనీ, తీరకపోతే విధి లిఖితం అని సరిపెట్టుకుంటారు కదూ?" కవ్విస్తున్నట్లుగా అంది చాయ.
సంధ్య తలతిప్పి చయవైపు చూస్తూ "జరిగేది జరగక మానదు చాయా! కానీ ఏ పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడి వాటిని భరించే ఆత్మస్థైర్యం ప్రసాదించమని ఆ పరమాత్ముడిని వేడుకోవడానికి రావాలి" అంది.
"గొప్ప కర్మసిద్దాంతం చెప్పావు సంధ్యా! అలా వేడుకోవడానికి ఇంతదూరం రావాలా? నీ ఇంట్లో కూర్చుని ఆయనతో మాట్లాడే సాధనం ఏదీలేదా?" హేళనగా నవ్వుతూ అంది చాయ.
"ఆయనకు వినపడనిదీ, తెలియనిదీ ఏదీలేదు చాయా! మననుంచి మనం పారిపోయి ప్రశాంతతని పొందడానికే ఈ ప్రయత్నం. ఇంట్లో కూర్చునీ నామం జపించవచ్చు. గుడిలో కూర్చునీ జపించవచ్చు. ఇంట్లో కూర్చుని ధ్యానం చేస్తుంటే నీకు తెలియకుండానే నీ ధ్యాస గుమ్మంలో అలికిడైందనో, టెలీఫోన్ మోగుతుందనో, ఎవరో పిలుస్తున్నారనో పోతూ వుంటుంది. అదే ఇలా దూరంగా వచ్చి నీకు తెలియని, నిన్ను ఎవరూ కదిలించని పరిసరాల్లో కూర్చుంటే నీకు మనశ్శాంతి లభిస్తుంది. అదే మెడిటేషన్."
చాయ మాట్లాడకుండా సంధ్య వెంట నడవసాగింది.
పూజారి సంధ్యని చూడగానే పరుగు-పరుగున ముందుకు వచ్చి "రండమ్మా....దయ చెయ్యండి" అని ఆమె చేతిలోని బుట్ట అందుకున్నాడు.
"నాన్నగారి పేరున అర్చన చెయ్యండి" అంది సంధ్య.
ఒళ్ళంతా నగలు పెట్టుకుని ఆడంబరంగా వున్న దేవుడ్ని పరీక్షగా చూస్తూ నిలబడింది చాయ.
పూజారి జయచంద్రా, కాంచనా, సంధ్యల పేర్లు ఉచ్చరిస్తూ గోత్ర నామాలతో పూజ చేస్తున్నవాడల్లా ఆపి-
"ఈ అమ్మాయిగారి పేరు?" అని చాయను చూపించాడు.
"చాయ" చెప్పింది సంధ్య.
"చాయా నామధేయస్యా....ఆ......మీ గోత్రం చెప్పండమ్మా?" అడిగాడు చాయవంక చూస్తూ.