Previous Page Next Page 
ఖజురహో పేజి 39


    "అక్కర్లేదు" అని చాయ దిగి వేగంగా ఓ సందులోకి వెళ్ళిపోయింది.
    
    "అమ్మాయిగారూ పోదామా?" అడిగాడు డ్రైవర్.
    
    "ఆ సందులోకి పోనీ....మనం కూడా చాయ హాస్టల్ కి వెళ్ళాలి" స్థిరంగా అంది సంధ్య.
    
    డ్రైవర్ ఏదో అనబోయి మళ్ళీ వూర్కుని కారు సందులోకి పోనిచ్చాడు.
    
    వరండా మెట్లు ఎక్కుతున్న చాయ "చాయా" అన్న సంధ్య పిలుపునకు తలతిప్పి విస్మయంగా చూసింది.
    
    సంధ్య చయవైపు గబగబా అడుగులు వేసి "నువ్వు వద్దన్నా నీ ఆతిథ్యం కోసం వచ్చిన అతిథిని పొమ్మంటావా?" నవ్వుతూ అడిగింది.
    
    చాయ ముఖంలో ఏ భావం లేకుండా "రా!" అని ముందుకు నడిచింది. మనసులో మాత్రం 'ఇదీ ఒకందుకు మంచిదే....పొయ్యిమీద పెట్టక్కర్లేకుండానే సెగ తగిలితే చాలు, కరిగిపోయే వెన్నపూసలాంటిది దీని మనసు. 'రాత్రంతా ఆ చెట్లు నిలబడే వుంటాయి పాపం!' అని కన్నీళ్లు కార్చే పిచ్చిముండ దానంతట అదే పొయ్యి వెతుక్కుంటూ వచ్చింది......రా.....చెప్తా' అనుకుంది.
    
    సంధ్యకి అదంతా ఒక వింత ప్రపంచంలా వుంది. ఇంతమంది ఆడపిల్లలు రకరకాల వయసులవాళ్ళు అలా ఒకేచోట గుమిగూడి వుండడం తమాషాగా అనిపించింది.
    
    "ఏయ్ చాయా.....ఎవడితో పోయావే? చాల అలసటగా కనిపిస్తున్నావు?" కన్ను కొడుతూ అడిగింది మేరీ.
    
    సంధ్య ఆశ్చర్యంగా చూసింది. ఆడపిల్లలు అలా బరితెగించి మాట్లాడతారని ఆమెకు తెలీదు.
    
    మాయ వరండాలో కాళ్ళు జాపుకుని కూర్చుని ఒక అమ్మాయితో వీపు గోకించుకుంటోంది. ఆ అమ్మాయి సంధ్యనీ, చాయనీ చూస్తూ గట్టిగా గీకేసరికే "నీయమ్మ.....ఓ బూతుమాట తిట్టి, "ఏమే చాయా.....ఈ పిల్లెవరు? కొత్తగా వచ్చిందా? ఎవడు మోసం చేసి వదిలిపెట్టాడుటా?" అని పెద్దగా నవ్వింది.
    
    "షటప్!" అంది చాయ.
    
    "ఓయబ్బో ఇంగ్లీషు! కాలేజీ చదువులు చదువుతోందిగా మరి. చదువు.....చదువు....ఇంగ్లీషు మాట్లాడితే మామూలుకన్నా నాలుగు ఎక్కువ డబ్బులే రాలుస్తాడులే ఎవడైనా" అక్కసుగా అంది మాయ.
    
    సంధ్య విననట్లే చాయవంక చూసింది.
    
    చాయ తలవంచుకుని మౌనంగా నడుస్తోంది.
    
    ముక్కులు బద్దలుకొట్టే కంపు వస్తున్నవైపు చూపిస్తూ "ఇంత మందికీ కలిసి ఆ నాలుగు టాయ్ లెట్లు" అంది.
    
    సంధ్య ముఖంలో జాలితో కూడిన అసహ్యం చోటుచేసుకుంది. ఆమె హాస్టల్ అంటే సోఫిస్టికేటెడ్ గా తను ఊటీలో చదివిన స్కూల్లా ఊహించుకుంది.
    
    "ఇదే మా గది......ఆ మూల నేనూ, ఇదిగో ఇక్కడ మంగళా..... ఆ చివర కోమలా పడుకోవాలి.....కప్పుకోడానికీ, పరుచుకోడానికీ ఏమీ వుండవు...." అంది.
    
    అక్కడక్కడా గచ్చు వూడిపోయి దుమ్ముతో నిండివున్న అ అగడి జైలుగదిలా కనబడింది.
    
    "పద.....మా భోజనశాల చూపిస్తాను" అంటూ మెస్ కి తీసుకెళ్ళింది చాయ.
    
    నేలంతా జిడ్డుగా మురికిగా వున్నచోటే బియ్యం కుప్పగా పోసి వున్నాయి. ఇంకోపక్క కూరగాయలు తరుగుతూ బూతుజోకులు చెప్పుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. చెమటలు కారిపోతుండగా పచ్చడి రుబ్బుతున్న నల్లని కొండలాంటి వంటవాడు" అప్పుడే వచ్చారేం మెక్కడానికి? ఇంకా గంట కాలా" అన్నాడు.
    
    కూరలు తరుగుతున్న ఓ అమ్మాయి చేతినిండా రసికారుతున్న పుండ్లు వున్నాయి. వాటిమీద ఈగలు ముసురుతున్నాయి.
    
    సంధ్యకి ఆ దృశ్యం కడుపులో తిప్పింది.
    
    ఎక్కడ చూసినా పేలు కుక్కుకుంటూ, గోక్కుంటూ, పోట్లాడుకుంటూ, అశ్లీలమయిన భాష మాట్లాడుకుంటూ కనిపించారు అమ్మాయిలు. హాస్టల్ లో వార్డెన్ లేకపోతే బరితెగించినట్లు చేస్తుంటారు.
    
    "మసక మసక చీకట్లో....మల్లెతోట వెనకాల...." కర్ణకఠోరంగా పాడుతూ డాన్స్ చేస్తోంది ఓ అమ్మాయి. మిగతావాళ్ళు చప్పట్లు కొడుతూ అరుస్తున్నారు. ఆయా తిడుతున్నా పట్టించుకోవడంలేదు.
    
    ఇద్దరమ్మాయిలు క్రిందపడి కొట్టేసుకుంటున్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ వెనక్కి పోకుండా భీకరంగా, పొట్టేళ్ళలా తలలతో ఢీకొట్టుకుంటున్నారు. ఓ అమ్మాయి ఓణి చింపేసింది అవతలి అమ్మాయి. ఆ అమ్మాయి వెంటనే ఆమెమీద పడి జాకెట్టు సర్రున చింపేసింది. ఇద్దరూ అలా సగం సగం బట్టలతోనే సిగ్గులేకుండా పోట్లాడుకుంటున్నారు. చెంపలమీద నుండి రక్తాలు కారిపోతున్నాయి.
    
    "అయ్యో....ఎవరూ ఆపరేం? ఎందుకలా పోట్లాడుకుంటున్నారు?" కంగారుగా అడిగింది సంధ్య.
    
    "ఇది చిరంజీవి బావుంటాడంటే, ఇది కాదు రజనీకాంత్ బావుంటా డంది" ఓ అమ్మాయి సమాధానం యిచ్చింది.
    
    "ఆ!" సంధ్య ఆశ్చర్యంతో నోరు తెరిచేసింది.
    
    చాయ ఇదంతా తనకు రోజూ అలవాటే అన్నట్లు నిర్లిప్తంగా చూసింది.
    
    "చాయా.....ఇటువంటి వాతావరణంలో నువ్వు ఎలా చదువుకుంటున్నావు?" సంధ్య బాధగా అంది.
    
    "ఏం చెయ్యను? తక్కువ నోములునోచి ఎక్కువ ఫలాలు అనుభవిస్తామంటే ఎలా? కుదరదు" సంధ్య ముఖంలోని భావాలనే గమనిస్తూ అంది చాయ.
    
    సంధ్య గబుక్కున ముందుకి వచ్చి చాయ చేతిని గట్టిగా పట్టుకుని "నో! నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళలేను. నువ్వు ఇక్కడ వుండకూడదు పద.....నాతో నడు. మన ఇంటికి పోదాం! ఇది జైలుకన్నా ఘోరంగా వుంది" అంది.
    
    "ఒకరోజూ రెండు రోజులతో తీరే సమస్య కాదు! జీవితాంతం నన్ను ఎవరు వుంచుకుంటారు?" కన్నీళ్ళతో అంది చాయ.
    
    "జీవితాంతం ఎందుకు? నీ కాళ్ళమీద నువ్వు నిలబడేవరకూ చాలు పద డాడీతోచెప్పి నీకు ఏదయినా ఉద్యోగం ఇప్పిస్తాను.....ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చు. అందాకా మా ఇంట్లో వుందువుగాని.......ఇంకేం చెప్పకు పద" ఆవేశంగా అంది సంధ్య.
    
    "మరి మీ అమ్మా-నాన్నా..."
    
    "నా మాట వాళ్ళు కాదనరు నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు" నమ్మకంగా అంది సంధ్య.
    
    "నిజమా!?" వెలుగుతున్న కళ్ళతో అని "సంధ్యా! యూ ఆర్ ఏన్ ఎంజిల్" అని బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది చాయ.
    
    ఎక్కడినుంచో ఓ గుడ్లగూబ భయంకరంగా అరిచింది.
    
                                                * * *

 Previous Page Next Page