Previous Page Next Page 
సంకల్పం పేజి 39

 

       "ఓ.కె. అలాగే.... నర్సింహమూర్తిగారూ.... శివమూర్తిగారి నొకసారి కలవండి. రేపన్నించి రావోయ్..." కిషన్తో అన్నాడు వికాస్. వికాస్ లేచి టాయ్ లెట్ వేపెళ్ళాడు.
   
    అదే సమయంలో చయనులు వచ్చి కూర్చున్నాడు. ప్రక్కన పెట్టిన రిసీవర్ని తీసి ఫోన్ మీద యధాస్థానంలో ఉంచాడు.
   
    ఒక్క నిమిషంలో...
   
    ఫోన్ గణ... గణ....గణమని మ్రోగింది.
   
    గబుక్కున చయనులు తీశాడు.
   
    "లవ్ స్టాంప్ గురించి చెప్పనా..."
   
    అమ్మాయి గొంతు వినగానే కంగారు పడిపోయాడు చయనులు.
   
    ఏవో మరి... ఆ స్టాంపులేవో వికాస్ తెప్పించమన్నట్టున్నాడు.
   
    "ఆ స్టాంపుల గురించి నాకేం తెలీదమ్మా..." ఆ గొంతు వినగానే ఫోన్ టక్కున పెట్టేసింది లిఖిత.

    అంతలో వికాస్ వచ్చి కూర్చున్నాడు.
   
    "ఏవయ్యా.... ఏవో స్టాంపులు తెప్పించమని ఎవరికైనా చెప్పానా..." చయనులు అడుగుతున్నదేమిటో అర్ధం కాలేదు వికాస్ కి.
   
    "ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది... ఏవో స్టాంపులనీ అంది..."   

    "స్టాంపులా..." వెంటనే అర్ధమైంది వికాస్ కి.
   
    "రెవెన్యూ స్టాంపులు పంపమని చెప్పానులే!" సర్దేశాడు వికాస్.
   
    "సాయంత్రం ఇంటికెళ్తున్నాను.... మళ్ళీ సోమవారం ఉదయాన్నే వచ్చేస్తాను....అర్జంటు పనులేవీ లేవు కదా."
   
    "వెళ్ళు.... మరిచిపోయాను మావయ్యా.... నాన్ననీ, అక్కయ్యల్నీ ఇక్కడకు తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను ఏమంటావ్..." అని అడిగాడు వికాస్.
   
    "తీసుకొచ్చెయ్.... ఆ విషయమే, నేనూ నీతో చెప్దావనుకున్నాను."
   
    "అయితే.... నువ్వో పని చెయ్యాలి. ఇంటికెళ్ళి, అక్కడి వ్యవహారాలన్నీ సెటిల్ చేసి, నీతో పాటూ వాళ్ళని తీసుకొచ్చెయ్. ఈలోపల... నేనో ఇల్లు చూస్తాను."
   
    "అలాగేరా.... ఇన్నాళ్ళకి మీరందరూ ఒక్కచోట ఉండే అవకాశాన్ని కల్పించిన భగవంతుడికి మొక్కుకుంటున్నాన్రా. నిజంగా ఇవాళ చాలా ఆనందంగా ఉందిరా. ఈ సమయంలో మీ అమ్మే గనక వుంటే...." చెమర్చిన కళ్ళను తుడుచుకున్నాడు.
   
    "ఖర్చులకుంచు..." ఓ రెండువందలు తీసి, చయనులు కిచ్చాడు వికాస్. తల్లి గుర్తుకు రాగానే తడిదేరిన కళ్ళను మూసుకుంటూ.
   
                                      *    *    *    *    *
   
    ఫోన్ గణ... గణమని మ్రోగింది. వెంటనే ఎత్తి-
   
    "ఇప్పుడు చెప్పండి మీ లవ్ స్టాంప్ విషయం..." అన్నాడు వికాస్.
   
    "లవ్ స్టాంపా.... ఏంట్రోయ్..... అది..." అవతలి గొంతు లిఖితది కాదు. లిఖిత ఫోనే అనుకుని, వెంటనే మాట్లాడాడు. అవతలి వ్యక్తి జగన్మోహన్.
   
    నాలిక్కరుచుకున్నాడు వికాస్.
   
    "సారీ భాయ్ చెప్పు...." అప్పటికే పసికట్టాడు జగన్.
   
    గురుడు లవ్ స్టాంపులంటున్నాడు. అంటే ఎవరితోనైనా ప్రేమలో పడుతున్నాడా?
   
    "స్టీరింగులూ, బేరింగులూ అని వినాల్సిన చోట, లవ్వులు, స్టాంపులూ అంటున్నావ్.... ఏంది కత..." అన్నాడు జగన్.
   
    "అలాంటిదేం లేదు కానీ.... నువ్వెళ్ళిన పని ఏవైందో చెప్పు...." అడిగాడు వికాస్.
   
    "ఇక్కడందర్నీ కలిశాను. ఇక్కడ జగన్నాధ మిశ్రా అని ఓ డీలరున్నాడు. ఆయన నీతో మాట్లాడుతానంటున్నాడు. ఎప్పుడు రమ్మంటావ్...." అడిగాడు జగన్.
   
    "మంగళవారం రమ్మను."
   
    "రాత్రి కొచ్చేస్తాను.... ఉంటా... నేను రాగానే... ఆ లవ్ స్టాంపుల గురించి ఎవరితో చర్చిస్తున్నావో చెప్తావా."
   
    "అలాగే.... రా..." ఫోన్ పెట్టేసిన, అయిదు నిమిషాలకు మళ్ళీ ఫోన్ మ్రోగింది.
   
    లిఖిత.
   
    "ఇప్పుడు మీరొక్కరే ఉన్నారు. మీ చుట్టూ ఎవరూ లేరు. నేనడిగిన వాటన్నిటికీ మీరిప్పుడు జవాబులు చెప్తారు... అవునా...."
   
    "కొత్తగా హిప్నటిజం ప్రాక్టీసు చేస్తున్నారా..." అడిగాడు నవ్వుతూ.
   
    "అవును. మీకోసం కష్టపడి పదిహేనురోజులు నేర్చుకున్నాను." చెప్పింది లిఖిత.
   
    "మిమ్మల్ని మొట్టమొదట చూసి, చాలా సీరియస్ మనిషనుకున్నాను. చాలా సిల్లీ...." ఏదో అనబోయాడు.
   
    "లేకపోతే మీలా మూడీగా ఉండాలా?" ఎదురు ప్రశ్న వేసింది లిఖిత.
   
    "మీరీ మధ్య నా కల్లో కొచ్చారు."
   
    "ఎలా నేనిక్కడే ఉన్నానే..... ఎటూ వెళ్ళలేదే...."
   
    తనంటే ఇష్టమని ఇవాళ ఎలాగైనా వికాస్ చేత చెప్పించాలి. నిశ్చయించుకుంది లిఖిత.
   
    "అబ్బాయిగారు..... జోక్స్ వెయ్యగలరే."
   
    "అమ్మాయిగారే వేయిస్తున్నారు."
   
    "వికాస్. మిమ్మల్ని ఇప్పుడో ప్రశ్న వేస్తున్నాను. దానికి ఏమాత్రం దాచకుండా జవాబు చెప్పాలి."
   
    "అడగండి."
   
    "మీ కిష్టమైన ఏడుగురి వ్యక్తులు లేదా వస్తువుల పేర్లు చెప్పండి. ఉదాహరణకి, మీ మావయ్యంటే మీకిష్టం. అలాగే ఏదో పువ్వు ఇలా అన్నమాట. చెప్పండి.... ఆ వస్తువులు మీకెందుకిష్టమో కూడా చెప్పాలి. అర్ధమైందా..."
   
    "మా అమ్మగారు.... ఎందుకంటే...."
   
    "దీనిక్కారణం అక్కర్లేదు. రెండోది చెప్పండి" అంది లిఖిత.
   
    "మా మావయ్య.... ఎందుకంటే...."
   
    "దీనికి కారణం తెలుసు.. మూడు."
   
    "నేను చిన్నప్పుడెప్పుడో చూసిన కారు- ఎందుకంటే అలనాటి ఆ కారే ఈనాటి ఈ నా ఉన్నతికి కారణం."
   
    "నాలుగు.... సముద్రం.... సముద్రాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు దాని అది, అంతం ఎక్కడున్నాయో వెతకాలనిపిస్తుంది. ఒక విషయాన్ని శోధించాలనే తపన కలగడానికి నన్ను ఉత్తేజితుడ్ని చేస్తున్నది..... సముద్రమే.... వింటున్నారా..."

    "వింటున్నాను.... నోట్ చేసుకుంటున్నాను.... చెప్పండి- చెప్పండి"
   
    "అయిదు.... ఆకు సంపెంగ పువ్వంటే నాకిష్టం. ఎందుకంటే చిన్నప్పుడు దాన్ని చూసి ఆశ్చర్యపోయాన్నేను .....మధురమైన వాసన వేసే ఆకులుంటాయా అని, తర్వాత తెలిసింది- అదొక ఆకులాగుండే పువ్వని."
   
    "ఆరు... లీ అయకోకా జీవిత చరిత్ర పుస్తకం నాకిష్టం. ఒక వ్యక్తి అట్టడుగు నుంచి ఎలా కష్టపడి పైకొచ్చాడో ఆ పుస్తకం చెపుతుంది.... ఒక వ్యక్తిలోని శక్తిని ఎలా సక్రమమైన మార్గంలో పెట్టొచ్చో.... ఆ పుస్తకం ద్వారానే నేర్చుకున్నా నేను..... అయిపోయాయి కదా..." ఆగాడు వికాస్.
   
    "ఇంక ఏడవది చెప్పాలి మీరు" అంది లిఖిత.
   
    లిఖితంటే ఇష్టం అనే పాయింట్ కావాలి లిఖితకు. ఇప్పుడు వికాస్ చేపెప్ది అదేనని ఆమె భావన. ఆ ఏడవది ఏం చెప్పాలోనని ఆలోచిస్తున్నాడు. ముసురుకుంటున్న ఎన్నో ప్రశ్నల వెనక ఎన్నో జవాబులు.
   
    "మానవ దేహంలో కళ్ళు అనే అవయవం నాకిష్టం. ఎందుకంటే కళ్ళులేని మనిషిని వూహించి చూడండి మీరు...... దుఃఖాన్నిగ్గానీ, సంతోషాన్నిగ్గానీ, నిరాశగ్గానీ, ఆశగ్గానీ కళ్ళే కేంద్రస్థానాలు. అవునంటారా..... కాదంటారా...."
   
    "ఇదా మీ ఏడవది..." నిరాశగా అంది లిఖిత.
   
    "కాదు.... నేను చెప్పే ఏడవడానికి ఇది ఉపోద్ఘాతం మాత్రమే..... మనిషి బాధపడేటప్పుడు ఆ కళ్ళవెంట వచ్చే కన్నీళ్లను తుడవటానికి ఓ ఆత్మీయ హృదయం వుండాలి... సానుభూతిని కురిపించడానికి అమృతనేత్రం వుండాలి. నిరాశ ఊబిలోకి కూరుకుపోతున్న మనిషిని బయటకు లాగడానికి ఓ ఆర్ద్రహస్తం వుండాలి... అవునా?"
   
    "ఇదా మీ ఏడవది..." నిరాశగా అంది లిఖిత.
   
    "కాదు.... నేను చెప్పే ఏడవదానికి ఇది ఉపోద్ఘాతం మాత్రమే.... మనిషి బాధపడేటప్పుడు ఆ కళ్ళవెంట వచ్చే కన్నీళ్ళను తుడవటానికి ఓ ఆత్మీయ హృదయం వుండాలి.... సానుభూతిని కురిపించడానికి అమృతనేత్రం వుండాలి. నిరాశ ఊబిలోకి కూరుకుపోతున్న మనిషిని బయటకు లాగడానికి ఓ ఆర్ద్రహస్తం వుండాలి... అవునా?"
   
    "యూ ఆర్ పర్ ఫెక్ట్ లీ రైట్..." సంతోషంగా అంది లిఖిత.
   
    తను అనుకున్నట్టుగానే దారిలోకొచ్చాడు మగాడు.
   
    ఆ ఒక్క విషయం చెప్పేస్తే.... చెప్పేస్తే...
   
    "అంచేత నా ఏడవ పాయింట్..."
   
    టక్ మని తలుపు చప్పుడైతే తలెత్తి చూశాడు వికాస్.
   
    ఎదురుగా శివమూర్తి.
   
    మాటల్ని మింగేశాడు వికాస్, వెంటనే టాపిక్ మార్చేశాడు.
   
    "ఏడవ పాయింట్... ఏమిటంటే....స్ట్రీట్ రైడర్.... ఆ కారుకి ఆ పేరే ఎందుకు నిర్ణయించామంటే.... యూత్ కి కావల్సింది.... ఎట్రాక్ట్ చేసేది అలాంటి పేరే..... ఓ.కే-" టక్ మని ఫోన్ పెట్టేశాడు.
   
    అతని ముఖంలో చిరుచెమటలు.
   
    వికాస్ సడన్ గా టాపిక్ ఎందుకు మార్చేశాడో అర్ధం కాలేదు లిఖితకు.
   
    చెప్పడానికి మొహమాటపడ్డాడా?

 Previous Page Next Page