"అవసరం లేనపుడు అడ్డవైనవాళ్ళూ రోడ్డుమీద నడవటానికొచ్చే స్తారు-ఇప్పుడొక్కడూ కనబడి చావడూ" విసుక్కుని ముందుకు అడుగేసాడు నారాయణరావు.
* * * *
పిఠాపురం కాలనీలో ఓ ఇంటి ముందాగి కాలింగ్ బెల్ కొట్టాడు నారాయణరావు.
ఐదు నిముషాల తర్వాత పదేళ్ళ కుర్రాడు బయటికొచ్చాడు.
"బాబూ! ఇంట్లో పెద్దవాళ్ళెవరయినా వున్నారా?" అడిగాడు నారాయణరావు.
"లేరు అందరూ స్మశానానికి తగలడ్డారు" సీరియస్ గా చెప్పాడు కుర్రాడు.
"స్మశానానికా?" అదేం పిక్నిక్ స్పాటా? అందరూ తరలి వెళ్ళటానికి?" ప్రతిస్పందించాడు నారాయణరావు.
"నీకు తెలీకుండా కామెంట్ చెయ్యక.....మా కుక్కపిల్ల చచ్చిపోయింది దాన్నక్కడ పాతిపెట్టటానికెళ్ళారు" మరింత సీరియస్ గా చెప్పాడు ఆ కుర్రాడు.
"కుక్కకు అంతిమ సంస్కారమన్నమాట. పద పోదాం"
వెనుతిరగబోతూ ఆ కుర్రాడి పిలుపువిని ఆగిపోయాడు నారాయణరావు.
"వచ్చిన పనేమిటో నాతో చెప్పొచ్చు హైబ్రీడ్ జాతి మొక్కలా ఫోజిచ్చి మాట్లాడుతున్న ఆ కుర్రాడివేపు చూసి....
"నీకు సంబంధించింది కాదులే.....పెద్దవాళ్ళతో మాట్లాడాలి....." అన్నాడు.
"ఏంటయ్యా.....పెద్దవాళ్ళతో మాట్లాడాలి? నాతో చెప్పు. మీరు ఇద్దరూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. పదేళ్ళుగా ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజిలో మూలుగుతున్నారు.....కార్డూ రాలేదూ, జాబూ రాలేదు...... అడుక్కోటానికి వచ్చారు....అంతే.....కొత్తరకం పద్దతి......ఐ ఎప్రిషియేట్ యూ.....నా దగ్గర ఈ పదిరూపాయలే వున్నాయ్-తీసుకోండి". ఓ పదిరూపాయలు నిక్కరులోంచి తీసి నారాయణరావు చేతిలో పెట్టి గబుక్కున లోపలికెళ్ళిపోయాడు.
నిర్ఘాంత పోయారిద్దరూ.
"వెళ్ళి ఆ పదిరూపాయలూ ఇచ్చేసి వచ్చేయ్.....ఏంటిది అసహ్యంగా" చికాకుపడింది సంధ్య.
"వాడి దగ్గరకా మళ్ళీనా.....అయ్యబాబోయ్.....హైబ్రీడ్ జాతి......వీడీ వయసులోనే బుర్ర తినేస్తే....ఇంకొంచెం ముదిరితే"
"మనిషిని తినేస్తాడు" జతకలిపింది సంధ్య.
"భలే బోణీ దొరికిందిలే....." ముందుకు నడిచాడు నారాయణరావు.
* * * *
"ఏవిటి రాయాలంటావ్?" నలభయ్యేళ్ళ వ్యక్తి కళ్ళద్దాలు సర్దుకుంటూ అడిగాడు.
"అదేనండి.....ప్రేముంది చూసారూ....ఆ ప్రేమ గురించి మీ ఒపీనియన్ రాయాలండీ" చేతిలోని ఒక కాగితాన్ని తీసిచ్చాడు. బాల్ పెన్ ని అందించింది సంధ్య.
"తప్పదంటావా? ఇంతకీ ఇదెందుకూ?"
"ప్రేమసమాజం తరపున, ప్రేమ సర్వే చేస్తున్నామండీ. ప్రేమ దాని పుట్టు పూర్వోత్తరాలు-ప్రేమ-దాని పుట్టు పూర్వోత్తరాలు-ప్రేమ-దాని విశేషాలూ వైపరీత్యాలు.......గోల.....తదితరాలు"
"అర్ధమయింది.....రాస్తాలే....సాయంత్రం రండి"
"ఇప్పుడు కావాలిసార్!"
"ఇప్పుడా.....తప్పదా?"
"తప్పదండి"
"ఐతే నేను డిక్టేట్ చేస్తాను మీ యిద్దరిలో ఎవరో ఒకరు రాసుకోండి"
నారాయణరావు బాల్ పెన్ తెరచి రాయడం మొదలుపెట్టాడు.
ఆయన చెప్పడం మొదలుపెట్టాడు.
"ప్రేమ యనునది హృదయ కవాటములో ఒకానొక విపరీత సమయంలో జరిగే గలగల స్వరూపము. అది ఘనపదార్ధము, ద్రవ పదార్ధమూ కాదు. ఉపద్రవ పదార్ధము. అది ఆడువారి విషయములో వెన్నవలెనూ, మగవారి విషయములో దూదివలెనూ ఉండును"
"సార్! ఇదేంటిది?" కంగారుగా, ముఖం చెక్కుకుపోయిన వాడిలా అడిగాడు నారాయణరావు.
"ప్రేమ గురించి అడిగావుకదా చెపుతున్నాను"
"ప్రేమ గురించి ఆపు వ్యాసంలా చెపితే ఎలా సార్? ప్రేమ గురించి మీ అభిప్రాయం ఉదాహరణకు ఓ ఇద్దరు యువతీ, యువకులు అంటే మాలాంటివాళ్ళు ప్రేమించుకుంటున్నారనుకోండి దానిమీద మీ ఒపీనియన్ అన్నమాట"
"ఓహో.....అదా.....చెప్పావు కాదేం....వుండు ఒక్కనిమిషంలో వస్తాను"
అంటూ లోన గదిలోకి నడిచాడు ఆ పెద్దమనిషి.
"ఏవిటీ ఈయన సడన్ గా లోనకెళ్ళాడు?"
ఐదు నిముషాల తర్వాత ఓ ముప్పై ఎనిమిదేళ్ళావిడ అంట్ల గరిటెతో బయటకొచ్చింది.
"ఎవరయ్యా ఆయన్ని ప్రేమ గురించి అడిగింది?"
"నేనేనండి"
"నీకు బుద్ది వుందా? చూడు.....ఆయన లోనకెళ్ళి ఎంతగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారో?"
"మేం ఏడ్వమని చెప్పలేదు మేడమ్.....ప్రేమ గురించి అడిగాం" సంధ్య ఏదో చెప్పబోయింది.
"ఈ రివట కాడ వెధవకి బుద్ది లేకపోతే.....నీకయినా బుద్ది ఉండక్కర్లే.....పాతికేళ్ళక్రితం ఆయన ఎవతినో ప్రేమించాడు. ఆ తర్వాత నన్ను పెళ్ళి చేసుకున్నాడు. ఇన్నాళ్ళూ నాలో ఆవిడ్ని చూసుకొని కాలక్షేపం చేస్తున్న ఆయనకు మళ్ళీ మీరు ప్రేమవిషయం జ్ఞాపకం చేశారు. చూడండి..... ఆ ఏడుపులకు మీరేం సమాధానం చెపుతారో చెప్పండి"
"ఇదేం గోల నాయనోయ్......లవ్ గురించి ఒపీనియన్ అడిగాం అంతే" బిత్తరపోతూ అన్నారిద్దరూ.
"మీరేం చేస్తారో నాకనవసరం రండి.....ఆయన్ని ఎలా ఓదారుస్తారో ఓదార్చండి......మామూలు మనిషిని చేసి వెళ్ళండి" అంటూ మర మనిషిలా ఆవిడ లోనకెళ్ళింది.
"సంధ్యా.....ఇవాళ మన తిధులూ, గడియలూ ఏం బాగాలేదు. ఏం చేద్దాం"
"ఆవిడ వెనక్కి తిరిగి వెళుతోంది కాబట్టి.....మనం...."సంధ్య చెప్పేదేమిటో అర్ధమైపోయిన నారాయణరావు ఆమె చేతిని పట్టుకొని వెనక్కి పరుగుతీసాడు.
"తీయగా, తీయగా ఓ అరగంట తర్వాత జగదాంబ జంక్షన్ కి చేరుకున్నారు.
సరిగ్గా అదే సమయంలో ఓ సిటీబస్ రావడంతో గబుక్కున ఎక్కి కూర్చున్నారు ఇద్దరూ.
* * * *
"టిక్కెట్....టిక్కెట్" అంటూ అడుగుతున్న వ్యక్తి ముఖాన్ని చూసి, కెవ్వున కేకవేయబోయి ఆగిపోయింది సంధ్య.
ఆ కండక్టర్ పరకాయమణి.....
"నేనీమధ్య ఏ సిటీ బస్సులోనూ తిరగలేదు" సంధ్యకు రహస్యం చెపుతున్నట్టుగా చెప్పాడతను.
"లీవు పెట్టారా?"
"లీవా___లీవ్ కాదమ్మా.....ఆ రోజు అత్యుత్సాహంతో, ప్రేమా జిందాబాద్.....జిందాబాద్ అని మీ అందరి దగ్గరా టిక్కెట్లు వసూలు చేయలేదు జ్ఞాపకం వుందా......దానిదెబ్బ"
"అంటే?"
"ప్రేమ షాక్ అన్న మాట.....ఆరోజు మధ్యలో స్క్వాడ్ తనిఖీ కొచ్చిందమ్మా.....ఎవరికీ టిక్కెట్లు ఎందుకివ్వలేదని, నన్ను ప్రశ్నించారంతే__ఆ దెబ్బతో నన్ను నెలరోజులు సస్పెండ్ చేశారు తల్లో.....ఈ విషయాన్ని మా మొద్దుముఖం.....అదే మా ఆవిడ అపార్ధ సారధి కజిన్ సిస్టర్ అపార్ధం చేసుకుంది. నేనే రెడీమేడ్ గా ఎవర్నో ప్రేమిస్తున్నానను కొంది. ఇల్లు పూర్ణామార్కెట్ అయిపోయింది. సారీ అమ్మా.....ఆరోజు నిన్నుకూడా నేను యిబ్బంది పెట్టాను" జాలిగా అన్నాడు పరకాయ మణి.