Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 3

    పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛ యివ్వడం వారి మనోవికాసానికి దోహదం చేస్తుంది అని నువ్వు నిరూపించావు.

    ఆ నమ్మకంతోనే ఈ విషయంలో నీ నిర్ణయానికి విలువ ఇస్తాను నేను యిచ్చేది సలహా మాత్రమే! అంత నిర్మలమయిన మనసున్న యువకుడి ఆపేక్షని నువ్వు త్రుంచి వేయకు బేబి!" అని సలహాయిచ్చిందామె. అయినా మనసు ఊగిసలాడటం మానలేదు.

    ప్రొఫెసర్ సమతాబెనర్జీ తనకు దైవంతో సమానం. ఆమె సలహా కోసం పరుగులు తీసింది. అందరూ ఒకే మాట! ఒకే దారి!.

    "నీ జీవితాశయం సైన్సు పరిశోధనలు చేయటం! దానికి ఆటంకం లేదనుకున్నప్పుడు అతని మాటని తిరస్కరించటంలో అర్ధమేలేదు. మగవాళ్ళలో మంచివాళ్ళు అరుదుగా ఉంటారు బేబి? ఇది నా అనుభవం!! ఈ అవకాశాన్ని పోనివ్వకు" అంది ప్రేమ వైఫల్యాన్ని ఫలితంగా జీవితమంతా బ్రహ్మచారిణిగా మిగిలిపోయిన సమతాబెనర్జీ.

    "ప్రొఫెసర్! మీరు నాకు గురువులు! మార్గదర్శి! మమ్మీ నన్ను జీవితంలోకి నడిపించారు. మీరు  వెలుగుదారులు చూపించారు. అమ్మ వివరించలేని విజ్ఞాన ప్రపంచాన్ని నా కళ్ళముందు పరిచారు.

    నేను జీవితానికి ఒక ఆశయమంటూ ఏర్పరచుకోవటానికి ప్రధమ కారణం మీరు! బ్రహ్మచారిణిగా మిగిలిపోయి జీవితమంతా విద్యార్ధులె ప్రపంచంగా బ్రతికారు. అలాంటి మీరుకూడా అమ్మ యిచ్చిన సలహాని సమర్దిస్తున్నారా?"

    "బేబీ! చెడు ఆలోచనలకి చాలా కోణాలుంటాయి. కాని మంచి మనసుకి, మంచి మాటకు దారి ఒక్కటే! ధ్వని కూడా ఒక్కటే!
    నా సంగతి వేరు! దారుణంగా మోసపోయాను! ఆడదాని జీవితానికి ప్రధమ లక్ష్యం పెళ్లికాదు. మరొక్కటి ఉండాలని అప్పుడే తెలుసు కున్నాను. మనసు విప్పే మగవాడు ఎందరికో లభించడు.

    అతని జీవితాన్ని నీ ముందు పరచి పూలరేకులుచల్లి నడిచిరమ్మని స్వాగతం పలుకుతున్నాడు. అతని నీడలో నీ జీవితాశయంనించి వంచితురాలవుతానని ఎందుకు ఆలోచించాలి?

    ఒక విద్యార్ధిని నా దగ్గరకు వచ్చినపుడు ఒక సంవత్సరం విద్య బోధించి అంతటితో నా పని తీరిపోయిందని నేను భావించను. ఆమె భవిష్యత్తుని నిర్మించుకోవటంలో నా బాధ్యత ఉందనుకుంటాను.

    నీ విషయంలో మరికొంత అధికంగానే కమిట్ అయ్యాను. అవుతున్నాను కూడ! అతడే నీకు సరి అయినా జీవిత భాగస్వామి అనిపిస్తోంది! ఆ తరువాత నిర్ణయించుకోవటం నీ యిష్టం!" అని ముగించిందామె.

    ఒకటి రెండు రోజులు తీవ్రమయిన అంతర్మధనం తరువాత మళ్ళీ కన్పించాడు శివరాజ్! తనే కావాలని వచ్చి కలిశాడు.

    "మనసు మార్చుకుని నాకోసం ఎదురుచూస్తూ ఉంటావనే నమ్మకంతో వచ్చాను. మమ్మీతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను" అన్నాడు.

    "ఎదుటివారు కాదంటారేమోననే సందేహం మీకు రవంతయినా కలగదేమిటి? ఇంత సుకుమారమయిన మనసుతో పోలీసు ఉద్యోగం ఎలా చేస్తారు మీరు?"

    "మనలో మంచితనం అనేది కొంతయినా నటన కాకుండా వుంటే సాలిడ్ అయితే సక్సెస్ మనతోనే వుంటుంది!"
    "అయితే నేను ఒప్పుకుంటున్నానని మీరు అనుకుంటున్నారా?"

    "కాదనటానికి నువ్వు ఒక్క కారణం కూడా చూపించలేవనుకుంటున్నాను." ఆ మాటలు విన్న తరువాత ఎంతో చెప్పాలనుకుంది. ఏమీ చెప్పలేక ఒక స్లిప్ రాసి అతనికి అందించి వేగంగా అక్కడ్నించి వెళ్ళిపోయింది.

    "పెళ్ళి అయినా మన యిద్దరమే! ప్లస్ అనడానికి నో! ఇష్టమయితే రేపు ఉదయం మమ్మీతో మాట్లాడేందుకు రండి!"

    ఉదయం అనుకున్న సమయానికి అరగంట ముందుగానే ప్రత్యక్షమయ్యాడు. మమ్మీ చాలా యాక్టివ్ అయిపోయింది. శివరాజ్ పలికిన ప్రతి అక్షరాన్ని ఎంతో సెన్సిటివ్ గా తీసుకుంది.

    అప్పుడు ప్రారంభించిన పెళ్ళి ప్రయత్నాలు ఈ చోటుకి తెచ్చి నిలిపాయి! బరువుగా రెప్పలు విప్పి చూచాడు శివరాజ్!

    "బిలీవ్ మీ తులసి! ఎందుకు మేలుకుంతావు. వచ్చి పడుకో?" అంటూనే చేయి పట్టుకున్నాడు. ఆమె మనసు వెన్నలా కరిగిపోయింది.

    అతన్ని కావలించుకుని పడుకుంది తిరిగి క్షణాలమీద నిద్రపట్టించేశాడు. రెప్పలు మూసుకున్నా ఆమె మనసు మేలుకునే వుంది.

    తెల్లవారుఝామున లేచి స్నానంచేసి పూజ ముగించింది.

    నిద్రలేమివల్ల ఆమె కళ్ళు ఎర్రగా మండుతూ ఉండటం చూచి తల్లి మురిపెంగా అనుకుంది. "ఆడపిల్లలు ఆశయాలు కట్టుకున్న మగవాడి ఆశలముందు క్షణంలో కరిగిపోతాయి!" అని.

    పూజ ముగించి వచ్చేసరికి కాఫీ అందించింది!

    అది తీసుకుని పైకి వెళ్ళింది తులసి!

    టెర్రస్ మీద కార్దిల్ పైన కూర్చుని ఊగుతున్నాడు. ఎంతో హాయిహాయి అనిపించే ఉషోదయపు తుషార వీచికలు వీస్తున్నాయి!"

    కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు!

    "గుడ్ మార్నింగ్! కళ్ళు విప్పండిసర్! కాఫీ తీసుకోండి!"

    "ఇది కాఫీ కాదు. పవిత్ర తీర్ధం!" అందుకున్నాడు.

    బాధపడే అర్ధం వచ్చేలా మాట్లాడకండి ప్లీజ్!"

    "అర్ధం చేసుకోలేకపోయావు. నేన్నది అదికాదు. పవిత్రంగా మిగిలిపోయిన తులసి అందించిన తీర్ధం! ఇది తులసి తీర్ధం!"

    చివ్వున ముందుకు వెళ్ళి అతని నోరు మూసింది!

    "తమాషాకయినా అలాంటి మాటలు మాట్లాడకండి!"

    "హనీమూన్ కి అంతా రెడీనా?"

    "మమ్మీ కన్నా మీకే ఎక్కువ తొందరగా వుంది!"

    "మా డిపార్ట్ మెంట్ లో శలవు దొరకడం దుర్లభం! హనీ లేని హనీమూన్ పేరుతో అయినా సరదాగా తిరిగి రావచ్చుకదా!"

    "నేను మేడమ్ కి చెప్పి రావాలి! ఆవిడ యూనివర్సిటీకి పెందరాడే వెడతారు. నేను ముందుగా వెళ్ళొస్తాను."
 

 Previous Page Next Page