ఆటో సర్రుమని ముందుకు దూసుకుపోయింది.
"యంగ్ ఆటో డ్రైవర్...నాదో చిన్న డౌటు....కాచిగూడ పోలీస్ స్టేషన్ పక్కనే, రైల్వే స్టేషన్ కూడా ఉందని, నాంపల్లి స్టేషన్ లో చెప్పారే...నువ్వేంటీ...ఇటేటో తీసికెళ్తున్నావ్...మమ్మల్ని గానీ మోసం చెయ్యాలని చూస్తున్నావా..." చాలా తెలివిగా ఒక్క ప్రశ్న వేసానని తనలో తానే మురిసిపోతూ అడిగాడు సేతురాజు.
"ఆ నాంపల్లి స్టేషన్ లో అలాగే చెప్తారు బిడ్డా...అక్కడ రోజూ ఒకళ్ళే ఉండరు కదా...రకరకాల వ్యక్తులుంటారు___నాంపల్లి స్టేషన్ లోని వాళ్ళకి...కాచిగూడ స్టేషన్ వాళ్ళకి ఒక్కక్షణం పడి చావదు. అందుకే అలా అబద్దం చెబుతారు. ఎవరేది చెప్పినా నమ్మేస్తే ఎలా? నువ్వే చెప్పు..." ముందుకి వంగి, తన ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న సేతురాజు ముఖం లోకి చూస్తూ అడిగాడు ఆటోడ్రైవర్.
"నువ్వే కరెక్టు...ఒరేయ్ సేతురాజు పోతురాజు పాపం ఆటో బ్రదర్ మంచివాడురా..." అంటూ మీటర్ వేపు చూసి కెవ్వుమని, అరవబోయి,బ్రేవ్ మని తేల్చాడు__పక్కన ఉన్న సేతురాజు భుజాన్ని గీకి, మీటరు వేపు వేలుని చూపెట్టాడు వీర్రాజు.
"ఆఁ" అంటూ కళ్ళెగరేసాడతను.
"తొంభై రూపాయలా...?" పోతురాజు ఆమాటను గట్టిగా బైటకే అనేసాడు.
ఆటో నింబోలి అడ్డ దగ్గర ఎడమవేపుకి మలుపు తిప్పి, కొంత దూరం పోయాక, సరదాగా గల్లీలన్నీ తిప్పుతున్నాడు డ్రైవర్.
"పోలీస్ స్టేషన్ కి ఇంత దూరమా...రైల్వే స్టేషన్...చాలా దగ్గరని చెప్పారే?" మళ్ళీ అనుమానం వ్యక్తం చేశాడు పోతురాజు.
"మళ్ళీ మొదటికే వచ్చావా బిడ్డా....ఒకప్పుడు రెండూ పక్క, పక్కనే ఉండేవి...హైద్రాబాద్ కార్పొరేషను అయిపోయాక, రోడ్లు వెడల్పు చేశారుకదా...అప్పుడు దూరమై పోయాయి.
"అలా చెప్పు మరి...రీజనింగ్ ఉండే ప్రతి విషయాన్నీ మేం నమ్ముతాం...ఏరా?" నవ్వుతూ అన్నాడు సేతురాజు.
ఓ గల్లీ లోంచి వచ్చి, ఆటో కాచిగూడ రైల్వేస్టేషన్ ముందు ఆగింది.
ముగ్గురూ తలలువంచిబూడిద రంగులో కన్పిస్తున్న బిల్డింగ్ ను చూశారు.
"స్టేషను కాడకు పొమ్మంటే, నిజాం బిల్డింగ్ కాడకు తీసుకొచ్చావేంటి బిడ్డా...." అని అడిగాడు పోతురాజు.
"ఇది నిజాం బిల్డింగ్ కాదు....స్టేషన్...సూట్ కేసుల్ని పట్టుకుని వెళ్తున్న పాసింజర్లను చూడండి..." సాక్ష్యం చూశాక, నమ్మకం కలిగిన వారి ముగ్గురూ కిందకు దిగారు.
అప్పటికి ఆటో మీటరు నూట ఇరవై ఏడు రూపాయలైంది.
వీర్రాజు సేతురాజు మొఖంలోనికి చూసి, జేబులోంచి డబ్బులు తీశాడు. సరిగ్గా ఇరవై ఏడు రూపాయలు.
"మన దగ్గరున్న పైసలియ్యే..." పోతురాజు చెవిలో గుసగుస లాడాడు. అప్పుడు పోతురాజు చిద్విలాసంగా పాతకాలపు సినిమాల్లో సత్యనారాయణలా నవ్వి, ఫేంటు వెనక జేబులోంచి హండ్రెడ్ రుపీస్ నోటుని తీసి వీర్రాజు చేతిలో పెట్టాడు.
"కరెక్టుగా సరిపోయింది గదా..." ఆ ఎమౌంట్ ని, ఆటో డ్రైవర్ చేతిలో పెట్టాడు.
ఈ వెర్రి వెంగళప్పల్ని భలే మోసం చేశానుగదా....అన్నట్టుగా ఆటో డ్రైవర్ ఒక చూపు చూసి, ఆ డబ్బును జేబులో పెట్టుకున్నాడు.
టింగురంగా మంటూ ముగ్గురూ కాచిగూడ స్టేషనులోకి అడుగు పెట్టగానే-పోతురాజు.
"ఒరే నాంపల్లి స్టేషను దగ్గర అస్సలు పైసలు లేవన్నావ్ గదరా....కాచిగూడ స్టేషను దగ్గర కొచ్చేసరికి, పైసలెలా వచ్చాయ్?" ఇద్దరూ ఆత్రుతగా ప్రశ్నించారు.
పోతురాజు విశ్వరూపం చూపించడానికి సిద్దమైన లార్డ్ కృష్ణలా మందహాసం చేసి__
"నా మైండ్ లో తెలివుందని మీరొప్పుకుంటే, ఆ పైసలెలా సంపాదించానో" చెప్తానన్నాడు.
"ఒప్పుకొన్నాం....సరే చెప్పి తగలడు..." ఇద్దరూ కోరస్ గా అన్నారు.
పోతురాజు అటూ ఇటూ చూసి పరమ రహస్యం చెప్పాడు__
"ఆటో యంగ్ డ్రైవర్ ఉన్నాడా....ఆడి బ్యాక్ పాకెట్లోంచి కొట్టేశా..." కారపు డబ్బాలో పడ్డ కోతిలా కిచకిచమంటూ నవ్వాడు పోతురాజు.
"హా" మిగతా ఇద్దరూ నోళ్ళు తెరిచారు.
ముప్పై, ముప్పై అయిదేళ్ళ మధ్య వయసుగల సేతురాజు పోతురాజు, వీర్రాజులు నల్గొండ పక్కనున్న ఒక పల్లెటూరినుంచి, తెలివి తేటల్నినమ్ముకుని, అమ్ముకుని బతకడానికి నెలరోజుల క్రితం, ఇంట్లో వాళ్ళకు తెలీకుండా హైద్రాబాద్ సిటీకొచ్చారు.
ఈ హైద్రాబాద్ లో తెలివితేటల్ని అమ్ముకోవడం కుదరదని వారం రోజులు లోపల తెల్సిపోయింది. అప్పట్నించీ తెలివి తేటల్ని నమ్ముకోవడం ప్రారంభించి, ఇరానీ హోటల్లో సర్వర్ ఉద్యోగం దగ్గర్నించి చాలా జాబ్స్ వెలగబెట్టారు. మన వాళ్ళ తెలివితేటలన్నీ, అవతలివాళ్ళకీ అతి తెలివితేటలుగా కనబడటంతో మీలాంటి మహా తెలివైన వాళ్ళు మా కక్కర్లేదని, అందరూ ఛీకొట్టగా, ముగ్గురూ మూడు రోజులపాటు నాంపల్లి స్టేషను ఫ్లాట్ ఫారమ్మీద గడిపారు__తీవ్రంగా ఆలోచన చేశారు.
ప్రపంచంలో మనిషి బతకడానికి, ప్రధానంగా కావాల్సినవి ఏవిటి? అని ముగ్గురిలో పెద్దవాడైన వీర్రాజు ఒక ప్రశ్న వేశాడు ఒకరోజు.
"తిండి...బట్ట..." టక్కున జవాబు చెప్పాడు రెండోవాడు సేతురాజు.
"మకాన్....కూడా..." అని మూడోవాడు పోతురాజు చెప్పాడు.
"అర్జంటుగా ఈ మూడు మనకు కావాలంటే...?"
"డబ్బులుండాలి...."
"మనం తెచ్చుకొన్న పైసలన్నీ అయిపోయాయి కాబట్టి...డబ్బుల్లేవు కాబట్టి....డబ్బుల్లెకుండా, ఈ మూడు సంపాదించాలంటే...ఏం చేయాలి?" ఒక అతి తెలివైన క్వశ్చను వేశాడు వీర్రాజు.
"క్యాకరూ....?" మిగతా ఇతర భాషలో ఆ ప్రశ్న వేసుకొని గాడంగా ఆలోచించడం ప్రారంభించారు.
"ఒకేచోట కూర్చుంటే మనకు అయిడియాలు రావు...అయితే మనం ఈ నాంపల్లి స్టేషను మార్చేసి....కాచిగూడ స్టేషనుకెళ్ళి, తీరుబడిగా ఆలోచిద్దాం...."
"అక్కడ ఆలోచన్లు దొరుకుతాయా..." అన్నాడు పోతురాజు.
"అవును...అక్కడ చాలామంది....ఆలోచన్లను ఫ్లాట్ ఫారమ్మీద పారేసి వెళ్ళిపోతార్ట..." చెప్పాడు వీర్రాజు "ఛలో...కాచిగూడ..." ఉత్సాహంగా అరిచాడు సేతురాజు ఎదురుగా ఉన్న ఎర్ర పోస్టర్ మీద హెడ్డింగ్ ను చదివిన ఇన్ స్పిరేషనుతో.
ఇదీ ఫ్లాష్ బాక్....
ఇక కరెంట్ ఎపిసోడ్ లోకొస్తే, ఒకసారి కాచిగూడ రైల్వే స్టేషను ఫ్లాట్ ఫారమ్మీద, ఆ చివర్నుంచి, ఈ చివర వరకూ తిరిగొచ్చి నీరసంగా సిమెంట్ బెంచీ మీద కూర్చుంటూ__
"ఈ హైద్రాబాద్ లో పుకార్లెక్కువరా..." అన్నాడు వీర్రాజు.
"ఏం...?"
"ఈ ఫ్లాట్ ఫారమ్మీద, అయిడియాలు దొరుకుతాయనుకొన్నామా అబ్బే....ఏం దొరకవు ... అయిడియాలే కాదు .... ఇక్కడ పాసింజర్లు కూడా లేరు..."
సరిగ్గా నలభై నిమిషాలు గడిచాయి.