"ఇలా వాగితే నేను మా పుట్టింటికి పోతాను...." చర్రుమని పైకిలేస్తూ అంది సీత.
"పోతే ఫో! నీవు లేకపోతే నాకు జరగదా?" అన్నాడు రామకృష్ణ.
"పోనీలే బాబూ! ఇంత చిన్న విషయానికి జీవితాంతం కలసి కాపురం చేయవలసిన దంపతులు కొట్టుకోటం ఏం బాగుండలేదు. నాకు బూస్ట్ ఇచ్చినా తాగుతాను, హార్లిక్స్ ఇచ్చినా తాగుతాను. ప్రస్తుతం ఏది వద్దు పొరపాటున కప్పు బద్దలయినంత మాత్రాన అమ్మాయిని నీవు అంతగా కోప్పడటం న్యాయం కాదు. నీవు తొందరపడి కోపగించుకున్నా - అమ్మాయి వెళతానని బెదిరించటమూ సవ్యంగా లేదు" అంటూ చిన్న బుచ్చుకున్న ముఖం వేసుకుని చుట్టం ఏదో చెప్పాడు.
తమ మధ్య చుట్టం అనే మూడో మనిషి ఉన్నట్లు అప్పుడు గుర్తించిన సీత, రామకృష్ణ ముందు తెల్లబోయి, ఆపై తెప్పరిల్లి, బోలెడంత సిగ్గుపడి, ఆపై పక్కున నవ్వారు.
ఈ తఫా తెల్లబోవటం చుట్టం వంతయింది.
సీత మళ్ళి బూస్ట్ కలుపుకు వచ్చే లోపల రామకృష్ణ సిగ్గుపడుతూ అసలు విషయం చెప్పాడు.
"మీ కోపం దొంగలుతోలా! ఇదెం కోరికర్రా మీకు! సంసారంలో ఏ పొరపొచ్చాలు లేకుండా ఉండాలని ప్రతివాళ్ళూ కోరుకుంటారు. మీరేమో కోపాలు, అపార్ధాలు అంటూ కోరరాని కోరికలు కోరుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య అపార్ధాలు, అనుమానాలు ఉండకూడదు. ఉన్నాయా - అవి ఎంత దూరం లాక్కెళ్ళాలో అంత దూరం లాక్కెళ్ళి సర్వనాశనం చేస్తాయి. సంసారం అంటే అద్దంమీద ఆవగింజ అనుకో - " అంటూ చుట్టంగారు వేడి వేడి బూస్టు తాగుతూ చల్ల చల్లగా చివాట్లు పెట్టాడు.
ఆ సంఘటనతో రామకృష్ణ, సీత సిగ్గు తెచ్చుకున్నారు.
చుట్టంగారు వెళ్ళిం తరువాత "నీవు ఆయన్ని మర్చిపోయావా?" అన్నాడు రామకృష్ణ.
"కోపంతో వెలిగిపోతున్న మీ మోము చూస్తూ పరిసరాలు మర్చిపోయాను!" ముద్దు ముద్దుగా చెప్పింది సీత.
"నేనూ అంతే సీతా! కోటి సూర్యుళ్ళ కాంతి నీ మనోహరమయిన మోము నందు ప్రతిబింబిస్తుంటే- నిన్ను కోప్పడుతూ నన్ను నేనే మర్చిపోయాను!" రామకృష్ణ చెప్పాడు.
"ఈరోజు నుంచీ ఉత్తుత్తి నాటకాలు మన మధ్య వద్దు బాబూ!" అంది సీత.
"నీ ఇష్టమే నా ఇష్టమమ్మా సీతామనోహరి!" అన్నాడు రామకృష్ణ.
అది జరిగింతరువాత వాళ్ళెప్పుడూ ఉత్తుత్తి కోపాలు కొని తెచ్చుకోలేదు.
వాళ్ళ కోరిక వద్దనుకుంటున్న సమయంలో ముందు ముందు తీరనుంది. వాళ్ళ పాలిట అది పెద్ద శిరోవేదన. సంసారం అన్న తర్వాత కొన్ని తప్పవు మరి.
3
"నాకు హేమామాలిని, ధర్మేంద్ర జంట ఇష్టం. వాళ్ళున్న పిక్చర్ కి వెళదాము" అంది సీత.
"నాకు రేఖ, అమితాబ్ ల పిక్చర్ ఇష్టం. దానికి వెళదాం" అన్నాడు రామకృష్ణ.
"ఉహు, నేను రాను."
"నేనక్కడికి మహా వస్తున్నట్లు-"
"హేమామాలిని చూస్తూ కూర్చోవచ్చు."
"రేఖ చూపులు చాలు - చూస్తూ కూర్చోటానికి....."
"గడకర్రలా అమితాబ్...."
"సత్రకాయలా ధర్మేంద్ర లేడూ!"
ఇద్దరూ కాసేపు వాదులాడుకున్నారు. సీతామనోహరికి, రామకృష్ణకీ చెరో జంట ఇష్టం. ఆ సాయంత్రం పిక్చర్ కి వేళదామనుకున్నారు. ఫలానా జంట ఉన్న ఫలానా పిక్చర్ కి వెళదామని కాసేపు వాదించుకుని - చివరికి మీ ఇష్టం అంటే మీ యిష్టంలో దిగారు.