Previous Page Next Page 
హిమసుందరి పేజి 5

    "హేమామాలిన్ని చూడటానికి వస్తాలే" అంటే - రేఖను చూడటానికి నేను రెడీ అయితే!" అంది సీత.

    ఇలా పరస్పరం గౌరవించుకున్నారు గాని - ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. దాంతో రూట్ మార్చి - ఏకాభిప్రాయానికి వచ్చి తెలుగు సినిమాకి బయలుదేరారు.

    సీత, రామకృష్ణ స్కూటర్ ఎక్కి ఆఘమేఘాల మీద హాలు దగ్గరకు వచ్చేసరికి - భారతదేశం జనాభా మొత్తం ఆ హాలులో దూరి తలదాచుకున్నట్లు - హాలు నిండింది అన్న బోర్డు అందంగా దర్శనం ఇచ్చింది.

    వీళ్ళు అర్జంటుగా తిరుగు టపాలో బయలుదేరుతుంటే వాడెవడో బ్లాకులో నాలుగు టిక్కెట్లు ఉన్నాయన్నాడు.

    "రెండు చాలు. అదే మహాప్రసాదం!" అని టిక్కెట్లు పుచ్చుకుని హాలులో దూరారు.

    హాలులో వరసగా నాలుగు సీట్లు ఉన్నాయి. అయితే అవి గోడపక్కగా ఉన్నాయి.

    చివరి సీట్లలో కూర్చోటం సీతకి ఎంత వళ్ళుమంటో - రామకృష్ణకీ అంతే - అంతకి అంత వళ్ళుమంట.

    అదే సమయంలో మరో భార్యా, భర్త వచ్చారు. టిక్కెట్స్ మీద ఉన్న నెంబరు ప్రకారం అయితే సీతా వాళ్లకి గోడపక్క సీట్లు వచ్చాయి.

    అంభంలో కుంభం - ఆదివారంలో సోమవారం సామెత గుర్తు తెచ్చుకుని సీత గొణగబోయింది.

    అంతలో వచ్చినాయన రామకృష్ణతో "మేము ఇటు కూర్చుంటాము. మీరు అటు కూర్చుంటారా?" అని మర్యాదగా అడిగాడు.

    సమయానికి చేతిలో దండ లేదు గాని- ఉన్నట్లయితే రామకృష్ణ అతగాడి మెడలో వేసి, గట్టిగా ఆలింగనం చేసుకుని గాడంగా ముద్దుపెట్టుకునే వాడే!

    మహాప్రసాదం లాంటి మాట వాడితే అతగాడికి అర్ధం కాదేమోనని, ఒక్క ముక్కలో ఓకే అనేశాడు రామకృష్ణ.

    ఆ జంట అటు - ఈ జంట ఇటు కూర్చున్నారు.

    తెరమీద న్యూస్ రీలు అయిపోయి - డాం డాం చప్పుళ్ళతో తుపాకీ రాముడు సినిమా మొదలయింది. తుపాకీ రాముడు వాల్ పోస్టర్ల మీద కొందరు కొంటె కుర్రాళ్ళు "తు" మీద పెడ, బురద పులుమి ఆ సినిమా పేరు మార్చిపారేశారు.

    అది గుర్తొచ్చి రామకృష్ణ కి నవ్వు వచ్చింది.

    తుపాకీ రాముడు సినిమాలో ఆడపిల్లలంతా పిచ్చి పట్టినట్లు హీరో చుట్టూ తిరుగుతూ నన్ను పెళ్ళి చేసుకోమని ఒకతి, పెళ్ళాడటం ఇష్టం లేకపోతే ఒక్కసారి నా కోర్కె తీర్చమని మరోకతే ఏకంగా అతగాడి మీదపడి ముద్దు పెట్టుకుంటూ వేరే ఒకతి. ఇలా వేషాలు వేస్తుంటారు. హీరోతుపాకి రాముడు తాను ఏక పత్నీ వ్రతుడినని, శిలవంతుడినని చెపుతూ - ఆడపిల్లల తొంట్లమీద దరువేస్తూ, జబ్బ పట్టుకుని మీదకి గుంజుకుంటూ బుగ్గలు పిండుతూ, ద్వందార్ధం మాటలు విసురుతూ వెర్రి గంతులతో హాలు హోరేత్తిస్తున్నాడు.

    "అదృష్టం అంటే అలా ఉండాలి!" కళ్ళు పత్తి కాయల్లా చేసుకుని, తెరమీద నుంచి దృష్టి మళ్లించకుండా అన్నాడు రామకృష్ణ.

    "ఎలా?" అడిగింది సీత.

    "ఆడవాళ్ళందరినీ ఎలా నలిపి పారేస్తున్నాడో చూడు" అన్నాడు రామకృష్ణ.

    "అది అదృష్టమా?"

    "కాదా?"

    "అలా అయితే ఓ పని చేయండి. నే పక్కన లేకుండా చూసి ప్రాక్టికల్ గా అలాంటి పనులు చేసి చూడండి."

    "చావగొట్టి చెవులు మూస్తారు. అయినా నేను రామనామదేయుడిని. ఏక పత్నివ్రతుడిని."

    "మంచిది మరి అలాంటప్పుడు దిక్కుమాలిన సీనులు చూసి గుటకలు మింగకూడదు - అందునా అందమయిన పెళ్ళాం పక్కన ఉన్నప్పుడు వెర్రి మొర్రి వేషాలు అసలు వేయకూడదు!" సీత సన్నసన్నగా చివాట్లు పెట్టింది.

    "గుర్తుంచుకుంటాను - " అన్నాడు రామకృష్ణ.

    రామకృష్ణ కి గాని, సీతా మనోహరికి గానీ ఊరికే కూర్చుంటే బొత్తిగా తోచదు. పక్క పక్కన ఉన్నారంటే కిచ కిచ లాడుకోవాల్సిందే.

    తమ మాటలు ఎవరయినా వింటారేమోనని తల, తల పక్కకు చేర్చి కువ కువ లాడుకుంతుంటే- వెనుకనున్నాయన బొత్తిగా మంచి, మర్యాద లేకుండా "తలలు సరిగా పెట్టుకోండి" అన్నాడు కాస్త గట్టిగానే.

 Previous Page Next Page