Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 4

    "చాలుబాబూ చాలు. ఈ జీవితానికి నాకీ అదృష్టం చాలుబాబూ." అంటూ గోపి తలని తన గుండెలకేసి అడుముకుంది తల్లిలాంటి అన్నపూర్ణ.
    తర్వాత గోపి చకచకా పళ్ళు తోమేసుకున్నాడు. గోరువెచ్చని నీళ్ళతో మొహం కడుక్కున్నాడు.
    మొహం తుడుచుకోవడానికి టవల్ కోసం చూస్తుంటే "ఉండండి. నేను తెస్తా..." అని గదిలోకి వెళ్ళి టవల్ తెచ్చింది.
    కానీ అప్పటికే గోపి టవల్ తో మొహం తుడుచుకుంటున్నాడు.
    "మీకి టవల్ ఎక్కడిది?" అడిగింది రాధ.
    "వదిన ఇచ్చింది!" చెప్పాడు గోపి.
    పరంధామయ్య నొసలు చిట్లించాడు.
    సరిగ్గా అప్పుడే అన్నపూర్ణ డైనింగ్ హాల్లోంచి అరిచింది "అందరూ టిఫిన్ తిండానికి రండి." అంటూ.
 
                                                                         3
    గోపి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరేసరికి అందరూ అతనికోసమే అంగలారుస్తూ ఎదురు చూస్తున్నారు.
    "రా గోపి. రారా." అంది సరస్వతి కొడుకు తల ప్రేమగా నిమురుతూ.
    "రా బాబు. రా." అంటూ అన్నపూర్ణ కూడా గోపి తలకాయ్ క్రాపు చెరిగిపోయేలా  నిమిరింది.
    "రారా తమ్ముడూ. రా." శంకరం గోపి వీపుమీద ధఢేల్ మని బాదాడు.
    "బాబాయ్...రా బాబాయ్. నా దగ్గర కూర్చో బాబాయ్." గోపీ చొక్కా పట్టిలాగింది. గోపీ చొక్కా పర్రున చిరిగింది.
    రాధ బిక్క మొహం వేస్తూ నిల్చుండిపోయింది.
    సొంత భార్య అయిన తనకు అవకాశం ఇవ్వకుండా గోపీని మిగతావాళ్ళే "రా. రా." అంటూ పీక్కుతినడం ఆమెకుబాధ కలిగించింది.
    రాధ గుడ్లనీరు కక్కుకుంది.
    అది పరంధామయ్య గమనించి బుస్సున నిట్టూర్చాడు.
    గోపి రాధవంక చూసి డంగైపోయాడు.
    ఏంటి రాధా? ఎందుకీ కన్నీళ్ళు?.... దేవాలయంలాంటి ఇంట్లో ఓ దేవత కంటనీరు పెట్టడమా?" అన్నాడు ఆమె గెడ్డం పట్టుకుని.
    ఆ మాట వినగానే రాధ ఫకాలుమని నవ్వింది.
    "మీకేమయినా పిచ్చా. ఈ మమతల కోవెలలో నేనెందుకు కంటనీరు పెడతాను? ఇప్పుడు మామయ్యగారు బస్సును నిట్టూర్చారు కదా? ఆ దెబ్బకి టేబులుమీదున్న కందిపొడి ఎగిరి నా కంట్లో పడిందన్న మాట!!"
    అలా అనేసి మళ్ళీ గలగలా నవ్వేసింది మిగతా అందరూ ఆమె నవ్వులతో శృతికలిపారు.
    చిన్నారి దీపమాత్రం నవ్వలేదు.
    "మనిషి నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయ్. ఎందుకో" అంది సీరియస్ గా.
    అంతలో "అక్కాయ్." అంటూ గాఠిగా కేక వినిపించి అందరూ తలలు త్రిప్పి చూశారు.
    రాధకూడా తల త్రిప్పి చూసింది.
    గుమ్మంలో తమ్ముడు సుబ్రహ్మణ్యం నిలుచుని ఉన్నాడు!
    సుబ్రహ్మణ్యాన్ని చూడగానే రాధ మనసులో సితార్లూ, వీణలూ కలగాపులగంగా మోగాయ్.
    "తమ్ముడు" రెండు చేతులూ బార్లాచాపి ముందుకు పరుగైతింది రాధ.
    "హక్కా..." సుబ్రహ్మణ్యం చంకల క్రింది కర్రలని విసిరవతల నిమురుతూ అడిగింది రాధ.
    "దేవతలాంటి నువ్వు ఆ ఇల్లు వదిలిపెట్టాక ఆ ఇంటి కళే పోయిందక్కా కళపోయిన ఆ ఇంటిలో సంతోషంగా ఎలా ఉంటాం అక్కా" కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "కానీ దేవుడులాంటి నాన్నారు ఉన్నారుకదా తమ్ముడూ..." వాడి ఒంటిని ఇంకా నిమురుతూనే ఉంది రాధ.
    "అవుననుకో..."
    ఉన్నట్టుండి మెలికలు తిరగడం మొదలుపెట్టాడు సుబ్రహ్మణ్యం.
    "ఎందుకరా తమ్ముడూ అలా సిగ్గుతో ముడుచుకుపోతున్నావ్...మెలికలు తిరుగుతున్నావ్?.... ఇది నీ అక్క ఇల్లురా... ఇక్కడ మన ఇంట్లో ఉన్నంత స్వేచ్చగా ఉండొచ్చు తమ్ముడూ......"
    "అది కాదక్కా...నువ్వు ప్రేమగా ఒళ్ళు నిమిరితే నిమురుగానీ.... నీవు, చాతీదాటి ఇంకా క్రిందికి రాకక్కా..." మొహం కందగడ్డలా చేసుకుంటూ అన్నాడు సుబ్రమణ్యం.
    రాధ ఓసారి నాలుక కొరుక్కుని చేతిని సుబ్రహ్మణ్యం వీపుమీద వేస్తూ అడిగింది.
    "అమ్మ ఎలాగుంది తమ్ముడూ?"
    "అమ్మ బాగానే అంది అక్కా...ఎప్పట్లా హాయిగా దగ్గుతుంది...."
    "నాన్న..."
    "నాన్న అమ్మకోసం డాక్టర్లని తేవడంతోనూ, అమ్మకు మందులు పట్టించడంతోనూ కాలక్షేపం చేస్తున్నారక్కా..."
    "హలాగా?" రాధ నాలుగు ఆనందభాష్పాలు రాల్చింది.
    "అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ కలిశారుగా... ఇక మేమెవరం అక్కరలేదు..." అన్నాడు గోపి రాధతో.
    "చీ.... అవేం మాటలండీ..." అంటూ రాధ గోపి దగ్గరికి వెళ్ళి ప్రక్కన కూర్చుంది.
    "నువ్వుకూడా రావోయ్!" పరంధామయ్య సుబ్రమణ్యంతో అన్నాడు.
    సుబ్రమణ్యం దీప ప్రక్కన కూర్చున్నాడు.
    "ఊ...ఊ...ఇంక టిఫిన్ తినడం మొదలెట్టండి" అన్నాడు శంకరం ఇడ్లివంక, దోసెలవంక, వడలవంక చూసి లొట్టలు వేస్తూ.
    అందరూ ఒక్కసారిగా టిఫిన్ మీద ఎగబడ్డారు.
    గోపీ ఇడ్లీముక్క తుంచి నోట్లో పెట్టుకోబోయాడు.
    "గోపీ..." హఠాత్తుగా అన్నపూర్ణ పొలికేకపెట్టింది.
    ఆ కేకకి ఉలిక్కిపడ్డ గోపీ చేతిలోని ఇడ్డెన్ ముక్క ఎగిరి నేలమీద పడిపోయింది.
    గోపీ అన్నపూర్ణవంక అయోమయంగా చూశాడు.
    "ఎందుకు వదినా అంతచేటున అరిచావు....? ఇడ్లీలో విషం ఏమయినా కలిసిందా?...." అన్నాడు గోపి.
    "కాదు బాబూ..." కుమిలిపోతూ అంది అన్నపూర్ణ.
    "మరెందుకే అలా అరిచావ్?...." అడిగాడు శంకరం.
    "చెప్పు వదినా...ఎందుకొదినా అరిచావ్?"
    "ఏనాడైనా నువ్వు నీ చేత్తో తిన్నావా గోపీ...? ఎప్పుడూ నేను తినిపిస్తే తినేవాడివి ఈరోజు నువ్వు సొంతంగా తినాలని చూస్తావా గోపీ?....పెళ్ళికాగానే పెద్దవాడివి అయిపోయావా గోపీ?...." బాధగా అంది అన్నపూర్ణ.
    "వదినా వదినా... ఎందుకొదినా అలా సూటీపోటీ మాటలు అంటున్నావ్?.... సరే... తినిపించు.... ఆ...."మొహం అంతా నోరు తెరిచాడు గోపి.
    అంతే!....అన్నపూర్ణ సంతోషంగా చెవుల్దాకా నవ్వి పూర్తి ఇడ్లీ నోట్లో దోపింది అన్నపూర్ణ.
    అంతే... టిఫిన్ ఒకరికొకరు తినిపించుకోవడం ప్రారంభం అయ్యింది.
    గోపీ అన్నపూర్ణ నోట్లో దోసెముక్క పెట్టాడు. దీప గోపీనోట్లో మరో ఇడ్లీముక్క పెట్టింది. గోపీ బదులుగా దీప నోట్లో ఇడ్లీముక్క పెట్టాడు.
    శంకరం తమ్ముడి నాలిక్కి అప్యాయంగా అల్లంపచ్చడి రాశాడు. గోపీ అన్నయ్య నోట్లో వడముక్క కొట్టాడు. సుబ్రమణ్యం నోట్లో దీప దోసె పెడితే, సుబ్రమణ్యం  దీపకి మంచినీళ్ళు త్రాగించాడు. పరంధామయ్య సరస్వతి నోటికి దోసెముక్క అందిస్తే సరస్వతి సిగ్గుతో చితికిపోతూ పరంధామయ్య నోటికి వడ అందించింది.
    రాధ బొమ్మలా నిలబడిపోయింది.
    తన ప్రాణానికి ప్రాణమైన గోపి! తన భర్త గోపీ నోటికి వడ అందించాలనే ఆమె ప్రయత్నం విఫలప్రయత్నం అయ్యింది. అందరూ పోటీలుపడి గోపికి తినిపిస్తున్నారు. అన్నపూర్ణ మరీనూ...
    రాధ కళ్ళలో నీళ్ళు తిరిగాయ్.
    "భగవాన్....గోపీ నా వడ తిననే తినడా?" ఆమె హృదయం ఆక్రోశించింది.

                                                             * * *
    "హమ్మా..."
    సుబ్రమణ్యం ఆనందంగా గావు కేక పెట్టాడు.
    "నాయనా సుబ్బూ....ఖళ్....ఖళ్....వచ్చేశావా నాయనా...ఖళ్...నా మంచం దగ్గరికి రా ఖళ్...నాయనా.." కామాక్షమ్మ ఆనందంగా దగ్గింది.

 Previous Page Next Page