Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 5

    సుబ్రమణ్యం కామాక్షమ్మ ఎదురుగా నిల్చుని బొటబొటా కన్నీళ్ళు కార్చాడు. కొడుకు కళ్ళవెంట కార్తున్న కన్నీరు చూసి నారాయణరావు కంగారు పడిపోయాడు. "ఏంట్రా - ఎందుకలా ఏడుస్తున్నావ్? క్షేమంగానే ఉందికదూ?" అంటూ అడిగాడు.
    సుబ్రమణ్యం పకపకా నవ్వి.... "హయ్యో పిచ్చినాన్న.... ఇవి కన్నీళ్లు కావు... ఆనందభాష్పాలు!!..." అన్నాడు.
    "మన రాధ ఖళ్ క్షేమంగా ఉందా  ఖళ్ ఖళ్ బాబూ..." అడిగింది కామాక్షమ్మ.
    "క్షేమంగా ఉండమ్మా... ఆ ఇంట్లో అక్కయ్యకి ఎంత విలువ ఉందనీ?.... ఆ ఇల్లు ఒక మమతల కోవెలమ్మ. ఒకరిమీద ఒకరు విసుగుపుట్టేలా ప్రేమలు కురిపించేస్కుంటారమ్మా.... పొట్టపగిలేలా ఒకరికొకరు దోసెలూ, ఇడ్లెన్ లూ తినిపించుకుంటారమ్మా... అదో దేవాలయం అమ్మా..." అన్నాడు సుబ్రమణ్యం.
    కామాక్షమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ భర్త ఫోటోవంక చూస్తూ "ఏవండీ.... ఖళ్... చూశారా.., మన అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో....ఖళ్... ఒక ప్రేమ మందిరంలో పడిందండీ మన అమ్మాయి.... ఖళ్ ఖళ్" అంది.
    నారాయణరావు పళ్లు కొరుకుతూ అన్నాడు "నేను బ్రతికే వున్నాను.... ఆ ఫోటోకి చెప్తావేం? నాతో చెప్పేడు"
    కామాక్షమ్మ నాలుక కొరుక్కుని దగ్గింది.
    తర్వాత కాసేపు వాళ్లు ముగ్గురూ రాధ అదృష్టాన్ని గురించి తలుచుకొని బొటబొటా ఆనందభాష్పాలు ధారాపాతంగా కార్చారు.
    త్వరలో కథ వింతమలుపు తిరుగుతుందని వాళ్ళకా క్షణంలో తెలీదు.
 
                                                                      4
    "ఏవండీ....నీళ్ళు కాగాయ్... మీరు స్నానం చేస్తారా?" అడిగింది రాధ గదిలోకి వస్తూ.
    "స్నానమా?... నువ్వు చేయిస్తావా?...." గోపి రాధకి కన్ను గీటుతూ పైట పట్టుకుని లాగాడు.
    "ఏమండి ఇప్పుడు టైం ఎంతయిందండీ..." అడిగింది రాధ.
    "తొమ్మిది! ఏం?"
    "చూశారా ఉదయం తొమ్మిది గంటలకు మీరు నా కొంగుపట్టుకుని లాగుతున్నారు... మీరు సరసాలు ఆడ్డానికి వేళాపాళా లేదా ఏం?... అంది రాధ మయ చిలిపిగా గోపివంక చూస్తూ.
    "మనకి ఆ టైమూ గియ్ మూ లేదోయ్... ఎప్పుడు బుద్ధిపుడితే అప్పుడే..." రాధ పైటతో సహా చీర మొత్తం గోపీ చేతిలోకి ఊడి వచ్చేసింది.
    రాధ తన రెండు చేతుల్తో గుండెలు కప్పుకుని గోపివంక సిగ్గుగా చూస్తూ కాలి బొటనవ్రేలితో నేలమీద రాయసాగింది.
    రాధ చూసిన ఆ చూపుకి గోపి గిలగిల్లాడిపోయి హఠాత్తుగా రాధని గట్టిగా కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరిచేసేవాడు
    "బాబాయ్"
    ఉన్నట్టుండి దీప గొంతు ఆ గదిలో ప్రతిధ్వనించింది.
    అంతే !... గోపి, రాధ గదికి చెరో మూలా ఎగిరిపడ్డారు.
    దీప కిల కిలా నవ్వింది. రాధ కంగారుగా లేచి ఒంటికి గబ గబా చీర చుట్టుకుంది.
    "ఏంటి పాపా హఠాత్తుగా ఇలా వూడిపడ్డావ్?" అడిగాడు చిరునవ్వు నవ్వుతూ. రాధ మాత్రం చిన్నబుచ్చుకుంది.
    "ఏంలేదు బాబాయ్. ప్రొద్దున్న లేచినదగ్గర్నుండీ నాకు ఒక్క ముద్దుకూడా ఇవ్వలేదు. నాకు ముద్దియ్యవా బాబాయ్? నువ్వు ముద్దిచ్చాక దేవాలయంలాంటి స్కూలుకి వెళతాను" అంది దీప కళ్ళు చక్రాల్లా తిప్పుతూ.
    గోపీ మోకాలి,మీద కూర్చుని దీప బుగ్గమీద ముద్దుపెట్టాడు.
    "పిన్నీ నువ్వు కూడా" రాధని చూస్తూ అంది దీప.
    రాధ దీప రెండో బుగ్గమీద ముద్దు ఇచ్చింది.
    "ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి ఇవ్వాలి." అంది ముద్దుముద్దుగా.
    రాధ, గోపి ఇద్దరూ ఒకేసారి దీప బుగ్గమీద ముద్దుపెట్టే సమయంలో దీప చటుక్కున వెనక్కి తిరిగింది.
    అంతే... గోపి, రాధ బుర్రలు కొబ్బరికాయ కొట్టినట్లు పఠేల్ మని శబ్దం చేశాయ్.
    అయినా బాధపడకుండా ఇద్దరూ పక పకా నవ్వి "చిలిపి పిల్ల!" అని దీప మెచ్చుకున్నారు.
    "నీ స్కూలుకి టైమైంది ఇక నువ్వు వెళ్ళమ్మా" అన్నాడు గోపి దీప టెంకిమీద మెల్లగా కొడ్తూ.
    దీప చెంగున అక్కడినుండి పరుగుతీసింది.
    "మీరు ఒక స్నానానికి పదండి... బాత్రూంలో నీళ్ళు పెట్టేస్తాను" అంది రాధ చీర చెంగుని మొలలో దోపుకుంటూ.
    "నేను పెట్టేశాను చెల్లీ...వేడినీళ్ళలో చల్లనీళ్ళు కూడా తొరిపేశాను. గోపి నీళ్ళు ఎంత వేడిగా పోసుకుంటాడో  నీకు తెలియదు కదా?" అంది అన్నపూర్ణ.
    "ఉండండి టవల్ తీసుకొస్తా" అంది రాధ.
    "అది కూడా తెచ్చాను చెల్లీ...." అన్నపూర్ణ గోపికి టవల్ అందించింది.
    గోపి అన్నపూర్ణ ప్రేమకి కరిగిపోయాడు.
    "వదినా! ఎందుకు వదినా నా మీద నీకు ఇంత ప్రేమ?" కళ్ళనీళ్ళు నింపుకుంటూ అడిగాడు గోపి.
    "తల్లికి ఏ బిడ్డమీద ప్రేమ ఉండదు బాబూ?"
    "వహ్విదినా!" ఆనందంతో రంకె వేశాడు గోపి.
    "ఏంటి బాబూ ఆ రంకెలు. కాలనీలోనివాళ్ళంతా ఉలిక్కిపడ్తారు. ఇట్టారా స్నానం చేద్దువుగాని" అంటూ అన్నపూర్ణ గోపిని బరబరా బాత్రూంలోకి లాక్కెళ్ళి, అతని బట్టలూడదీసి, ఒట్టి డ్రాయర్ మీద స్టూల్ మీద కూలేసి కొబ్బరిపీచుతో వీపునీ, ఒంటినీ బాగా తోమి స్నానం చేయించింది.
                                                         * * *
    రాత్రి ...
    డైనింగ్ హాల్లో అందరూ భోజనం చెయ్యడానికి కూర్చున్నారు.
    "ఆ.... వదినా! ఏదీ నీ అమృతహస్తంతో నాకు తినిపించు..." అన్నాడు గోపి హుషారుగా
    "తినిపిస్తాను బాబూ. తినిపిస్తాను. నీకంటే నాకింకెవారు ఎక్కువ?" అంటూ కంచంలో అన్నం కలిపి గోరుముద్దులు నోటికి అందించబోయింది అన్నపూర్ణ.
    "హమ్మా అన్నపూర్ణా! ఏంటమ్మా అది?" కోపంగా అరిచాడు పరంధామయ్య.
    "గోంగూర పచ్చడన్నం, ఇవేమో బంగాళదుంపలు వేయించిన ముక్కలు మామయ్యా" సమాధానం చెప్పింది అన్నపూర్ణ.
    తినిపిస్తున్నది ఏమిటో తెలుసుకోవడానికి అంత కోపంగా ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకేమొచ్చిందో అన్నపూర్ణకి అర్థంకాలేదు.
    "నేనడుగుతుంది నువ్వు వాడికేం తినిపిస్తున్నావని కాదమ్మా. నువ్వు చేస్తున్న పని ఏమిటని? ముందు కష్టపడి పనిచేసేవాళ్ళకి తిండి పెట్టు. అంతేగానీ తిండి తిని బలాదూర్ గా తిరిగొచ్చి నిద్రపోయే సోమరిపోతులకు కాదు. ముందు నువ్వు శంకరానికి వడ్డించు" ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు పరంధామయ్య.
    ఆయన ఆవేశానికి అక్కడ వున్న అందరూ బిత్తరపోయారు.
    అన్నపూర్ణ చేతిలోని గోంగూరపచ్చడి అన్నంప్లేటు జారి క్రిందపడిపోయింది.
    ఆమె కళ్ళు వొత్తుకుని భర్త శంకరానికి ముందుగా వడ్డించింది.
    గోపి మొహం చిన్నబోయింది. భర్త మొహంలోకి బాధని గమనించిన రాధ హృదయం గిలగిల్లాడిపోయింది.
    కొన్ని క్షణాల తర్వాత తమాయించుకుని గోపి టేబుల్ మీద పదార్ధాలను తన కంచంలోకి వడ్డించుకుని తినడం ప్రారంభించాడు.
    తనంతట తాను...తన చేతితో తిని చాలాకాలం అయ్యింది అతనికి.అందుకనే అతని కుడిచేయి అదేపనిగా వణికిపోసాగింది.
    "గోపీ! ఆ వెన్నముద్దని అన్నంలో కలుపుకొని తిను బాబూ" అంది అన్నపూర్ణ చిన్న గిన్నెని చూపిస్తూ.
    గోపీ ఆ గిన్నెని అందుకునేలోగా పరంధామయ్య చటుక్కున తనే ఆ గిన్నెని అందుకుని అందులోని వెన్నని సగం తను వేస్కుని మిగతా సగం పెద్దకొడుకు శంకరం కంచంలో వేశాడు.
    గోపీ దెబ్బతిన్నాడు.
    తింటున్న కంచంలో చేయి  కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు. రాధ కూడా తన కంచంలో చేయి కడుక్కుని అతని వెనకాలే వెళ్ళిపోయింది.
    పరంధామయ్య తృప్తిగా నవ్వుకున్నాడు.
    ఉదయం...
    "గోపీ! వేడినీళ్ళు పెట్టాను స్నానం చెయ్యడానికి రావయ్యా" అంది అన్నపూర్ణ ప్రేమగా.
    గోపి టవల్ భుజాన వేస్కుని బాత్రూం వైపు అడుగులు వెయ్యబోయాడు.
    "ఆగు" పరంధామయ్య గర్జించాడు.
    గోపి ఆగిపోయి బిత్తరపోయి తండ్రివంక చూశాడు.
    "నీకేం కంగారు స్నానానికి? ఓ పనా పాటా? సుష్టుగా భోజనంచేసి యింట్లో పండడమేగా? ముందు అన్నయ్యని స్నానంచెయ్యనివ్వు" అన్నాడు పరంధామయ్య.
    అప్పటికే శంకరం టవల్ తీసుకుని బాత్రూములోనికి వెళ్ళిపోయాడు.
    గోపీ సర్రున తన గదిలోకి వెళ్ళిపోయి మంచంమీద దభీమని బోర్లాపడ్డాడు.

 Previous Page Next Page