Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 1

                                                      నవ్వితేనవ్ రత్నాలు -2
                                                                                ------ మల్లిక్                                        

                                        "నాకు ఓటెయ్యండీ ....ప్లీజ్ !"
    "నాకు ఓటెయ్యండీ ....ప్లీజ్..."అని ఎవరంటారు?.....
         రాజకీయ నాయకుడు అంటాడు అని మీరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే  రాజకీయ నాయకులు ఎప్పుడో ఎన్నికలప్పుడు మాత్రమే ఓటు వెయ్యమని అడుగుతారు...వీళ్ళు మాత్రం సంవత్సరం పొడుగునా ఎప్పుడూ ఓట్లు అడుగుతూనే ఉంటారు.
    ఎవరబ్బా వీళ్ళు అని ఆలోచిస్తున్నారా?...చెప్తా...చెప్తా...
    అది "లస్కుటపా" టీవి ఛానల్. ఆ   ఛానల్ లో "మీరూ  గార్ధబమే"అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కడెక్కడినుండో గాయని గాయకులు వచ్చి పాడతారు....అంటే అది పాడేవారికి పోటీ  కార్యక్రమం  అన్నమాట... దానికి జడ్జీలు  సంగీత దర్శకుడు సరిగమ పప్పరావ్, సినీగాయని కీచురాణి (ఈమె అర డజను సినిమాల్లో "ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ...అంటూ కోరస్ లోపాడింది ...ఒకటి రెండు   సినిమాల్లో సోలోగా కూడా పాడింది ),గీత రచయిత బూతప్ప!
    ఆ  రోజు  కార్యక్రమంలో నలుగురు పార్టిసిపెంట్స్ పాల్గొంటున్నారు. ఇద్దరు మగా...ఇద్దరు ఆడా!అందరూ  దాదాపు  పాతికేళ్ళ వయసు వాళ్లు.
    కార్యక్రమం ప్రారంభం అయింది.
    ఈనాటి  "మీరూ  గార్ధబమ్" కార్యక్రమంలో రాజు, మీనా, గోపి, పద్మ పాల్గొంటున్నారు.... ముందుగా మీ ముందుకు రాజు వస్తున్నాడు....
    "రాజు ..."అంటు గావుకేక పెట్టింది యాంకర్
    రాజు ఆ కేకకి ఒక్కసారి ఉలిక్కిపడి బిక్కచచ్చిపోయి...మళ్ళీ తేరుకుని స్టేజి మీదకి వచ్చి జడ్జీలకీ, ఆడియన్స్ కీ వందనం చేశాడు.
    అందరూ చప్పట్లు కొట్టారు.
    జడ్జీలు చప్పట్లు కొడుతూనే రాజు వంక వేళాకోళంగా చూశారు. ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళలో వాళ్ళు మొహమొహాలు చూస్కుని  "పిచ్చినాయాలు " అనే మీనింగ్ వచ్చేలా  నవ్వుకున్నారు.
    "చూడు రాజు...నువ్వు ఎక్కడి నుండి వచ్చావ్?..." అడిగాడు సరిగమ పప్పారవ్.
    "వైజాగ్  నుండి  వచ్చానండీ!"అన్నాడు రాజు వినయంగా.
    "ఏంటీ... ఈ బోడి ప్రోగ్రాం కోసం వైజాగ్ నుండి వచ్చావా?" అంది కీచురాణి కిసకిసా నవ్వుతూ.
    యాంకర్ లబలబ మొత్తుకుంటూ అరచేత్తో నోటిమీద కొట్టుకుంది... ఆమె గబగబా కీచురాణి దగ్గరికి వెళ్లి ఆమె చెనిలో మేడమ్... ఇది మా ఛానల్ ప్రోగ్రాం... దీనికి మీరు జడ్జి... మీరలా అనకూడదు!" అంది.
    "కానీ నేను వైజాగ్ లోనే ఉంటానండీ... ఇంకా దూరంనుండి ఎలా రాగలనండీ?" వెర్రి మొహం వేస్కుని వినయంగా అన్నాడు రాజు.
    "నువ్వు వైజాగ్ నుండి వెనక్కి భువనేశ్వర్ వెళ్లి... అక్కడి నుండి ఢిల్లీ వెళ్లి... అక్కడి నుండి హైదరాబాద్ రావాల్సింది!... అప్పుడు బోల్డంత దూరం నుండి వచ్చినట్లు ఉండేదిగా?" అన్నాడు సినీ గీత రచయిత బూతప్ప.
    రాజు వెర్రిమొహం వేశాడు.
    జడ్జీలు ముగ్గురూ విరగబడి నవ్వారు. అప్పుడు రాజు బూతప్పుని అతని పాటల్లోని బూతులుకంటే ఎక్కువ బూతులు తిట్టుకున్నాడు మనసులో....
     "సరేగానీ రాజూ.... ముందు ఏ పాటపాడ్తావ్?...." అడిగాడు సరిగమ పప్పారవ్.
    "ఘంటసాలగారు పాడిన అందమె ఆనందం-ఆనందమె జీవిత మకరందం పాడ్తానండీ...." అన్నాడు రాజు.
    "ఓ... పాత షింతకాయ్ పష్షడి....ఊ... పాడు..."అంది కీచురాణి.
    రాజు పాడడం మొదలుబెట్టాడు. జడ్జీలు ముగ్గురూ వెంటనే కంగారుగా అట్టలు తీసి ఒళ్లో పెట్టుకుని తల వొంచుకుని ఏంటేంటో పెన్నుతో బరికేస్తున్నారు పరీక్షరాసే కుర్రాళ్ళలా. మధ్యమధ్య రాజుని నిర్లక్ష్యంగా.... సీరియస్ గా.... జాలిగా... కోపంగా చూస్తూ ఉన్నారు.
    అతను పాడడం ముగించాడు. రాజు పాపం ఆ పాటని బాగానే పాడాడు. ఆడియన్స్ చప్పట్లు బాగా కొట్టారు.
    "సంగీతంలో నీకు గురువు ఎవ్వరు?...హిహిహి?ఆ?...." వేళాకోళంగా అడిగాడు సరిగమ పప్పారవ్.
    "ఎవరూ లేరండీ.... నేను సంగీతం నేర్చుకోలేదు...." అన్నాడు రాజు.
    "ఒహో... అలా చెప్పు... సరే... ఇక వెళ్లు..." కుడిచేతిని వయలెంట్గా ఊపాడు బిచ్చగాడిని ఛీదరించుకుంటూ వెళ్లమని చెప్తారే... ఆ లెవెల్లో...
    రాజు ఓసారి తెల్లబోయి... తర్వాత బాధగా స్టేజి మీద వెనకాలకి వెళ్లి మిగతా పార్టిసిపెంట్స్ దగ్గర కూర్చున్నాడు.
    "అవర్ నెక్స్ట్ పార్టిసెపెంట్ ఈజ్ గోపీ... కమాన్ గోపీ..." అని అరిచింది యాంకర్.
    ఆ అరుపుకి గోపి ఛాతిమీద రుద్దుకుంటూ స్టేజి ముందుకి వచ్చాడు.
    "గోపీ... నాకేమో నిన్ను పాపీ అని పిలవాలనిపిస్తుంది!!..." అని జోకేశాడు సరిగమ పప్పారవ్.
    మిగతా ఇద్దరు జడ్జీలూ, యాంకరూ ఫకాల్మని నవ్వారు... పాపం... గోపీ మొహం చిన్నబోయింది.
    "ఏం పాడాలని అనుకుంటున్నావ్?" అడిగింది కీచురాణి.
    "తుపాకి పిల్లడికి లపాకి పిల్ల... సినిమాలోని ఓ పాట పాడ్దామని అనుకుంటున్నానండీ" అన్నాడు గోపి.
    "ఏదీ పాడు చూద్దాం-దమ్ముంటే!" అన్నాడు బూతప్ప.
    గోపి"నీకు చింతపిక్కా... నాకు సొంటి పిక్కా...హై..." అంటూ పాడడం మొదలు పెట్టాడు.
    గోపి చాలా అపస్వరాలతో పాడ్తున్నాడు... అయినా వాళ్లు ముగ్గురూ ఎందుకో ఒకరు కళ్లు మూస్కుని... ఒకరు కళ్లు తేలేసి... మరొకరు మిడిగుడ్లేస్కునీ చాలా పరవశంగా తలలు ఊగిస్తూ ఆ పాట విన్నారు.
    గోపి పాట ముగించాడు.
    జడ్జీలు చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు.
    "చాలా బాగాపాడావుగానీ ఇంకొంచెం తక్కువ శృతిలో పాడ్తే బాగుండేది!" అన్నాడు సరిగమ పప్పారవ్ ఏదో ఒకటి అనాలి కదా అని.
    "మర్వెలెస్... బాగా పాడావ్ గోపీ... కానీ పాడ్తున్నంతసేపు మోకాలుని బాజాగా ఇట్టా ఇట్టా ఆడించావ్... అలా ఆడిస్తే తప్ప పాడలేవా?..." చిలిపిగా చూస్తూ అడిగింది కీచురాణి.
    "పాడగలనండీ ... కానీ ఇదివరకు ఇలానే ఓ సింగింగ్ కాంపిటేషన్ జరిగినప్పుడు నేను మామూలుగా పాడ్తే అక్కడ జడ్జీలుగా వచ్చిన వాళ్లు నేను ఇలా ఊగిస్తూ పాడ్తే బాగుంటుందని అన్నారండీ... అందుచేత నేను ఇలా ఊగిస్తూ పాడడం ప్రాక్టీస్ చేశా..." చెప్పాడు గోపి..
    "అతను ఊగిస్తూ పాడ్తే కీచురాణికి అభ్యంతరమేమోగానీ... నాకేం అభ్యంతరం లేదు... హిహిహి" అన్నాడు బూతప్ప."కానీ ఇప్పుడు నువ్వు పాడిన పాటలో సాహిత్యం చాలా బూతుగా ఉంది."

Next Page