Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం  పేజి 3

    రాధ చెంగున మేడమెట్లన్నీ క్షణంలో ఎక్కేసింది.
    గోపీ గదిమధ్యలో నిల్చుని కళ్ళు మూసుకుని రెండుచేతులూ బారజాపి "అమ్మా చెల్లెమ్మా. రావాలమ్మా ....త్వరగా రావాలమ్మ....ఉదయం లేవగానే ఈ అన్నయ్య నిన్ను చూసిన తర్వాతే ఈ ప్రపంచాన్ని చూస్తాడని తెలీదా చెల్లీ. రామ్మా..." అరిగిపోయిన రికార్డులా అంటూనే వున్నాడు గోపీ.
    రాధ గోపీదగ్గరకెళ్ళి అతనికి తగిలేలా నిల్చుంది.
    అంతే. గోపి ఆమెను అమాంతం వాటేస్కున్నాడు.
    "అమ్మా చెల్లీ. చెల్లెమ్మా..."
    ఇంకా కళ్ళు మూస్కుని రాధని కౌగిలించుకునే ఆమె వీపుని తమకంగా నిమురుతున్నాడు గోపి.
    "నేను మీ చెల్లెని కాదండీ భార్యని!" అతని కౌగిలి విడిపించుకుంటూ మెల్లగా అంది రాధ.
    గోపి కళ్ళుతెరిచి చూశాడు.
    "రాధా!నువ్వా...?"
    దెబ్బతిన్నట్టు ఆమెవంక చూశాడు గోపి.
                                                                         2

    "అవునండీ. నేనే...మీరు తాళికట్టిన ఆడదాన్ని. మీ భార్యని!"
    పైటచాటు తాళిని బయటకిలాగి గోపీకి చూపించింది రాధ.
    అమ్మా చెల్లీ? ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? ఈ అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయినా నా బంగారుతల్లీ?"
    కాలర్ నలిపేస్కుంటూ జుట్టు పీకేస్కుంటూ బాధగా అన్నాడు గోపీ.
    అతని కళ్ళలోంచి రెండుచుక్కలు రాలాయ్.
    "ఊర్కోండి. పెళ్ళయిన ఆడది కాపురానికి వెళ్ళక ఇంట్లోనే వుంటుందా ఏంటీ?" ఓదారుస్తూ అంది రాధ.
    "కానీ నా చెల్లెలు దేవత రాధా." ముక్కు పొంగిస్తూ అన్నాడు గోపి.
    "అంజిబాబు కూడా దేవుడేనండీ. మీ చెల్లెల్ని బాగానే చూస్కుంటాడు."
    "అంతేనంటావా రాధా?"
    "అంతే. మీరిక సంతోషంతో ఉండండి. ఇకనుండి పాచిమొహముతో కళ్ళుతెరిచి చూసేది నా మొహమే. ఆ తర్వాత కౌగిలింతలు కూడా నాతోనే." అంది రాధ గంభీరంగా.
    "రాధా..." ఆవేశంగా అని రాధని లటుక్కున కౌగిలించుకున్నాడు గోపి.
    వాళ్ళు అలా ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోతూ కాసేపు నిల్చుండిపోయారు.
    ఇంతలో కిందనుండి పరంధామయ్య గేవుకేక వినిపించింది.
    ఆ కేకకి ఇద్దరూ ఉలిక్కిపడి కౌగిలి వీడారు.
    "ఏంటి రాధా. మా నాన్నగారు అంతచేటున అరిచారు?" కంగారుగా అన్నాడు గోపీ.
    "ఏమోనండీ. ఇందాక నేను బాత్రూమ్ లో బట్టలు వుతికి సబ్బునీళ్ళు పోయేలా నేల కడగలేదు. కొంపదీసి బాత్రూంలోకి వెళ్ళి కాలుజారిపడి నడ్డిరక్కొట్టు కున్నారేమో!?"
    ఆందోళనగా అంది రాధ.
    "నాన్నా." ఆర్తనాదం చేశాడు గోపి.
    "నో. అలా జరగడానికి వీల్లేదు. మా నాన్నగారు దేవుడు రాధా. ఆయన నడ్డిరగడానికి వీల్లేదు రాధా వీల్లేదు!" జుట్టు పీక్కున్నాడు గోపి.
    "అవునండీ ఆయన నిజంగానే దేవుడు. ఆయన నడ్డి విరగడానికి వీల్లేదు. మనం ఇక్కడ ఇలా జుట్టు పీక్కుంటూ టైంవేస్టు చేసేకంటే కిందకెళ్ళి అసలేం జరిగిందో చూడడం మేలండి."
    "పద. వెళ్దాం."
    ఇద్దరూ గబగబా మెట్లుదిగి క్రిందికి వెళ్ళారు.
    అక్కడ..
    హాలుమధ్యన పరంధామయ్య వణికిపోతూ నిలబడి వున్నాడు. ఆయన శరీరం నిలువెల్లా కంపించిపోతూంది.
    ఆయనచుట్టూ శంకరం, అన్నపూర్ణా, సరస్వతి, దీప అందరూ నిల్చుని ఆందోళనగా చూడసాగారు.
    "నాన్నా. ఏంటి నాన్నా? ఎందుకిలా సుడిగాలి తాకిడికి లతలా గడగడా వణికిపోతున్నావ్? నీ కసలు ఏమైంది నాన్నా?" కంగారుగా అడిగాడు గోపి.
    పరంధామయ్య తేరుకుని గోపివంక చూశాడు.
    "నాకేం కాలేదురా. నాకేం కాలేదు." అన్నాడు.
    "మరి ఎందుకలా వణికిపోతున్నావ్?"
    "ఆనందంరా. ఆనందం."
    ఆయన మొహంలో ఆనందం పొంగిపొర్లుతూంది మూసీనదిలోకి వదిలిన డ్రైనేజి కాలువలాగా.
    "ఆనందమా! ఎందుకు మామయ్యగారూ? దేవతలాంటి నేను ఈ ఇంటిలో అడుగుపెట్టాననా?" అడిగింది రాధ.
    రాధ గొంతు వినగానే పరంధామయ్య చటుక్కున అమెవైపుకు తిరిగాడు. ఆయన మొహం విప్పారింది.
    అంతే...
    ఒక్క జంప్ చేసి రాధ ముందుకదూకి ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు.
    రాధ కూడా ఆయనకు బల్లిలా కర్చుకుపోయింది.
    "నాన్నా. హేన్టిది నాన్నా? ఇది చాలా అన్నాయం నాన్నా." ఆక్రోశించాడు గోపి.
    "లాభం లేదు గోపీ. నువ్వెంత ఆక్రోశించినా నేను నిన్ను కౌగిలించుకోను. ఈ అదృష్టంమంతా కోడలు పిల్లదే." అన్నాడు పరంధామయ్య కౌగిలి మరికాస్త బిగిస్తూ.
    "అవును మామయ్యగారూ. ప్రేమాభిమానాలు పాలూతేనెలమాదిరి కలిసిన ఆత్మీయతతో మీరు దగ్గరకుతీసుకోవడం నిజంగా నా అదృష్టమే..." అంది రాధ పరవశంగా.
    "హబ్బా!" గోపి కసిగా జుట్టు పీక్కున్నాడు.
    "నువ్వు నా పాయింట్ అర్థం చేసుకోవడంలేదు నాన్నా. అసలు రాధని ఎందుకలా పట్టేస్కున్నావ్?" గుడ్ల నీరు కుక్కుకుంటూ అడిగాడు గోపి.
    "ఆనందం బాబూ. ఆనందం!" అన్నాడు పరంధామయ్య రాధని వదిలేస్తూ.
    "ఎందుకంత పట్టలేని, రాధని పట్టుకునేంత ఆనందం?" పళ్లు కొరుకుతూ అన్నాడు గోపి.
    పరంధామయ్య అందరివంకా చూస్తూ ఆనందంగా నవ్వాడు.
    "మీకో శుభవార్త! అని ఆగి ఆతృతగా ఎదురుచూస్తున్న అందరివంకా చూసి మళ్ళీ అన్నాడు. "ఇప్పుడే మేనేజర్ దగ్గర్నుండి ఫోన్ వచ్చింది.
    మన కంపెనీకి ఈ సంవత్సరం బాగా లాభాలు వచ్చాయంట. ఇదంతా రాధ ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. అదృష్టం అంతా రాధదే..." అంటూ పరంధామయ్య రాధవైపుకు ఒక్క అడుగువేశాడు.   
    గోపి మెరుపులా రాధ చెయ్యి పట్టుకుని తన ప్రక్కకి లాక్కున్నాడు మళ్ళీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని.
    "అవును నాన్నా. నువ్వు చెప్పింది నిజమే.హి!" అన్నాడు ఏడవలేక నవ్వుతూ.
    "ఈవేళ మనింట్లో పండగ జరుపుకోవాలి!" అన్నాడు పరంధమయ్యా .
    అందరూ "అవును" అన్నారు కోరస్ గా.
    "నువ్వేమంటావోయ్?" సరస్వతివంక చిలిపిగా చూస్తూ అన్నాడు పరంధామయ్య.
    "ఛీ. నేనేమంటనండీ? నేను గోపికి కన్నతల్లిని అని, మీరు పెంపుడు తండ్రి అనీ మాటిమాటికీ మర్చిపోతున్నారు. " చీర చెంగు భుజాలమీద నిండుగా కప్పుకుంటూ సిగ్గుపడిపోతూ అంది సరస్వతి.
    "అవునుకదూ ఆడ్డెడ్డెడ్డె." అంటూ ఫెళ్ళున నవ్వేశాడు పరంధామయ్య.
    "ఏంటో. ఓడలు బళ్ళు ఓడలు అవుతుంటాయ్. అదేకదా జీవితం అంటే." అంది దీప కళ్ళు తిప్పుతూ.
    "రాధా. నేను పళ్ళు తోముకోవాలిగానీ నా పేస్టూ, బ్రష్షు తీసుకురా..." అన్నాడు గోపి.
    రాధ లోపలికి వెళ్ళబోయింది కానీ అంతలోనే అన్నపూర్ణ చేతిలో పేస్టూ  బ్రష్షుతో చటుక్కున ప్రత్యక్షం అయింది.
    "ఇదిగో బాబూ. నీ పేస్టూ,  బ్రష్షు..." అంది ప్రేమానురాగాల్ని గొంతులో పూర్తిగా పలికిస్తూ.
    "వదినా! నువ్వు, నువ్వు నా  బ్రష్షు పేస్టూ తచ్చావా వదినా." పట్టిపట్టి పలుకుతూ అన్నాడు గోపి.
    ఆమె ప్రేమానురాగాలకి చలించిపోయాడు గోపి.
    "అవును బాబూ. నేనే తెచ్చాను. ఏం బాబూ! పెళ్ళయ్యాక నీకు ఈ వదిన కనిపించకుండాపోయిందా బాబూ. నేను తేకూదడా బాబూ?" బాధగా అంది అన్నపూర్ణ.
    "వదినా....వదినా....వదినా. ఎందుకు వదినా నన్నలా పరాయినిచేసి మాట్లాడతావు? నాకు పేస్టూ తేవడమేకాదు నాపళ్ళు కూడా నువ్వే తోమవచ్చు వదినా. నాకు టిఫిన్ కూడా నీచేతితోనే తినిపించవచ్చు. నాకు స్నానం చేయించవచ్చు... నాకు."

 Previous Page Next Page