"ఎవరు వాళ్ళు.....స్టూడెంట్లా.....అయ్యో.....వాళ్ళతో ఎందుకు తగిలావమ్మా' రాధాదేవి ఆందోళనగా అంది.
"స్టూడెంట్లు కాదండి. వెధవలు. వాళ్ళ వేషాలు, వాళ్ళు ఎవరో రౌడి వెధవలు. అలా పెల్తుంటే ఎన్నాళ్ళూరుకుంటానండి , ఆరోజు తిట్టానని వాళ్ళు మరింత పంతంగా అల్లరి పెట్టడం ఆరంభించారు రోజు రోజు. ఈరోజు ఏం చేసారో తెలుసాండి....యివాళ కాలేజినుంచి మా ఫ్రెండ్ సునీత పుట్టినరోజని దానింటికీ పార్టీకి వెళ్ళి చీకటి పడ్డాక యింటి కొస్తున్నాను. దాని ఇంటిరోడ్డు కాస్త నిర్మానుష్యంగా వుంటుంది. రోడ్డు ,మొగన నల్గురు నించున్నారు. వాళ్ళని చూడగానే నా ప్రాణాలు పోయాయి. నేను ఎక్కడికి వెళ్ళింది తెలుసుకుని వచ్చారన్నమాట. ఇన్నాళ్ళు జనం మధ్య భయం అన్పించలేదు. కాని ఈరోజు సందు మొగన కాపు కాసి - నల్గురు చేతులడ్డం పెట్టి 'పోలీసులని తీసుకొచ్చావంటే జామపండూ...." అని ఒకడు, 'ఏపిల్ పండు ఒక్కసారి కోరకనియవూ " అని మరొకడు - "ఎంటలా బెదురూ చూపులు చూస్తున్నావు? చెప్పుచ్చుకు కొట్టవే' అని మరొకడు - 'చిలక పిట్టా కబుర్లు చెప్పినట్టు కాదు కొట్టు చూద్దాం ' - అని నల్గురు తలోమాట అంటూ నా దారికి అడ్డం కాశారు. కాళ్ళలో వణుకు పుడ్తున్నా భయపడినట్లు కనిపిస్తే మరింత బెదిరిస్తారని ఎవరన్నా అటు రారా అని అటూ ఇటూ చూస్తూ 'మర్యాదగా దారి వదలండి. లేకపోతే ఈ క్షణంలోనే పోలీసులని పిలుస్తాను. నడిరోడ్డు మీద మీకింత ధైర్యం ...." అన్నాను బెదిరిస్తూ బింకంగా.
"నడిరోడ్డుద్దంటారా. పద యింటికో , హోటలుకో పోదాం" అన్నాడొకడు వెకిలిగా నవ్వి.
కోపం పట్టలేక చెప్పు తీసి వాడి చెంప మీద ఒకటి అంటించాను. "వెధవల్లారా! ఆడపిల్లలంటే అంత చులకనగా వుందా..... హోటలుకు తీసికెడతావా పద, మీ మామగారింటికీ తీసికేడ్తాను" అని ఎడాపెడా వాయించేసాను. వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎర్రటి కళ్ళతో తీక్షణంగా చూస్తూ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. అంతవరకున్న ధైర్యం నీరుగారిపోయి కెవ్వుమని అరిచాను. వాడింకా గట్టిగా పట్టుకుని లాగుతున్నాడు. ఇంకేం జరిగేదో శ్యామ్ సైకిల్ మీద అట్నించి వస్తున్నాడు. నా కేక విని చటుక్కున ఆగాడు. నన్ను ఆ స్థితిలో చూడగానే ఒక్క క్షణం నిర్ఘాంత పోయాడు. శ్యా,మ్ ని చూడగానే వాడు నా చేయి వదిలాడు. ఒక్క అంగలో శ్యామ్ దగ్గరికి పరిగెత్తాను. నేను చెప్పక్కరలేకుండానే శ్యామ్ పరిస్థితి గ్రహించి పరిగెట్టి పోవాలని చూస్తున్న వాళ్ళ దగ్గరికి కేకలు పెడ్తూ పరిగెట్టి ఒకడిని పట్టుకుని కింద పడేశాడు. మా యిద్దరి కేకలు విని జనం పోగయ్యారు. ఆ నల్గురు వెధవలని అంతా కల్సి చావకొట్టారు. పోలీసులు, గొడవ ఎందుకని అందరూ తిట్టి పొమ్మన్నారు ...." రేఖ అంతా చెప్పి శ్యామ్ వంక కృతజ్ఞతగా చూస్తూ -- "మీ అబ్బాయికి నేను థాంక్స్ చెప్పుకోవాలి యివాళ."
"ఆ వేళకి నీవు ఎట్నించి వస్తున్నవురా....." రాధాదేవి అడిగింది.
"ప్రెండ్ యింటి నుంచి వస్తున్నానమ్మా.....రేఖ కేక వినగానే పరిచితమైన గొంతులా అన్పించి ఏమిటా అని సైకిలు దిగగానే , తీరా చూస్తే రేఖ .....సమయానికి వెళ్ళకపోతే రేఖని ఏం చేసేవారో .....మన ఇల్లు యిక్కడే అని చెప్పి తీసుకువచ్చాను."
"ఎంత పని జరిగింది? అమ్మా రేఖ , చీకటి పడ్డాక వంటరిగా ఎప్పుడూ వెళ్ళకు తల్లీ. అలాంటి వాళ్ళను చూసీ చూడనట్లు వూరుకోవాలి గాని రెచ్చగొడితే మరింత పెట్రేగిపోయి ఏమన్నా చేస్తారు. ఈరోజు మంచిది . నల్గురు లాక్కెళ్ళి ఏం చేసినా దిక్కెవరు? వద్దు అమ్మా. ఇంకెప్పుడూ అలాంటి వాళ్ళల్తో దేబ్బలాటకి దిగకు...." రాధాదేవి ఆందోళనగా అంది.
"ఆ వెధవలు అలా కూస్తుంటే ఎలా ఊరుకోనండీ? ఊరుకుంటే మన మెతకతనం చూసి మరింత చేస్తారు...." ఆవేశంగా అంది రేఖ.
"ఊరుకోక ఏం చెయ్యగలమమ్మా. శారీరకంగా పురుషుడు మనకంటే బలవంతుడు. ఏ అఘాయిత్యం అన్నా జరిగితే ఆ ఆడదాని బతుకు అధోగతే అవుతుందమ్మా. తన తప్పు కాకపోయినా సమాజం స్త్రీనే శిక్షిస్తుంది . నా మాట విని అమ్మా - మరెప్పుడూ వాళ్ళెం అన్నా విన్నట్టు వెళ్ళిపో..... హు ....ఆడది ఎంత చదివినా , ఎన్ని ఊళ్ళేలినా , సమాన హక్కులంటూ ఎంత మాట్లాడినా ఆనాటికీ , ఈనాటికి స్త్రీ పురుషాధిపత్యానికి తల ఒగ్గే వుందమ్మా. ఓ ఆడపిల్ల చీకటి పడ్డాక క్షేమంగా ఇల్లు చేరటం కూడా అనుమానస్పదమే . ఆనాడూ, ఈనాడూ మనం ఏం స్వాతంత్యం సాధించామో అర్ధం కాదు...." రాధాదేవి గొంతులో కంపన, ఆవేదన చూసి రేఖ ఆమె తన గురించి అంత బాధపడుతున్నందుకు ఆమె పట్ల , ఎంతో గౌవరం, అభిమానం కల్గింది. ఆమెని చూడగానే ఆ నలబై దాటిన వయసులో కూడా ఆమె అందం, హుందా ఆ సంస్కారం వుట్టిపడే మొహం, అభిమానంగా మాట్లాడే తీరు అన్నీ రేఖని ఆకర్షించాయి.
ఈమె యింత అందంగా వుంది. మరి శ్యామ్ ..... తండ్రి పోలిక? .....
"ఈ సంగతి యిదివరకు మీ యింట్లో చెప్పావా అమ్మా...."
"లేదండి , ఎవరో రౌడీ వెధవలు ఏదో కూస్తే ఇంట్లో చెప్పేది ఏమిటి అని ఊరుకున్నాను. ఇవాళ సంగతి నాన్నగారితో చెపితే ఏం అంటారో]నని భయం వేస్తుంది. మరి చీకటి పడ్డాక ఇల్లు కదలవద్దని కట్టడి చేసి యింకేక్కడికీ వెళ్ళనీయరని భయం వేస్తుంది."
"లేదు. ఇంట్లో చెప్పమ్మా. ఆ వెధవలని వీలయితే మీ నాన్నగారికి చూపు. ఎందుకన్నా మంచిది.ఈరోజు సంఘటనతో వాళ్ళు మరింత కోపం తెచ్చుకుని ఏమన్నా చేస్తారేమో, పోలీసులకి చెప్పడం మంచిదేమో ..." రాధాదేవి సాలోచనగా అంది.
"అమ్మా! అలాచేస్తే యివాళ కాకపోతే రేపన్నా వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటా]
రేమో ఆ కక్ష మనసులో పెట్టుకుని" శ్యామ్ అన్నాడు.
"ఇప్పుడు మాత్రం కక్ష వుండదంటావా?" ఏమో పోలీసులకి చెప్పడం మంచిదేమో.....మీ నాన్నగారితో మాట్లాడి వారెలా చెపితే అలా చెయ్యమ్మా! మరిచేపోయాను. వుండు కాస్త కాఫీ తెస్తాను....శ్యామ్ వచ్చి యింటి దగ్గిర దింపుతాడులే. భయం లేదు."
వద్దండి. మరోసారి వస్తాను. ఇప్పుడే పార్టీలో అన్నీ తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యం అయింది. అమ్మా నాన్న అరాటపడుతుంటారు. వెళ్తాను. శ్యామ్ , సారీ ట్రబుల్ ఇస్తున్నాను. నన్ను కాస్త దింపుతారా?"