Previous Page Next Page 
జనపదం పేజి 3

 

    "అమృతా ఎట్లయినావు? ఊరు పాడు పడ్డది. గడీ పాడుపడ్డది. గడీ ఇడిచి ఎందుకు పోలేదు వాణీ! ఎందుకిట్లయిపోయినావు?" ఆవేదన కురిసింది. ఆమెలో మిణుకు మిణుకు మనే దీపం వెలిగింది.
    "దొరా! బాంచను! నీ ఉప్పు తిన్న. నీ సోమ్మేట్ల దోచుకుండును దొరా! మీరు పోయిన్రా రావాన్ని గడీల కాపలా పెట్టిన - గడీల పడున్న. దొరా ఏం చెప్పుదు! ఉప్పెననోచ్చిందనుకోరి, మాలోడు, మాదిగోడు, మంగలోడు, చాకలోడు కూడా తుపాకులు పట్టిన్రు. ఇరుచుక పడ్డారనుకోరి వేలకు వేల జనం. అల్ల కాల్ల మీద పడ్డ బతిమలాడిన ఎవడన్న ఇన్నాడా బాంచను! నన్ను గుంజి అవతల పారేసిన్రు, గడ్డ పారలతో తవ్విన్రు అరిచిన్రు -మోత్తుకున్నారు. దోర్లనే దొంగలన్నరుండి! దర్వాజాలు, తలుపులు, మంచాలు, నిలువుటద్దాలు ఒక్కటానుండి అన్నీ దోచుకుపోయిన్రు. ఇగో గడీ నిట్ల చేసి పోయిన్రు. రావడు కూడా వాండ్లల్లనే కలిసిపోయే. ఏం చేద్దును దొరా! ఏం  చేయలేకపోతిని" తుదకు "ఎట్లోచ్చిన్రు దొరా! వాండ్లోస్తరు ,. తుపాకులేస్తరు , పో దొరా జల్ది పో" అని అతన్ని పక్కకు నెట్టింది.
    "వాణీ! నువ్వెంత మంచిదానివి!" డగ్గుత్తుకతో అన్నాడు దొర. "ఇంత ఊర్ల నువ్వొక్కదానివి లేకుంటే నేను గుండె పగిలి చుచ్చేటోడ్నీ . పోలీసులను తెచ్చినలే భయపడకు" అని ఆమె ముందు కూర్చున్నాడు.
    నూతన వైభవాన్ని గురించి ఇద్దరూ ఎన్నో ముచ్చటలు మాట్లాడుకున్నారు.
    వాణికి దగ్గు తెర వచ్చింది. ఖంగు ఖంగు మని దగ్గింది. దగ్గు ఆగలేదు. ఊరిపి అందడం లేదు. విలవిలలాడుతుంది. చుట్టుకొని పోతుంది. కళ్ళు తేలవేస్తుంది. అయినా దగ్గు తెరిపి ఇవ్వడం లేదు.
    దొర చూస్తూ కూర్చున్నాడు. వాణి మృత్యువు కౌగిలి లో విలవిలలాడుతున్నట్లనిపించింది. లేచి నుంచున్నాడు. చూస్తున్నాడు. ఏమిటో అర్ధం కావడం లేదు. చావు! చావు! ! చావు!!! అమాంతంగా వెనక్కు జరిగాడు.
    దగ్గు తెరిపి ఇచ్చింది వాణి రక్తం ఉమిసింది. తోటకూర కాడలా పడిపోయింది. తనుస్తుంది. కళ్ళు తేలవేసింది. మళ్ళీ రక్తం ఉమిసింది. కళ్ళు మూసుకుంది. ముడుచుకుని పడుకుంది.
    దొర దూరంగా నుంచున్నాడు. అది క్షయ అని తేలిపోయింది. అంటువ్యాధి అని అతనికి తెలుసు. మెల్లగా అడుగులు వేశాడు. అడుగుల చప్పుడు విన్నది వాణి. అంత యాతనలోనూ అన్నది "దొరా , మంచం పట్టించుకో ! కిందేట్ల పడుకుంటావ్" దొర మనస్సు కలుక్కు మన్నది అయినా సాగిపోయాడు.
    పోలీసుల శిభిరంలో వంటలు జరుగుతున్నాయి. పెట్రో మాక్సులు వెలుగుతున్నాయి. సంబరంగా ఉంది. మెట్ల మీద కూర్చొని చూస్తున్నాడు బలరామయ్య. తనకు పడక ఎట్లా? పట్టు పాన్పులు, పందిరి మంచాలు లేవు. ఈ దుమ్ములో పడుకోలేడు . వాణి మంచానికి క్షయ. ఏ ఇంట్లోంచైనా మంచం తెప్పించాలి. ఎవరు తెస్తాడు? పోలీసులు తెస్తారా? తెమ్మనడం బాగుంటుందా?
    పోలీసుల వంటలైనాయి. తాగుడు సాగుతుంది. ఆటలు, పాటలు భోజనాలైనాయి. వారితోనే భోజనం చేశాడు బలరామయ్య. క్యాంపు లోనే పడుకున్నాడు. నిద్రపట్టలేదు. అయినా తెల్లావారింది. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. పంట పొలాల మీద నుంచి చల్లని గాలి వీస్తుంది. బలరామయ్యకు ఏదో హాయి అనిపించింది. ఊళ్ళోకి బయలుదేరాడు. పోలీసులు వెంట వచ్చారు. సాగిపోతున్నాడు దొర. దొర వస్తున్నాడని తప్పుకునే వాడు లేడు. వంగి దణ్ణాలు పెట్టె వారు, చెప్పులు విడిచి చేత పట్టుకొని గోడ కంటుకొని నంచునేవాళ్ళు లేరు. అంతా నిరామయం నిశ్శబ్దంలోంచి వెళుతున్నాడు దొర - పూర్వపు ఠీవితో నడవాలని ప్రయత్నిస్తూ.
    మొండి గోడలు కనిపించాయి. కప్పు పూర్తిగా కూలిపోయింది. గోడలు కూడా కొంత కూలాయి. శిదిలాలుం ఇటుక కుప్పలు కూలినవి. అది పోలీసు ఔట్ పోస్ట్. అందులో ఇద్దరే పోలీసులుండేవారు. అయినా వారంటే హడలి చచ్చేవారు జనం. ఆ ఇద్దరు నైజాం నవాబులు ప్రతినిధులు. వారు కావాలనుకుంటే ఎవరినైనా చీల్చి చండాడేవారు . వారూ దొరల కనుసన్నల్లో నడిచేవారు. ఆ కూలిన గోడల మీద కూడా నినాదాలున్నాయి.
    "విప్లవం వర్ధిల్లాలే"
    నిన్నడం చూసి బలరామయ్య వళ్ళు మండింది. "దానికి వ్యతిరేక నినాదం ఏదో అందామని గొణిగాడు. రాలేదు. ఒక పెంకు ముక్క అందుకొని నినాదాన్ని గీకేశాడు. కొంత సంతృప్తి కలిగింది. కొంతదూరం నడుస్తే చావిటి కనిపించింది. అది కూలిపోయింది. గోడలున్న గుర్తులు సైతం లేవు. లిప్తపాటు పూర్వవైభవం తలచుకున్నాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే కోపం పొంగింది. గుండె మండింది. ఊరంతా తగల పెడదామనుకున్నాడు. అందుకు అడ్డేవారు ఎవరు లేరు. అయినా ఎందుకో అ పని చేయలేదు. పొలాల కోటలకూ, నూర్పిళ్ళకూ మనుషులు కావాలి మరి! వారు రావాలి. ఈ గుడిసెల్లోనే వుండాలి . తన పనులు చేయాలి.
    బాలరామయ్య సాగిపోతున్నాడు. తుపాకులు పట్టుకొని ముందూ వెనుకా పోలీసులు నడుస్తున్నారు. ఒక ఇంట్లో -- గుడిసెలో - ప్రాణం ఉన్న జాడ వినిపించింది. ఊపిరి పీల్చుకుంటున్న సవ్వడి వినిపించింది. తరువాత దగ్గు వినిపించింది. గుడిసెలోకి దూరాడు బలరామయ్య. గొంగళి చుట్టుకొని నడుస్తున్న ఆకారం కనిపించింది.
    "ఎవడ్రా వాడు గర్జించాడు దొర.
    ముఖం మీద నుంచి కప్పు తీసి చూశాడు - మనిషి.
    "మాట్లాడవెందిరా?" మరొక గర్జన.
    చూస్తూ ఉండిపోయాడా మనిషి.
    కాలితో తన్నాడు దొర.
    డొక్కలో తగిలింది.
    మూలిగాడు మనిషి లేచి కూర్చున్నాడు.
    "ఎవడవురా?"
    "జగ్గయ్యను."
    "జగ్గయ్య.....జగ్గయ్యట జగ్గయ్య. జగ్గిగాణ్ణి దొరా అను భంచాత్. పండాకోరు ముండా కొడక. మస్తీ ఎక్కింది. లే. లమ్డీ కొడక. చూసి పోయెందుకు వచ్చినవులే. ఎరిరా మీవొండ్లు ? తోళ్ళూ వోలుస్తా. తడాఖా చూపిస్తా. యాడున్నారో చూపిస్తవా లేదా?"
    "రోగంతోని నేనీడ పంటిని. "లేచి నుంచుంటూ "నాకేమెర్క ఎవ్వడేడ చచ్చిందో " అన్నాడు.

 Previous Page Next Page