Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 3

 

    మచ్చుకి - మంచి గత చరిత్రని కొని ఇవ్వలేదు డబ్బు!

 

    తన కుటుంబానికి గతమెంతో ఘనమైన చరిత్ర ఉండి ఉంటుందని విక్రమదేవరావుకి ఒక నమ్మకం! అలా అని వాళ్ళ కుటుంబంలో ఇంకా చాలా మందికి కూడా నమ్మకం ఉంది.

 

    అది రూడి చేసుకోవడానిగానూ విక్రమదేవరావు వెదికి వెదికి జస్వంతరావు అనే ఒక రిసెర్చి స్కాలర్ ని పట్టుకున్నాడు.

 

    కెప్టెన్ జస్వంతరావు ఆర్మీలో పనిచేసి రిటైరనవాడు. మహా మేధావి. మా మంచి మనిషి!


    
    జస్వంతరావు చేత తన పూర్వికుల వివరాలు వెలికి తీయించాడు విక్రమదేవరావు.

 

    అతను కోరుకుంటున్న వివరాలలో కొన్ని నిజమే అని తేలాయి-

 

    విక్రమదేవరావు పుర్వికులలో ఒకాయన పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక చిన్న సంస్థానానికి అధిపతిగా, బ్రిటీష్ వారికి తొత్తుగా వుంటుండేవాడు.

 

    అయన మరణించాక కొడుకులు 'సింహాసనం' కోసం పోటీపడి, ప్రివీకౌన్సిలు దాకా వెళ్ళారు. తీర్పు వచ్చేసరికి "రాజ్యం" హరించుకుపోయింది. పేర్లలో రాజసము, అలవికాని అప్పులూ తప్ప ఇంకేవి మిగలలేదు విక్రమదేవరావు వంశానికి.

 

చాలా తరాలు గడిచాక - ఆ వంశస్థులలో విక్రమదేవరావు కేవలం స్వయంకృషితోనే కుబేరుడు అయ్యాడు.

 

    జస్వంతరావు ధర్మమా అని తన గతాన్ని గ్రహించాక, ఇప్పుడు తనని నిజంగానే ఒక రాజాలా భావించుకుంటున్నాడు విక్రమదేవరావు.

 

    ఇప్పుడతని కుటుంబంలో ఒక పెళ్ళి జరగబోతోంది.

 

    అదే ఈ తరానికి చివరి పెళ్ళి అవుతుంది కూడా!

 

    అందుకే అతను ప్రపంచం నలుమూలలా ఉన్న తన కంపెనిలలో పనిచేస్తున్న బంధువులందరినీ పెళ్ళికి ఆహ్వానించాడు. అతనికి బంధుప్రీతి ఎక్కువ. తన కంపెనీలు అన్నిట్లో కూడా తన బందువులనే నింపేశాడు.

 

    అతని మాట శిలాశాసనంగా భావించి బంధువులందరూ బిలబిల్లాడుతూ హైదరాబాద్ చేరుకున్నారు.

 

    పెళ్ళి జరిగిందేమో బాంబేలో!

 

    బాంబేలో పెళ్ళి విడిదికి గానూ ఒక ఫైవ్ స్టార్ హోటల్ మొత్తం బుక్ చేసేశారు.

 

    ఆ ఫైవ్ స్టార్ హోటల్ కూడా విక్రమదేవరావు సొంతమే!

 

    ఆ విమానంలో విక్రమదేవరావు కాళ్ళ దగ్గరగా ఒక సర్వెంటు కూర్చుని ఉన్నాడు. విమానం టేకాఫ్ అయ్యేదాకా వెనక వరసలోని ఒక సీట్లో కూర్చున్నాడు ఆ సేవకుడు. విమానం గాలిలో సమానాంతరంగా ఎగరడం మొదలెట్టాక, ఆ "భ్రుత్యుడిని" వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చోమని "శాసించాడు" (రాజా) విక్రమదేవరావు.

 

    అప్పుడు ఎయిర్ హోస్టెస్ అంజలి మళ్ళీ అటువైపుగా వచ్చింది. ఈసారి ఆమె మోహంలో ఆందోళన కనబడుతోంది.

 

    "సర్! అతన్ని వెంటనే సీట్లో కూర్చుని సీట్ బెల్టు బిగించుకోమని చెప్పండి!" అంది ఆదుర్దాగా.

 

    "నాన్సెన్స్! మళ్ళీ విమానం కిందికి దిగేటప్పుడు వాణ్ణి సీట్లో కూర్చోనిచ్చేది!" అన్నాడు విక్రమదేవరావు గంభీరంగా.

 

    "సర్! ప్లయిట్ కొద్ది క్షణాల్లో లాండ్ కాబోతుంది!" అంది అంజలి గాభరాగా.

    

                                            * * *


    కాక్ పిట్ లో-

 

    పైలట్ సంజీవి తన మెదడుని, మనసుని శరీరాన్ని కంట్రోల్ లో ఉంచుకుని కాన్ సన్ ట్రేట్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. కో పైలట్ మాత్రం భయంతో దాదాపు కోయ్యబారిపోయి వున్నాడు.

 

    సంజీవికి తెలుసు.

 

    తక్షణం తను ఈ విమానాన్ని ఎమర్జెన్సి లాండింగ్ చెయ్యాలి!

 

    విమానం తాలూకు ఒక ఇంజన్ కి నిప్పంటుకుంది.

 

    విమానం ఎక్స్ ఫ్లోడ్ అయ్యేలోపల గనక లాండ్ అవగలిగితే-

 

    ఎక్కడా?

 

    అదిగో!

 

    అక్కడ కనబడుతోంది పెద్ద బిల్డింగు!

 

    అది పారడైజ్ హోటల్-

 

    దాని పక్కనే మార్ష్ లాండ్ ఉంది.

 

    బురదనేల!

 

    ఆ బురద మైదానంలో విమానాన్ని దింపగలిగితే డామేజీ తక్కువ కావచ్చు-

 

    ప్రయాణికుల ప్రాణాలు రక్షించబడవచ్చు కూడా!

 

    కానీ-

 

    ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దింపే కండిషన్లో లేదు ఈ విమానం! పూర్తిగా తన కంట్రోలులో లేదు!

 

    దురదృష్టవశాత్తూ ఇది ఆ బురద మైదానంలో దిగేలోగానే ఆ హోటల్ బిల్డింగ్ మీద క్రాష్ లాండ్ అయిపోతే-

 

    గాడ్ ఫర్ బిడ్!

 

    అప్పుడు విమానంలోని ప్రయాణికులతో బాటు హోటల్లోని జనం కూడా దారుణ మరణం పాలయిపోతారు-

 

    విమానం సంజీవి స్వాదినంలో లేకుండా కిందికి జారిపోవడం మొదలెట్టింది.

 

    డైమండ్ రాజా అలా ఆకాశం వైపు చూస్తూ ఉండగానే విమానం బాగా కిందికి వచ్చేసింది. కానీ అది పైలట్ సంజీవి కంట్రోల్ లో లేదు!

 

    సంజీవి ఆశించినట్లు విమానాన్ని పారడైజ్ హోటల్ పక్కనే ఉన్న బురద మైదానంలో దింపడం సాధ్యమయ్యేటట్లు అనిపించడం లేదు. హోటలు బిల్డింగుని తాకేసేటట్లు కిందికి దిగిపోతుంది విమానం!

 

    ఒక్కసారిగా దేవుణ్ణి తలుచుకున్నాడు సంజీవి. విమానాన్ని పైకి పోనిచ్చాడు.

 

    అదృష్టవశాత్తు ఈసారి అతని మాట విన్నది విమానం. తారాజువ్వలా పైకి దూసుకుపోయింది.

 

    కింద నిలబడి ఇదంతా చూస్తున్న డైమండ్ రాజా విమానం మళ్ళీ గాల్లోకి లేవగానే త్వరత్వరగా హోటల్లోకి వెళ్ళిపోయాడు.


    వెళ్తూనే, "డేంజర్! డేంజర్! అందరూ అర్జెంటుగా బయటికి వెళ్లిపోవాలి! క్విక్! క్విక్!" అని అరిచాడు.

 

    అలా అరుస్తూనే , అక్కడే ఉన్న అలారం మోగించాడు కూడా.

 

    దేయ్యప్పిల్ల ఏడుస్తున్నట్లు మోగడం మొదలెట్టింది అలారం.

 

    అది వినగానే హోటల్ లో ఉన్నవాళ్ళంతా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పారిపోవడం మొదలెట్టారు.

 

    కానీ రాజా మాత్రం బయటికి రాలేదు.

 

    తన హెచ్చరికని వినకుండా, ఇంకా ఎవరైనా అక్కడే ఉండిపోయారేమోనని గబగబ హోటలంతా చెక్ చెయ్యడం మొదలెట్టాడు.

 

    ఆకాశంలో-

 

    విమానం ఆకాశంలో సమానంతరంగా ఎగరడం మొదలెట్టాక సంజీవి సంకోచిస్తూనే ప్రయాణికులని ఉద్దేశించి ఒక ప్రకటన చేశాడు.

 

    "లేడీస్ అండ్ జెంటిల్మన్! ఇందాక మిమ్మల్ని అందరిని సీటు బెల్టులు కట్టుకోమని చెప్పాను. కానీ దానికి కారణం చెప్పలేదు.

 

    ఫ్రెండ్స్! మన విమానం ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుంది! సాధ్యమైనంత త్వరలో దీన్ని లాండ్ చెయ్యకపోతే ఇది గాలిలో నిలవదు...దయచేసి ఎవ్వరు పానిక్ కావద్దు. ఎమర్జెన్సి లాండింగ్ కి సిద్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. థాంక్యూ!"

 

    పైలట్ అలా చెప్పగానే , ఒక్కసారిగా ప్రయాణికులలో కేకలూ, ఏడుపులు వినబడ్డాయి....కలవరంగా అనేక కంఠాలు ఒకేసారి మాట్లాడడం వినబడింది.

 

    ప్రపంచం నలుమూలలా ఉన్న దేశాల్లో, విక్రమదేవరావు స్థాపించిన కంపెనీలలో పనిచేస్తూ, సుఖంగా విలాసవంతమైన జీవితం గడిపేస్తున్న వాళ్ళే వాళ్ళందరూ కూడా! అందరూ ఆయనకి బంధువులే! పెళ్ళి చూడాలని సంబరంగా వచ్చారు .........ఇప్పుడు ఇలా మృత్యువుతో ముఖాముఖి అనిపించే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని వాళ్ళెవరు కలలో కూడా ఉహించలేదు.

 

    చావు తప్పదని అనిపించాక, వాళ్ళలోని నిజనైజాలు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధంగా బయటపడటం మొదలెట్టాయి.

 

    ప్రయాణికుల్లో ఒకతను పైలట్ ప్రకటన వినివినగానే , రాతి బొమ్మలా నిశ్చేష్టుడై నీలుక్కుపోయాడు.

 

    ఇంకోకతను "అంతా అయిపొయింది!" అని గొణుక్కుని , బ్రీఫ్ కేసులో నుంచి వెండి విస్కీ ప్లాస్కు తీసి గటగట తాగడం మొదలెట్టాడు.

 

    కోరమీసాలు, మిడిగుడ్లతో విలన్ లా కనిపిస్తున్నట్లు అనిపించిన ఒక మనిషి నిశ్చలంగా దైవప్రార్ధన చేసుకోవడం మొదలెట్టాడు.

 

    బిజినెస్ బేరసారాల్లో ఆరితేరిన ఒక ఘనాపాఠీ తన పక్క సీట్లో కూర్చుని ఉన్న పురోహితుడి వైపు చటుక్కున తిరిగి, "నువ్వు బ్రాహ్మడివి కదా! నా ఆస్తిపాస్తులన్ని నీకు దానమిచ్చేస్తున్నా! ఈ లోకంలో నువ్వు చేసిన పుణ్యాలేమన్నా ఉంటే అవి నావి, నేను చేసిన పాపాలేమున్నా అవి నీవి! బేరం సెటిలయిపోయింది! ఇంక నోరెత్తకు!" అన్నాడు అతి తెలివిగా.

 

    పెద్ద బొట్టు పెట్టుకుని, పరమ భాగవతోత్తముడిలా కనబడుతున్న ఆ పూజారి నిర్లిప్తంగా నవ్వి, ఆ తర్వాత ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎయిర్ హోస్ట్ స్ అంజలి అందాలని ఆబగా చూడటం మొదలెట్టాడు.

 

    అసలైన మగమహరాజులా దర్జాగా కనబడుతున్న ఇంకొక మనిషి, ఒక సీట్లో కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే కూర్చుని ఉంది అతని భార్య. బతుకంతా అతని దాష్టికంలో నలిగిపోయినట్లు నిస్త్రాణంగా ఉంది ఆమె.

 

    ఇప్పుడామె కళ్ళలో నవ్వు కనబడుతోంది.

 

    ఆమె భర్త ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు.

 

    "మీకో మాట చెప్పాలి!" అంది ఆమె.

 

    "ఏమిటన్నట్లు" చూశాడు అతను.

 

    "మన రోహిత్ కి తండ్రి ఎవరనుకుంటున్నారు? మీరు మాత్రం కాదు" అంది ఆమె కూల్ గా.

 Previous Page Next Page