చాయ అటు చూసింది. నీరుకాని రంగు పంచె కట్టుకున్న పల్లెటూరి బైతులాంటి వ్యక్తి ఒకాయన సీత తల నిమురుతూ ఏదో చెపుతున్నాడు. సీత బుద్దిగా తల వూపుతోంది.
చాయ పెదవి వంపు తిరిగింది.
ఓసారి భుజాలు ఎగురవేసి 'నేనూ చాలా అదృష్టవంతురాల్నే' అటువంటి బీద మామయ్యలెవరూ నాకు లేరు' అనుకుంది.
"ఈ గార్లెట్స్ ప్రెజెంట్ చేసిన నీ బోయ్ ఫ్రెండ్ టేస్ట్ ని అంచనా వెయ్యలేము కానీ నీ మెడలోచేరాక వీటి అందం పెరిగిపోతుందన్న అతని కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోకుండా వుండలేము" అంది అనూరాధ.
"ఆ విషయమే అతనూ వ్రాశాడు. నా అంత అందంగా వుండే వాళ్ళకి తప్ప ఇలాంటివి ఎవరికీ సూట్ కావుట" నోటికి వచ్చినట్టుగా చెప్పేస్తోంది చాయ.
"చాయా! ఆ అమ్మాయిని చూడు.....కొత్తగా మన క్లాసులో చేరిందని చెప్పానే.....ఆ అమ్మాయే...." అంది స్మిత.
చాయ తలతిప్పి అటు చూసింది. గుండెల దగ్గరగా పుస్తకాలు పట్టుకుని, లైట్ పింక్ కలర్ కాటన్ శారీలో ఓ అమ్మాయి క్లాసులోకి వస్తోంది.
చాయ ఓసారి ఆ అమ్మాయిని చూసి చటుక్కున తల తిప్పేసుకుంది. ఎక్కువసేపు చూసేటంత ఆకర్షణేం ఆ అమ్మాయిలో చాయకి కనిపించలేదు.
చామనఛాయలో, నూనె రాసుకుని, జడవేసుకుని, ఒద్దికగా వున్న ఆ అమ్మాయివైపు చూడటం వేస్టు అనిపించింది. సాధారణంగా చాయ చుట్టూ వుండే అమ్మాయిలు గొప్పింటివాళ్ళూ, ఆధునికంగా కనిపించే వాళ్ళూ అయివుంటారు. చాయ అంత అందగత్తెతో తిరగడమే తమ భాగ్యంగా భావిస్తూ బస్ స్టాప్ లలో, సినిమా హాల్స్ లో తమ వెనకాలే తచ్చాడుతున్న అబ్బాయిల్ని చూసి ఆనందపడుతుంటారు. చాలామంది అబ్బాయిలు చాయతో పరిచయం కోసం వీళ్ళతో ముందుగా స్నేహం చేసుకుంటారు.
లెక్చరర్ క్లాసులోకి రావడంతో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.
లెక్చరర్ ఎటెండెన్స్ రిజిస్టర్ తీసుకుని కొత్తగా వచ్చిన అమ్మాయివంక చూసి "సంధ్య....సంధ్య నువ్వేనా అమ్మా?" అంది.
ఆ అమ్మాయి లేచి నిలబడి వినయంగా "ఎస్ మేడమ్" అంది.
"ప్రిన్సిపాల్ గారు చెప్పారు! కూర్చో అమ్మా క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఏమైనా ఫాలో అవలేకపోతే వచ్చి నన్ను ప్రత్యేకంగా కలుసుకో" అంది లెక్చరర్ నవ్వుతూ.
చాయ కళ్ళ చివర్లనుండి స్మితవైపు చూసింది.
ఎప్పుడూ ధుమధుమలాడుతూ సీరియస్ గా పాఠం చెప్పుకుపోయే ఎకనామిక్స్ మేడం అలా నవ్వుతూ మాట్లాడటం ఆమెతోబాటు అందరికీ ఆశ్చర్యంగానే వున్నట్లుంది. స్మిత చాయ కళ్ళలోకి హ్కోసి 'ఎందుకో' అన్నట్లు భుజాలు ఎగురవేసింది.
క్లాసు అయి లెక్చరర్ వెళ్ళిపోగానే మళ్ళీ అందరూ కబుర్లలో పడ్డారు. క్లాసంతా రణగొణ ధ్వనితో నిండిపోయింది. సంధ్య ఒక్కతే కూర్చుని అందరివైపూ పరీక్షగా చూడసాగింది.
ఏదోచెప్పి పెద్దగా నవ్వుతున్న చాయ నుదుటిమీద పడిన ముంగురులు సవరించుకుంటూ యధాలాపంగా పక్కకి తిరిగి సంధ్య తననే గమనిస్తుండడం చూసి ఓసారి కళ్ళు ఆర్పి, మళ్ళీ ఇటుతిరిగి కబుర్లలో పడిపోయింది.
సంధ్య చెక్కిట చెయ్యి జేర్చుకుని చాయ ప్రతి కదలికనీ గొప్ప ఆసక్తిగా చూస్తూ కూర్చుంది. చాయ నవ్వుతూ వుంటే మువ్వలు తెగి క్రిందపడి గలగలా దొర్లినంత మధురంగా వుంది. ఆమె మాట్లాడుతుంటే మోహనవంశీ మీద ఆనందభైరవి రవళిస్తున్నంత సమ్మోహనంగా వుంది. ఆమె కనురెప్పలు ఎత్తినప్పుడల్లా ఓ నవోదయానికి నాంది పలుకుతున్నట్లున్నాయి. ఆమె పెదవులు విచ్చుకోగానే కోటి పారిజాతాలు నేలరాలిన అనుభూతి!
భుజం వెనుకనుంచి వచ్చి ఆమె నడుము ఒంపులో చిక్కుకున్న వేణీబంధం వురుకులూ, పరుగులతో వచ్చి నదిలో కలిసే పిల్ల కాలవలా వుంది. ఆ నడుము వంపు..... ఎవరో నేర్పరైన శిల్పి వందేళ్ళు శ్రమపడి వులి పట్టుకు కూర్చుని తీర్చిదిద్దినంత రమ్యంగా వుంది. ఆమె చిటికెనవేలి గోరు.....సంధ్యకి దాన్ని వర్ణించడానికి పదమే దొరకనంత అద్భుతంగా అనిపించింది.
"పోదాం పదండే....హిస్టరీ మేడమ్ రాలేదుట" అన్నారెవరో.
అంతే అందరూ గొల్లున అరుస్తూ లేచి క్లాసులోంచి బయటపడ్డారు.
సంధ్య కూడా లేచి అవతలికి వచ్చింది. ఆమెకి తెలియకుండానే ఆమె చాయ వెనుకగా నడవసాగింది. ఆమెలోని భావుకురాలు చాయ ప్రతి కదలికలోని లావణ్యం చూసి గొప్పగా పరవశించసాగింది.
అందరూ బస్ స్టాప్ చేరారు.
"చాయా! అటు చూడు కోయదొర" అంది అనురాధ.
"తుర్....ర్....ర్....చేయి చూస్తాం. జరిగేది సెప్తాం! జరగబోయేది సెప్తాం" అంటూ వాళ్ళ దగ్గరకి వచ్చాడో కోయదొర.
అతని మాటల్ని తలలో తురుముకున్న ఈకల్నీ మొలకి చేతులకీ కట్టుకున్న పూసల్నీ వినోదంగా చూశారు అమ్మాయిలు.
"వెనకజన్మ గురించి అక్కర్లేదులే. ఈ జన్మ గురించి సరిగ్గా చెప్పగలిగితే చెప్పు" అంది చాయ.
"డుర్....ర్....ర్....కూన, సెయ్యి జూపుతే చాలు. కళ్ళకి కట్టినట్లు కనబడ్తది. కొండ తల్లిమీద ఆన! ఏదీ చెయ్యి?" అంటూ క్రిందే కూలబడ్డాడు కోయదొర.
మిత్రబృందం అంతా అతన్ని చుట్టుముట్టారు. సంధ్య కూడా దగ్గరికి వెళ్ళి నిలబడి ఏం చెప్తాడోనని ఆసక్తిగా చూడసాగింది.
బస్ స్టాప్ లో నిలబడ్డ కుర్రవాళ్ళు జాపిన చాయ చేతినీ, కోయదొర అదృష్టాన్నీ చూసి "ప్చ్....ప్చ్..." అని మనసులో విచారించారు.
చాయ చేతిని పట్టుకోగానే "డుర్.....ర్.....ర్..." అని అరిచాడు కోయదొర.
"అంతగా అరవకు, సంగతి చెప్పు చాలు!" అంది విసుగ్గా చాయ.
"సెప్తుంటిని ఇనుకోవే కూన! ఇది అసుమంటి....ఇసుమంటి జల్మకాదు! బెమ్మ సాచ్చిగా రాణియోగం! దారి తప్పిన కూన.....తిరిగి చేరేను కోటకి! కాసుల మీదె నడవాల.....నోట్ల కట్టల మీదనే పండాల! అడవి తల్లి మీద ఆన! ఇది మామూలు సెయ్యికాదు.....గొప్ప యోగమున్న సెయ్యి" అన్నాడు.
చాయ గబుక్కున ముందుకు వంగి "డబ్బు సంగతో.....డబ్బు వస్తుందా?" అంది.
"డుర్....ర్...ర్..." అని మళ్ళీ గుండెలు అదిరేటట్లుగా అరిచి "ఇమానాల మీద అడుగేసి నడవాల! పుట్టింది కోటలోనే....దారి తప్పినావు. తిరిగి దారి పట్టుకోవాలి..... గొప్ప జాతకం..... రాణీయోగం" అన్నాడు.
చాయకి పట్టపగగాలు లేనంత సంతోషంగా అనిపించింది.
"చూశారా? నాది రాణీయోగంట!" అంది సంతోషంగా ఫ్రెండ్స్ తో.
"ఆ సంగతి ఇతను చెప్పక్కర్లేదు. నీ ముఖం చూస్తే ఎవరైనా చెప్తారు" అని వినిపించింది.