Previous Page Next Page 
ఖజురహో పేజి 3


    "కారణం ఏమయినా కానీ......ఇకముందు అలా జరగనివ్వకు . తెలివయిన విద్యార్ధుల్ని అన్ని ఖర్చులూ భరించి మా ట్రస్ట్ వాళ్ళు పై చదువులకు పంపుతున్నది పైకొస్తారని కానీ ఇలా బయట ప్రపంచంలోని మెరుగులు చూసి బోల్తాపడిపోవాలని కాదు. చూడు చాయా! మీరు అందరిలాగా కాదు...." అని వార్డెన్ చెప్పబోతుండగానే చాయ అందుకుని- "మేము అందర్లాగా కాదు.....అనాధలం" అంది కసిగా.
    
    దయామణి కాస్త ఆశ్చర్యంగా చూసి అంతలోనే చిరునవ్వు నవ్వి.
    
    "మీ తల్లీ తండ్రీ అన్నీ ఆ భగవంతుడేనమ్మా-ఆయన్ని మించిన వారా ఈ మానవులు? మీరంతా బాగా చదువుకుని మీ కాళ్ళమీద మీరు నిలబడి ఈ సమాజంలో మంచి పౌరులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. వెళ్ళు......వెళ్ళి చదువుకో! అన్నట్లు చైర్ మెన్ గారి భార్య ఏవో చీరలు పంపారట. వెళ్ళి నీకు నచ్చినవి రెండు తీసుకో" అంది.
    
    "మేడమ్!" అంది కాస్త నెమ్మదిగా చాయ.
    
    "ఏమిటమ్మా?" అడిగింది వార్డెన్.
    
    "ఆ చీర ఎంత ఖరీదుంటుందంటారు?" కేలండర్ వేపు వేలుపెట్టి చూపిస్తూ అడిగిందామె.
    
    దయామణి వెనక్కి తిరిగి చూసి-
    
    "రెండువేల రూపాయల మీద వుంటుంది మనం జన్మలో కొనుక్కోలేము" అంది.
    
    చాయ అక్కడ్నుంచి కదులుతూ తనలో తను అనుకున్నట్టు అంది- "మనం కాదు....మీరు కొనుక్కోలేరేమో."
    
    చాయ పైన వున్న స్టోర్ రూంలోకి వెళ్ళి అక్కడ మూటలుగా కట్టివున్న బట్టలని చూసింది.
    
    రెండు-మూడు నెలలకోసారి సోషల్ వర్కర్సు ఇంటింటికీ తిరిగి బట్టలు కలెక్ట్ చేసి తీసుకొచ్చి అనాధాశ్రమానికి ఇస్తుంటారు. అందులో కాస్త ఖరీదుగా అనిపించేవీ, బావున్నవీ తీసి చాయకి ఇస్తుంది దయామణి.
    
    చాయని కాలేజ్ లో చేర్పించడం కూడా దయామణి ప్రోద్బలం వలనే జరిగింది. ఆమె అందం, తెలివితేటలూ చూస్తే దయామణికి చాలా ఇష్టం.
    
    దయామణికి భర్త లేడు. ఓ కూతురు ఆరేళ్ళు పెరిగి జబ్బుచేసి పోయిందట.
    
    తన కూతురు బ్రతికి వుంటే చాయ ఈడే వుండేదనీ, ఆమె అప్పుడప్పుడూ కాంతమ్మతో, క్లర్క్ చిదంబరంతో అంటూ వుంటుంది.
    
    ఆ మాటలు చెవిన పడ్డప్పుడల్లా చాయ వంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకుతున్నట్లు అనిపిస్తుంది. ఇటువంటి కడుపునా తను పుట్టడం? అంతకన్నా ఈ అనాధ బ్రతుకే మేలు!
    
    కనీసం తల్లిదండ్రులు ఎక్కడో గొప్పగా వున్నారనీ, ఎప్పుడో ఒకసారి తనని వెతుక్కుంటూ వస్తారనీ వూహలతో బ్రతకచ్చు! అనుకుంటుంది.
    
    "చాయా! ఈ రెండు చీరలూ వార్డెన్ నీకిమ్మన్నారు" అంటూ ఓ అమ్మాయి అందించింది.
    
    చాయ అందుకుంది కానీ మనసంతా ఇందాక తను కేలండర్ లో చూసిన చీరమీదనే వుంది. చేతిలోని చీరలు చూసుకోగానే దుఃఖం ముంచుకొచ్చింది.
    
    అవి కొత్తగానే వున్నాయి. అందంగా కూడా వున్నాయి. కానీ చాయకి అవి ఇచ్చినవాళ్ళ మీద కృతజ్ఞతకు బదులు కోపం ముంచుకువచ్చింది.
    
    ఇంత అందమైనవీ, ఖరీదయినవీ రెండుసార్లు కట్టి ఇలా మా మీదకి విసిరేస్తున్నారంటే ఎంతగొప్పవాళ్ళయి వుంటారూ? అసలు అంత గొప్పగా వుండే అర్హత వాళ్ళు ఎక్కడ్నుంచి సంపాదించారూ?
    
    ఆమెకి నల్లగా, లావుగా వుండి ఒంటినిండా నగలు పెట్టుకుని గద్వాల చీరలు కట్టుకుని వచ్చే చైర్మన్ గారి భార్య కళ్ళల్లో మెదిలింది.
    
    ఆ నగలూ, చీరలూ ఆవిడకి అందాన్ని ఇవ్వకపోగా మరింత వికృతం చేస్తున్నాయి అనుకుంది. ఆ పైవాడు ఇలాంటి వికారపు పనులన్నీ కళ్ళు మూసుకుపోయి చేస్తుంటాడా? ఇంత అందాన్నిచ్చిన వాడు నాకు తగిన సౌఖ్యాలు ఇవ్వడేం?" ఆమె మనసు ఆక్రోశించింది.
    
    "చాయా! ఈ ఎర్రపూల చీరలో నువ్వు చాలా అందంగా ఉంటావు" చీరలు ఇచ్చిన అమ్మాయి చాయవంక ఆరాధనగా చూస్తూ అంది.
    
    చాయ ఆ అమ్మాయివంక కాస్త విసుగ్గా చూసింది. ఆ చూపులో నా అందం గురించి పొగిడే అర్హత కూడా ఆమెకు లేదు అన్న భావన వుంది.
    
    చాయ రూంవేపు నడుస్తూ నిన్న సాయంత్రం కాలేజ్ నించి లేట్ గా రావడం వెనుకగల కారణం గుర్తుతెచ్చుకుంది.
    
    తన క్లాస్ మేట్ అనూరాధకి బోలెడు గీర! తనకే అమెరికాలో చదివే బావ వున్నాడని మురిసిపోతుంటుంది. వాడు అక్కడ్నించీ పంపించే చీరలూ, వస్తువులూ చూపించి తెగ ఫోజులు కొడుతుంటుంది. ఇవన్నీ చూసి ఒళ్ళు మండిన చాయ తనకీ అమెరికాలో ఓ పెన్ ఫ్రెండ్ వున్నాడనీ, అక్కడ్నుంచీ తనకో గార్లెట్స్ చెయిన్ పంపించాడనీ అబద్దమాడింది.
    
    చాయ మాటలకి సాధారణంగా బోల్తాపడని వారు వుండరు కాబట్టి అది తీసుకొచ్చి చూపించమని ఆమె ఫ్రెండ్స్ ప్రాణం తీశారు. ఎలాగో అలా ఆ ముప్పు తప్పించుకోవడం కోసం సాయంత్రం అడ్డమైన గాజుల షాపులూ తిరిగి ఓ పదిరూపాయలని రంగురంగుల పూసలు కొనితెచ్చి గుచ్చుకుంది.
    
    ఇప్పుడా గొలుసు చూపించి వాళ్ళని మాయ చెయ్యడం మిగిలివుంది అనుకుంటూ అలమరలోంచి ఆ గొలుసు తీసి మెడలో వేసుకుంది. ఆ తర్వాత ఎర్ర పూలున్న షిఫాన్ జార్జెట్ చీర కట్టుకుని, వదులుగా పోనీటైల్ కట్టి, మెరూన్ రంగు చిన్న స్టిక్కర్ బొట్టు నుదుటున పెట్టుకుని అద్దంలో చూసుకుంది. చూడగానే ఏమీ కనిపించలేదు. ఆ చిన్న అద్దంముక్కనిండా దుమ్ము పేరుకుపోయి వుంది. దాన్ని శుభ్రంగా తుడిచి గూట్లో పెట్టి తనని పైనించి క్రిందివరకూ చూసుకోవాలని తాపత్రయపడింది చాయ!
    
    ఆమె ప్రయత్నం ఫలించాలేదు. ఆ అద్దం ముక్కని రాయితో మెత్తగా చితగ్గొట్టాలన్న కోరిక వచ్చినా, మళ్ళీ రేపు తన ముఖం చూసుకోడానికి అదే గతి అన్న విషయం గుర్తొచ్చి ఏమీ చెయ్యలేకపోయింది. మరోసారి తన మెడలోని గొలుసు చూసుకుంది. ఆ ఎరుపూ, ఆకుపచ్చా, పసుపూ పూసలు ఆమె మెడలోకి చేరగానే లేని అందం వచ్చినట్టు మెరవసాగాయి. చాయ అద్దాన్ని యధాస్థానంలో పెట్టి పుస్తకాలు తీసుకుని బయటికి నడిచింది.
    
    ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వరండాలో నిలబడి గేటువైపు ఆసక్తిగా చూస్తూ కనిపించారు చాయకి.
    
    "ఏమిటిక్కడ నిలబడి చూస్తున్నారూ? ఎవరైనా సినిమా యాక్టర్ గానీ వచ్చాడా?" అంది వ్యంగ్యంగా.
    
    ఆ అమ్మాయిలలో ఒకరు "సీత వాళ్ళ మావయ్యట వచ్చాడు. చూడు సంచులనిండా ఏమిటేమిటో తీసుకొచ్చి ఇస్తున్నాడు. సీత అదృష్టవంతురాలు కదూ!" అంది.

 Previous Page Next Page