Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 3


                                      సాధారణ ఉగాది పచ్చడి

దయచెయ్యండి దయచెయ్యండి
సాధారణ సంవత్సరంగారూ
దయచెయ్యండి
వద్దంటే మానేస్తారు గనుకనా
వచ్చేశారుగా ఎలాగూ
అంచేత అందుకోండి స్వాగతం
సహజంగా విచ్చేసిన వచ్చేసిన
సాధారణ సంవత్సరంగారూ
స్వాగతం సుస్వాగతం మీకు
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్
(ఈ ఉదయంలో ఏ గుడ్డూ లేకపొయినా)
గుడ్ మార్నింగ్
సాధారణాఖ్య సంవత్సరంగారూ
అదేమిటి అంత బస్తా తెచ్చారు
అందులో ఏముంది
బహుశా సామ్యవాదం కాదుకద!
కాదనే అనుకుంటాను
పెట్టుబడిదారులు బెంగ పెట్టుకోనక్కరలేదు
సాధారణ పరిస్థితులు సామ్యవాదాన్ని తీసుకురాలేవు
కాలం ఇంకా కళపెళా ఉడకాలి
సరియైన వంటవాళ్లు దొరకాలి
సాధారణ బస్తాలో సామ్యవాదం లేదు
అయితే మరేముందో చెప్పండి?
సాధారణ సంవత్సరంగారూ
అరే, నన్నే చెప్పుకోమంటున్నారా?
సరే ప్రయత్నిస్తాను
ఆ బస్తాలో మున్నూట అరవైకి తక్కువ కాని రోజులున్నాయి.
రైటేనా!రైటే
కాని, రోజుకి ఇరవయి నాలుగే గంటలు
రైటేనా? డబుల్ రైట్
రోజూ సూర్యుడు దక్షిణాన ఉదయించి ఉత్తరాన అస్తమిస్తాడు
తప్పు తప్పు ఏదో ఆలోచిస్తూ ఏమిటో అనేశాను
ఎప్పటిలాగే సూర్యుడు
తూర్పున ఉదయించి పడమటనే అస్తమిస్తాడు
విరుగుడు చిట్కాలెన్ని ప్రయోగించినా
జనాభాలు
తరగడానికి బదులు పెరుగుతూనే  ఉంటాయి
అది మృతువు మీద జీవితానికి విజయం
ఏదీ ఆ బస్తా ఇటు తిప్పండి
రాజ పూజితం ఎంతో
అవమానం ఎంతో చూస్తాను
అనవసరం అంటారా
అయితే మానేస్తాను.
అదేమిటి ఆ కన్నంలోంచి అంత స్పష్టంగా కనిపిస్తోంది సిగ్గుసిగ్గు
సెన్సారులారా పారా హుషార్
సిలుగ్గుడ్డలో అలుగుడ్డలో వేసి ఆచ్ఛాదించండి
బలే బలే
ఎక్కడ తడిమితే అక్కడే తగుల్తున్నాయి రాజకీయాలు
వాటితో బాటే మాయోపాయాలు
వచ్చే రాములూ పోయే రాములూ1
తెచ్చిపెట్టే మారాములు.
క్షమించండి సాధారణగారూ
మీరనుమతిస్తే బస్తాలో చెయ్యిపెట్టి చూస్తాను.
థాంక్స్! ఇందులో ఏవేవో బోలెడు పొట్లాలున్నాయే
ఏదో ఒక్కటి మాత్రం బైటికి తియ్యమన్నారా
ఇదిగో ఇది మిఠాయి పొట్లం
నిరుటి దినపత్రికలో కట్టిన ఆంధ్ర సాహిత్యం.
ఇలా చమురోడుతోందేమిటి
ఉత్త నూనె మిఠాయిలాగుందే
ఏమిటీ బూజు
పాత భావాల సంపాదకీయం
ఈనాటి ఆంధ్ర సాహిత్యం అంతా ఇంతేనా
బూజులూ - ఫోజులేనా
కాదు కాదు ఇంకో మంచి పొట్లం ఉందంటారా!
ఉండాలి, ఉండితీరాలి
సచేతనంగా యువతరం సంస్పందిస్తోంది
ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తోంది
తిరుగుబాటు2 గాలులు పీలుస్తూ పెరుగుతోంది
నిరాడంబరంగా దిగంబరంగా3 తిరుగుతోంది
ఈలోగా నేను చక్కని మన సంప్రదాయాన్ని మన్నిస్తూ
ఉడిపి హోటేల్లో ఉగాది పచ్చడి సేవిస్తాను

                                            *    *    *
అరె ఇంకా ఇక్కడే ఉన్నారా
సాధారణగారూ
అన్నట్టు ఏడాది దాకా ఇక్కడే ఉంటారుగా
ఎలాగుంది ఉగాది పచ్చడి అని అంటారా
ఓ భేషుగ్గా ఉంది
పత్రిక పొట్లంలోని పాత సాహిత్యంకన్నా బాగానే ఉంది.
కొంచెం తియ్యగా ఉంది.
చాలా చేదుగా ఉంది.
మొత్తంమీద మన జీవితాల్లాగే ఉంది.
అదిగో ఎదురుగా అద్దం
అందులో నా మొగం చూసుకుంటే
చిన్న చిరునవ్వూ చాలా  వేదనా కనిపించాయి.
అయినా ఉడిపి హోటేల్లో పచ్చడి తిన్నానా
లేక కాఫీ తాగేనా?
షికారీ పౌడరు చేదుతోకూడిన
ఫాక్టరీ పంచదార కలిపిన
పరమ పవిత్రమైన కాఫీ దిగమింగి
అదే ఉగాది పచ్చడి అనుకున్నావా
అందుకే కాబోలు నా మొగం అలా కనిపించింది
గోడ మీద నెహ్రూ ఫోటో ఉంది
"జీ! నీ మొగం నా మొగంలా ఉం"దన్నాను
అదే చిరునవ్వు అదే ఆవేదన
సాధారణ బస్తా చూస్తుంటే
ఎవరిలోనైనా ఇవే కనిపిస్తాయి.
శ్రీమతి సాధారణగారూ
మీ సెక్సు స్పష్టమే కానీ
ఉన్నదొక్కటే చిన్న అనుమానం
మీరు శ్రీమతి సాధారణగారా
కుమారి సామాన్యగారా అని! ఫర్వాలేదు
సాధారణలే అసాధారణలవుతారు
సామాన్యలే అసామాన్యలవుతారు
ఇతి శుభం!


                                                                    ఆకాశవాణిలో వినిపించిన కవిత
                                                                   ముద్రణ : వాణి, 22 - 4 - 1970
                                           పునర్ముద్రణ : ఆంధ్ర ప్రభ వార పత్రిక, 22 - 4 - 1970
                                                       మరో ప్రస్థానం విరసం ప్రచురణ - మే, 1970

1.వచ్చేరాములు, పోయే రాములు: అఖిలభారత కాంగ్రెస్ 1969లో చీలిపోయింది. కామరాజ్ నాడార్, సంజీవరెడ్డి, మొరార్జీ   దేశాయి సిండికేట్ గా ఏర్పడి 'పాత' కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఇందిరాగాంధీ పార్టీని 'కొత్త' కాంగ్రెస్ అనేవారు. పదవుల కోసం   రాజకీయ ప్లేటు ఫిరాయింపులు చాలా  మామూలయ్యాయి. ఈ ఫిరాయింపులపై వచ్చిన 'ఆయేరాం గయేరాం' అనే జాతీయానికి   శ్రీశ్రీ అనువాదం ఇది.
2. వరంగల్ లోని 'తిరుగబడు' కవులు. 1970 జనవరిలో వెలువడిన సంకలనం.
3.దిగంబరంగా: విరసం ఏర్పడడానికి ముందు తెలుగు సాహిత్యంలో పేరుకుపోయిన స్తబ్దతను చీల్చడానికి దిక్కులే అంబరంగా తిరుగు సాహిత్యోద్యమంగా వచ్చిన కవుల తిరుగుబాటు గాలులను ఉద్దేశించాడు.

 Previous Page Next Page