"నువ్వు సరిగ్గా విన్పించుకోవడంలేదు. నేను చెపుతున్న పాయింట్ ఏంటి. ఆయనలా తయారుకావడానికి కారణం ఆవిడని అంటున్నావా ప్రపంచంలో గొప్పగొప్ప వ్యక్తుల్ని తీసుకో ఆ మగవాళ్ళని అలా మలచిన వ్యక్తులు స్త్రీలే స్త్రీ తలచుకుంటే ఆ స్త్రీ ఆ పురుషుడికి అపరిచితురాలు కావచ్చు. ప్రేయసి కావచ్చు. తల్లికావచ్చు. అక్క కావచ్చు, వదిన కావచ్చు, భార్యకావచ్చు ఎవరయినా స్త్రీ తలచుకుంటే పురుషుల్నీ నెంబర్ వన్ గా తయారు చెయ్యగలదు. ఈ ప్రపంచంలో గొప్పగొప్ప విజయాలు సాధించిన ప్రతి ఒక్కడివెనుక స్త్రీ వుంది. పరమ క్రూరుడని చెప్పుకునే జర్మన్ నియంత హిట్లర్ వేనుకున్నది గెలీ అనే స్త్రీ పాకిస్తాన్ భుట్టో వెనక హస్నాషేక్, చార్లీచాప్లిన్ వెనుక ఊనా, అంతెందుకు అమితాబచ్చన్ ని తీసుకో అమితాబ్ నెంబర్ వన్ స్థానానికి రావడానికి వెనకున్నది ఎవరో తెలుసా.....జయాబచ్చన్ కాదా రాజ్ కపూర్ ని తీసుకో నర్గీస్, లతామంగేష్కర్... ఇలా ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ వున్నాయి.
పురుషుడ్ని అభిమానించే నిజమైన స్త్రీ, పురుషుడ్ని ప్రేమించే నిజమైన స్త్రీ, పురుషుడ్ని వాంచించే నిజమైన స్త్రీ, పురుషుడి ఆలంబనను కోరుకునే నిజమైన స్త్రీ ఆ పురుషుడు నుంచి కోరుకునేది ఏమిటో తెల్సా? విజయం.
వర్తమానాన్ని శాసించే విజయం భవిష్యత్తుని తన గుప్పిట్లో బిగించుకో గలిగే విజయం. అందుకే స్త్రీని ఆదిశక్తి అన్నారు. ఆదిశక్తికి నిన్నటి పురాణాలు చెప్పే అర్ధం దేవతా పరమైనదయితే, నేటి ఆధునిక శాస్త్రం చెప్పే అర్ధం మూలశక్తి అని.
మొన్నటి వరకూ బ్రిటన్ ను పాలించిన మార్గరెట్ ధాచర్ ని చూడు కొరజానో ఆక్వినోను చూడు, ఇమెల్డా మార్కోస్, ఇందిరాగాంధీ, మదర్ తెరిస్సా, సిరిమావో బండారునాయకే, మేనకా గాంధీ, కిరణ్ బేడీ, నందినీ శతపధి, పి.టి. ఉష, జయలలిత, ఎంతోమంది.... ఎంతోమంది ఆయా రంగాల్లో ఉక్కు వనితల్లా నిలిచారు. వాళ్ళు ఒక్కొక్కరూ ఒక్కొక్క మూలశక్తికి నిదర్శనం.
ఒక పాపర్ ని కింగ్ ని చేయగలదు స్త్రీ ఒక బెగ్గర్ ని దేశానికి ప్రెసిడెంటుగా చేయగలదు స్త్రీ ఒక అనామకుడ్ని ఎవరెస్టు శిఖరం మీదకు ఎక్కించగలదు స్త్రీ ఒక సాధారణమైనవాడ్ని సాహసిని చేసి చంద్రమండలం మీదకు పంపించగలదు స్త్రీ.
చెప్పేదేమిటంటే నేనేగనక మన హిస్టరీమేడం స్థానంలో వుంటే ఈ పాటికి సాదా సైంటిస్టుగా మనమధ్యనున్న శ్రీధర్ గ్రేట్ సైంటిస్టుగా తయారయి వుండే వాడు. గుర్తింపు పొందేవాడు. తలచుకుంటే ఏ స్త్రీ అయినా నయాగరా జలపాతంలాంటి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పురుషుడికి యివ్వగలదు..... తెలుసా..." చెప్పింది సురభి ఎంతో ఉద్రేకంతో.
"నో మేడం ఇటీజ్ నాట్ పాజిబుల్" వాళ్ళ సంభాషణను అంత వరకూ చాలా జాగ్రత్తగా వింటున్న ఓ యూనివర్శిటీ కుర్రాడు సడన్ గా ఆమాటన్నాడు. అతని పేరు పర్ణేష్.
ఒక్కసారి సురభితోపాటు మిగతా అమ్మాయిలు ముగ్గురూ సీరియస్ గా అతనివేపు చూసారు.
సురభి ఉద్రేకంగా, ఉద్వేగంగా చెప్పిన మాటలే ఆ ముగ్గురమ్మాయిల్లో పనిచేస్తున్నాయి.
"నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ ఇన్ దిస్ వరల్డ్ యూ నో" పర్ణేష్ వేపు చూస్తూ సీరియస్ గా అంది ముగ్ధ.
ముగ్ధవేపు చిరునవ్వుతో చూసింది సురభి తనని సమర్ధిస్తున్నందుకు.
"ఎస్. అఫ్ కోర్స్ నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వన్ థింగ్. ఈ జనరేషన్ లో అలాంటి లేడీస్ లేరు. ఇవాల్టి స్త్రీలు వంటింటికి, ఇంట్లో టి.వి.కి. బయట సినిమాలకి, బంగారు నగలకి, పట్టుచీరలకు, షాపింగ్ కి పరిమితం తప్ప తమ మగాళ్ళని గొప్పగా మలచుకోవాలన్న ధ్యాస వున్నవాళ్ళు ఎక్కడా కన్పించడంలేదు. ఆ జనరేషన్ అయిపోయింది. మళ్ళీరాదు.
ఎంతసేపు ప్రక్క స్తీ ఏం కొన్నది? మనం అంతకంటే ఖరీదైంది ఎప్పుడు కొనాలి అని తప్ప - ప్రొడక్టివ్ కానేకాదు- ఇంటి ముందు ఖాళీఉన్నా, నాలుగు మొక్కల్ని పెంచుకోరు - మంచి అభిరుచులుండవు- చీర మడతలు నలగకుండా పనిమనుష్యుల సహాయంతో వండటం- వార్చటం, తినటం, తినబెట్టటం - అంతేగా? జపాన్ లో, కొరియాలో ప్రతి ఇల్లు ఒక ఏన్సిలారీ యూనిట్ అట- నడిపేది ఎవరో తెలుసా? గృహిణులు... కాని మనదేశంలో? తెలుసుగా? మొగుడ్ని వెనక్కిలాగే వాళ్ళేగాని ముందుకు నడిపేవారు లేరు" కాజువల్ గా అన్నాడు పర్ణేష్.
"నో మిస్టర్ పర్ణేష్ మీరు స్త్రీలని కించపరుస్తున్నారు- ఏ యుగంలోనైనా, ఏ జనరేషన్ లోనైనా, అలాంటి స్త్రీలు వుంటారు. మనదేశంలో కూడా....
ఈ ఆపరేషన్ గురించి ఆలోచించండి. మనదేశంలో ఆయా రంగాల్లో ఎంతోమంది జీనియస్ లు, ప్రతిభావంతులు, మేధావులున్నారా? లేదా? చెప్పండి" సూటిగా అడిగింది నీలిమ, పర్ణేష్ ని.
"ఉన్నారు" నెమ్మదిగా అన్నాడు పర్ణేష్.
"అంటే, ఆయా వ్యక్తుల వెనక అంతమంది స్త్రీ లున్నారనేగా అర్ధం." నీలిమ ఆర్గ్యుమెంట్ కి చప్పట్లు కొట్టింది అలక.
"గుడ్, ఆర్గ్యుమెంట్" గట్టిగా, బైటకనేసింది ముగ్ధ పర్ణేష్ మరేం మాట్లాడలేకపోయాడు.
"మా నలుగుర్నే తీసుకోండి ట్వంటీ ఫస్ట్ సెంచరీలోకి వూహించని మార్పులతో, ఎలక్ట్రానిక్ ప్రభంజనంతో దేశం ప్రవేశిస్తున్న సమయం ఇది. ఈ జనరేషన్ కే చెందిన వాళ్ళంమేం మేం నాన్ ప్రొడక్టివ్ అని అనగలరా? ఇకపై చూసిగదా అనాలి?
మేం ప్రేమలకు, అభిమానాలకు, అనుబంధాలకు ఆత్మీయతలకు దూరం కాలేదు. కాబోము.
ఇది మేం మనుష్యులమని అనిపించుకొనేందుకు - ఇక మేం దేశానికి ఉపయోగపడగలమా? లేదా? అనేది ప్రశ్న....అందుకూ సమాధానం చెప్పగలం.
ఒక్క హార్డకొర్ క్రిమినల్ ని బుద్ధుడిగా మార్చగలం అశోకుడు చేత మళ్ళీ యుద్ధం చేయించగలం శివరాసన్ ని ఒక పీఠాధిపతిగా మార్చగలం. దారీ తెన్నూ లేకుండా, ఒక ప్రోపర్ గైడెన్స్ లేకుండా తిరిగే, ఒకడిచేత జీవితంలో వండర్స్ చేయించగలం వుయ్ ఆర్ డామ్ ష్యూర్ ఎబౌట్ ఇట్ అండ్ వుయ్ ఆర్ డామ్ సీరియస్ ఎబౌట్ ఇట్." సురభి ఛాలెంజ్ గా అంది పర్ణేష్ వేపు చూస్తూ.
"అన్నంత సులభంకాదు, చెయ్యడం" ఒకింత సవాల్ ధ్వనించింది పర్ణేష్ మాటల్లో.
దాన్ని భరించలేకపోయారు అమ్మాయిలు.
అవమానభారంతో వాళ్ళ అందమైన మోములు కందిపోయాయి.
"కొందరి విషయంలో మీ ఆర్గ్యుమెంట్ కరక్ట్ అంతే అందరి విషయంలో మాత్రంకాదు. అలాంటి షో పీస్ లాంటి స్త్రీలమూలంగా నిజంగా ఎంతో సాధిస్తున్న స్త్రీలుకూడా ఇలాంటి అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తోంది." అంది ముగ్ధ పౌరుషంగా.
పర్ణేష్ కి ముగ్ధ ఆర్గ్యుమెంట్ లో రీజనింగ్ కనిపించింది. అందుకే మౌనంగా ఉండిపోయాడు.
"ఓ.కే. మిస్టర్ పర్ణేష్.... బెట్....
ఈ క్షణంలో మేం నలుగురం ఓ సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. నలుగురు భిన్న మనస్తత్వాల అపరిచిత వ్యక్తుల్ని మేం ప్రేమిస్తాం. వాళ్ళను గొప్ప వ్యక్తులుగా తయారుచేస్తాం" అంటూ అందరివేపూ చూసింది ముగ్ధ.