Previous Page Next Page 
సామ వేద సంహిత పేజి 3

           

                                               ఎనిమిదవ ఖండము
   
ఋషులు :- 1 బుధ, గవిష్టరులు. 2,5. వత్సుడు. 3. భరద్వాజుడు. 4,7. విశ్వామిత్రుడు. 6. వసిష్ఠుడు. 8. పాయువు.
   
1.    ఈ అగ్నిని జనులు సమిధలచే ప్రజ్వరిల్ల చేసినారు. ఉషః కాలమున అగ్ని అవతరించినపుడు గోవులు మేల్కొన్నట్లు జనులు సావధానులు అగుదురు. మహావృక్షముల శాఖలవలె ప్రజ్వలించు అగ్ని కిరణము ఒకటి తరువాత మరొకటిగా వ్యాపించుచు నాకమునకు వెలుగులు వ్యాపింప చేయుచున్నవి.
   
    (చెట్లు కొమ్మపై కొమ్మను పెంచుచు ఎదుగును. సూర్యకిరణములు అట్లే క్రమక్రమముగ వ్యాపించునని చెప్పుట ఎంతో సహజము.)

2.    అగ్ని విజేత. మహానుడు. విప్రపోషకుడు. సుఖముల అధిష్టాత. తనువులను సాదరమున రక్షించువాడు. స్తోతలారా! అట్టి అగ్నిని స్తుతించు యోగ్యత సాధించండి.
   
    అగ్ని ధనదాత. కవచము వంటి జ్వాలా యుక్తుడు. హరితవర్ణ కేశ సదృశుడు. అగ్నిని ప్రసన్నుని చేయుటకు అతనిని స్తుతులతో ఆరాధించండి.
   
3.    పూషదేవా! నీ ఒక రంగు తెలుపు మరొక రంగు నలుపు అగుచున్నవి. నీ మహిమచే తెలుపు రంగులు పగళ్ళు, నలుపు రంగులు రాత్రులు అగుచున్నవి. అన్నవంత పూషదేవా! నీవు ఆదిత్యుడవు. సకల ప్రజ్ఞల రక్షకుడవు. నీ కళ్యాణ రూపము, దానగుణము మాకు వర్తించును గాక.
   
4.    అగ్నిదేవా! నీవు బహువిధ కర్మలవాడవు. ఇడాదేవి గోవులను ప్రసాదించునది. నేను నిరంతరము ఇడా హవనము చేయుచున్నాను. నాకు సాధన కలిగించుము. పుత్రపౌత్రులను కలిగించుము. నీ సహృదయము, నీకు కలుగు విజయములు మా పరములు అగును గాత.
   
5.    హోతల ముందున్న అగ్ని మేఘగర్భము నందలి విద్యుత్తు అయినది. ఆ అగ్ని హోతలకు సిద్ది కలిగించుచున్నాడు.
   
    అగ్ని గుణసంపన్నుడు. అంతరిక్షజ్ఞాత. వేది యందు ప్రసన్నుడు. హవ్యవాహకుడు అట్టి అగ్ని వేది మీద చక్కగా స్థాపించబడినాడు. స్తోతలారా! అగ్నిని ఉపాసించండి. అతడు మీకు అన్నములను, దనములను ఇచ్చును గాత. మీ తనువులను రక్షించును గాక.
   
6.    అగ్ని మహా బలిశాలి. వీరులచే స్తుతించదగిన వాడు. ఇంద్రుని వంటి బలశాలి. వెలుగుల నీను ఆ అగ్నిని స్తుతించండి. నమస్కరించండి. కర్మ ఫలములను అర్ధించండి.
   
7.    అగ్ని సర్వజ్ఞుడు. గర్భిణులు గర్భము దాల్చినట్లు అగ్ని అరణులందున్నాడు. అట్టి అగ్నిని నరులు యజ్ఞములు చేసియు, హవిస్సులు అర్పించియు నిత్యము అర్చించుచున్నారు.
   
8.    అగ్నిదేవా! కలకాలముగ నీవు రాక్షసులను హింసించుచున్నావు. అట్లయ్యు యుద్దమున నిన్ను గెలిచిన రాక్షసుడు లేడు. ఇక నీవు హింసావ్యాపారులు, మాంస భక్షకులగు రాక్షసులను నీ తేజస్సున భస్మము చేయుము. వాడి యగు నీ ఆయుధము ఒక్కనినైన విడువరాదు.
   
                                          తొమ్మిదవ ఖండము
   

ఋషులు :- 2,10. వామదేవుడు. 1. గాయత్రి. 3,4. భరద్వాజుడు. 5. మృత్కవాహాద్వితుడు. 6. వసూయవ. 7,9. గోపవనుడు. 8. పూరురాత్రేయ.
   
1.    అగ్నిదేవా! నీవు ఎంతో బలవంతుడవు. తేజోవంతుడవు. మాకు ధనము తెచ్చిఇమ్ము. నిరాటంక గతిగల అగ్నీ! ప్రశంసనీయమగు ధనమును ప్రసాదించుము. అన్నపు మార్గములను చూపుము.
   
2.    నరునకు పుత్రుడు కలిగినపుడు అగ్నిని ప్రజ్వరిల్లచేయవలెను. అవిచ్చిన్నమగు హవితోడ అగ్నికి అభిముఖుడై యజించవలెను. దివ్యసుఖములను అనుభవించవలెను.
   
3.    అగ్నీ! నీవు ప్రజ్వలితుడవైనావు. నిర్మలమగు నీ ధూమము వెడలినది. అంతరిక్షమున వ్యాపించినది. మేఘముగా పరిణమించినది.
   
    పావక అగ్నీ! ఈ స్తుతులు సూర్యసమములు. అవి నిన్ను ప్రశంసించుచున్నవి. ప్రకాశింప చేయుచున్నవి. ఆ ప్రకాశముచే నీవు ప్రదీప్తుడవు అగుము.
   
4.    అగ్నిదేవా! నీ భోజనము శుష్క కాష్టమగును. అది నీకు సూర్యునకు పగటి వెలుగు వలె లభించుచున్నది. సర్వద్రష్టవు, వ్యాపకుడవగు అగ్నీ! యజమాని ఇంట పుష్టిని వర్దిల్లచేయుము.
   
5.    అగ్ని బహుజన ప్రియుడు. సంపదలు ఇచ్చువాడు. అతిథి వంటి పూజనీయుడు. అతనిని ప్రాతః కాలము స్తుతింతురు. అమర్త్యుడగు అగ్నిని మర్త్యులగు నరులు హవిస్సులు అర్పించి అర్చింతురు!   
   
6.    ఈ స్తుతి వాహకము. దీనిని అగ్నికి అర్పించబడుచున్నది. అగ్ని అధిక ధనములు ప్రసాదించువాడు. అతడు ఈ స్తుతిని అందుకొని మాకు మరింత ధనము ప్రసాదించును గాత.
   
7.    అగ్ని జనప్రియుడు. అతిథి వంటి పూజ్యుడు. గృహ హితకారి. మీకు సుఖములు కలుగుటకు గాను అగ్నిని స్తుతించండి.
   
8.    యజ్ఞములందు ప్రదీప్తమానుడగు అగ్నికి మహాహవి సమర్పించబడును. మానవులు అగ్నిని తమ మిత్రునిగ భావింతురు. అతనిని స్తుతింతురు. సత్కరింతురు. కావున మీరు సహితము అన్నము కోరి అగ్నిని అర్చించండి.
   
9.    అగ్ని శత్రుహంత ప్రశంసనీయుడు. జనహితకారి. ఋక్షపుత్రుడగు 'శృతర్వు'ని నిమిత్తము అగ్ని జ్వాలారూపమున ప్రజ్వరిల్ల చేయబడినాడు. అటువంటి అగ్ని మాకు లభించినాడు.
   
10.    అగ్నిదేవా! నీవు సత్కార్యములు చేయుటకు అవతరించినావు. నీవు ఋత్విజులతో కూడ యజ్ఞములందు ఉండువాడవు. నీ తండ్రి కశ్యపుడు, తల్లి శ్రద్ద, స్తోత మనువు అగుచున్నారు.
   
                                             పదవ ఖండము
   
ఋషులు :- 1 అగ్నిస్తాపసుడు. 2. వామదేవుడు. 3. కశ్యప అసితుడు లేక దేవలుడు. 4. భార్గహతి కాని సోముడు కాని. 5. పాయువు. 6. ప్రస్కణ్వుడు.
   
1.    ఈశ్వరుని, సోముని, వరుణుని, అగ్నిని, అదితి పుత్రుడగు విష్ణువును, సూర్యుని, బ్రహ్మను, బృహస్పతిని మమ్ము రక్షించుడని ఆహ్వానించుచున్నాము.
   
2.    హవిస్సుల అంగిరసులు మార్గము ఏర్పరచుకొని ద్యులోకమునకు చేరినట్లు - నరులు దారులు ఏర్పరచుకొని గ్రామములకు చేరినట్లు యజ్ఞకర్తలు ఈ భూమి పైకి ఎగిరి స్వర్గస్థానమును ఆరోహించినారు.
   
3.    అగ్నిదేవా! గొప్ప ధనములు ప్రసాదించుమని నిన్ను వెలిగించుచున్నాము. నీవు మాకు వారములు ఇచ్చుటకును, హవనార్దమును ద్వాహపృథ్వులను ఆరాధించుము.
   
4.    ఈ యజ్ఞమునందు అధ్వర్యాదులు స్తుతులు ఉచ్చరించుచున్నారు. అగ్నికి ఈ విషయము తెలియును. చక్రములను ఇరుసు తన అధీనమందు ఉంచుకొనును. అట్లే అగ్ని ఋత్విజుల కర్మలను తన అధీనమందు ఉంచుకొనును.
   
5.    అగ్నిదేవా! నీవు నీ తేజమునకు, క్రోధమునకు రాక్షసులను హరింపచేయువాడవు. రాక్షసులు సకల దిశలందు వ్యాపించి ఉన్నారు. వారిని హతమార్చుము. వారి పరాక్రమమును త్రుంచి వేయుము.
   
6.    అగ్నిదేవా! ఈ యజ్ఞమునందు వసువులను, రుద్రులను, ఆదిత్యులను యాగయుక్తులును, ప్రజాపతి సృష్టించిన వారును, జలములను ప్రసాదించగల అన్య దేవతలను యజింపుము.
   
                                            పదకొండవ ఖండము
   
ఋషులు :- 1. దీర్ఘతముడు 2,4. విశ్వామిత్రుడు. 3. గోతముడు. 5. త్రితుడు. 6. ఇరిమిఠి. 7,8,10. వైయశ్వుడు. 9. భరద్వాజుడు.   
   
1.    అగ్నిదేవా! నీవు నాకు స్వామివి. నేను నీ శరణు జొచ్చినాను. నిన్ను అనేక మంది పుత్రులను, బహు ధనములను ప్రసాదించుమని ప్రార్దించుచున్నాను.
   
2.    అగ్ని ఋత్విజుల క్రతువులను అందుకొనువాడు. తేజస్సులచే వెలుగొందు జగములకు విధాత. దేవతల ఆహ్వానకర్త. ఋత్విజులారా! అట్టి అగ్ని కొరకు గొప్ప గొప్ప ప్రాచీన స్తోత్రములు రచించండి.
   
3.    అగ్నిదేవా! నీవు బలపుత్రుడవు. గోవులకు, అన్నములకు స్వామివి. సకల భూతములకు అంతర్యామివి. మాకు ఎంతో అన్నమును ప్రసాదించుము.
   
4.    అగ్నిదేవా! నీవు యజిష్టుడవు. యజ్ఞములందు దేవతలను అభిలషించువాడవు. దేవతలను యజింపుము. హోతయగు యజమాని శత్రువులను వధించుము. విరాజిల్లుము.
   
5.    స్థిరుడును, ధన శాసకుడును అగు అగ్ని తన సప్తజిహ్వల జ్వాలలతో ప్రత్యక్షమైనాడు. అతడు కర్మలను నిర్దేశించు సోమమును శాసించుచున్నాడు.
   
6.    అదితి స్తుతియోగ్య ఆమె పగలు మమ్ము రక్షించును గాత, మావద్దకు విచ్చేసి మాకు శాంతియు సుఖమును కలిగించును గాత. శత్రువులను దూరము చేయును గాత.
   
7.    శత్రువును వధించు అగ్నిని యజించండి.. ఎవని ధూమము సర్వత్ర వ్యాపించునో, ఎవని తేజస్సును రాక్షసులు సహితము నిలువరింపజాలరో, ఎవడు సకల భూతజ్ఞాత అగునో అట్టి అగ్నిని అర్చించండి.
   
8.    శత్రువు తన సకల మాయల చేతను అధిగమించ జాలనివాడు అగ్ని. హవ్యా దాతలను అనుగ్రహించువాడు అగ్ని. అట్టి అగ్నికి మానవులు హవిస్సులు అర్పింతురు.
   
9.    అగ్నిదేవా! కుటిలురను, పాపులను, దుష్ట బుద్దులను, హింసకులను దూరమునకు విసరివేయుము. సజ్జనపాలకా! మమ్ము సుఖవంతులను చేయుము.
   
10.    శత్రువినాశక, విశ్వపాలక అగ్నీ! ఇది నేను రచించిన నవతమ స్తోత్రము. దీనిని ఆలకించుము. మాయావులగు రాక్షసులను నీ మంటలలో కాల్చి బూడిదచేయుము.
   
                                              పన్నెండవ ఖండము
   
ఋషులు :- 1,3,4 ప్రయోగ భార్గవుడు. 2,5,6,7. సౌభరి. 8. విశ్వమనుడు.
   
1.    అగ్ని మహాదాత సత్యవంతుడు తేజోవంతుడు. స్తోతలారా! అట్టి అగ్ని స్తుతులను చక్కగా గానము చేయండి - "ప్రగాయత".
   
2.    అగ్నిదేవా! నీ స్నేహము కలిగిన వాడు వీరపుతుర్లు, అన్నరాసులు, పటిష్ట రక్షణలు కలవాడగు చున్నాడు - వర్ధిల్లుచున్నాడు.
   
3.    స్తోతలారా! హవ్యవాహక అగ్నిని స్తుతించండి. దానాది గుణయుక్తుడగు అగ్నిని ఉపాసించండి. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులు చేర్చండి.
   
4.    ఋత్విజులారా! మా యజ్ఞములందు అగ్ని అతిథివంటి ప్రియతముడు. అతనిని తొలగించకండి. అగ్ని మంచి హోత. మంచి అధ్వరుడు. అతనిని అనేకులు ఉపాసించుచున్నారు. అగ్ని నివసింపచేయువాడు.
   
5.    అగ్నిదేవా! హవిస్సులచే తృప్తిచెందుము. మాకు మంగళకరుడవు అగుము. చక్కని ధనముల వాడా! మాకు మంగళమయ దానము కలిగించుము. మా యజ్ఞములు మంగళకరములు అగును గాత. మా స్తుతులు మంగళ మయములు అగును గాత.
   
6.    అగ్నిదేవా! నీవు యజిష్టవు. దేవతలందు అధిక దానకర్తవు. దేవతల ఆహ్వాతవు. అమరుడవు. ఈ యజ్ఞమును నిర్వహించువాడవు. అట్టి నిన్ను ఆరాధించుచున్నాము.
   
7.    అగ్నిదేవా! యజ్ఞమును మ్రింగు రాక్షసాదులను పారద్రోలుము. పాప బుద్దిగల శత్రువుల క్రోధమును అణచివేయుము. ఆ కీర్తి మాకు కలిగించుము.
   
8.    అగ్ని విశ్వపతి. హవిస్సుల అందుకొని మండి పడువాడు. అతడు ఇంటనున్న రాక్షసాది పీడలను తొలగించును. ఇది ప్రసిద్ధము.
   
    శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత యందలి ఆగ్నేయకాండము సమాప్తము.

 Previous Page Next Page