ఇప్పటికీ అతని కంపెనీకి పర్చేజ్ డిపార్టుమెంట్ లేదు. అతను ఏ మార్కెట్ సర్వే చేయలేదు. అయినా నేను ఉత్పత్తి చేసే టూత్ పేస్ట్ బాగా అమ్ముడు పోతుంది. ఎందుకంటే మిగిలిన కొన్ని టూత్ పేస్ట్ ల కంటే తక్కువ ధరకి అమ్ముతాను. ఈ దేశంలో పేద ప్రజలెక్కువ. ప్రోడక్ట్ గన్ షాట్ గా పోతుంది. ఇంకెందుకు మార్కెట్ సర్వ్ అంటాడు. వాట్ ఏ జీనియస్?!
మిగతావారు ఎక్కువ లాభాల కోసం ధర ఎక్కువ పెట్టి తక్కువ అమ్మితే- పటేల్ తక్కువ ధరకి ఎక్కువ అమ్మి లాభాలు సమకూర్చుకుంటాడు.
త్వరలో కొన్ని కోట్లలో లైనియర్ ఆల్ కైల్ బెంజిన్ (డిటర్జెంట్ కి ఉపయోగించే ముడిపదార్ధం) ఫ్యాక్టరీ నెలకొల్పబోతున్నాడు. మరో కొన్ని కోట్లతో సోడా ఏష్ ఫ్యాక్టరీ కూడా నిర్మించబోతున్నాడు.
కేవలం బట్టలుతికే పౌడర్ వ్యాపారంలో దేశంలోని పది పెద్ద కంపెనీలైన టాటాస్, బిర్లాస్, సింఘానియస్, తాపడ్స్, శ్రీరామ్స్ లాంటి కంపెనీల స్థాయికి ఎదిగిపోయాడు పటేల్ భాయ్.
ఆయనది ఒక్కటే స్లోగన్!
"సరసమైన ధరకి నాణ్యతగల వస్తువునందించు- అప్పుడు నువ్వేది ఉత్పత్తి చేసినా దాన్నదే అమ్ముకుంటుంది."
ఓహో.... హేట్సాఫ్ పటేల్ భాయ్...
కేవలం పసుపుపచ్చ పౌడర్ పొట్లంతో నువ్వు సాధించిన వ్యాపార విజయం అమోఘం- అద్భుతం.
ఇప్పుడు చెప్పండి గుప్తాగారు, పెద్ద పెద్ద కంపెనీలు- కోట్లాది రూపాయల పెట్టుబడి- కళ్ళు చెదిరే ప్రచారం- కాకలుతీరిన వ్యాపార అనుభవం- అమోఘమైన నెట్ వర్క్- టైమ్ ఆఫ్ షెడ్యూల్స్- ఏవి....? ఏవి అవన్నీ?
ఏం చేయగలిగాయ్ అవన్నీ- అతి సాధారణ పసుపుపచ్చ ప్యాకెట్ ని ఏం కదిలించగలిగారు పటేల్ భాయ్ ని...? ఏం దెబ్బకొట్టారు 'నిర్మా'ని?
కేవలం 450 రూపాయల జీతగాడు సాధించిన వ్యాపార అద్భుతం ఇది గుప్తాగారూ. ఇది కల్పించిన కథకాదు- సృష్టించిన నవల కాదు. ఇది పచ్చి నిజం. వాస్తవ జీవితం.
మన కళ్ళెదుటే- మన దేశంలోనే జరిగిన అద్భుతం ఇది. 'నిర్మా' కథ భారతదేశ వ్యాపార చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
సో... ఇప్పుడిక మనం పోటీ అని, పెద్ద కంపెనీలని తట్టుకోగలమా అని ఆలోచించడం పిరికితనం కాదంటారా? ఆల్ రెడీ వున్న బిగ్ బిజినెస్ కంపెనీలను చూసో, వ్యక్తుల్ని చూసో ఉలిక్కిపడితే చరిత్రలో ప్రతి సంవత్సరం కొందరు కొత్త భాగ్యవంతులు, పారిశ్రామికవేత్తలు పుట్టుకురారు.
కనుక... ఈ రోజునుంచే మన కంపెనీ డిక్షనరీలో "భయం- పిరికితనం- వెనుకంజ" అనే పదాలు లేవని గుర్తించండి.
రేపటినుంచే మనం కొత్త డిటర్జెంట్ పౌడర్ ని, సోప్ ని తయారుచేసే ప్రయత్నాలు ఆరంభిస్తున్నాం.
'గివ్ క్వాలిటీ ఎట్ ది రైట్ ప్రైస్' నిర్మా స్లోగన్ అయితే.
'గివ్ మోర్ క్వాలిటీ ఎట్ ది చీపెస్ట్ ప్రైస్' మన స్లోగన్.
ఇకపోతే, మన పౌడర్ పేరు 'ప్రియ' మనం యాడ్ ఫిల్మ్ లో చూపించాల్సింది- వేరే బిళ్ళలు వాడితే బట్టలు త్వరగా చిరుగుతాయి. ప్రియా వాడితే మీ ప్రియమైన బట్టల్ని కాపాడుతుంది అని. వీలైతే ప్రియాతో ఉతికిన బట్టలు మంచి సువాసనల్ని వెదజల్లుతాయని కూడా ఇద్దాం.
ఇప్పుడు మారోపని చేయండి. డిటర్జెంట్ లో సాధారణంగా వుండే బట్టలు చింపే గుణాన్ని అరికట్టే విధంగా, త్వరగా అరగని విధంగా, ఎక్కువ నురుగు వచ్చే విధంగా, ఫెర్ ఫ్యూమ్ పౌడర్ ని తయారుచేసిచ్చే కెమిస్ట్ ని వెతికి పట్టుకోండి. వీలైతే అహ్మదాబాద్ వెళ్ళి అనుభవజ్ఞుడైన ఒక వర్కర్ ని మనవైపుకు లాక్కురండి-" త్రినాధ్ చెప్పడం ఆపాడు.
అప్పటికే ఇంజనీర్, గుప్తాలు మతులు పోగొట్టుకుని త్రినాధ్ వైపు దిగ్భ్రమగా చూస్తున్నారు.
"అలాగే పట్టణాలలో వుండే గృహిణులకు మషాలాలు తయారుచేసుకోవడం ఇబ్బందితో కూడిన పని. దినుసులు కొనుక్కురావాలి. వాటిని రోట్లోనో, గ్రైండర్ లోనో వేసి పొడిగా మార్చుకోవాలి. ఇవన్నీ అలా వుంచి, కమ్మగా ఘుమఘుమలాడించే విధంగా మషాలాలు తయారుచేసే పద్ధతి తెలియక ఆధునిక యువతులు గృహిణులయ్యాక ఇబ్బంది పడతారు. కనుక వాటిలో అనుభవం బాగా వున్న గృహిణుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోండి.
సౌత్ ఇండియన్ సాంబారు పొడి, రసం పొడి, యాలకుల పొడి, మషాలా పొడి, ధనియాల పొడి, లవంగాల పొడి, దాచినచెక్కపొడి, మిరియాల పొడి, గసగసాల పొడి, కారపుపొడి, వెల్లుల్లి లాంటివి ఉత్పత్తి చేయడం మంచి లాభదాయకమని నా ఉద్దేశ్యం. ఈ సందర్భంలో ఇప్పటికే రంగంలో వున్న బ్రూక్ బాండ్ కంపెనీ ఉత్పత్తుల్ని మనం బీట్ చేయాలంటే ఒకటి క్వాలిటీ, రెండు తక్కువ ధరని మెయిన్ టైన్ చేయాలి. ఓకే-" అంటూ కుర్చీలోంచి లేచాడు త్రినాధ్.
మరో విషయం నేను చాలాసార్లు గమనించాను. స్కూటర్స్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కోసారి వెంటనే స్టార్ట్ కావు. అప్పుడు ఇంజన్ వున్న కుడివేపు స్కూటర్ ని బాగా వంచి కొద్ది క్షణాలుంచి ఆ తరువాత స్టార్ట్ చేస్తే అవుతాయ్. మనదేశ వినియోగదారుల దౌర్భాగ్యమేమిటంటే ఒక ప్రోడక్ట్ బాగా అమ్ముడు పోతుంటే సదరు కంపెనీవాళ్ళు దాన్ని మరింత నాణ్యత వుండేలా, పై ఆకారం ముచ్చటగా వుండేలా ఇంప్రూవ్ చేయరు.
ప్రోడక్ట్ డెవలప్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇండియాలో లేదు. రీసర్చ్ వింగ్ కి ప్రాధాన్యత ఇవ్వరు. పాత మోడల్ లో ఏదైనా లోపాలుంటే వెంటనే సరిచేసుకోరు. ఈ పాయింట్ దగ్గరే మనమో కొత్త వ్యాపారాన్ని ఆరంభించాలి. స్కూటర్ ని వంచకుండానే స్టార్ట్ చేయగల పరికరాన్ని మనం ఉత్పత్తి చేయాలి. పెద్ద స్కూటర్ కంపెనీలు మేల్కొనే రోజు రాగానే మనమే వారి కంపెనీల బ్రాండ్ నేమ్ తో వాటిని సప్లై చేస్తామనే ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇకపోతే మోపెడ్స్ విషయానికొస్తే తరచూ స్పార్క్ ప్లగ్ కి డస్ట్ పట్టి కరెంట్ సప్లై ఆగిపోయి స్టార్ట్ కావు. డస్ట్ పట్టని రీతిలో మనం స్పార్క్ ప్లగ్స్ తయారుచేయాలి.
ఇండియన్ వినియోగదారులకు ఆప్షన్ తక్కువ. దానికి కార్ల కంపెనీ ఉదాహరణ. నా చిన్నప్పటినుంచి చూస్తున్నాను. అంబాసిడర్ కారు ఏ కొత్త మార్పును సంతరించుకోలేదు. అదే షేప్, అవే కలర్స్- అదే ఇంజన్. అదే పెట్రోల కంజప్షన్- కాకపోతే మార్కు ఒన్, మార్క్ టూ, మార్క్ త్రీ అంటూ పాత చింతకాయ పచ్చడినే మన ముఖాన రుద్దుతారు. అలాగే ప్రీమియర్, ప్రీమియర్ పద్మిని ప్రెసిడెంట్ అంటూ షో చేస్తారు. ఇండియాలో కార్లు ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీలు ఈ రెండే. వాళ్ళ ధైర్యం ఏమిటంటే- భారతీయ వినియోగదారులు కొనక ఛస్తారా? మరో ఛాయిస్ లేదుగా అని. దేశవాళీ కార్ల పరిశ్రమ దెబ్బ తింటుందని కేంద్ర ప్రభుత్వం విదేశీ కార్ల దిగుమతిని నిలిపివేసింది. ఒకటీ, అరా వచ్చినా విపరీతమైన దిగుమతి సుకం చెల్లించాలి. సో- చచ్చినట్లు అంబాసిడర్, ప్రీమియరో కొనక తప్పదు. అందుకే ఆప్షన్ తక్కువ అన్నది. అదే అమెరికా, జపాన్ లలో సంవత్సరానికే రెండు మూడు కొత్త మోడల్స్ ని తీసుకొస్తారట.
సో... దీన్ని బట్టి ఇండియాలో కొన్ని పరిశ్రమలలో గుత్తాధిపత్యం కొనసాగుతోంది. అలాంటి పరిశ్రమల్ని మనం వెతికి పట్టుకోవాలి.
ఇకపోతే ఎప్పుడూ కొత్త అవసరాల్ని తీర్చే కొత్త వస్తువుల అన్వేషణ ఓ ప్రక్క, పాత వస్తువులకు సంబంధించిన లోపాల్ని సరిదిద్దే కొత్త వస్తువుల అన్వేషణ మరో పక్క మనం సాగించాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే- మనం బిజినెస్ కొలంబస్ లం కావాలి.
We have maximum number of consumers in India for any product-any company....
త్రినాధ్ ఆంగ్లంలో స్వచ్చంగా, నిర్దుష్టంగా, సరళంగా మాట్లాడడం చూసిన ఇంజనీర్ ఓ క్షణం షాక్ తిన్నాడు. అతనలాగే ఆశ్చర్యపోయి చూస్తుండగా త్రినాధ్ మరలా అన్నాడు- "If someone is willing to work day and night, I will teach him to be successful in life. There is no easy way to money-"
త్రినాధ్ తనలో తానే అనుకుంటున్నట్లుగా అన్నా అవి పైకే వినిపించాయి.
"ఒక దశ వరకు మనం కష్టపడి డబ్బును సంపాదిస్తే- ఆ తరువాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది.'
After a point of time, money has no sense. Working for me is a game and I continue to play the game.
అనే స్థాయికి నేను ఎదగాలి గుప్తాగారు.
అదీ తక్కువ కాలంలో.
నాకు జరిగిన అవమానం ప్రతి క్షణం నన్ను బాధిస్తోంది- రెచ్చగొడుతోంది. పగబట్టి ప్రకారం తీర్చుకోమంటోంది. అందుకే విశ్రాంతి లేని పగళ్ళను- నిద్రలేని రాత్రిళ్ళను ఆశ్రయిస్తున్నాను... నా లక్ష్యం కోసం. మీరు నాతో సహకరిస్తే మీ సహాయాన్ని విస్మరించే స్థితికి దిగజారనని హామీ ఇస్తున్నాను.
ఇకపై ఒక విషయాన్నే రెండుసార్లు చెప్పే పద్ధతిని మానేస్తున్నాను. అత్యవసరమనుకుంటేనే నాతో సంప్రదించండి- నా కాలాన్ని వాడుకోండి..." అంటుండగా ఫోన్ మ్రోగింది.
త్రినాధ్ చటుక్కున ఫోన్ ఎత్తాడు. ఫోన్ లో వినిపించే మాటలు వింటున్న కొద్దీ త్రినాధ్ ముఖంలో తీవ్రమైన మార్పు రానారంభించింది.
అప్పటివరకూ ఎంతో ప్రశాంతంగా ఎన్నో విషయాల్ని ఆలోచించిన త్రినాధ్ లా లేడిప్పుడు.
ముఖంలో ఏదో కసి, కోపం హఠాత్తుగా చోటుచేసుకున్నాయి. ఉన్నట్టుండి ఫోన్ ని విసురుగా పెట్టేసి ఆవేశంగా ముందుకు దూకాడు. ఏం జరిగిందో అర్ధంకాక తెల్లబోయిన ఇంజనీర్ ధైర్యం చేసి అడిగాడు... "ఏం జరిగింది త్రినాధ్? ఎందుకలా మారిపోయావ్ ఇంతలో...?"
"ఇంతవరకు ఏం జరగలేదు. ఇప్పుడే జరగబోతోంది... మరో అరగంటలో ఒకడి చూపుడువేలు వాడినుంచి వేరుపడిపోతుంది..." అంటూ ఒక్క అంగలో ఆ గదిలోంచి బయటకు దూసుకుపోయాడు త్రినాధ్ పాములా బుసలు కొడుతూ.
క్షణాల్లో త్రినాధ్ ని ప్రళయకాళ రుద్రుణ్ణి చేసిన ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి...? ఎవరిపై ఆ కోపం...?
మానసికంగా ఎదిగి తిమ్మడు త్రినాధ్ గా మారినా శారీరకంగా మాత్రం ఎప్పటిలాగే మొరటుగా, మొండిగా వుండిపోయాడా...? అదే నిజమైతే ఎవరో నిర్భాగ్యుడు చావుదెబ్బ తినడం ఖాయం.
ఎవరతను...?
ఇంజనీర్ కి ఒకింత ఆందోళనగా వుంది.
* * * *
త్రినాధ్ ఎక్కిన జీప్ సరాసరి కాలేజీకి వెళ్లింది. కాని అప్పటికే మాలిని వెళ్ళిపోయిందని తెలిసింది.
జీప్ తిరిగి బయలుదేరింది.
కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి.
ఆవేశంతో అతని శరీరం ఊగిపోతోంది.
ఇటీవల కాలంలో అతనిలో అంత కోపం ఎప్పుడూ ప్రజ్వరిల్లలేదు.
జీప్ స్పీడోమీటర్ లోని ముల్లు డెబ్బైకి, ఎనభైకి మధ్య ఊగిసలాడుతోంది నిస్సహాయంగా.
అతని శరీరమంతా ఉక్కుముక్కలా బిగుసుకుపోయింది.
శత్రుసైన్యం మీదకు దుమకబోయే విధ్వంసక శతఘ్నిలా వున్నాడు ఇప్పుడతను.
ఇంటిముందు జీప్ ఆగుతూనే ఎగిరి దూకాడు. అప్పటికే సాయం చీకట్లు కాటేజ్ ముందున్న మొక్కలపై పరుచుకుంటున్నాయి.
వడివడిగా లోపలకు వెళుతున్నాడు నలువైపులా పరికించి చూస్తూ.
ఆమె కోసం కాటేజ్ లోకి వెళ్ళే అవసరం లేకపోయిందతనికి.
గార్డెన్ లో కుడివైపు మూలగా అప్పుడప్పుడూ ఆమె కూర్చునే చెట్టు క్రిందే కూర్చుని వుంది.