Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 38

    విజయ్ కుమార్ మల్ హోత్ర రంగూన్ నుంచి యింత దూరం రావటానికి ఓ ముఖ్య కారణం వుంది. అతనికి యింకా పెళ్ళికాలేదు. ఇక్కడ పిల్లలని చూసిరమ్మని తండ్రి పంపిస్తే వచ్చాడు. తండ్రికి చాలా డబ్బు వుందిట రకరకాల వ్యాపారాలు వున్నాయి. తల్లి లేదు. క్లుప్తంగా అదీ అతని విషయం.

    విజయ్ కుమార్ మల్ హోత్ర వచ్చి నాలుగు రోజులు అయింది. అతను వచ్చినప్పటి నుంచీ చూస్తున్నది అమల. గుచ్చి గుచ్చి కళ్ళార్పకుండా చూస్తుంటే మండిపోతున్నది అమలకి. "నా ప్రాణానికి మరో రాక్షసుడు అవతరించాడు" అనుకుంది.

    విజయ్ కుమార్ మల్ హోత్ర వచ్చిన నాలుగురోజుల్లో ఇద్దరు ఆమ్మాయిలను చూసి వచ్చాడు ఒక్కరూ నచ్చలేదుట.

    "ఓ నెల వుండి వెళ్ళవోయ్ మళ్ళి మళ్ళి వస్తావా పెడతావా!" అన్నాడు భుజంగరావు.

    "ఏదో ఒక పిల్లని చూడాలి. ఆ పిల్ల నాకు నచ్చాలి. ఆ తర్వాత డాడీని పిలవాలి. ఉందికదా బోలెడు తతంగం. నాకు కావాల్సింది అందమైన కుందనపు బొమ్మ బాబాయ్!"

    "కట్నం కూడా అక్కరలేదన్నావు దొరుకుతుంది లేవోయ్!" అన్నాడు భుజంగరావు.

    ఈ మాటలు జరిగేప్పుడు అమల అక్కడే వుంది.

    "రోజాలాంటి పిల్ల దొరికితే ఎగిరి గంతేసి తాళికడతాను బాబాయ్!" విజయ్ కుమార్ మల్ హోత్ర అన్నాడు.
 
    "రోజాలాంటి పిల్లే దొరుకుతుంది లేవోయ్, అదృష్టవంతుడిని చేరిపేవారు లేరు దురదృష్టవంతుడిని బాగుచేసే వారు లేరు." రవంత విచారంగా అన్నాడు భుజంగరావు.

    "నీవు చెప్పింది నిజమే బాబాయ్!"

    వాళ్ళ మాటలు వింటున్న అమలకి వళ్ళు భగ్గుమంటున్నది. ఓ పక్క భుజంగరావుని బాబాయ్ అంటున్నాడు. బాబాయి కూతురు లాంటి అమ్మాయి పెళ్ళాంగా రావాలి అనుకోటం ఏం న్యాయం! ఎంతవరకూ సమంజసం! ఈ విజయ్ గాడు కూడా చాటున సమయం చూసి తన ప్రాణం తీసేట్టు వున్నాడు. మాటలతో ఎత్తుకు ఫై ఎత్తులు వేయటానికి లేదు. ఏం చేసినా ఏం సాధించినా పిచ్చిదాని లాగానే నటించి రోగం కుదర్చాలి అనుకుంది.

    రామచంద్రం వచ్చి పిలవటంతో భుజంగరావు బైటికి వెళ్లాడు. అక్కడ అమల విజయ్ కుమార్ మల్ హోత్ర మిగిలారు.

    "వాటే ఎ బ్యూటీ." అన్నాడు వి.కు. మల్ హోత్ర ఎటో చూస్తూ.

    "నీకూ పుట్టింది రోగం!" అనుకుంది అమల.

    "నా స్వీట్ బ్యూటీ...."

    "ఏయ్ కుర్రాడా!" అంది అమల.

    "నన్నేనా!" విజయ్ కుమార్ మల్ హోత్ర అడిగాడు.

    "నిన్నే నిన్నే."

    "నా పేరు విజయ్ కుమార్ మల్ హోత్ర. విజయ్ అని పిలువు." వి. కు. మల్ హోత్ర.

    "హిహ్హిహ్హీ." అంది అమల.

    "పిలుస్తా పిలుస్తా." అని "బావగా! అత్తగా!" అంటూ పెద్దగా అరిచింది.

    గంగారత్నం త్రయంబకరావుకి ఎప్పుడూ తలుపు చాటునో గోడచాటునో నక్కటం అలవాటు ఇప్పుడూ అలాగే ఏ పక్కనో నక్కివున్నట్లున్నారు. అమల పిలవగానే రెండు అంగల్లో వచ్చి పడ్డారు.

    "ఏంటమ్మా కోడలా!" అంది గంగారత్నం.

    "ఏంటి రోజా! క్షణం నాకు దూరంగా వుండవు కదా!" అన్నాడు త్రయంబకరావు.

    విజయ్ కుమార్ మల్ హోత్ర మౌనంగా కూర్చుండిపోయాడు.

    "కూర్చో కూర్చో అత్తగా బావగా!" అంది అమల.

    సోఫాలో కూర్చుండిపోయారు తల్లీ కొడుకు.

    "ఏంటి!" అంది గంగారత్నం.

    "ఈ అబ్బాయి బాగున్నాడు కదూ!" అమల విజయ్ కుమార్ మల్ హోత్రని చూపిస్తూ అంది.   

 Previous Page Next Page