Previous Page Next Page 
శుభోదయం పేజి 38


    "రాస్కెల్స్...ఎంతకి తెగించారురా...అమాయకురాలైన ఆడపిల్లని యింత ఘోరంగా హింసిస్తారా" బూటుకాలితో తన్నాడు ఇన స్పెక్టర్ కోపం పట్టలేక.
    ఈ కేసులో దోషులని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రినించి పోలీసులకి ఆదేశం వచ్చి వుండడంతో వెంటనే కోర్టుకి కేసు వెళ్ళి పదిరోజులలో కేసు పూర్తయి, నేరం రుజువయి, యీ సహాయం చేసినవాడిని ఐదేళ్ళు, చేయించినవాళ్ళకి పదేళ్ళు కఠిన శిక్ష విధించింది కోర్టు 376 సెక్షన్ ప్రకారం.
    పేపర్లన్నీ ఈ కేసు ప్రొసీడింగ్స్ అన్నీ ప్రాముఖ్యత యిచ్చి ప్రచురించాయి. కేసు తీర్పు చెప్పిన రోజున కోర్టు బయట కాలేజీ అమ్మాయిలు, వూర్లో అన్నీ మహిళామండలులు సభ్యురాండ్రు, యింకెందరో స్త్రీలు గుంపులు గుంపులుగా నిలబడి తీర్పు చెప్పగానే హర్షధ్వానాలు చేశారు.
    రేపిస్ట్సు ముర్దాబాద్.... రేఖా జిందాబాద్. జస్టిస్ జిందాబాద్. న్యాయం గెలుస్తుంది. మా స్త్రీలకి రక్షణ కావాలి. రేపిస్టులని శిక్షించాలి" అంటూ అరిచారు. జడ్జిగారిని ఛాంబరులో కల్సుకుని వూర్లో మహిళామండలుల అధ్యక్షులు అభినందించారు.
    కేసులో దోషులని పట్టుకోవడానికి సహాయపడిన ఆటోడ్రైవరుకి రాధాదేవే కాకుండా, పోలీసులు, వూర్లో మహిళామండలులవారు, కాలేజీలలో ఆడపిల్లలు అంతా కలసి తలో బహుమానమూ యిచ్చి అభినందించారు. అతని కళ్ళు చెమర్చాయి.
    "ఒక ఆడపిల్లకి.... నా తోబుట్టువులాంటి అమ్మాయిపై జరిగిన అత్యాచారంలో నేరస్థులని పట్టుకోవడానికి సహాయపడిగలిగినందుకు నా జీవితం ధన్యమైందనిపిస్తుంది" అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు డ్రైవరు. కాస్తో కూస్తో చదువుకున్నవాడు. "ఆడపిల్లలు....అంటే మనలో ఎవరో ఒకరికి అక్కా చెల్లెల్లో, తల్లో, భార్యో అవుతారు. వారి గౌరవం మన గౌరవం, ఆ స్త్రీల గౌరవం కాపాడే బాధ్యత మనది. అలా ఒక యువతిని కాపాడలేక పోయినా నేరంచేసిన వారిని శిక్షించేందుకు తోడ్పడినందుకు గర్వంగా వుంది" అంటూ పేపరువాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్పాడు.
    రిపోర్టర్లందరూ రేఖని చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. "యిప్పుడు మీకేం అనిపిస్తూంది? దోషులు శిక్షించబడినందువల్ల మీకు తృప్తి కలిగిందా" అంటూ ఆమె అభిప్రాయం కోరారు.
    రేఖ నిర్లిప్తంగా నవ్వింది. "దోషులు శిక్షించబడినంత మాత్రాన ఆ అవమానం, హింస మరిచిపోలేనుగదా? ఎటొచ్చి దోషులు తప్పించుకోకుండా శిక్ష పొందడంతో కనీసం కొన్నాళ్ళవరకైనా స్త్రీలమీద అత్యాచారం జరిపే ముందు కాస్త జంకవచ్చు అలాంటివారు. నేననుభవించిన హింస, నరకం యింకో ఆడపిల్ల అనుభవించే దుస్థితి రాకూడదని కోరుతున్నాను. ఇలాంటి రేపిస్టులని వెంటవెంటనే పట్టుకుని గట్టిగా శిక్షించితే కొన్నాళ్ళకైనా యీ అత్యాచారాలు తగ్గుతాయి" అంటూ తన అభిప్రాయం చెప్పింది రేఖ.
    కేసు తీర్పు విన్నాక అందరికంటే ఎక్కువ ఆనందపడింది రాధాదేవి. నిశ్చింతగా నిట్టూర్పు వదిలింది. తనమీద నింద తొలగిపోయినందుకేకాక ఆ దుర్మార్గులకి శిక్ష విధించడం ఆనందం కలిగించింది. కోర్టులో తీర్పు అయ్యాక అప్రయత్నంగానే రాధాదేవి మాధవరావువంక చూసింది. రాధాదేవితో చూపులు కలవగానే మలినమైన తనమొహం చూపలేనట్టు తల తిప్పుకున్నాడు. చూశావా అని రాధ సవాల్ చేసినట్లనిపించిందతనికి. కేసు తీర్పు చెప్పగానే జడ్జి ఛాంబర్స్ లోకి వెళ్ళగానే రాధాదేవి రేఖ దగ్గరికి వెళ్ళి చెయ్యినొక్కి అభిమానంగా భుజంచుట్టూ చెయ్యివేసి తన అభిమానం తెలియచెప్పింది. మాధవరావు చూస్తున్నాడని తెలిసినా లెక్కచెయ్యకుండా "రేఖా.....దోషులు శిక్షించబడ్డారు. యింక నీవీ విషయం మర్చిపోయి చదువులో మనసు లగ్నం చెయ్యి. కాలేజీకి వెళ్ళడంలేదు అన్నాడు శ్యాం. యింక రేపటినుంచి వెళ్ళాలి. ప్రామిస్" అంది చనువుగా.
    రేఖ తలతిప్పి "అలాగే ఆంటీ... కానీ... ఎందుకో భయంగా, మొహమాటంగా వుంది" నసిగింది.
    "అదిగో....నీవు అలా మాట్లాడవద్దు. చూడు నీవెనకాతల ఎందరి ఆడవాళ్ళ సానుభూతి వుందో చూడు. యింతమందీ వచ్చారంటే నీ పట్లవున్న అభిమానంతో. ఓ స్త్రీకి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందన్న సంతోషం పంచుకోవడానికి వచ్చారు. రేఖా.... మళ్ళీ చెపుతున్నాను. నీకేం కాలేదు. ఆ మాటే అనుకో పదిసార్లు" అంటూ నచ్చచెప్పింది.
    "రేఖా..... పద యింటికి" తండ్రి తీవ్రంగా పిల్చాడు. రేఖ కళ్ళతోనే రాధాదేవి దగ్గిర వీడ్కోలు తీసుకుని వెళ్ళింది.
    
                            22
    
    పదిహేనురోజులు గడిచాయి.
    "అమ్మా.... అమ్మా.... రేఖ..... సూయిసైడ్ కమిట్ చేసిందమ్మా" ఓరోజు కాలేజీనుంచి పరిగెత్తి వచ్చినట్లే వచ్చి తల్లితో చెప్పాడు శ్యాం ఆ వార్త. రాధాదేవి నిశ్చేష్టురాలైంది.
    "ఆత్మహత్యా.....ఆత్మహత్యకి తలపడిందా? ఏమయింది, ఎలావుంది?...అసలేం జరిగింది?" అప్రతిభురాలై అడిగింది.
    "అమ్మా.... రేఖ టిక్ ట్వంటీ తాగిందట. ఎంతోసేపటికిగాని ఎవరూ చూడలేదుట. చూసి తీసుకొచ్చి ఆస్పత్రిలో జాయిన్ చేశారుట. డాక్టర్లు చాలా ప్రయత్నించాక ఆఖరికి ప్రమాదం గడిచిందంటున్నారు."

 Previous Page Next Page