Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 39


    "ఇంతకీ ఏమంటారు?" ఇక అక్కడ ఉండటం ఇష్టం లేనట్లుగా అడిగాడు  సామంత్_
    "నేను అనాల్సింది అన్నాను. ఇక నీవే చెప్పాలి" సత్యరాజ్ ఓ వైపు మాట్లాడుతూనే మధ్య మధ్యలో ఫోను వైపు చూస్తున్నాడు.
    "నేనా పని చేయను. నేనే  నా సోదరుల మధ్య కెళ్ళి జరిగింది చెప్పి  మీ బండారాన్ని బయట పెడతాను" సామంత్ ఆవేశంతో ఊగిపోతున్నాడు.
    అంతలోనే ఫోను మోగింది.
    సత్యరాజ్ చటుక్కున ఫోన్ ఎత్తాడు.
    ఫోన్ కి అవతల హసీంఖాన్ ఉన్నాడు.
    ఓ నిముషం సత్యరాజ్ ఫోన్ చెవికానించుకున్నాడు.
    ఫోన్ లో మాటల్ని వింటూన్న సత్యరాజ్ మొఖంలో క్రమంగా మార్పు వస్తోంది ఆ మార్పు చాలా భయంకరంగా వుంది.
    అంతా  విన్నాక  అప్పుడు తలెత్తాడు సత్యరాజ్.
    "పాపం నీవు చాలా చిక్కుల్లోపడ్డావు......" అన్నాడు నింపాదిగా సత్యారాజ్.
    సామంత్ అర్ధంకానట్లుగా చూసాడు.
    "నీ తమ్ముడు ఎక్కడినుండో ఫోన్ వస్తే  పరిగెత్తుకు వెళ్ళాడట. మొగల్ కోర్ట్ అపార్టుమెంట్ 24 ఇంటిలోకి వెళ్ళాడట. అక్కడోకడ్ని ఠపీమనిపించాడట......"
    నా కర్ధంకావటంలేదు మీరేమంటున్నారో? అప్పటికే సామంత్ కి ఊపిరి అందడం లేదు. ఏదో ప్రమాదం తనను చుట్టుకోబోతున్నట్లుగా చూచాయగా పసిగట్టాడు.
    "ఏం లేదు కాలేజీలో నీ తమ్ముడికో ప్రత్యర్థి వున్నాడు వాడి  పేరు కారంత్. వాడికేదో ప్రమాదం జరిగింది. వెంటనే రమ్మనమని నీ తమ్ముడికో ఫోను-దాన్ని నా మనిషే చేసాడు.
    నీ తమ్ముడు పరుగెత్తుకెళ్ళాడు. అక్కడ కారంత్ మర్డరయ్యాడు. అదీ నా మనిషే చేసాడు. కాని ప్రస్తుతం నీ తమ్ముడు ఆ శవం పక్కనే ఉన్నాడు. ఆ తరువాతేం జరుగుతుందో ఊహించగలవనుకుంటాను....."
    "నో......నో" గది గోడలు ప్రతిధ్వనించేలా అరిచాడు సామంత్ పిచ్చి ఆవేశంతో.
    "అదిగో అదే వద్దన్నాను. కూల్ గా మన డీల్  సెటిల్ చేసుకుందాం......"
    సామంత్ పిచ్చిగా చూస్తున్నాడు.
    "నేనమ్మను....." అరిచాడు సామంత్.
    "భలేవాడివే ఎవరు నమ్మమన్నారు? నేనూ నమ్మను. కాని నా మనుష్యులు అప్పగించినపని చక్కగా చేసి నీ తమ్ముడ్ని ఇరికించారు ఫోన్ అక్కడినుంచే నమ్మకపోతే ఫోన్ ఇదిగో 882130కి ఫోన్ చేయి" అంటూ ఫోన్ ముందుకు జరిపాడు సత్యరాజ్.
    ఓ క్షణం సామంత్ కి వెన్ను జలదరించింది.
    "ఆ మర్డర్ జరిగిన పరిధిలో ఓ పోలీస్ స్టేషనుంది. దాంట్లో ఓ  ఎస్.ఐ ఉన్నాడు. వాడు  మనోడే. సమ్మె ఉధృతం చేయించటానికి అబద్ధం చెప్పి లాఠీచార్జ్  చేస్తాడు. అదిగో అది, నాకు వాడికిఉన్న సంబంధం ఇప్పుడు నీ తమ్ముడు ఆ ఇంటిలో బందీ. బయట నా మనుష్యులు తాళం వేసి నా ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. సింపుల్ గా ఒప్పుకున్నావనుకో- ఆ ఇంటి తాళం తీసి నీ తమ్ముడ్ని వదిలేస్తారు ఎవడో అన్నోన్ పర్సన్  మర్డర్  చేసాడని రాసేసుకుని ఫైల్ క్లోజ్ చేస్తాడా ఎస్.ఐ లేదనుకో- ఆ ఎస్.ఐ కి ఓ ఆకాశవాణి ఫోన్ వెళుతుంది. ఆ ఇంట్లోకి ఓ యువకుడు వెళ్ళటం చూసాను ఆ తరువాత ఆ ఇంట్లోంచి ఓ ఆర్తనాదం వినిపించిందని.
    సామంత్ ఒళ్ళు చల్లబడిపోయింది. ఓ నరరూప రాక్షసుడ్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఫీలింగు అతన్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది.
    కష్టజీవులకు అన్యాయం జరక్కుండా మేనేజిమెంట్సుతో పోరాడతామని చెప్పే మాస్క్ వెనుక రౌడీలు, గూండాలూ, దగాకోరులు, వీళ్ళను నమ్మే అమాయక శ్రామికవర్గం చిత్తు అయిన విష వలయం.
    కర్తవ్యం గుర్తుకొచ్చి ఫోన్ ని చటుక్కున దగ్గరకు లాక్కొని 882130కి రింగ్ చేసాడు. అవతల  రెస్పాన్స్ లేదు.
    సామంత్ సత్యరాజ్ వైపు అనుమానంగా  చూసాడు.
    "చేసేది దుర్మార్గమనే చెబుతున్నాను మరలా ఇందులో అబద్ధం ఎందుకుంటుంది? నీ తమ్ముడు ఫోన్ ఎత్తటానికి సందేహిస్తుంటాడు. కాసేపు అలాగే పట్టుకో ఎత్తవచ్చు............"
    "నేనమ్మను....." గుండె దిటవు చేసుకొని అన్నాడు సామంత్.
    ఇది నిజం. తమ్ముడు సెంటిమెంట్ కన్నా  చెల్లెలు సెంటిమెంట్ బలమైందనుకుంటాను. దీనికి లొంగక మొరాయించవనుకో__నీ  తమ్ముడికి జైలు. నిర్దోషి అని తేలటానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. అన్నాళ్ళు లాయర్స్ ని పోషించే శక్తి నీకుంటే, ఈ లోపు నీ తమ్ముడి చదువు భవిష్యత్ కొండెక్కుతుంది. ఇక చెల్లెలు_ఎన్నాళ్ళని ఇంట్లో దాచుకోగలవు. నీ చెల్లెలు బయటకొచ్చిన మరుక్షణం నా వాళ్ళు నీ చెల్లెలు శీలంపై కన్నువేస్తారు.
    సామంత్ ఫోన్ పెట్టేసి స్థాణువైపోయాడు.
    "పాపం వారినెందుకు బలిచేస్తావు నీ మూర్ఖత్వానికి? నువ్వు  ఊ అంటే నీ తమ్ముడు ఇంజనీర్ కి, నీ చెల్లెలు మెడిసిన్ కి వెళతారు మంచి చదువులు, భవిష్యత్ వారికుంటుంది....." సత్యరాజ్ లేచి పచార్లు చేస్తున్నాడు.


                                                            *    *    *

    బట్టల పరిశ్రమ మొత్తం సత్యరాజ్ తీసుకోబోయే చర్య గురించి ఆందోళనగా ఉంది.
    ఒక ఉప్పెనలా విరుచుకు పడుతుందనుకుంటున్న సమ్మె  ఉపద్రవానికి ఇదే నాందా.....?
    ఒకవేళ సమ్మె అనివార్యమైతే, ఉన్నసరకుని కొన్నాళ్ళు దాచేసి, రేటు పెంచి బ్లాక్ లో అమ్మేందుకు ఏర్పాట్లుచేసుకోవాలి.
    సరీగ్గా ఇదే పాయింట్ దగ్గర భూపతిరావు ఆలోచనలు__పథకం వేరుగా ఉన్నాయి. సామంత్ అనే యువ కార్మికుడు ద్వారా రెయిజ్ అయిన పాక్షికమైన సమ్మెను తక్షణం విరమింపజేసి పెద్దఎత్తులో రానున్న సమ్మెకు తిరుగు చేతబడి చేయాలి. అందుకోసమే సత్యరాజ్ తో ఇష్టంలేకపోయినా సుహృద్భావ చర్చలకు మానసికంగా  సిద్ధమౌతున్నాడు ఓ పక్క?

        
                                                             *    *    *

    బట్టల పరిశ్రమలో మెయిన్ ముడిపదార్ధం పాలియస్టర్ ఫైబర్ యార్న్ ఈ నవలా  కాలం 1985 ముందుది. అప్పటిలో ఇండియాలో పాలియష్టర్ ఫైబర్ యార్న్ తయారుచేసే కంపెని ఒక్కటే ఉంది. అది  రిలయన్స్ టెక్స్ టైల్స్  అధినేత ధిరూబాయ్ అంబాని చేతుల్లో ఉంది. ఇది ఆయన కంపెనీ అని అప్పట్లో చాలామందికి తెలియని ఓ నిగూఢ రహస్యం. దీని  ద్వారానే అంబాని తన నిజ జీవితంలో ఒక ఫెంటాస్టిక్ డ్రామా  నడిపాడు. అదే డ్రామాను ప్రస్తుతం ఈ నవలలో భూపతిరావు నడపబోతున్నాడు.
    1978 తరువాత నుంచి బట్టల తయారీలో విప్లవాత్మకమయిన మార్పులు వచ్చాయి. కాటన్ (పత్తి\దూది) వాడకం తగ్గి సింథటిక్ మెటీరియల్ , పాలియస్టర్ యార్ని వాడకం బాగా పెరిగింది ఇతర దేశాలలో చాలా కాలం క్రిందటే పాలియస్టర్ యార్న్  తయారీ  పెద్ద  ఎత్తున  మొదలయినా ఇండియాలోకీ చాలా ఆలస్యంగా ఆ టెక్నిక్ దిగుమతి అయింది. అప్పటివరకు (ఇప్పటికీ కోంత భాగం) విదేశాల నుంచి యార్న్  దిగుమతి చేసుకోవటం జరిగేది. దానిమూలంగా కాస్టాఫ్ ప్రొడక్షన్ ఎక్కువయ్యేది. అంబాని ఇన్ షియేటివ్ తీసుకొని యార్న్ తయారీ టెక్నిక్ ని దిగుమతి చేసుకొని భారీ ఎత్తున ఒక కంపెనీని స్థాపించాడు. అప్పటినుండి చాలా బట్టల కంపెనీలు ఆ కంపెనీ  స్థాపించాడు. అప్పటినుండి చాలా బట్టల కంపెనీలు ఆ కంపెనీ నుంచే యార్న్  కొనుగోలు చేయటం మొదలెట్టాయి. ఓ పక్క  రిజర్వ్  బ్యాంక్,కేంద్ర ఆర్ధిక శాఖ విదేశీ ద్రవ్య  వినియోగం పై అంక్షల్ని రోజురోజుకు కఠినతరం చేయటం ప్రారంభించాయి. దాంతో చాపక్రింద నీరులా అంబానీ యార్న్ సప్లయి ద్వారా ఇండియన్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ మీద కనిపించని గ్రివ్ తెచ్చుకున్నాడు. కేవలం పది సంవత్సరాలలో రిలయన్స్  ఇండియాలో మూడవ పెద్దకంపెనీగా స్థానం సంపాదించుకుంది 1985లో రిలయన్స్ అమ్మకాలు:711కోట్లు. లాభాలు 71కోట్లు. విదేశీయులు సయితం ఆశ్చర్యపోయేంత అభివృద్ధిని అంబాని సాధించగలిగాడు. అంబానీకి ఇద్దరు కొడుకులు- ముఖేష్ అంబాని, అనిల్ అంబాని అంబాని పథకాలు అనుకున్నవి అనుకున్నట్లుళ సాగితే ఈనాడు (1985) ఇండియాలో నెంబర్  వన్  కంపెనీగా నిలబడి  అటు టాటా బిజినెస్  హౌస్ ని ఇటు బిర్లా  బిజినెస్  హౌస్  ని నెంబర్ టు, నెంబర్ త్రీలోకి తోసేసేది.

 Previous Page Next Page