Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 38

 

    కాలేజీలో ఉన్న సామంత్ తమ్ముడికి ఫోన్ వచ్చింది.
    "కారంత్ కి యాక్సిడెంట్ అయింది. చావుబతుకుల్లో ఉన్నాడు. నిన్ను, మరి కొంతమంది స్టూడెంట్స్ ని  రమ్మని ఆఖరి మాటగా  చెప్పాడు. కాలేజీ  ఎలక్షన్స్  మూలంగా మీకు, మాకు గతంలో ఎమ్నన్నా ఈ  టైమ్ లో అవి గుర్తుంచుకోవటం మానవత్వం కాదు__ఫోనులో దీపక్  రాజ్ గొంతు మార్చి చెప్పుకుపోతున్నాడు.
    ఈలోపే సామంత్ తమ్ముడు సడన్ గా అడిగాడు"ఇప్పుడు  కారంత్ ఎక్కడున్నాడు?"
    ఫోనుకి ఆవలి వైపునున్న దీపక్ రాజ్ నిశ్శబ్దంగా నవ్వుకుంటూ "మొగల్ కోర్ట్ ఎపార్ట్ మెంట్స్ లో నెంబర్ 24లో ఉన్నాడు."
    ఫోన్ చట్టుకున్న పెట్టేసి ఓ ఫ్రెండ్ స్కూటర్ మీద కూర్చున్న మరుక్షణం అది మొగల్ కోర్టువైపు దూసుకుపోతుంది.
    ఫోన్ పెట్టేసిన దీపక్ రాజ్ సరస్వతిని విసురుగా  దగ్గరకు లాక్కుని ఆమె పైటను తొలగించటంలో నిమగ్నమయ్యాడు.

    
                                                               *    *    *

    యూనియన్ ఆఫీసు  వర్కర్స్ తో కిటకిటలాడి పోతోంది. లోపల రూమ్ లో సత్యరాజ్ రిలాక్సుగా కూర్చుని సామంత్ కి కబురు పెట్టాడు.
    బయట హల్లో, వరండాల్లో నిల్చున్న  కార్మికులకి ప్రస్తుతం తాము చేస్తూన్న  సమ్మె దేనికోసమో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.
    ఖచ్చితంగా కారణమేమిటో అడిగి తెలుసుకొనేందుకు ధైర్యం చాలటం లేదు.
    ఎవరికీ  వారే సత్యరాజ్ ఆర్డర్స్ కోసం సిద్ధంగా వున్నారు. కొంత మంది మాత్రం  అసలు   యూనియన్ ఆఫీసుకి  రాలేదు. ధైర్యం వున్న  మరికొంత మంది పనిలోకి వెళ్ళిపోయారు.
    అరగంటకి వచ్చాడు సామంత్.
    సత్యరాజ్ అంటే సామంత్ కి మొదటినుండి సదభిప్రాయం లేదు. కారణం లేకుండానే, కార్మిక బహుముఖ ప్రయోజనం ఆశించకుండానే చీటికి మాటికి సమ్మెలు చేయిస్తాడని కోపం.
    సామంత్ అయిష్టంగానే సత్యరాజ్ రూమ్ లోకి వెళ్ళాడు.
    సామంత్ ను చూసి  ఓసారి మెల్లగ నవ్వుకున్నాడు సత్యరాజ్.
    "చూడు- స్త్రెయిట్ గా విషయంలోకి వస్తాను. నావైపు సగంమంది వర్కర్స్  ఉన్నారు. నీ వెనుక సగంమంది ప్రస్తుతం లేకపోయినా నీవు రంగంలోకి దిగితే వాళ్ళు వచ్చేస్తారు. నువ్విప్పుడు సమ్మెకు  మద్దతు ప్రకటించాలి. నేను తల్చుకుంటే నిన్ను నేషనల్  ఇండస్ట్రీస్ యూనియన్ లీడర్ ని చేస్తాను___" సత్యరాజ్  ఒకింతసేపు ఆపాడు.
    సామంత్ కోపంగా ఉన్నాడు.
    "నువ్వు జాబ్ లో చేరి ఐదేండ్లు. ఏం సంపాదించావ్.......?" చటుక్కున తలెత్తాడు సామంత్.
    "అంటే యూనియన్ లీడర్స్  సంపాదించుకోవటానికేనన్నమాట?" సామంత్ నోటి వెంట బుల్లెట్ లా వచ్చింది ప్రశ్న.
    "అంత ఆవేశం పనికిరాదు. దాని మూలంగా నేను బిగించిన ఉచ్చులో చాలా తేలిగ్గా ఇరుక్కుపోయావు. ఫలితం చూసావుగా__ఇప్పుడు నీవు కాదన్నా, నీమీద ఇంజనీర్ చేయి చేసుకున్నందుకు సమ్మె కొనసాగుతుంది........."
    ఉలిక్కిపడ్డాడు సామంత్. అయోమయంగా సత్యరాజ్ వైపు చూసాడు.
    "కారణం లేకుండానే  నాలాంటి వాళ్ళు తలచుకుంటే సమ్మెలు తేగలం. మరో విషయం తెలుసా? నేనసలు ఎలక్షన్సు ద్వారా లీడర్ ని కాలేదు. నేనే కాదు  ఈనాడు ఈ దేశంలో చాలా మంది ఎవరి అమోదం లేకుండానే యూనియన్ లీడర్సు అయ్యారు, అవుతున్నారు....."
    "ఇక ముందూ అవుతారు కూడా" చీత్కారంగా అన్నాడు సామంత్.
    "యు ఆర్ రైట్, వాస్తవానికి దగ్గరగానే ఉన్నావు. నీవు అంగీకరిస్తే రేపు ఈపాటికి నీవూ అవుతావు ఈ దేశంలో అన్నిపనులు చెడుతోను, భయభక్తులతోను, డబ్బు, పలుకుబడితోనే కావు......"
    "మంచి వాళ్ళు ఉన్నారు గనుక"
    "కావచ్చు ఆ మంచివార్ని నీలాంటి మంచివాడి ద్వారా నిన్ను చెడగొట్టి సాధించుకోవచ్చు....."
    సామంత్ పురుగును చూస్తున్నాట్లు చూస్తున్నాడు సత్యరాజ్ ను.
    "నీకు తెలుసో లేదో- యన్.జి.వో లీడర్సుకి ఎన్నికలు జారిగాయా? ఇప్పుడున్న వార్ని ఎవరు  ఎన్నుకున్నారు? వారికి వారే__నోటి, చేవ, కండబలం, గుండెబలం ఉన్నావాడు వాడికి వాడే ఉద్యోగుల్ని ఉద్దరిస్తానని లీడరాయి కూర్చుంటాడు. సీట్లో కూర్చునేవరకే-కూర్చున్నాక ఇక ఎవడూ కదిలించలేడు........"

 Previous Page Next Page