"మైగాడ్ ! అటువంటి మనిషితో ఎలా ఉంటున్నవే బాబూ?" అంది హంసిని ఝాన్సీ మీద జాలిపడుతూ.
"హంసీ! పదే పదే అలా అని ఆమెని బాధ పెట్టకు. సమస్యకి పరిష్కారం చూడాలి. కానీ, సమస్యని చూసి బెదిరిపోయి కూర్చోవడం మంచి పద్దతి కాదు. ఈ విషయంలో ఝాన్సీ లక్ష్మి గారి ప్రవర్తననీ, ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నాను" అన్నాడు అభిమాన్.
"థాంక్సండీ!" అంది అభిమాన్ వైపు చూసి ఝాన్సీ.
కాస్సేపు అలోచించి ఏదో స్పురించిన వాడిలా "నాకు తెలిసిన ఒక సైక్రియాటిస్టు డాక్టరు న్నాడు. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడండి! చాలా గొప్ప డాక్టరు! పేరు చంద్ర మౌళి!" అన్నాడు అభిమాన్.
",మీరొచ్చి పరిచయం చేస్తే బాగుంటుందేమో! సారీ .....ఫర్ .ది .....ట్రబుల్ ఏమీ అనుకోవద్దు" అంది ఝాన్సీ.
"నీ తలకాయ్! మనలో మనకి సారీ ఏంటే?" అని ఝాన్సీని మందలించి , "వెళ్ళండి. వీలయితే ఇవాళ మీరూ లీవు పెట్టి దాన్ని తీసికెళ్ళండి" అంది హంసిని ఇంచుమించు ఆజ్ఞాపిస్తున్నట్టుగా భర్త వైపు చూస్తూ.
క్"నువ్వురా! అతనికిప్పుడే ఫోన్ చేసి , అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేస్తాను.
"డానికి మళ్ళీ మళ్ళీ కుదరదు. అర్జంటని చెప్పి ఇవాళ్టికె ఫిక్స్ చెయ్యండి" అంది హంసిని.
అభిమాన్ లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. లక్కీగా డాక్టరుగారు దొరికారు. అభిమాన్ మాటలు విని అర్జెంటు కేసు కింద ఆ రోజు సాయంత్రం నాలుగింటికి టైమిచ్చాడు డాక్టరు గారు మిగత అప్పాయింట్ మెంట్స్ కాన్సల్ చేసి, ఆఫీసుకెళ్ళి పని చూసుకుని మూడింటి కల్లా ఒచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అభిమాన్.
"నేను సగం రోజు పనిచేసి రావలసింది" అంది ఝాన్సీ.
"పోనీలేవే! సరదాగా కలిసి భోంచేసి కబుర్లూ చెప్పుకుంటూ ఈ రోజంతా స్పెండ్ చేద్దాం. మూడింటికి ఆయనోచ్చేసరికి మనం రెడీగా ఉంటే, వెంటనే బయల్దేరొచ్చు" అంది హంసిని.
హంసిని అత్తగారు కూడా అలాగే అన్నారు. వాళ్ళ మాటలతోటీ ఆప్యాయత తోటి ఎంతో ఆనందాన్నీ ఆహ్లాదాన్నీ పొందుతున్న ఝాన్సీ 'సరే' నంటూ ఉండిపోయింది.
మనిషికి మనసు విప్పి మాట్లాడుకునే తోడు కన్నా కావలసినదేముందు? స్నేహితురాళ్లిద్దరూ చిన్ననాటి కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటూ సరదాగా కాలక్షేపం చేశారు. గంటలు, నిమిషాల్లా దొర్లిపోయాయి.
సరిగ్గా మూడింటికల్లా అభిమాన్ ఆఫీసు నుంచి ఒచ్చేశాడు. ముగ్గురూ కలిసి డాక్టర్ దగ్గరికి బయలుదేరారు.
అభిమాన్ ని చూస్తూనే చిరునవ్వుతో కరచాలనం చేశాడు డాక్టర్ చంద్రమౌళి. అభిమాన్ ఝాన్సీని హంసిని క్లోజ్ ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. జరిగినదంతా పూస గుచ్చినట్టుగా చెప్పింది ఝాన్సీ లక్ష్మి.
"అమ్మా! ఈ సైకలాజికల్ ట్రీట్ మెంటులో , పేషెంటుతో కలిసి మాట్లాడాలి. అలా కలుసుకోవడానికి అతడు ఇష్టపడతాడా? పేషెంటుకీ డాక్టరు కీ మధ్య నుంచి రాపోర్టు ఉండాలి, ఒకరకంగా అవగాహన అనొచ్చు. దానివలన పేషెంటు కు డాక్టరు మీద నమ్మకం ఏర్పడుతుంది. ఆ తరువాత అబ్రియాక్షన్ ద్వారా అతను ఫ్రీగా మాట్టాడేటట్టు, మనసు పొరల్లో దాగి వున్న నిజాలను వెల్లడి చేసేటట్టు చెయ్యొచ్చు! దీనివల్ల అతను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? దానికేమైనా కారణాలున్నాయా? ఉంటే అవి ఏరకమైనవి? ఆ సంఘటనలు తెలుస్తాయి" అన్నారు చంద్రమౌళిగారు.
"అంటే డాక్టరు గారూ! ఈ ట్రీట్ మెంట్ లో పేషెంట్ డాక్టరు గారితో అన్ని విషయాలూ తనే చెబుతాడా అండీ?" అడిగింది ఝాన్సీ.
"అవును! అతి రహస్యంగా తన గుండెల్లో దాచుకున్న నిప్పులాంటి రహస్యాలను కూడా వెల్లడి చేస్తారు. పేషెంటుకి డాక్టరుకి మధ్యన మంచి రాపోర్ట్ కలిగాక, పెంటతాల్ సోడియం' అనే ఇంజక్షన్ ఇస్తాం. ఇది ఇంట్రానీనన్ ఇంజక్షన్. అంటే తిన్నగా నరాల్లోకే ఇస్తారు. ఈ ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు డాక్టరు పేషెంటుని మాటల్లో పెట్టి అతను రిలాక్స్ అవుతూ మాట్లాడేలా చూస్తాడు. సాధారణంగా , ఒకటీ, రెండూ అని లెక్కపెట్టుకుంటూ , మాట్లాడిస్తూ పొతే దాదాపు ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది , ఇరవై తొమ్మిదీ , ముప్పై అని లెక్క పెట్టేలోగా అతను పూర్తిగా స్పృహ కోల్పోడు కానే మత్తులో తేలుతున్నట్టుగా హాయిగా ఫీలవుతూ , ఏ సంకోచమూ లేకుండా అన్ని విషయాలూ చెబుతాడు. ముందుగానే కొంత బాక్ గ్రౌండ్ డాక్టరుకి రాపోర్టు వల్ల పెరుగుతుంది కాబట్టి మధ్య మధ్య డాక్టరు కొన్ని ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టుకోవచ్చు" అన్నాడు చంద్రమౌళి గారు.