"దానివల్ల ఏం లాభం డాక్టరు గారు? విషయం తెలుస్తుంది కానీ అతను మారడానికి ఎలా తోడ్పడుతుంది ఈ ట్రీట్ మెంట్?" అడిగింది ఝాన్సీ.
"చెప్తా! సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఏదైనా ట్రీట్ మెంట్ వల్ల కలిగిన కక్ష గానీ, నిరాశా , నిస్పృహ, నిస్సహాయతా , ఇవన్నీ కలిగి ఒక రకమైన 'ఇమాజినరి' సమస్యలు ఏర్పడతాయి. వాటికి తగ్గట్టుగా ఆ మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ అబ్రియాక్షన్ వాళ్ళ డాక్టరు పేషంటు సమస్యేమిటో తెలుసుకుని అతనిలో గూడు కట్టుకున్న భావాలని తొలగించడానికి తగిన సలహాల నిస్తూ ధైర్యాన్ని కలిగించడం, అపోహలు తొలగించడం mental catharsis(మనసులో పేరుకుపోయిన అపోహలను కడిగి వేయడం) చేస్తూ మాములు మనిషిని చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని 'పోస్ట్ హిప్నాటిక్ సజెషన్' ఆ cleansing process అర్వాట , ఆరోగ్యకరమైన భావాల్ని ప్రవేశపెట్టడం అంటారు. అయితే ఒక్క విషయం. ఇదంతా చాలా జాగ్రత్తగా , పేషెంటు యొక్క నమ్మకాన్ని డాక్టరు పూర్తిగా పొందగలిగాకనే చెయ్యాలి. లేకపోతే సత్ఫలితాలకు బదులు దుష్పలితాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ 'అబ్ రియాక్షన్' మొదలు పెట్టె ముందు , పేషెంటుతో మంచి సాన్నిహిత్యాన్ని సంపాదించి, అతనికి స్నేహితుడిలాగా ప్రవర్తించాలి డాక్టరు" అన్నాడు డాక్టరు చంద్రమౌళి గారు నవ్వుతూ.
'అయితే రేపే అతణ్ణి తీసుకొస్తాను డాక్టరు గారూ!" అంది ఝాన్సీ.
"వొద్దొద్దు. మీకూ అతనికి మధ్యా సఖ్యత లేదు. కాబట్టి మీరు చెప్తే అతడు రాకపోవచ్చు. ఒకసారి అతడు రానూ అని మొరాయిస్తే మీరు చేసేదేమీ లేదు. కేసు బెడిసి కొడుతుంది."
"మరయితే ఏం చెయ్యాలి డాక్టర్? అతణ్ణి తీసుకురావడం ఎలా?" అడిగాడు అభిమాన్.
"పోనీ మీరు వెళ్ళి నచ్చజెప్పి తీసుకొస్తే?" అంది అభిమాన్ తో హంసిని.
"అదీ వొద్దు. మీరూ ఆమె స్నేహితులేగా? అంటే అతనికి విరోధులు. పైగా అభిమాన్ ఆమెకి ఉద్యోగం వేయించారని కోపం కూడా వుంది.'
"మరెలాగ డాక్టర్?" అంది ఏం చెయ్యాలో తెలీక హంసిని. డాక్టర్ చంద్రమౌళి కాస్సేపు అలోచించి , "మనం ఒక చిన్న డ్రామా ఆడాలి" అన్నారు నవ్వుతూ.
"ఏమిటది?" అడిగాడు అభిమాన్.
"అతడు ఎప్పుడు ఇంటి దగ్గరుంటాడు?" ఝాన్సీని అడిగాడు డాక్టరు గారు.
"ఉదయం తొమ్మిది వరకు ఇంట్లోనే ఉంటారు. రాత్రి ఒక టైమంటూ లేదు- తనిష్టం! ఎప్పుడో అప్పుడు ఇల్లు చేరుకుంటాడు." చెప్పింది ఝాన్సీ.
'అలా అయితే రేపు ఉదయం ఎనిమిదింటికీ నేను వేరే ఎవరిల్లో వెతుక్కుంటూ వొచ్చినట్టూ తప్పుగా మీ ఇంటికొచ్చినట్టూ వొస్తాను. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. మెల్లగా మాటల్లోకి దింపి కాస్సేపు వుంటాను. మీరు మాత్రం నన్ను గుర్తుపట్టినట్టు చెయ్యకండి. అసలు నన్ను చూడగానే మీరు లోపలి కెళ్ళి పొతే మంచిది. ఆ తరువాత ఏం చెయ్యాలో నేను అభిమాన్ కి ఫోన్ చేసి చెబుతాను" అన్నారు చంద్రమౌళి గారు.
"సరే" అంది ఝాన్సీ. డాక్టరు దగ్గర ముగ్గురూ సెలవు తీసుకుని బయలుదేరారు.
ఆ రాత్రి మంచి పనిచేశానన్న తృప్తితో హాయిగా నిద్రపోయింది ఝాన్సీ.
* * * *
"ఏమండీ! విజయ్ కుమార్ గారిల్లు ఇదేనా?" అంటూ లోపలికొచ్చాడోకాయన.
ఝాన్సీ అతనికేసి చూసి "ఈ ఇల్లు కాదండీ" అంది మెల్లగా నవ్వాపుకుంటూ.
"ఈ ఎడ్రస్ ఇచ్చారండీ! ఈ పక్కనెక్కడైనా వుందా?" అడిగాడాయన.
"ఏమో నాకు తెలీదు" అంది భర్త అటుకేసి రావడం క్రీగంట చూస్తూ ఝాన్సీ కసురుకుంటున్నట్టుగా.
"ఎవరొచ్చారు?" అడిగాడు పానకాలు.


