Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 38

 

    ఝాన్సీకి జాలి ముంచు కొచ్చింది.
    మనసు పానకాలు గురించి ఆలోచించడం మొదలెట్టింది.
    "అతడు తెలివి తక్కువవాడు కాదు. అతనిలో అఖండమైన తెలిసి తేటలున్నాయి. కాలికేస్తే మెడకీ, మెడకీ వేస్తె కాలికీ ఉచ్చులు బిగించేటన్ని తెలివి తేటలు ఆఫీసులో కూడా అతను చేస్తున్న ప్రతి పనిని అందరూ కాదంటున్నా , తన తెలివి తేటలవల్లె ఏదో విధంగా బుకాయిస్తూ గెలుచు కొస్తున్నాడు. అన్ని తెలివి తేటలు తల మనిషి అన్నీ తెలిసిన మనిషి మరి ఎందుకిలా వక్రంగా ఆలోచిస్తాడు? పనికిమాలిన వాటిపైన ఆలోచనలని వృధా చేస్తాడు? ఈ ప్రశ్నలకి ఎంత ఆలోచించినా సమాధానం దొరక లేదు ఝాన్సీ లక్ష్మికి.
    అంతేకాదు , ఆడవాళ్ళంటే అతనికి మహా కోపం, ఆ కోపం ఎందుకో అర్ధం కాలేదు ఝాన్సికి.
    తన జీవితంలో ఎదురుపడ్డ ప్రత్రి స్త్రీని అతడు అవమానించాడు. అవహేళన చేశాడు. అవకాశం వొస్తే వాళ్ళని హింసిస్తాడు కూడా. ఈ పశు ప్రవృత్తికి ఏదైనా కారాణాలున్నాయేమో? ఎలా తెలుసుకోవడం? అతనికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉన్నట్టు లేరు. అయితే 'అమ్మా నాన్నా వాళ్ళు లేకపోయినా వాళ్ళ' గురించి కొంచమైన తెలుసుండాలి కదా? అప్పుడప్పుడయినా అతని మాటల్లో వాళ్ళ ప్రస్తావన ఏదో ఒక విధంగా రావాలి కదా? దీన్ని బట్టి చూస్తే అతను అనాధ ఆయిండొచ్చు! అతని తల్లిదండ్రులెవరో కూడా అతనికి తెలీని స్థితిలో ఉండొచ్చు! ఏ అనాధ శరణాలయంలోనో, వారాలబ్బాయిగానో పెరిగి, ఎందరి దయా దాక్షిణ్యాల వల్లో ఇంతవాడయి ఉండొచ్చు. అందుకే అతనికి ఈ రకమైన మనస్తత్వం ఏర్పడిందేమో! ఏది ఏమైనా ఒక సరి ఎవరైనా డాక్టర్ని అడిగి చూస్తే?
    ఈ ఆలోచన వచ్చింది ఝాన్సీ లక్ష్మికి. ఎలాగైనా అతణ్ణి డాక్టరు దగ్గరికి తీసికెళ్ళి మానసిక శాస్త్ర నిపుణుడి చేత పరీక్ష చేయించాలను కుంది! ఈ ఆలోచన రాగానే మనసు కాస్త కుదుట పడ్డట్టనిపించింది. పక్కనే గుర్రు పెడుతూ నిద్రపోతున్న అతని కేసి చూసింది.
    ఆ నిముషంలో అతడు భారతాలా అనిపించలేదు. అతడి మోహంలో క్రూరత్వం కనిపించలేదు. ఏమీ తెలియని అమాయకుడు, ఒక పసిపాప తన మంచం మీద పడుకున్న అనుభూతి కలిగింది!
    వెంటనే యౌవనపు కోరికలూ, వయసు పెట్టె గిలిగింతలూ కవ్వింతలూ ఆమెలో మాయమై పోయాయి. ఆ స్థానంలో మాతృత్వంలోని మధురిమలు చోటు చేసుకున్నాయి. మమకారం వెల్లువలా పొంగుకొచ్చింది. మానవత్వం పురులు విప్పింది. చిందరవందరగా పడున్న దుప్పటినీ తీసి, అతనికి సరిగ్గా కప్పింది. వంకరగా ఉన్న తలగడలను సరిచేసింది. ఆ క్షణంలో అతని మీద విపరీతమయిన జాలి పుట్టుకు రావడంతో ఒకసారి ఆప్యాయంగా అతనికేసి చూసి, అటువైపుకు తిరిగి కప్పుకుని పడుకుంది.
    తుఫాను వెలిసిన తరువాత కలిగే ప్రశాంతతలా ఉంది మనసు! నిర్లిప్తమైన భావాలతో నిద్రలోకి జారుకుంది ఝాన్సీ.

                                                         *    *    *    *

    పక్షుల కిలకిలలూ, కోడి కూతలూ వినబడుతుంటే , కళ్ళు మగతతో మూసుకున్నాయి ఝాన్సికి. బద్దలయ్యేఅంత తలపోటుతో తెల్లవారు ఝాము వరకు కంటి మీదికి కునుకు రాలేదు ఝాన్సికి.
    కళ్ళు తెరిచి చూసేసరికి మంచం మీద భర్త కనిపించలేదు. గబగబా లేచి వెళ్ళి గదులన్నీ చూసింది. ఎక్కడా లేడు. అంటే అప్పటికే అతడు వెళ్ళిపోయాడన్న మాట. వంటింట్లో కెళ్ళి కాఫీ కలుపుకుని తాగినట్టున్నాడు. ఎక్కడి గిన్నెలక్కడే ఈగలు వాలుతూపడుతున్నాయి. బాతురూంలో స్నానం చేసి విడిచి వేసిన తడి లుంగీ బాతురూమంతా ఆక్రమించుకుని వుంది! చచ్చినట్టు అవన్నీ శుభ్రం చేసుకుంది ఝాన్సీ!
    రాత్రి ఘర్షణ జరిగినప్పుడు , ఇలా తెల్లారకుండానే పానకాలు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఆమెకి అలవాటే కాబట్టి, తన పనిలో తాను నిమగ్నమై పోయింది.
    ఆ రోజు బ్యాంక్ కి లీవు పెట్టింది ఝాన్సీ.
    పానకాలు వెళ్ళిపోగానే తనూ బయలుదేరి హంసిని ఇంటి కెళ్ళింది. హంసిని భర్త అభియాన్ అప్పటికి ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఝాన్సీని చూడగానే "హల్లో ఝాన్సీ ! రావే!" అంటూ ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది హంసిని.
    "ఏమిటిలా వచ్చావ్? బ్యాంక్ కి వెళ్ళడం లేదా?" అడిగింది.
    "లేదే! నీతోటి మీవారి తోటి పనుండి వచ్చాను. ఇవాళ లీవు పెట్టాను.' అంది.
    "ఏమైందే? ఉద్యోగం బాగా లేదా? లేకపోతే ఎవరైనా ఏమైనా అన్నారా?" ఆదుర్దాగా అడిగింది హంసిని.
    "అదేమీ లేదే! మా వారి విషయం మాట్లాడాలి. అతనిని చూస్తూ వుంటే ఎవరికైనా సైక్రియాటిస్టుని కన్సల్టు చేస్తే బాగుంటుందేమోననిపిస్తోంది! అతనిలోని ఆ క్ర్రూరత్వానికి ఈ విచిత్ర ప్రవర్తనకి ఏమైనా బలమైన కారణాలుండి ఉండవచ్చు!" అంటూ రాత్రి జరిగిన సంఘటనా, అంతకు ముందు జరిగిన సంఘటనలూ అన్నీ వివరించి చెప్పింది ఝాన్సీ.

 Previous Page Next Page