చులకనగా నవ్వాడు పోలీసాఫీసరు.
"అంటే...యూ మీన్...అతన్ని నువ్వు పట్టుకోలేక పోతున్నానంటావ్?"
అవునన్నట్లు ఇబ్బందిగా తల వూపాడు జలీల్.
తక్షణం అతనికి వరం ఇస్తున్నట్లు అన్నాడు ఆఫీసరు. "ఆ మనిషి...అతని పేరేమిటి? దినకరా? అతన్ని పట్టుకోవడానికి అవసరం అనుకుంటే మన పోలీసు బలగం మొత్తాన్ని కదిలిద్దాం! వీవిల్ హావ్ దట్ బగర్ ఇన్ అవర్ హాండ్స్ వితిన్ నో టైం! ఐ రిపీట్.....ఇన్ నో టైం అటాల్!"
తక్షణం అన్నాడు జలీల్.
"సర్! అసలు ఇంతకీ ఆ దినకర్ అనేవాడు హంతకుడో కాడో కూడా మనకి తెలియదు. కేవలం ఒక కుర్రాడి మతాల ఆధారంగా అతన్ని వెంటాడుతున్నాం మనం!"
"మరి వాడెందుకు పారిపోతున్నాడు దొరక్కుండా?" అన్నాడు పోలీసు ఆఫీసరు.
"మన పోలీసు డిపార్టుమెంటుకి జనంలో ఉన్న కీర్తి ప్రతిష్టల గురించి విని అతను భయపడిపోయి ఉండచ్చు" అన్నాడు జలీల్ వ్యంగ్యంగా. "సర్! ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, నిజంగా హత్య చేశాడో లేదో తెలియకుండా, కేవలం అనుమానం మీదే ఒక వ్యక్తిని వెంటాడటం కోసం మొత్తం పోలీసు బలగాన్ని సర్వసన్నద్ధం చేయడానికి సిద్దంగా వున్నాం మనం! అవునా సర్?"
"అవును!"
"కానీ సర్! అందరికీ తెలిసిన ఒక కిరాయి హంతకుడూ, గ్యాంగ్ స్టర్ అయిన మెకానిక్ ని అదుపులో పెట్టడానికి మాత్రం మనం సంశయిస్తున్నాం! ఎందుకని? మే ఐ నో సర్!"
పోలీసాఫీసరు మొహం కోపంతో జేవురించింది. "ఇన్ స్పెక్టర్! నీ లిమిట్స్ దాటి అతిగా మాట్లాడకు. నీకు అవసరమైతే ఆ దినకర్ ని పట్టుకోవడానికి ఏమేం ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ఇస్తాయి. కానీ మెకానిక్ సంగతి మాత్రం...అది నీ స్థాయికి మించిన విషయం! అలవిగాని విషయాల్లో తల దూర్చటం నీకు మంచిదికాదు" అన్నాడు కటువుగా.
ఒక్కసారి ఆయన కళ్ళలోకి సూటిగా చూసి "యస్సర్!" అని స్మార్ట్ గా సెల్యూట్ చేసి వెనుదిరిగాడు జలీల్.
అతను అక్కడ నుంచి మళ్ళీ పోలీసు స్టేషన్ కి వెళ్ళలేదు. ఇంటికి కూడా వెళ్ళలేదు. ఒక హోటల్లో కూర్చుని కప్పు టీ తాగుతూ ఏం చెయ్యాలో ఆలోచించాడు జలీల్. తర్వాత హోటలు క్యాషియరు వద్దు వద్దంటున్నా కూడా బలవంతంగా బిల్లు డబ్బులు ఇచ్చేసి, మరో టాప్ రాంకింగ్ పోలీసు ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
ఆ ఆఫీసర్ చాలా మంచివాడన్న పేరు ఉంది డిపార్టుమెంటులో. మంచీ చెడూ, న్యాయం అన్యాయం అన్న ఆలోచన ఇంకా మిగిలి ఉన్న పాతకాలపు మనిషి ఆయన అని చెప్పుకుంటారు జనం. ఆయన ఇల్లు ఆఫీసర్ల ఇల్లులాగా అందంగా, నీట్ గా వుంది. అంతేగానీ, కోటీశ్వరుడి ఇల్లులాగా లేదు.
ఇన్ స్పెక్టర్ జలీల్ ని చూడగానే అన్యాయంగా ఆహ్వానించాడు ఆయన. వద్దు వద్దంటున్నా కాఫీ తెప్పించాడు. యోగక్షేమాలు అడిగాడు.
తర్వాత మెల్లిగా అన్నాడు ఆయన "వాట్ జలీల్! ఎనీ థింగ్ ఇన్ పర్టిక్యులర్?"
"యస్సర్!" అని మెకానిక్ కేసు గురించీ, దినకర్ గురించీ చెప్పాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
విని తల పంకించాడు ఆయన. తర్వాత అన్నాడు. "మెకానిక్ మీద యాక్షన్ తీసుకోవడం అంటే....ఇలా చెప్పవలసి వస్తున్నందుకు నాకు సిగ్గుగా వుంది.... పోలీసు ఫోర్సుమీదా, రాజకీయ నాయకుల మీదా ప్రత్యక్ష యుద్ధం ప్రకటించడమేనన్న మాట! ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్?"
"యస్సర్!" అన్నాడు జలీల్ స్థిరంగా.
"బట్ ఐయామ్ నాట్ ప్రిపేర్ డ్ ఫర్ ఇట్!" అన్నాడు ఆ పోలీసు ఆఫీసర్.
జలీల్ ఆవేశంగా ఏదో అనబోతుంటే వారించి అన్నాడు ఆయన.
"జలీల్! తొందరపడకు. మెకానిక్ ని కంట్రోల్ చెయ్యాలని నాకూ గట్టిగా వుంది. కానీ....టైం ఈజ్ నాట్ ఎట్ రైవ్! వాడు చాలా పవర్ ఫుల్! చాలా గట్టి రుజువులు లేకపోతే పట్టుకోలేం మనం వాణ్ణి. జారిపోతాడు!"
'ఆ రుజువులు సంపాదించడానికే ఈ ప్రయత్నం సర్!"
"అంటే? వాట్ డూ యూ మీన్?"
చెప్పడం మొదలు పెట్టాడు జలీల్. "ప్రపంచంలో ఇప్పుడు రాజకీయాల తర్వాత అంతటి లాభసాటి వ్యాపారం మారక ద్రవ్యాలు. మెకానిక్ ఈ డ్రగ్స్ లావా దేవీల్లోకి కూడా దిగాడు ఈ మధ్య. ఆ సంగతి చాలా మందికి తెలుసు. పోలీసులకి కూడా తెలుసు. ఇంకా బాధ కలిగించే విషయమేమిటంటే సర్, ఈ ఊళ్ళో అతి శ్రేష్టమైన గంజాయి ఒక పోలీస్ స్టేషన్ కి ఎదురుగా దొరుకుతుంది. ఆ పోలీస్ స్టేషన్ పేరే ఆ గంజాయికి బ్రాండ్ నేమ్ అయిపోయింది."
"విన్నాను" అన్నాడు పోలీస్ ఆఫీసర్ విచారంగా తల తాటిస్తూ.
"సర్! మెకాకిక్ తన డ్రగ్స్ సప్లయ్ కి ఒక ఇంటిని 'అడ్డా'గా పెట్టుకున్నాడు. దాన్ని రెయిడ్ చేసి రెడ్ హాండెడ్ గా పట్టుకోదలుచుకున్నాను నేను. ఐ వాంట్ స్పెషల్ పర్మిషన్ ఫర్ దిస్ సర్!"
కళ్ళార్పకుండా జలీల్ వైపే చాలా సేపు చూస్తూ వుండిపోయాడు ఆయన. క్రమంగా ఆయన మొహంలో చిరునవ్వు వచ్చింది.
"ఐ లైక్ యూ యంగ్ మాన్!" అన్నాడు మెచ్చుకోలుగా. "ఐ అప్రిషియేట్ యువర్ గట్స్! గో ఎ హెడ్!"
"థాంక్యూ సర్!" అన్నాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
"అయితే ఒక్క విషయం" అన్నాడు ఆఫీసర్.
ప్రశ్నార్ధకంగా చూశాడు జలీల్.
"ఇప్పుడు నువ్వు చెయ్యబోతున్నదంతా నీ పర్సనల్ కెపాసిటీ లోనే! ఈ రెయిడ్ కీ, పోలీసు డిపార్టు మెంట్ కీ ఏమీ సంబంధం వుండదు. యంగ్ మాన్! నీతోబాటు ఒక కెమెరా తీసుకెళ్ళు! టేక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫోటోస్! మెకానిక్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి పనికి వచ్చే రుజువులు ఇంకా ఏమన్నా దొరికితే అవీ సేకరించు.
నువ్వు గనుక ఇది సాధించగలిగితే...అంటే ఇంకో విధంగా చెప్పాలంటే. నువ్వు గనుక తిరిగి రాగలిగితే.... అప్పుడు....మొత్తం డిపార్టుమెంట్ అంతా నీ వెనక నిలబడేటట్లు చెయ్యగలను నేను. అంత వరకూ....ఐ యామ్ సారీ..... ఐయామ్ హెల్ప్ లెస్!" అన్నాడు ఆయన.
"యస్సర్!" అని లేచి నిలబడి సెల్యూట్ చేశాడు జలీల్.
"ఐ విష్ యూ సక్సెస్! అండ్ లాంగ్ లైఫ్!" అన్నాడు ఆఫీసరు.
అక్కడనుంచి తన ఇంటికి తిరిగి వచ్చాడు జలీల్.
జలీల్ ఇంట్లోకి వచ్చీ రాకముందే అడిగింది అతని తల్లి జహానారా బేగం.
"జలీల్! ఎలావుంది ఇవాళ నేను చేసి పంపిన షీర్ మాల్?"
"ఓహ్! అద్భుతం!" అన్నాడు జలీల్ లొట్టలేస్తూ. "ఇంకా ఉందా?"
"అంటే నువ్వు మధ్యాహ్నం భోజనం చెయ్యలేదన్నమాట!" అంది జలీల్ తల్లి కోపంగా.
"నీకెలా తెలుసు?" అన్నాడు జలీల్ ఆశ్చర్యంగా.
"నేను ఇవాళ చేసిన స్వీటు డబుల్ కా మీటా! షీర్ మాల్ కాదు! నేను ఓ పోలీసాఫీసరు తల్లినిరా! మర్చిపోకు!"
చటుక్కున నాలిక కరుచుకున్నాడు జలీల్.
"చెప్పు! ఎందుకు భోజనం చేయలేదు" అని అభిమానంగానే గద్దించింది తల్లి.
శివరాం ఎలాంటి విషాదకరమైన పరిస్థితులలో పోలీస్ స్టేషన్ కి వచ్చాడో, అక్కడ ఎంత ఘోరమైన చావు చచ్చాడో వివరంగా చెప్పాడు జలీల్.
విని సానుభూతిగా తల తాటించింది జహానారా బేగం.
ఆమెతో చెప్పాలా వద్దా అని కొద్దిగా తటపటాయించి తర్వాత అన్నాడు జలీల్.
"ఇవాళ నేను ఒక పెద్ద పనిమీద వెళుతున్నానమ్మా!"
"ఏమిటి నాయనా ఆ పని!"
"మెకానిక్ అనే పేరుతో చలామణీ అయ్యే ఒక కిల్లర్ ఉన్నాడు. వాడి పని పట్టడానికి వెళుతున్నాను ఇవాళ."
విని, మౌనంగా ఉండిపోయింది జగానారా బేగం కొద్ది క్షణాల పాటు.
"అమ్మా!" అంటూ ఆదుర్దాగా తల్లి కళ్ళలోకి చూశాడు జలీల్.
తెప్పరిల్లుకుని, అతనివైపు చూసింది జహానారా బేగం.
"అమ్మా! నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి ప్రయత్నించవు కదా ఇప్పుడు నువ్వు?"