Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 38

లావణ్యా, స్నేహ సినిమా స్టిల్సు చూస్తున్నారు పక్కపక్కన నిలబడి.
అప్పుడు మొదటిసారిగా స్నేహాని పరీక్షగా చూశాడు శ్రీహర్ష.
చిరే కట్టుకుంటే నాలుగేళ్ళు పెద్దదయిపోయినట్లు ఉంది.
లావణ్య- జాగ్రత్తగా ముస్తాబయి ఉంది. ప్రతి చిన్న డిటెయిల్ తో సహా. కాలిగోళ్ళకి నేరేడు రంగు నెయిల్ పాలిష్, ఎర్రటి ఇంపోర్టెడ్ జార్జేట్ చీరె. అందంగా నాభికి కిందకి కట్టింది. కళ్ళలో ఏదో ఆలోచన.
పక్కనే స్నేహ. పొద్దున తను తెచ్చిన కోటా చీరెలో ముగ్ధంగా ఉంది. మొహాన నయాపైసంత కుంకుమ బొట్టు. కళ్ళలో కాస్త విషాదం. తన విషాదంతో ఎదుట వాళ్ళని బాధపెట్టకూడదనే ప్రయత్నంతో పెదాల మీదకు తెచ్చుకుంటున్న బలవంతపు చిరునవ్వు.
తర్వాత వెళ్ళి సినిమాలో కూర్చున్నారు.
సినిమా మీద దృష్టి లేదు లావణ్యకి.
తను రాసిన ఉత్తరం సంగతి ఏం మాట్లాడలేదు శ్రీహర్ష. పొద్దున తమ ఇంటికి వచ్చాడు. అతను మాట్లాడతాడని తనకు దైర్యం చెబుతాడని ఏంతో ఎదురు చూసింది.
ఉహు! ఆ ప్రస్తావన అసలు లేనేలేదు.
ఆరోగ్యం సంగతి అడిగాడు. షాపింగు వెళ్దాం వస్తావా అని అడిగాడు.
అతనితో షాపింగు కెళ్ళడం అదే మొదటిసారి.
"ఏం కొనాలి?" అంది.
"చీరెలు"
"ఎవరికి"
"నీకూ, రేవతికి, స్నేహకి."
"నాకెందుకు చీరె?"
"అమ్మ కొనమంది. తను ఇవ్వాలని ముచ్చటపడుతోంది."
బజారు కెళ్ళారు. లావణ్యకి బట్టల సెలెక్షన్ బాగా తెలుసు. రేవతికి నప్పే చీరె తీసుకుంది. స్నేహకి సెలక్టు చేసేటప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని స్నేహాని గుర్తుకు తెచ్చుకుంది.
పొడుగ్గా, అందంగా నాజుగ్గా, ఛామన చాయలో , మల్లెతీగలో.......
"ఆ ఆకుపచ్చ డిజైను కోటా చీరె ఇవ్వండి" తీసుకుంది.
తనకి పింక్ కలరు రెడి అర్గండి తీసుకుంది.
తన సెలెక్షన్ కరక్టే, ఆ చీరెలో స్నేహ ఎంత బావుందో!
కొద్దిగా అసూయగా అనిపించింది.
శ్రీహర్ష సాయంత్రం అయినా ఉత్తరం విషయం ప్రస్తావిస్తాడేమోనని అనుకుంది. అసలతను పట్టించుకోవడమే లేదు.
ఇందాక తనూ స్నేహ పక్కపక్కన నిలబడి స్టిల్స్ చూస్తున్నప్పుడు అతను తదేకంగా స్నేహనే చూస్తున్నాడు.
తను వెనక్కి తిరక్కపోయినా అద్దంలో కనబడిపోతూ ఉంది ఆ విషయం.
శ్రీహర్ష తనని నిర్లక్ష్యం చేస్తున్నాడా?
సినిమా ఏమిటో అర్ధం కావటం లేదు.
"నువ్వేం మాటాడటం లేదు. సరదాగా లేవు." అన్నాడు శ్రీహర్ష.
"ఆ" అని ఉలిక్కిపడ్డట్లు చూసి, అంతంలోనే సర్దుకుని "అబ్బే! ఏం లేదు" అంది లావణ్య.
ఆమెకి మనసులో ఉన్న భయం వల్ల , హఠాత్తుగా ఎవరు పలకరించినా, బెదిరిపోతోంది.
ఒకసారి పరీక్షగా ఆమె వైపు చూసి మళ్ళీ తెరమీదకు దృష్టి సారించాడు శ్రీహర్ష.
ఏదో హాస్య సన్నివేశం.
ఏదో కామెంట్ చేసి గాజు పాత్రలో నుంచి ముత్యాలు దొర్లినట్లు నవ్వుతోంది స్నేహ.
స్నేహ నవ్వుతుంటే పక్కవాళ్ళు సీరియస్ గా ఉండలేరు. స్వచ్చంగా నిర్మలంగా, మనసారా నవ్వుతుంది.
ఆమెతో బాటు గొంతు కలిపారు రేవతి , శ్రీహర్ష.
మధ్యలో ఉన్న లావణ్య మాత్రం సీరియస్ గా, ముభావంగా ఉండిపోయింది.
మళ్ళీ ఆమె మొహంలోకి చూశాడు శ్రీహర్ష.
ఆలోచన- సీరియస్ నెస్-  ముభావం.
"ఏమయిందో?
బయటికి చెప్పను చెప్పదు. తనకు చెప్పాలనిపిస్తే తప్ప.
ఎందుకో అలజడిగా ఉంది ఆమె మనసు. అంతవరకూ తెలుస్తూనే ఉంది.
కారణమేమిటో!
ఎవరైనా తన మాటకి ఎదురు చెప్పారేమో,
నౌకర్లు ఇల్లు శుబ్రంగా ఉంచలేదేమో.
చీరె, జాకెట్టు సరిగా మాచ్ అవలేదేమో,
అంతకన్నా లావణ్యకి కష్టాలేముంటాయి?
ఆ మాత్రం ఇబ్బంది చాలు లావణ్య మూడ్ చెడిపోవడానికి.

 Previous Page Next Page