తినుబండారాల వాసన తగలగానే "బాంబే బాబాయ్!" అని వచ్చి మీద పడిపోయే చిన్నీ ఈ రోజు ఎందుకో ఎదురు రాలేదు.
"చిన్నీ ఏడీ!" అని అడిగాడు అక్కడ ఉన్న పిల్లలని.
"పడుకుని ఉన్నాడు" అన్నాడు ఒక పిల్లవాడు, తేజస్వి చేతిలోని స్వీట్ పాకెట్ వైపు కళ్ళార్పకుండా చూస్తూ.
"ఇప్పుడెం పడక?" అన్నాడు తేజస్వి.
పొద్దుట్నించి లేవలేదు. అప్పుడప్పుడు ఏడుస్తూన్నాడు."
"ఏడీ? ఎక్కడ?"
లోపలికి తీసుకెళ్ళి చూపించాడు ఆ పిల్లవాడు.
నెమ్ముబారిన గోడపక్కనే గోతం పట్టా వేసుకుని కుక్కపిల్లలా పడుకుని ఉన్నాడు చిన్నీ.
"చిన్నీ! ఏమయింది?" అన్నాడు తేజస్వి.
ఏదో చెప్పబోయాడు చిన్నీ, కాని అతని నోట వెంబడి మాట వెలువడలేదు. బాధగా మొహం పెట్టి చేత్తో గొంతుని తడుముకున్నాడు.
"చెప్పు! జ్వరమేనా! ఎప్పటినుంచి?"
మళ్ళీ మాట్లాడాడానికి ప్రయత్నం చేశాడు చిన్నీ. అతి కష్టం మీద "గొంతు" అన్నాడు. అంతే! ఆ తరువాత అతను పలికిన పదాలు అతని గొంతులోనే వుండిపోయాయి.
అతని మీదికి వంగి పరీక్షగా చూశాడు తేజస్వి. చిన్నీ నోరు కొద్దిగా తెరచుకుని ఉంది. పెదిమలు పుండ్లు పడి వున్నాయి.
"నోరు తెరు చిన్నీ!"
నోరు తెరువకుండా గొంతు పట్టుకుని బాధగా మూలిగాడు.
వెంటనే స్పురించింది తేజస్వికి.
డిప్తిరియానా? పిల్లలకు వచ్చే ప్రమాదకరమైన వ్యాధుల్లో అది ఒకటి. తక్షణం ట్రీట్ మెంట్ ఇప్పించకపొతే ప్రాణాపాయం కూడా కలగవచ్చు. పిల్లలకు గొంతు నొప్పి అనగానే ముందు గుర్తు వచ్చేది డిప్తిరియానే.
"వార్డెన్ వరదరాజులు ఏడీ?" అన్నాడు తేజస్వి. పిల్లల వైపు తిరిగి.
వాళ్ళందరూ భయం భయంగా చూశారు తప్ప. ఏ ఒక్కరూ కూడా సరైన సమాధానం చెప్పలేదు. వాళ్ళకి తెలుసు. వరదరాజులు మీద ఎవరన్నా గనుక నేరాలు చెపితే అది వెంటనే వరదరాజులు కి తెలిసిపోతుంది. తమలోనే ఒకళ్ళిద్దరు గూడచారులు ఉన్నారు. వాళ్ళ ద్వారా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు వరదరాజులు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఆ తరువాత తీవ్రంగా శిక్షిస్తాడు.
ఒక పిల్లవాడు మాత్రం నోటితో ఏం చెప్పకుండా , భావగర్భితంగా స్టోర్ రూం వైపు చూశాడు.
అది అర్ధం చేసుకుని స్టోర్ రూం దగ్గరకు నడిచాడు తేజస్వి.
స్టోర్ రూం తలుపులు బిడాయించి ఉన్నాయి. లోపల నుంచి ఏవో శబ్దాలు, గుసగుసగా మాటలు.
"వరదరాజులు!" అని పిలిచాడు తేజస్వి.
లోపల శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి.
వెంటనే ప్రాణభయంతో తేజస్వి దగ్గరికి వచ్చి, చెయ్యి పట్టుకు లాగాడు ఇందాకటి కుర్రాడు.
"లోపల ఆయా ప్రభావతి, వరదరాజులు ఉన్నారు" అన్నాడు. "అలాంటి సమయంలో డిస్టర్బ్ చేస్తే వరదరాజులు తోలు వలిచేస్తాడు" అన్నట్లు గొంతు పెట్టి.
ఆ పసివాడి నోటివెంట వెలువడిన ఆ మాటలు వినగానే తేజస్వి గుండె నీరుకరిపోయింది.
ఎంతటి అసహ్యమైన వాతావరణంలో పెరుగుతున్నారు ఈ పిల్లలు! ఎంతగా ఉంటుంది ఇలాంటి సంఘటనల ప్రభావం. ఇప్పుడిప్పుడే వికసిస్తున్న వాళ్ళ మనసుల మీద!
"ఏదో ఒకటి చెయ్యాలి తను! ఏం చెయ్యాలి! ఎలా చెయ్యాలి?
కానీ, దానికంటే ముందు చెయ్యవలసిన పని మరొకటి ఉంది ఇప్పుడు. వరదరాజులునీ, ఆ ఆయాని బయటకి లాగి పంచాయితీ పెట్టడం కాదు తన తక్షణ కర్తవ్యం. ముందు చిన్నిని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళి పోవాలి. డిప్తిరియా. మైగాడ్! ఎవ్విరి మినిట్ కౌంట్!
పది నిమిషాల లోపల డాక్టర్ సద్గుణ్ క్లినిక్ కి వెళ్ళాడు తేజస్వి, చిన్నితో కలిసి.
డాక్టర్ సద్గుణ్ నడుపుతోంది క్లినిక్ అని చెప్పడానికి లేదు. హాస్పిటల్ అని చెప్పడానికి లేదు, నర్సింగ్ హోమ్ అని చెప్పడానికి లేదు. అతను నడుపుతోంది ఒక ఉద్యమం అని చెప్పొచ్చు. వైద్యం పేషెంట్ల ఆరోగ్యం కోసమే గానీ, ధన సంపాదనకు అదొక మార్గం కాదంటాడు సద్గుణ్. అది అతని ఫిలాసఫీ. మాములుగా అన్ని క్లినిక్స్ లో కనబడే అట్టహాసం కనబడదు. ఉరి బయట , ఒక వెయ్యి గజాల స్థలంలో చెట్ల మధ్య చిన్న ఇల్లు. అదే అతని క్లినిక్. అదే అతని నివాసం. అదే అతని ఉద్యమానికి హెడ్ క్వార్టర్స్.
దాదాపు అరగంట పైగా పట్టింది ఆ సెషన్. రోగ నిర్ణయం కోసం ఒక డాక్టరు తన పేషెంటుని అంత వివరంగా ప్రశ్నలు అడగడం ఇప్పటి పద్దతి కాదు. ఒక్కొక్క పేషెంటు మీద అంత సమయాన్ని వెచ్చించడం లాభదాయకం కాదు డాక్టరుకి. తరువాత చిన్నికి బ్లడ్ టెస్ట్ చేశాడు సద్గుణ్.