14
యాంటి సెప్టిక్ వాసన........
దిగులుగా ఉండే ధర్మాసుపత్రి వాతావరణం - మెటర్నిటి వార్డ్ లో హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంది పావని. తన ప్రాణ స్నేహితురాలు. ఆమె ప్రక్కన వుయ్యాలో చిన్న పాపడు.
సౌమ్య వెనకాల యమదూతలు ఎవరో నిలబడి ఉన్నట్లు కళ్ళు పెద్దవి చేసి ఆమె భుజం పైనుంచి చూస్తుంది పావని. ఆమె కళ్ళలో మృత్యువు తాలూకు నీలి నీడలు ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి.
అయిపోయిందే సౌమ్యా! అంతా అయిపొయింది! వెళ్ళిపోతున్నాను నేను! కొడుకుని కానీ కనకముందే వాణ్ణి అనాదని చేసి వెళ్ళి పోతున్నాను. ఆ సాంబశివరావు చేతిలో తేలిగ్గా మోసపోయాను సౌమ్యా!" జీవితం చేతిలో ఘోరంగా ఓడిపోయాను. పెళ్ళి కాకుండానే తల్లినయ్యాను. పావని అని నాకు పేరు పెట్టిన తల్లిదండ్రులు ఇప్పుడు లేరు కాని, ఉంటేనా పేరు మార్చేసి పాతకి అని పెట్టి ఉండేవాళ్ళు. నేను తప్పు చేశానే సౌమ్య! వీడిని కనకముందే వీడు నా పొట్టలో వెచ్చగా బబ్బుని ఉండగానే వీడితో సహా నేను చనిపోతే వీడిని నాతో కూడా తీసుకెళ్ళిపోయి ఉండేదానిని. అపుడు ఇంక విడి గురించి నాకు బెంగ వుండేది కాదు. తల్లి లేకుండా , తండ్రేవరో తెలియకుండా ఎలా పెరుగుతాడే వీడు? ఎలా బతుకుతాడు? అంది కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకుంటూ.
"పావనీ అలా మాట్లాడకు! ఇప్పుడెం కాలేదు. మరేం భయం లేదు-" అంది సౌమ్య నచ్చచెబుతూ.
కానీ ఆమెకి తెలుసు. డాక్టరు చెప్పింది పావని చివరి క్షణాలలో ఉందని.
ఉన్నట్లుండి సౌమ్య చేతులు పట్టుకుంది పావని "సౌమ్యా! ఓ చిన్న సహాయం చేస్తావా?"
"తప్పకుండా పావనీ! నువ్వు పడుకో."
కాసేపు నిస్సత్తువుగా ఉండిపోయి తరువాత హటాత్తుగా అంది పావని.
"సౌమ్యా! నీకు ఏ దేవుడంటే నమ్మకం?"
"ఎందుకు? వెంకటేశ్వరస్వామి!"
"సౌమ్యా! నేను పైకెళ్ళి పోయాక, అయన ఎక్కడున్నా కనబడితే అయన కాళ్ళు పట్టుకుని నీకు పుణ్యం ఇప్పించమని వేడుకుంటా గానీ, నా కొడుకుని కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వవా?"
తన స్నేహితురాలిది సంధి ప్రేలాపన అని తెలుసు సౌమ్యకి. ఆమెకి అంత్యఘడియలు అతి త్వరగా సమిపిస్తున్నాయని కూడా తెలుసు. అందుకని ఆర్ద్రంగా చేతిలో చెయ్యి వేసింది.
"నిశ్చింతగా ఉండు పావనీ!"
కళ్ళు విప్పార్చి కృతజ్ఞత పూర్వకంగా చూసింది పావని.
అంతే! ఆ కనురెప్పలు మళ్ళీ ముసుకోలేదు.
మాట ఇచ్చింది గానీ, ఆ తరువాత మళ్ళీ తను చిన్నిని చూడలేదు. చూడడం కుదరలేదు.
చిన్నిని హాస్పిటల్ వాళ్ళు అనాధశరణాలయంలో చేర్చారుట!
ఒక కన్నె పిల్ల అనాధశరణాలయానికి వెళ్ళి ఒక అనాధ శిశువుని చూసి వస్తూ ఉంటె ఏమనుకుంటుంది లోకం?
అందుకే భయపడి వెళ్ళలేదు తను.
తను తల్లిదండ్రులతో ఈ సంగతి చెప్పి ఉండవచ్చు.
కానీ,
ఇలాంటి వాటిల్లో నీ కెందుకు జోక్యం అని వాళ్ళు కేకలేస్తారేమో అని జంకింది తను.
పైగా, పావని లాంటి అమ్మాయి తన ప్రాణస్నేహితురాలని తెలిస్తే, తనని కూడా అనుమానంగా, చూడొచ్చు. అమ్మా నాన్న అన్న అనుమానం ఒకవైపు, రకరకాల నిస్సహాయత అన్ని వైపులా . అందుకే చెప్పలేకపోయింది తను.
కానీ ఆ గిల్టి కాన్షస్ నెస్ మాత్రం తనని వదలలేదు . కంటికి కునుకు రానివ్వకుండా చంపుకు తినేస్తుంది తనని.
చిన్నిని కనిపెట్టి ఉంటానని మాట ఇచ్చి మళ్ళీ వాడి వైపు చూడని నిర్ధయురాలు తను!
తనలాంటి రాక్షసి మరొకటి ఉంటుందా ఈ లోకంలో! ఉండదు! ఉండదు ఉండదు!
నిద్రలోనే సౌమ్య కళ్ళు వర్షించడం మొదలెట్టాయి. పెదిమలు వణుకుతున్నాయి. వెక్కిళ్ళతో భుజం ఎగిరి పడడం మొదలెట్టింది.
ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో పనులన్నీ తను దగ్గర వుండి పూర్తి చేయించిన తరువాత, చివరి పంక్తిలో భోజనానికి కూర్చున్నాడు తేజస్వి.
విస్తట్లో వడ్డించి ఉన్న రెండు రకాల కూరలు, రెండు పచ్చళ్ళు ఒక పిండివంట, ఉరగాయ ఇవన్ని చూసేసరికి అప్రయత్నంగా అతనికి జ్ఞాపకం వచ్చాడు చిన్నీ - ఏ పూటా పొట్టకు పట్టెడు మెతుకులు తృప్తిగా తినలేని చిన్నీ!
చిన్నీ గుర్తుకు రాగానే ఇక భోజనం సహించలేదు తేజస్వికి. అన్యమనస్కంగా నాలుగు ముద్దలు తిని, అందరి భోజనం పూర్తి అయ్యేదాకా మర్యాద కోసం ప్-పంక్తిలోనే కూర్చుని, ఆ తరువాత లేచాడు. మరో పదినిమిషాల తర్వాత అనాధశరణాలయం వైపు సాగిపోయింది అతని స్కూటరు. దారిలో ఒక స్వీట్ షాపు దగ్గర ఆగి బాంబే బర్ఫీ , పకోడీ కొన్నాడు.