ఎంత అప్రతిష్ట!
అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తనని తనే హెచ్చరించుకున్నాడు. తను కాన్సిడెన్స్ పోగొట్టుకోకూడదు. ధైర్యంగా నిలబడాలి! నిబ్బరంగా ప్రవర్తించాల్సింది ఇలాంటి సమయాల్లోనే! బిజినెస్ లో అందరికీ తనమీద నమ్మకం కలిగేటట్లు చేసుకోవాలి కానీ, తను మాత్రం ఇకనుంచీ ఎవర్నీ నమ్మకూడదు! చచ్చినా నమ్మకూడదు.
తన ఆఫీసుకి వేలాడుతున్న పెద్ద తాళం కప్పా, దానికి చుట్టిన గుడ్డా, దానిమీద ఎర్రతేలులా కనబడుతున్న ఎర్ర సీలూ చూస్తుంటే అతనికి కళ్ళు మసకలు కమ్ముతున్నట్లు అయింది. 'ఇదంతా తన భ్రమ ఏమో! పని ఎక్కువైపోయి, తన బుర్ర పని చెయ్యడం మానేసి హాల్యూసినేషన్స్ కలుగుతున్నాయేమో!' అనిపించింది. ఒక్క కప్పు మంచి కాఫీ తాగితే ఈ భ్రమ తొలగిపోతుందేమోనని ఆశ కలిగింది. జేబులు తడిమి చూసుకున్నాడు. నాలుగైదు రూపాయి నోట్లూ, కొంత చిల్లరా తగిలాయి. విషాదంగా నవ్వుకున్నాడు శ్రీరాం.
"నో! ఇది అబ్సర్డ్! ఫాంటాస్టిక్ నాన్సెన్స్!" తను, శ్రీరాం రెండు రోజులకి ఓసారి బంజారాకి వెళ్ళిపోయి వందల రూపాయలు ఖర్చు చేసే తను కాఫీకి చిల్లర ఉందా లేదా అని లెక్క చూసుకుంటున్నాడా?
తనమీద తనకే జాలి వేసింది శ్రీరాంకి. అతను అక్కడ నిలబడి నందలాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. నందలాల్ తనకి డబ్బు అప్పుగా ఇస్తానన్నాడు. మళ్ళీ బిజినెస్ లో పుంజుకునేటట్లు చేస్తానన్నాడు.
అవును మరి! నందలాల్ కి ఇదివరకు చాలా సహాయం చేశాడు తను. ఆ కృతజ్ఞత ఎక్కడికి పోతుంది? పదింటికీ వస్తానన్నాడు నందలాల్. పదకొండవుతూంది. ఇంకా రాడేం?
నందలాల్ అసలు ఇంక తనని కలుసుకోవడానికి రాడనీ, మొహం చాటెయ్యడం మొదలెట్టిన మిత్రుల్లో అతను మొదటివాడనీ ఆ తరవాత కానీ తెలియలేదు శ్రీరాంకి.
* * * * *
ఆరు నెలలు గడిచాయి. పోలీసు కేసులోనుంచీ మాత్రం బయటపడ్డాడు శ్రీరాం. కానీ ఈ గొడవల వల్ల వ్యాపారం మాత్రం పూర్తిగా దెబ్బ తినిపోయింది. ఆ వ్యవధిలో అతని పోటీదారులు పుంజుకుని, అతన్ని పక్కకి నెట్టెయ్యగలిగారు.
ఆ తరవాత ఇంకో ఆరు రకాల వ్యాపారాల్లో చెయ్యిపెట్టి చూశాడు శ్రీరాం. కానీ అలకతో బిగుసుకుపోయిన ప్రేయసి లాగా, అదృష్టదేవత అతను ఎంత ప్రాధేయపడినా కన్నెత్తి చూడటం లేదు.
ఆ రోజు ఆదివారం. మామూలుగా ఆదివారం అంటే శ్రీరాంకి ఆట విడుపు. ఫ్రెండ్సందరినీ తిరగేసి, మలక్ పేట రేసుల కెళ్ళిపోయి, సాయంత్రమంతా క్లబ్బులో టెన్నిస్ గానీ, కార్ డ్ స్ గానీ ఆడి, రాత్రికి సెకండ్ షో సినిమా చూసి -అలా ఉంటుంది అతని ఆదివారం! కానీ ఈ ఆదివారం వేరు. ఇంత దుర్భరమైన రోజు అతని జీవితంలో ఇంతకు ముందెప్పుడూ రాలేదు. క్లబ్బులో కార్డ్స్ ఉన్నాయి - జేబులో నోట్లు లేవు. మలక్ పేటలో గుర్రాలు ఉన్నాయ్. జేబుల్లో చిలకల్లేవు. అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలు ఉన్నాయి, సిగరెట్టు పెట్టెలో సిగరెట్లు లేవు.
చాలాసేపు చిరాగ్గా కూర్చుని, ఆ తరవాత ఏదో గుర్తొచ్చినట్లు కప్ బోర్డ్ తెరిచాడు.
సంకోచంగా అటూ ఇటూ చూశాడు. దగ్గరలో ప్రతిమ లేదు. తను చెయ్యవలసి వస్తున్న పనికి అతనికి చిన్నతనంగా ఉంది. బట్టల మడతల్లో కప్ బోర్డ్ మూలల్లో వెదకడం మొదలెట్టాడు.
ఇది వరకు తన జేబులో డబ్బులు గలగల్లాడుతున్నప్పుడు అదే తన గల్లాపెట్టెలా ఉండేది. ఇంటికి రాగానే నిర్లక్ష్యంగా జేబులోని నోట్లూ, చిల్లరా అక్కడ పడేసేవాడు. వాటిలో కొన్ని ఏ మూలో మిగిలిపోయి ఉండవచ్చు.
కొన్ని చిల్లర నాణాలు దొరికాయి. లెక్క పెట్టాడు. రూపాయి నలభై పైసలు! నిస్పృహగా నవ్వుకుని ఇంకా వెదికాడు. ప్రతిమ జాకెట్టు కింద - పెన్నిధే దొరికింది. అయిదు రూపాయల నోటు! అతని మొహంలోకి కొంచెం కళ వచ్చింది. ఈ చీరెల కింద ఇంకా దొరకొచ్చేమో డబ్బు! చీరెల మడతల్లో వంద రూపాయల నోటు దొరికింది! గుడ్ నెస్ గ్రేషియస్! ఇంకా వెదికాడు. ఉహూఁ! ఇంకో పైస కూడా దొరకలేదు. చివరగా కాశ్మీర్ సిల్కు చీరె తడమగానే గట్టిగా తగిలింది ఏదో! డబ్బు కాదు? తీసి చూశాడు.
నేమ్ ప్లేటు! డాక్టర్ (మిసెస్) ప్రతిమా శ్రీరాం, ఎమ్.బి.బి.ఎస్.
ఇంకో వంద రూపాయల నోటు కాకుండా ఇది దొరికినందుకు అతనికి నిరుత్సాహం కలిగింది! అప్పుడు చటుక్కున స్ఫురించింది అతనికి! ఇది మాత్రం డబ్బు కాదా? డబ్బుతో సమానమే ప్రతిమ డిగ్రీ!
నిశ్చలంగా చాలాసేపు అలాగే నిలబడిపోయాడు శ్రీరాం. అల్లకల్లోలంగా ఉంది అతని మనసు. అస్పష్టంగా ఒక ఆలోచన రూపు దిద్దుకోవడం మొదలెట్టింది.
తను మంచి బిజినెస్ మాన్! వ్యాపారంలో దెబ్బ తిని ఇలా ఉన్నాడు కానీ, మళ్ళీ కేపిటల్ దొరికితే ప్రపంచాన్నే వూపేస్తాడు. కేపిటల్! పెట్టుబడి! అదే దొరకడం లేదు తనకి! బ్యాంకులు తనకి అప్పివ్వడానికి సందేహిస్తున్నాయి. ఫ్రెండ్సు ఇచ్చకాలు చెబుతున్నారు కానీ ఎవరూ ముందుకి వచ్చి పెట్టుబడి పెట్టడం లేదు. ఈ బోర్డు.... ఈ డిగ్రీ....
"నా కూతురి చదువుతో వ్యాపారం చేస్తారుట... నా కూతురి చదువుతో వ్యాపారం చేస్తారుట... నా కూతురి..." మామగారి మాటలూ, ఎకసెక్కెం గుర్తొచ్చాయి. గాడ్డామిట్! ఇంతవరకూ ఎప్పుడూ కూడా ప్రతిమ సంపాదన మీద బతకాలనీ, ప్రతిమ చదువుతో వ్యాపారం చెయ్యాలనీ అనుకోలేదు తను! కానీ, హెల్! చేస్తే తప్పేమిటి?
ఇద్దరూ సుఖపడటం తప్ప?
అతని అలవాటు ప్రకారం హఠాత్తుగా ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికొచ్చాడు శ్రీరాం. కానీ కొద్దిగా అనుమానం మెదుల్తూనే ఉంది మనసులో. అప్పట్లో ఉద్యోగం చెయ్యొద్దనీ, ప్రాక్టీస్ పెట్టడానికి వీల్లేదనీ ఆంక్ష పెట్టాడు తను, ఇప్పుడు మళ్ళీ తనే ప్రాక్టీస్ పెట్టమంటే?
ఏం? తప్పేమిటి? తను మగాడు! ప్రతిమకి భర్త! ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన వాడు తనే! ఆప్పట్లో తను మంచిది కాదనుకున్నాడు. ఇప్పుడు మంచిదనుకుంటున్నాడు. ప్రతిమ మంచి వైఫ్ అయితే తన ఆలోచన ప్రకారం నడుచుకోవాలి. తనకు తెలుసు ప్రతిమ మంచి వైఫ్ అని! తన ఆలోచనల ప్రకారమే నడుచుకుంటుంది! ష్యూర్ థింగ్!పాంటు జేబులోనుంచి కర్చీఫ్ తీసి ఆ నేమ్ ప్లేట్ ని అపురూపంగా తుడిచాడు శ్రీరాం.
వెనక అలికిడయింది.
ప్రతిమ!
"ఆ నేమ్ ప్లేట్ బయటికి తీశారేమిటి?" అంది నవ్వుతూ.
"ఇంకా బయటికి తీసుకెళ్దాం! గేటుకి తగిలిద్దాం దీన్ని!"
నమ్మలేనట్లు చూసింది ప్రతిమ.
"నిజంగానే! ఈ బోర్డు బయట తగిలిద్దాం. నువ్వు ఇవాళ నుంచీ ప్రాక్టీస్ మొదలెడుదువు గాని!"
"మరేం పన్లేదు! అప్పుడు నేను ప్రాక్టీస్ పెడతానన్నప్పుడేమో నన్ను అంతగా తిట్టీ, ఇప్పుడు మీ అంతట మీరే... అంతా మీ ఇష్టమేనా ఏమిటి?"
"వై నాట్? అంతా నా ఇష్టమే! నేను నీ మొగుణ్ణి తెలుసా? పతియే ప్రత్యక్షదైవం అని చదూకోలేదూ చిన్నప్పుడూ?" అన్నాడు శ్రీరాం సరదాగా పైకి సరదాగానే కనిపించినా, అతను నమ్మే పరమ సత్యం అది.
వెక్కిరింపుగా తల వూపింది ప్రతిమ.
"నేను చెయ్యను, బాబూ!"
"ఎందువల్ల?"