Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 39


    మహాయోగులకు మాత్రమే మనసు, దేహాల సంగమం సిద్ధిస్తుంది.

 

    మామూలు మనుషులకు మనసు మనసే

 

    దేహం దేహమే.

 

    ఆ దేహానికి యింకో దేహం కావాలి.

 

    ఆడది అందగత్తె అయితే, ఆ అందాన్ని పొందాలని కోరుకుంటాడు మగాడు. ఒక్కొక్కప్పుడు కొంతమంది మగవాళ్ళకు అందంతో పనిలేదు. సెక్స్ కోరిక తీర్చే యంత్రమే వారికి ఆడది.

 

    ఆ సెక్స్  కోరికకు ముసుగువేసి, 'ప్రేమ' అని పిలుస్తారు బలహీనులు.

 

    అలాంటి బహీనుడు డాక్టర్ పరశురామ్.

 

    అందాన్ని ఆరాధించే ప్రేమికుడు మధు.

 

    మరి తేజ కూడా మగాడే. అనురాగ్ కూడా మగాడే.

 

    వేర్వేరు భిన్న మనస్తత్వాల కేంద్రిక అన్విత.

 

    తనకు పరిచయమయిన వ్యక్తులందరి గురించి ఆలోచిస్తుంది అన్విత.

 

    
                                            *    *    *

 

    పెద్దపాడు.....

 

    భీమవరం సోమరాజు ఏలూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.

 

    అది  చూసిన ఆయన భార్య సూర్యంబ లోలోపలే కంగారుపడి పోతోంది.

 

    తను బంగారం అమ్మీ, కొడుక్కి డబ్బులిచ్చిన విషయం ఏలూరు వెళితే తన భర్తకు ఏదో ఒకరకంగా  తెలిసిపోతోంది.

 

    కనుక తన భర్తను ఏలూరు వెళ్ళకుండా ఆపేయాలి.

 

    అందుకే చేయాలో, తీవ్రంగా ఆలోచిస్తోందామె.

 

    అంతలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన స్లోగన్స్ వినిపిస్తున్నాయి మైకులో.

 

    అంతే...

 

    ఆ మరుక్షణం ఆమె ఇంటి వెనుకవేపు నుంచి రోడ్డుమీదకు వెళ్ళి తమ పార్టీ గురించి ప్రచారం చేస్తున్న ఒక ఛోటా నాయకుడి దగ్గరికి వెళ్ళి.....

 

    "అదిగో, ఆ ఇంట్లో భీమవరం సోమరాజు అనే చాలా పలుకుబడి వున్న వ్యక్తి వున్నాడు. ఆయన్ని పట్టుకుంటే ఈ ఊళ్ళో సగం ఓట్లు మీ పార్టీకే పడేలా చేస్తాడు. ఆయన ఇప్పుడు ఏలూరు వెళ్ళబోతున్నాడు. ఆయన ఏలూరు వెళ్ళాడంటే, మరలా మీకు వారం రోజుల వరకూ దొరకడు. త్వరగా వెళ్ళి కలవండి" అని చోటా నాయకుడిని తొందరపెట్టి, వచ్చినంత త్వరగా ఇంటికెళ్ళిపోయింది.

 

    ఆ చోటా నాయకుడు వెంటనే తన పక్కనున్న కార్యకర్తల్ని తీసుకుని భీమవరం సోమరాజు ఇంటికెళ్ళిపోయాడు.

 

    
                                          *    *    *

 

    సరిగ్గా....

 

    భీమవరం సోమరాజు బయటికి వెళ్లబోతుండగా చోటా నాయకుడు తన కార్యకర్తలతో లోపలికి వచ్చాడు.

 

    "సార్..... నమస్తే సార్! మీరు తలుచుకుంటే ఈ వూళ్ళో సగం ఓట్లు మా పార్టీకే వేయించగలరని విన్నాను. దయచేసి ఆ పనిచేసి పెట్టండి" అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు ఆ చోటా నాయకుడు.

 

    "దాని మూలంగా ఏమిటి ప్రయోజనం?" చిరాగ్గా అడిగాడు భీమవరం సోమరాజు.

 

    "రైతులకు ఉచితంగా కరంటు..... ఉచితంగా మంచినీరు...... ఉచితంగా సాగునీరు..... ఉచితంగా ఫోను కనెక్షన్లు.... ఉచితంగా కేబుల్ టీవీ యిస్తాం" అన్నాడు ఆ చోటా నాయకుడు ఎంతో వుత్సాహంగా.

 

    దాంతో భీమవరం సోమరాజుకు చిర్రెత్తుకొచ్చింది.

 

    "ఉచితంగా హెయిర్ కటింగ్, ఉచితంగా దుస్తులు ఉతికిపెట్టడం, ఉచితంగా బీరు, బ్రాందీ, సప్లయ్ చేయడం, ఉచితంగా సినిమాలు చూపించడం, ఉచితంగా దుస్తులు ఇస్త్రీ చేసిపెట్టడం, ఉచితంగా చెప్పులు, బూట్లు యివ్వడం..... ఏ పనీ చేయకపొయినా కుటుంబానికి నెలకు పదివేలివ్వడం..... కణాలకు నిద్ర పట్టకపోతే ఉచితంగా నిద్రపుచ్చడం లాంటివి మీ పార్టీ ప్రాణాలికాలో లేవా?

 

    బుద్ధి లేకుండా బుద్ధిలేని హామీలు యిస్తావా? అయినా ప్రజల గురించి మీరేమనుకుంటున్నారు? బిచ్చగాళ్ళనుకుంటున్నారా? అసలు ప్రపంచంలో ఏ  ప్రభుత్వమయినా యిన్ని ఉచితంగా యివ్వగలదా? యివన్నీ మీ ఆస్తులమ్మి ఉచితంగా మాకిస్తారా? దోపిడీ, దొంగతనాలు చేసి యిస్తారా?"

 

    "తన భర్త ఏలూరు వెళ్ళకుండా ఆగిపోయినందుకు వూపిరి తీసుకుంది సూర్యాంబ.

 

    
                                           *    *    *

 

    అపార్ట్ మెంట్ చాలా పోష్ గా వుంది.

 

    అందమయిన ఫర్నీచర్.

 

    "గుడ్ టేస్ట్" అంది గోడకున్న పెయింటింగ్స్ వైపు చూస్తూ అన్విత.

 

    "ఖాళీగా వున్నప్పుడు పెయింటింగ్స్ వేయడం నా హాబీ" అన్నాడు పరశురాయ్.

 

    "మీ బర్త్ డే పార్టీకి నేనే ఎర్లీగా వచ్చానా?"

 

    "అవును -  కూర్చోండి."

 

    ఇద్దరిమధ్యా టీపాయ్ మీద పెద్ద సైజు కేక్ వుంది. ఆ కేక్ మీద  'హేపీ బర్త్ డే' అని రాసుంది.

 

    "ఈ కేక్ ను మీరు కట్ చేస్తారు" అన్నాడు పరశురామ్.

 

    "నేనా.....! బర్త్ డే మీది."

 

    "అవును. యాక్చువల్ గా  కేక్స్ కట్ చేయడం, పార్టీలను ఆడంబరంగా జరుపుకోవడం నాకిష్టం వుండదు. ఎందుకంటే పుట్టిన దగ్గర్నుంచీ ఒంటరితనంతో బతుకుతున్నవాణ్ణి" అన్నాడతను.

 

    కొంతమంది తనకు నచ్చిన స్త్రీలను లొంగదీసుకోడానికి, విషాదాన్ని నటిస్తాఋ. వారి జాలిని పొందడానికి కల్పిత కథల్ని చెప్తారు.

 

    శారీరకమైన హీరోయిజాన్ని చూపించి కొందరు, డబ్బు, హోదా చూపించి ఇంకొందరు, చదువు, సాధించుకున్న గోల్డ్ మెడల్స్ చూపించుకుని మరికొందరు, అధికారపు హోదాను ప్రదర్శించి ఇంకొందరు, మాటల నేర్పు ద్వారా, శరీరాకృతి ద్వారా, వ్నేఉక వుండే తల్లిదండ్రుల అంతస్తును చూపించి, ఆడపిల్లలను ఆకర్షించి, ప్రేమించేందుకు ప్రయత్నిస్తుంటారు.

 

    మరో వర్గం వారున్నారు. తమకుండే అంగవైకల్యాన్నీ, అనర్హతలన్నీ హైలెట్ చేసుకుని, అవతల వారి నుంచి సానుభూతి పొందుతూ-

 

    ఆ సానుభూతినే కొన్నాళ్ళకు ప్రేమగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు.

 

    అన్నింటికంటే హేయమైనది సానుభూతి ద్వారా ప్రేమను పొందటమే.....

 

    "మీకవరూ లేరా....." అడిగింది అన్విత జాలిగా.

 

    "నిన్నటివరకూ లేరు....." అన్నాడు పరశురామ్.

 

    "ఇవాళ?"

 

    "ఉన్నారు.... మీరున్నారుగా..... మిమ్మల్ని నేను నామనిషి..... అయ్ మీన్.... మై ఫ్రెండ్..... అని అనుకోవడం తప్పు లేదు కదా!"

 

    "ఇంకా ఏమిటి?" అన్నాడు పరశురామ్.

 

    "చాలామంది మగాళ్ళు, స్నేహానికి 'ప్రేమ' అనే ముద్దుపేరు పెట్టుకుంటారు."

 

    "నేను అలాంటి వాళ్ళను అసహ్యించుకుంటాను..... అన్నాడు పరశురామ్.

 

    "మీరెందుకు ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు?" అడిగింది అన్విత.

 

    "నచ్చిన అమ్మాయి కనిపించలేదు" అన్నాడు పరశురామ్.

 

    "పెళ్ళి జీవితానికి ఒక ఆకృతినిస్తుంది" అందామె.

 

    "మంచి అమ్మాయిని చూసిపెట్టండి. మీరు ఎలాంటి అమ్మాయిని చూసినా నాకభ్యంతరం లేదు. కళ్ళు మూసుకుని తాళి కట్టేస్తాను" అన్నాడు పరశురామ్.

 

    అతని కోరికమీద కేక్ కట్ చేసింది అన్విత.

 

    పార్టీకెవరూ రాకపోవడం ఆశ్చర్యంగా వుందామెకు.

 

    "మీకోసం షాంపైన్ తెప్పించాను" అన్నాడు పరశురామ్.

 

    రెండు గ్లాసులు, షాంపైన్ బాటిల్ తెస్తూ.

 

    "జస్ట్- కిల్లింగ్ ద టైమ్!" అంటూ డ్రింక్ పోసిన ఒక గ్లాసుని ఆమెకు అందించాడు.

 

    సెలబ్రేషన్ కావడంతో, అతను బాధపదతాడని మొహమాటానికి కొద్దిగా సిప్ చేసింది అన్విత.

 

    అది చూసి ఆనందించాడు పరశురామ్.

 

    చాలాసేపటి నుంచీ, ఆ అపార్ట్ మెంట్ పక్కనున్న అపార్ట్ మెంట్ టెర్రస్ మీద బైనాక్యులర్ తో పరశురామ్ ఫ్లాట్ వై పు చూస్తున్న తేజకు-

 

    బర్త్ డే పార్టీకి అన్విత తప్ప మరెవ్వరూ రాకపోవడం ఆశ్చర్యంగా వుంది అదే విషయాన్ని సెల్ ఫోన్ లో మధుకి చెప్పాడు.

 

    "ఈ డాక్టరు పరశురామ్ కూడా అన్విత ప్రేమిస్తున్నాడేమో!" అనుకున్నాడతను.

    


                                          *    *    *

 

    రాత్రి పదిగంటల ప్రాంతంలో ఫ్లాట్ లోంచి బయటికొచ్చారు అన్విత, పరశురామ్ లు.

 

    "వచ్చినందుకు థాంక్స్" అన్నాడు స్టీరింగ్ ముందు కూర్చుంటూ.

 

    కారు ముందుకు దూసుకుపోతోంది.

 

    తన పక్కనే కూర్చున్న అన్విత రాసుకున్న స్ప్రే వాసన పరశురామ్ లో మత్తును నింపుతోంది.

 

    "నిజానికి నేను అబద్ధం చెప్పాను" అన్నాడు పరశురామ్.

 

    "నాకు తెలుసు. బర్త్ డే పార్టీకి నన్ను మాత్రమే పిలిచారు...." అంది అన్విత.

 

    "యు ఆర్ జీనియస్. ఎందుకో తెలుసా?" అన్నాడుతను.

 

    "చెప్పండి" అంది.

 

    "ఊహించుకోండి. కొన్నింటిని ఊహలకు వదిలేస్తేనే బావుంటుంది. నాకు కీవితం ఎప్పుడూ ఊహాచిత్రమే- ఊహల్లోనే బతుకుతాను."

 

    "పెద్ద డాక్టర్  అయ్యుండి- మనో పరిణతిలేని మామూలు వ్యక్తిలా మాట్లాడటం చాలా వింతగా వుంది."

 

    "లేదు..... అన్వితా...... నా లోపాలు నాకు తెలుసు. అందుకే, అందుకే నేను కుంటివాడినయ్యాను" తాగుడు నిషాలో అన్నాడతను.

 

    పరశురామ్ మనసులోని ఆవేదన, స్పష్టంగా అర్థంకాకపోయినా, ఏదో విషయంలో అతను బాధపడుతున్నాడని మాత్రం అన్వితకు అర్థమైంది.

 Previous Page Next Page